టయోటా ల్యాండ్ క్రూయిజర్: ఇప్పుడు ఆర్డర్ చేస్తే నాలుగేళ్ల తరువాత డెలివరీ

ల్యాండ్ క్రూయిజర్

ఫొటో సోర్స్, TOYOTA

కార్ల తయారీ దిగ్గజం 'టయోటా' జపాన్‌లో కొత్త 'ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీ' కోసం ఆర్డర్ చేసేవారు నాలుగేళ్లు నిరీక్షించకతప్పదని చెప్పింది.

ఇప్పుడు ఆర్డర్ చేసినా వాహనం డెలివరీ చేయడానికి నాలుగేళ్లు పడుతుందని తెలిపింది.

అంతర్జాతీయంగా ఉన్న చిప్‌ల కొరత, సప్లయ్ చైన్ సంక్షోభాలకు ఈ సుదీర్ఘ నిరీక్షణకు ఎలాంటి సంబంధం లేదని ప్రపంచంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన టయోటా స్పష్టంచేసింది.

అయితే 'ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీ' డెలివరీకి ఇంత ఎక్కువ కాలం పట్టడానికి గల కారణాలు చెప్పేందుకు మాత్రం ఆ సంస్థ నిరాకరించింది.

చిప్‌లు

ఫొటో సోర్స్, Getty Images

కార్మికులు, విడిభాగాల సరఫరాదారులలో పెరుగుతున్న కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ల కారణంగా జపాన్‌లోని 11 ప్లాంట్లలో ఉత్పత్తి మందగిస్తున్నట్లు టయోటా తెలిపింది.

' జపాన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ల్యాండ్ క్రూయిజర్‌కు ఆదరణ ఉంది.కానీ, ఈ వాహనాల డెలివరీకి సుదీర్ఘ కాలం పడుతున్నందున క్షమాపణలు కోరుతున్నాం'

''మీరు ఇప్పుడు ఆర్డర్‌ చేస్తే డెలివరీ చేయడానికి నాలుగు సంవత్సరాలు వరకు పట్టవచ్చు ఈ సమయని తగ్గించడానికి మేం ప్రయత్నిస్తున్నాం. మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నందుకు అభినందిస్తున్నాం'' అంటూ టయోటా తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

''ఈ ఆలస్యానికి ప్రస్తుత సెమీకండక్టర్ల కొరత కారణమేమీ కాదు' అని కూడా కంపెనీ తెలిపింది.

టయోటా ప్లాంట్

ఫొటో సోర్స్, Getty Images

ల్యాండ్ క్రూయిజర్ కొత్త మోడల్‌కు అధిక డిమాండ్ ఉండటంతో దీర్ఘకాలికంగా వీటి ఉత్పత్తి పెంచే అంశాన్ని టయోటా పరిశీలిస్తోందని బీబీసీ అంచనా వేస్తోంది.

1951లో లాంఛ్ అయిన ల్యాండ్ క్రూయిజర్ టయోటా వాహన శ్రేణిలో అత్యంత సుదీర్ఘ కాలంగా అమ్ముడుపోతున్న వాహనం.

గత కొన్ని నెలలుగా జనరల్ మోటార్స్, ఫోర్డ్, నిస్సాన్, డైమ్లర్, బిఎమ్‌డబ్ల్యూతో పాటు రెనాల్ట్‌ సహా అనేక ప్రత్యర్థి కార్ల తయారీదారుల మాదిరిగానే ఈ సంస్థ వాహనాల ఉత్పత్తిని తగ్గించవలసి వచ్చింది.

సరఫరా గొలుసు సమస్యల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నందున జపాన్‌లోని కొన్ని కర్మాగారాల వద్ద ఉత్పత్తి నిలిపివేతను పొడిగిస్తున్నట్లు గత నెలలో టయోటా ప్రకటించింది.

ఆగ్నేయాసియాలోని తమ కాంపోనెంట్స్ ఫ్యాక్టరీలు కరోనా మహమ్మారి కారణంగా అంతరాయాలను ఎదుర్కొన్నాయని, 'ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్' ఉత్పత్తి ఆలస్యం కారణంగా దెబ్బతిన్నాయని సంస్థ తెలిపింది.

చిప్ కొరత కారణంగా సెప్టెంబరులో ప్రపంచవ్యాప్తంగా వాహన ఉత్పత్తిని 40% తగ్గించనున్నట్లు గత ఏడాది ప్రారంభంలో కంపెనీ ప్రకటించింది.

ఈ ప్రకటన కారణంగా శుక్రవారం టోక్యో ట్రేడింగ్‌లో టయోటా షేర్లు దాదాపు 2.7% తగ్గాయి.

ఈ సంవత్సరం ప్రారంభం నుండి జపాన్‌లో ఒమిక్రాన్ కరోనావైరస్ వేరియంట్ కేసుల పెరుగుదల తర్వాత తాజా ప్రకటన వెలువడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)