కీలెస్ కార్లు: వీటిని 10 సెకన్లలో కొట్టేయొచ్చు

ఫొటో సోర్స్, Getty Images
పాపులర్ బ్రాండ్‌లకు చెందిన కొన్ని కొత్త మోడల్ కార్లను చాలా సులువుగా సెకన్ల వ్యవధిలోనే హ్యాక్ చేసేసి, దొంగిలించే ప్రమాదం ఉందని తాజా పరిశీలనలో వెల్లడైంది. ఆ కార్లలోని కీలెస్ ఎంట్రీ (తాళంచెవి రహిత) వ్యవస్థలో లోపాలు ఉన్నట్లు బయటపడింది.
కీలెస్ కార్లలోకి డ్రైవర్లు జేబులోంచి తాళంచెవి తీయకుండానే కారు తలుపులు తెరవొచ్చు, ఇంజిన్‌ను స్టార్ట్ చేయొచ్చు.
బ్రిటన్‌కు చెందిన వాట్ కార్? అనే మేగజీన్... కీలెస్ ఎంట్రీ ఫీచర్ ఉన్న ఏడు వేర్వేరు మోడళ్ల కార్లను పరీక్షించింది.
డీఎస్ 3 క్రాస్‌బ్యాక్, ఆడి టీటీ ఆర్‌ఎస్ మోడల్ కార్లను 10 సెకన్లలో, లాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ టీడీ4 180 హెచ్‌ఎస్‌ఈ మోడల్ కారును 30 సెకన్లలో హ్యాక్ చేయగలిగారు.
దొంగలు వాడే ప్రత్యేక సాంకేతికతనే 'వాట్ కార్?'కి చెందిన సెక్యూరిటీ నిపుణులు ఈ పరీక్షల కోసం వినియోగించారు.
ఆ కార్లను హ్యాక్ చేసి, దొంగిలించడానికి పట్టిన సమయాన్ని గడియారంలో రికార్డు చేశారు.


ఏటా వాహనాల చోరీలు పెరిగిపోతున్నాయి. గతేడాది (2018) దిల్లీలో రోజుకు సగటున 125 కార్లు చోరీకి గురయ్యాయని పోలీసు గణాంకాలు చెబుతున్నాయి. 2017లో దొంగలు రోజుకు సగటున 111 కార్లను కొట్టేశారు.
ఇంగ్లండ్, వేల్స్‌లో కారు చోరీల సంఖ్య ఎనిమిదేళ్ల గరిష్ఠానికి చేరింది. 2018లో 1,06,000 వాహనాలు చోరీకి గురయ్యాయి.
చోరీలు ఎక్కువవుతుండటంతో వాహనాలపై బీమా క్లెయింల మొత్తం కూడా ఏటా పెరిగిపోతున్నాయి.
కీలెస్ కార్ల వాడకం పెరిగిపోతుండటం కూడా ఈ చోరీల సంఖ్య పెరుగుదలకు కొంతమేర కారణమని బ్రిటిష్ బీమా సంస్థల సంఘం అంటోంది.
కార్లలో భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పోలీసులు, బీమా సంస్థల సమన్వయంతో పనిచేస్తున్నామని ఆడి మాతృ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ గ్రూపు తెలిపింది.
తమ కార్లలో భద్రతా లోపాలను విశ్లేషించి, సవరించేందుకు పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఒక బృందం పనిచేస్తోందని డీఎస్ ఆటోమొబైల్స్ మాతృ సంస్థ పీఎస్‌ఏ గ్రూపు చెప్పింది.
భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని కొత్త మోడల్ కార్లలో కీలెస్ ఎంట్రీ వ్యవస్థ అవసరం లేదని యజమానులు కోరితే డీలర్లు నిలిపివేస్తారని పీఎస్‌ఏ పేర్కొంది.
"వాట్ కార్? సంస్థ పరీక్షించిన డిస్కవరీ స్పోర్ట్ మోడల్ కార్లు ప్రస్తుతం ఉత్పత్తి కావడంలేదు. ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న డిస్కవరీ స్పోర్టు కార్లలో హ్యాకింగ్‌ను నివారించే సాంకేతికత ఉంది. అంతేకాకుండా, మా వాహనాలన్నింటిలోనూ ట్రాకింగ్ పరికరాలు అమర్చి ఉన్నాయి" అని టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ లాండ్ రోవర్ వివరించింది.

ఫొటో సోర్స్, AFP
టాయిలెట్ కోసం ఆగితే
59 ఏళ్ల స్టీఫెన్ సావిగర్ బ్రిటన్‌లోని సౌత్ వేల్స్ నుంచి లండన్ హీత్రూ విమానాశ్రయానికి తన భార్య, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో బయలుదేరారు.
తన భార్య, ఆమె స్నేహితురాలి 60వ జన్మదిన వేడుకలను జరుపుకునేందుకు సింగపూర్ వెళ్లాల్సి ఉంది.
అయితే, హీత్రూ విమానాశ్రయం వెళ్లడానికి ముందు మార్గం మధ్యలో టాయిలెట్ కోసం కాసేపు ఆగారు. అప్పుడే, వారి కీలెస్ ఫోర్డ్ మాండియో కారును దొంగలు హ్యాక్ చేశారు.
"దొంగలు నా కారు లాకింగ్ సిస్టంను హ్యాక్ చేశారు. కారును తీసుకెళ్లలేదు, కానీ అందులో ఉన్న నా ట్రావెల్ బ్యాగును ఎత్తుకెళ్లారు. ఆ బ్యాగులో నా భార్య పాస్‌పోర్టు, కళ్ల జోళ్లు, ఐప్యాడ్ ఉన్నాయి" అని స్టీఫెన్ సావిగర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనతో వారు ఆరోజు ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అనంతరం పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లి, మరుసటి రోజు మళ్లీ విమానం టికెట్లు కొనుక్కొని సింగపూర్ వెళ్లాల్సి వచ్చింది.
ఇలాంటి బాధితులు చాలామంది ఉంటారు.
చాలావరకు దొంగలు కార్లను చోరీ చేయగానే భాగాలుగా విడదీసి అమ్ముతారని పోలీసులు చెబుతున్నారు. కొందరు దొంగలు పోలీసులకు చిక్కకుండా పొరుగు రాష్ట్రాలకు, మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్తుంటారని దిల్లీ పోలీసులు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేశ్... ఉత్తమ తెలుగు చిత్రంగా 'మహానటి'
- 'ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి దమ్ము, ధైర్యమే కాదు, కృతనిశ్చయం కావాలి'
- సుష్మా స్వరాజ్: కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? గుండెపోటుకూ దీనికీ తేడా ఏంటి?
- ఆర్టికల్ 370 సవరణ: ‘ఇక భారతీయులంతా కశ్మీర్లో భూమి కొనుక్కోవచ్చు’
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
- కశ్మీరీ పండిట్లు: 'ఎన్నో మరణాలు, రక్తపాతాలు చూశాం. కానీ, ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు'
- ఉన్న అణు ఒప్పందం నుంచి బయటకొచ్చేసి కొత్తది కావాలంటున్న ట్రంప్
- ఆర్టికల్ 370 సవరణ: ‘కశ్మీర్లో అస్థిరత మరింత పెరిగే అవకాశం’
- BODMAS: 8÷2(2+2) = ?.. ఈ ప్రశ్నకు మీ జవాబు ఏంటి?
- 'ఆర్టికల్ 370 సవరణ': 'ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








