భారత సైన్యం బలాన్ని ప్రశ్నించిన చైనా.. ఆ వాదనలో నిజమెంత?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దీపక్ మండల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సింగపూర్‌లో ఏటా నిర్వహించే షాంగ్రీ లా డైలాగ్‌లో పాల్గొన్న చైనా బృందం భారత సైనిక సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తి కొత్త చర్చకు దారితీసింది.
ఆసియా దేశాల భద్రతకు సంబంధించి షాంగ్రీ లా డైలాగ్ ఒక కీలకమైన సదస్సు.
జూన్ 2 నుంచి 4 వరకు జరిగిన ఈ సదస్సులో ఒక మీడియా సమావేశంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ప్రతినిధి బృందం మాట్లాడుతూ, భారత సైన్యం చైనా ఆర్మీని సవాలు చేసే స్థితిలో లేదన్నారు.
సైన్యం ఆధునీకరణ, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సామర్థ్యంలో చైనా కన్నా భారత్ వెనుకబడి ఉందని చెప్పడం వారి ఉద్దేశంగా కనిపిస్తోంది.
"రాబోయే మరి కొన్ని దశాబ్దాల వరకు భారత్ సైనిక శక్తిలో చైనాతో సరితూగే పరిస్థితి ఉండదు. భారత్‌లో పారిశ్రామిక రంగంలో మౌలిక సదుపాయాలు బలహీనంగా ఉన్నాయి. చైనాలో పారిశ్రామిక రంగానికి కావాల్సిన పెద్ద వేదిక ఇప్పటికే తయారైంది" అని పీఎల్ఏ అకాడమీ ఆఫ్ మిలిటరీ సైన్సెస్‌లో సీనియర్ కల్నల్ జావో షియాజువో అన్నారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఓ కథనంలో తెలిపింది.
చైనా సైన్యానికి చెందిన ఒక సీనీయర్ అధికారి ఈ వ్యాఖ్య చేయడంతో భారత్, చైనా మధ్య బలాబలాల పోలిక ప్రారంభమైంది.
చైనా సైన్యం చాలా బలంగా ఉందనడంలో సందేహం లేదని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, ఈ మధ్య కాలంలో భారత్ కూడా సైన్యం ఆధునీకరణపై దృష్టి సారిస్తోందన్నది కూడా వాస్తవమే.
స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్ఐపీఆర్ఐ) డేటా ప్రకారం, 2018 నుంచి 2022 మధ్య కాలంలో భారత్ అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంది. రష్యా నుంచి మాత్రమే 31 శాతం ఆయుధాలను దిగుమతి చేసుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాతో పోటీపడుతున్న చైనా
భారత్ సూపర్‌పవర్‌గా ఎదగడానికి సైన్యాన్ని బలోపేతం చేసే ఎలాంటి అవకాశాన్నీ వదలట్లేదని షాంగ్రి లా డైలాగ్‌లో పాల్గొన్న పీఎల్ఏ నేషనల్ డిఫెన్స్ యూనివర్సీటీ అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ కల్నల్ జాంగ్ లీ 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్'తో అన్నారు.
చైనా ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ, వ్యూహాత్మక ఆశయాలను కూడా విస్తరించుకుంటోంది.
చైనా ప్రస్తుతం అమెరికాతో పోటీ పడుతోంది. ఈ పోటీలో ఆసియా దేశాలైన భారత్, జపాన్ వంటి పెద్ద శక్తులు కూడా ముందున్నాయి.
ఇండో-పసిఫిక్ నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు చైనాకు, దాని ప్రత్యర్థులకు కయ్యానికి కాలు దువ్వే పరిస్థితులే ఉన్నాయి. అందుకే చైనా సైనిక సామర్థ్యాలను నిరంతరం బలోపేతం చేసుకుంటోంది.
2023లో చైనా మిలటరీపై 225 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 18,56,218 కోట్లు) ఖర్చు చేయనున్నట్లు చైనీస్ ప్రీమియర్ లీ కెకియాంగ్ ఈ ఏడాది మార్చిలో ప్రకటించారు. ఇది గత ఏడాది కంటే 7.2 శాతం ఎక్కువ.
చైనా రక్షణ బడ్జెట్ 2020లో 6.6 శాతం, 2021లో 6.8 శాతం, 2022లో 7.1 శాతం పెరిగింది. ఆ దేశ ఆర్థికవ్యవస్థ గతంతో పోలిస్తే మందగించిన్నప్పటికీ, రక్షణకు భారీగా ఖర్చుపెడుతోంది.
అయితే, 2023 చైనా రక్షణ బడ్జెట్, అమెరికా రక్షణ బడ్జెట్‌లో మూడవ వంతు మాత్రమే. కానీ భారత రక్షణ బడ్జెట్ కంటే చైనాది మూడు రెట్లు ఎక్కువ.
2023-24లో భారతదేశ రక్షణ బడ్జెట్ 54.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 4,47,231 కోట్లు)గా ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images
గల్వాన్ ఘర్షణ తరువాత భారత్ సైన్యాభివృద్ధి ముమ్మరం
మూడేళ్ల క్రితం 2020 జూన్‌లో లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో చైనా, భారత్ మధ్య హింసాత్మక ఘర్షణల్లో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు చనిపోయారు.
ఆ తరువాత భారత్ సైన్యాభివృద్ధిని ముమ్మరం చేసింది.
ఈ వివాదం తరువాత చైనాతో సరిహద్దుల్లో సైనిక సన్నాహాలను భారత్ వేగవంతం చేసిందని అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ 'యునైటెడ్ స్టేట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్ చెప్పింది.
భారత్ దాదాపు 50 వేల మంది అదనపు సైనికులను వాస్తవాధీన రేఖ వద్ద మోహరించింది. సరిహద్దుల దగ్గర భారత వైమానిక దళాన్ని కూడా మోహరించింది.
అంతే కాకుండా, సరిహద్దు వెంబడి మౌలిక సదుపాయాలను పటిష్టం చేస్తున్నారు.
వాస్తవాధీన రేఖను ఆనుకుని 73 వ్యూహాత్మక రహదారులను సిద్ధం చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోనే 1,430 మైళ్ల పొడవైన రహదారి తయారవుతోంది.
రక్షణ బడ్జెట్‌లో రూ.1.62 లక్షల కోట్లను కొత్త ఆయుధాలు, సైనిక పరికరాల కోసం కేటాయించారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా బలం గురించి భారత్ ఆందోళన చెందాలా?
సైన్యంపై భారత్ కంటే చైనా ఎక్కువ ఖర్చు పెడుతోంది. సైనిక సామర్థ్యాలను బలోపేతం చేస్తోంది. దీనిపై భారత్ ఆందోళన చెందాలా, వద్దా అన్నది ప్రశ్న.
"రక్షణ బడ్జెట్‌ను జీడీపీతో పోల్చి చూడాలి. లేదంటే వాస్తవ చిత్రం కళ్ల ముందుకు రాదు. ప్రతి దేశానికి రక్షణ అవసరాలు భిన్నంగా ఉంటాయి. చైనా, అమెరికా వ్యూహాత్మక లక్ష్యాలు వేరు. భారత్ వాటితో పోటీపడి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు" అని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చైనీస్ స్టడీస్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ అరవింద్ యెలేరి అభిప్రాయపడ్డారు.
అయితే, షాంగ్రీ లా డైలాగ్‌లో భారత సైనిక సామర్థ్యాలపై చైనా ఆర్మీ అధికారులు చేసిన వాఖ్యలను ఎంత సీరియస్‌గా తీసుకోవాలి?
"భారత్ ఇప్పుడు రక్షణ పరికరాల విషయంలో వైవిధ్యంగా ఆలోచిస్తోంది. రష్యా, ఫ్రాన్స్, అమెరికా, ఇజ్రాయెల్ నుంచి భారత్ ఆయుధాలను కొంటోంది. కానీ, ఇప్పుడు ఆయుధాలు, సైనిక పరికరాల తయారీలో స్వయం సమృద్ధి దిశగా కదులుతోంది. ప్రైవేట్ కంపెనీలు రక్షణ రంగంలో అడుగు పెడుతున్నాయి. ఇవన్నీ రక్షణ బడ్జెట్‌లో కనిపించకపోయినా, ఆయుధాలు, సైనిక పరికరాలపై పెడుతున్న ఖర్చు పెరుగుతోంది" అని అరవింద్ యెలేరి అన్నారు.

ఫొటో సోర్స్, ANI
'చైనా సామర్థ్యాలను ఇంకా పరీక్షించాల్సి ఉంది'
భారత్ శక్తిసామర్థ్యాలపై చైనా సందేహాలు వ్యక్తం చేసింది కానీ, అమెరికా, ఆస్ట్రేలియాలతో పోలిస్తే చైనా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నాణ్యత ఏపాటిదో పరిశీలించాల్సిన అవసరం ఉందని యెలేరి అభిప్రాయపడ్డారు.
చైనా ప్రతి సంవత్సరం పెద్ద పెద్ద యుద్ధనౌకలను నిర్మిస్తోంది. కానీ, నాణ్యత పరంగా అవి ఎలా ఉన్నాయన్నది ప్రశ్న.
భారత్ నౌకాదళంలో ఎన్నోయేళ్లుగా బలంగా ఉందని యెలేరి అన్నారు. చారిత్రకంగా సముద్రంపై యుద్ధాలు భారత్‌కు కొత్త కాదు.
ఈ విషయంలో చైనా బలహీనంగా ఉండవచ్చు. ఆ దేశం ఎప్పుడూ సముద్రంపై యుద్ధాలు చేయలేదు. కాబట్టి దాని సామర్థ్యంపై సందేహాలు ఉన్నాయి.
భారత సైనిక సామర్థ్యాలు బలహీనంగా ఉన్నాయని చెప్పడం సరికాదని యెలేరి అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే: ఈ 7 ఆహార పదార్థాలతో ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు...జాగ్రత్త
- డీలిమిటేషన్: లోక్‌సభ సీట్ల విభజన చేస్తే దక్షిణాది డమ్మీ అయిపోతుందా?
- చైనా 11 కి.మీ. లోతైన గొయ్యి తవ్వుతోంది, అక్కడ ఏముంది?
- రష్యా - యుక్రెయిన్ యుద్ధం: భారీ డ్యామ్ ధ్వంసం.. ప్రమాదంలో వేల మంది ప్రాణాలు
- యాపిల్ - విజన్ ప్రో: కొత్తగా విడుదలైన ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్సెట్ ఎలా పని చేస్తుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














