రైలు ప్రమాదాలపై గతంలోనూ దర్యాప్తు చేశారు... కానీ, చర్యలేమైనా తీసుకున్నారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, చందన్ కుమార్ జజ్వాడే
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతీయ రైల్వేలో ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాలు, చరిత్ర నుంచి రైల్వే శాఖ గుణపాఠాలేమీ నేర్చుకోలేదనే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.
అందుకే రైల్వేలో ప్రమాదాల చరిత్ర పునరావృతం అవుతూనే ఉంది.
రైల్వేలో ప్రతీ ప్రమాదం తర్వాత రైల్వే సేఫ్టీ కమిషనర్, లేదా రైల్వే సేఫ్టీ చీఫ్ కమిషనర్ దానిపై విచారణకు ఆదేశిస్తారు.
రైల్వేలో ప్రాణనష్టం, ఆస్తినష్టం లేదా రెండింటికీ సంబంధించిన కేసులను కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (సీఆర్‌ఎస్) దర్యాప్తు చేస్తుంది.
రైలు ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకొని భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవడమే ఈ దర్యాప్తు ఉద్దేశం.
ఒకవేళ సీఆర్‌ఎస్ విచారణ సాధ్యం కాకపోతే, రైల్వేలో జరిగిన ప్రమాదాలు లేదా ఏదైనా తీవ్ర ఘటనలను రైల్వేలోని ఉన్నత అధికారుల కమిటీ దర్యాప్తు చేస్తుంది.

ఫొటో సోర్స్, ANI
దర్యాప్తు నివేదిక
సీఆర్ఎస్‌లోని అధికారులు రైల్వేశాఖకు చెందినవారే. అయితే వారు డెప్యుటేషన్ మీద పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేస్తుంటారు.
సీఆర్‌ఎస్ దర్యాప్తులో పక్షపాతానికి చోటు లేకుండా ఉండేందుకే ఇలా వారు ఆ శాఖ పరిధిలో పనిచేస్తారని చెబుతారు.
దర్యాప్తు సమయంలో సీఆర్‌ఎస్ ఘటనా ప్రదేశాన్ని సందర్శిస్తుంది. స్థానికులతో మాట్లాడుతుంది. అవసరమైతే, విచారణ ప్రక్రియలో ప్రత్యక్ష సాక్షులు, రైల్వే సిబ్బంది, మీడియా కవరేజీని కూడా భాగం చేస్తుంది.
నిజానికి, ప్రతీ ప్రమాదం జరిగిన తర్వాత ఘటనా ప్రదేశంలో తక్షణమే సహాయక చర్యలను ప్రారంభించడం చాలా ముఖ్యం.
సహాయక చర్యల్లో భాగంగా చాలాసార్లు ధ్వంసమైన బోగీలు, ట్రాకులు, ఇతర వస్తువులను ఘటనా ప్రదేశం నుంచి తొలగించాల్సి ఉంటుంది.
అలాంటప్పుడు ప్రమాదం జరిగిన ప్రదేశం ముఖచిత్రం చాలావరకు మారిపోతుంది. పరిస్థితులు మారిపోవడం వల్ల అక్కడి నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించడం అంత సులభం కాదు.
ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు నివేదిక గురించి, తీసుకున్న చర్యల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మనకు చాలా అస్పష్టమైన సమాచారం అందుబాటులోకి వస్తుంది.
మేం కూడా సీఆర్‌ఎస్ వెబ్‌సైట్ నుంచి కొంత సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నించాం. కానీ, అందులో చాలా వరకు ఖాళీగానే కనిపించింది.
ఈ వెబ్‌సైట్ ద్వారా ఏం తెలుస్తుందంటే, ఎన్నో ఏళ్ల నాటి పాత రైలు ప్రమాదాల్లో ఇప్పటివరకు కూడా రైల్వే శాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. లేదా తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాచారాన్ని సాధారణ పౌరులకు లేదా ప్రయాణికులతో పంచుకోలేదని ఈ వెబ్‌సైట్‌ను చూస్తే అర్థం అవుతుంది.
ఇటీవలి ఏళ్లలో భారత్‌లో జరిగిన కొన్ని ప్రధాన రైలు ప్రమాదాలు, వాటిపై ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి తెలుసుకోవడానికి మేం ప్రయత్నించాం.

ఫొటో సోర్స్, Getty Images
గత ప్రమాదాలపై తీసుకున్న చర్యలు
2017 ఆగస్టు 19: ఉత్తరప్రదేశ్‌లోని ఖతౌలీలో ఒక పెద్ద రైలు ప్రమాదం జరిగింది. పురీ నుంచి హరిద్వార్ వెళ్లే ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన 14 బోగీలు పట్టాలు తప్పాయి.
ఖతౌలీలో రైల్వే ట్రాకుల మరమ్మతు పనులు జరుగుతుండగా, వాటిపై నుంచి వెళ్లేలా రైలుకు సిగ్నల్స్ ఇచ్చారు. ఈ ప్రమాదంలో 23 మంది చనిపోయారు. చాలా మంది ప్రయాణీకులు గాయపడ్డారు.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే కొంతమంది ఉన్నత అధికారులను బలవంతంగా సెలవుపై పంపారు.
ట్రాక్‌పై మరమ్మతు పనులు చేస్తున్న రైల్వే ట్రాక్‌మన్, లోహార్ (కమ్మరి పని చేసే వ్యక్తి), జూనియర్ ఇంజినీర్ సహా 14 మందిని తక్షణమే ఉద్యోగంలో నుంచి తీసేశారు.
అయితే, సీఆర్‌ఎస్ దర్యాప్తులో ఈ ప్రమాదానికి కేవలం జూనియర్ రైల్వే ఇంజినీర్ మాత్రమే కారణమని తేలడంతో మిగతా వారిని తిరిగి ఉద్యోగంలోకి చేర్చుకున్నట్లు ఆలిండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ్ గోపాల్ మిశ్రా చెప్పారు.
ఈ ప్రమాదం తర్వాత, అప్పటి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తన పదవికి రాజీనామా చేశారు. రైల్వేలోని ఉన్నతాధికారులు కొన్ని రోజుల తర్వాత మళ్లీ తమ విధుల్లో చేరారు.
2017 జనవరి 22: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో హీరాకుండ్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 8 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది చనిపోయారు. తొలుత ఈ ప్రమాదాన్ని ఒక కుట్రగా భావించారు. ఈ కేసు దర్యాప్తులో ఎన్‌ఐఏను కూడా భాగం చేశారు.
మూడు సంవత్సరాల దర్యాప్తు తర్వాత ట్రాకులో పగుళ్ల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సీఆర్‌ఎస్ గుర్తించినట్లు నివేదికలు వచ్చాయి. ఈ ప్రమాదానికి ఈస్ట్ కోస్ట్ రైల్వేకు చెందిన సివిల్ ఇంజనీరింగ్ శాఖ ప్రత్యక్ష బాధ్యత వహించాలని చెప్పారు.
2016 నవంబర్ 20: కాన్పుర్‌కు సమీపంలోని పుఖ్రాయాలో పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో దాదాపు 150 మంది చనిపోయారు.
మోదీ సర్కారు హయాంలో జరిగిన తొలి, భారీ రైలు ప్రమాదం ఇదే. ఈ ప్రమాదం వెనుక కూడా తొలుత ఏదో కుట్ర ఉన్నట్లు అనుకున్నారు. అందుకే ఈ కేసు విచారణలో ఎన్‌ఐఏను భాగం చేసినట్లు నివేదికలు వచ్చాయి.
అయితే, తర్వాత ఈ ప్రమాదంలో కుట్ర కోణం ఉన్నట్లు తేలలేదని శివ్ గోపాల్ మిశ్రా తెలిపారు.
రైల్వే విచారణలో అయిదుగురు రైల్వే సిబ్బందిని ఈ ప్రమాదానికి దోషులుగా గుర్తించి, వారిని విధుల నుంచి తొలగించారు. వీరిలో ఇద్దరు సీనియర్ ఇంజినీర్లు, ఇద్దరు ట్రాక్‌మెన్ ఒక సీఈటీ ఉన్నారు.
2015 మార్చి 20: డెహ్రాడూన్- వారణాసి జనతా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 35 మంది చనిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ప్రమాదం జరిగింది.
సీఆర్‌ఎస్ దర్యాప్తులో ఈ ప్రమాదానికి రైల్వే సిగ్నల్ మెయింటెనర్ కారణమని తేలింది. ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు.
2011 జూలై 10: హౌరా నుంచి దిల్లీకి వెళ్తున్న కల్కా మెయిల్ కాన్పూర్‌కు సమీపంలోని మల్వాన్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 70 మంది చనిపోయారు.
ఈ ప్రమాదంపై దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన అలహాబాద్ హైకోర్టు, సీసీఆర్‌ఎస్ రిపోర్టుపై తీసుకున్న చర్యల వివరాలను తమకు సమర్పించాలని రైల్వేను ఆదేశించింది.
2011 జూలైలో కోర్టు మరో ఆదేశాన్ని జారీ చేసింది. 2010 తర్వాత జరిగిన ప్రతీ ప్రమాదంపై రైల్వే శాఖ తీసుకున్న చర్యలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. రైల్వే శాఖ తీసుకున్న ఈ చర్యల గురించి తెలుసుకోవడానికి పిటిషనర్ కోర్టు సహాయాన్ని తీసుకోవాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, ANI
చిన్న ఉద్యోగులపై చర్యలు
రైలు ప్రమాదాలకు చిన్న ఉద్యోగులపై తీసుకున్న చర్యల గురించి మాట్లాడుతూ శివ్ గోపాల్ మిశ్రా ఇలా అన్నారు.
‘‘రైల్వేలో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అందులో రెండు లక్షల ఉద్యోగాలు రైల్వే భద్రతకు సంబంధించినవే. కానీ, ఇప్పుడు రైళ్లకు, స్టేషన్లకు రంగులు వేసే పనులు జరుగుతున్నాయి.
రైల్వేలో చిన్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం విషయంలో ఈరోజుకీ ఎలాంటి మార్పూ రాలేదు. కేవలం పెద్ద మాటలు మాట్లాడటం వల్ల ఏమీ జరుగదు. రైల్వేలో సిగ్నల్, భద్రత వ్యవస్థను పటిష్టం చేసేందుకు లక్షల కోట్ల రూపాయలు అవసరం కాగా, గత రెండు బడ్జెట్‌లలో రైల్వేకు కేవలం 200 కోట్లు కేటాయించారు’’ అని ఆయన వివరించారు.
రైల్వే బోర్డు మాజీ సభ్యుడు శ్రీప్రకాశ్‌తో బీబీసీ మాట్లాడింది.
‘‘రైల్వేలో దర్యాప్తు తర్వాత చర్యలు తీసుకుంటారు. కింది స్థాయిలో పనిచేసే సిబ్బందిపై చర్య తీసుకోవడం వెనుక కారణం ఏంటంటే, గ్రౌండ్ లెవల్‌లో రైలును నడిపేది వారే. అలాగే రైళ్లు సరైన సమయానికి నడిచేలా చేయాలనే ఒత్తిడి కూడా వారిపై ఎక్కువగా ఉంటుంది. ఈ ఒత్తిడి వల్లే వారు పొరపాట్లు చేస్తారు’’ అని చెప్పారు.
భారత్‌లో తరచుగా జరిగే రైలు ప్రమాదాలకు కిందిస్థాయి ఉద్యోగులు బాధ్యులా? లేదా వాటికి మరేదైనా కారణం ఉందా?
దీనికి సరైన జవాబు కంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే కాగ్ నివేదికలో ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- పదిహేనేళ్ల కిందట షేన్ వార్న్, ఇప్పుడు ధోనీ.. 41 ఏళ్ల ‘మిస్టర్ కూల్’ టీ20 కెప్టెన్సీని ఎలా మార్చేశాడు
- మిల్క్ డే: పచ్చిపాలా, మరగబెట్టినవా? ఆరోగ్యానికి ఏవి మంచివి?
- భారీగా రూ.500 దొంగ నోట్లు.. నకిలీ నోటును ఇలా గుర్తించవచ్చు
- మీరు సూర్యుడిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు
- రెజ్లర్ల నిరసన: బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలు రుజువైతే ఎన్నేళ్ల శిక్ష పడుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















