భారత నౌకాదళంలో మొదటి సారి.. సముద్రంపై మహిళా అధికారుల నిఘా మిషన్‌

వీడియో క్యాప్షన్, స్పెషల్ మిషన్‌తో దూసుకుపోతున్న మహిళా స్క్వాడ్రన్

భారత నౌకాదళంలో మొదటి సారి.. కేవలం మహిళా అధికారుల బృందం సముద్రం మీద నిఘా నిర్వహణ మిషన్‌ను పూర్తి చేసింది.

ఈ ఏడాది ఆగస్టు 3న డార్నియర్ 228 విమానంలో మహిళల బృందం ఉత్తర అరేబియా సముద్రంలో ఈ చరిత్రను రాసింది. మరి ఈ మిషన్‌పై వాళ్లు ఏం అంటున్నారు.

బీబీసీ ప్రతినిధులు తేజస్ వైద్య, పవన్ జైశ్వాల్, జయ్ బ్రహ్మభట్ అందిస్తున్న ఈ కథనం.

గుజరాత్ పోర్‌బందర్‌లోని ఉన్న INS 314 నావల్ స్క్వాడ్రన్‌కి చెందిన ఐదుగురు మహిళల బృందంలో ఇద్దరు పైలట్లు, ఇద్దరు ఎయిర్ ఆపరేషన్ ఆఫీసర్లు, ఒక కెప్టెన్ ఉన్నారు. ఈ మిషన్ కెప్టెన్ పేరు ఆంచల్ శర్మ.

‘‘ఈ మిషన్‌ను మారిటైం సర్వైలెన్స్ అండ్ రికానిసెన్స్ మిషన్ అంటారు. అక్కడ మేం ప్రత్యర్థులకు సమీపంలో పనిచేస్తుంటాం. మేం అక్కడి వెళ్తాం. గుర్తిస్తాం. సమాచారం సేకరిస్తాం. మా కమాండ్‌కు ఆ సమాచారాన్ని అందిస్తాం’’ అని భారత నౌకాదళం లెఫ్టినెంట్ కమాండర్ ఆంచల్ శర్మ బీబీసీతో అన్నారు.

ఈ మిషన్‌ను మారిటైం సర్వైలెన్స్ అండ్ రికానిసెన్స్ మిషన్ అంటారు. అక్కడ మేం ప్రత్యర్థులకు సమీపంలో పనిచేస్తుంటాం. మేం అక్కడి వెళ్తాం. గుర్తిస్తాం. సమాచారం సేకరిస్తాం. మా కమాండ్‌కు ఆ సమాచారాన్ని అందిస్తాం.

‘‘మాకిది సర్వ సాధారణం. మేం రోజూ ఇలాంటి మిషన్‌లకు వెళ్తుంటాం. ఈ సారి ప్రత్యేకత ఏంటంటే అందరం అమ్మాయిలం కలిసి వెళ్లాం. నేను నాలుగేళ్ల నుంచి నేవీలో ఉన్నాను. నా పని గాలిలో విమానాన్ని నడపడం. మేం దానికి శిక్షణ పొందాం’’ అని లెఫ్టినెంట్ పైలెట్ శివంగి చెప్పారు.

‘‘నాకైతే ఈ మిషన్ గుర్తుండి పోతుంది. కాక్‌పిట్‌లో ఎప్పుడు పురుషుల మాటలు వినిపించేవి. కానీ మొదటిసారి నాకు కేవలం ఆడవాళ్ల మాటలు వినిపించాయి. అది చాలా సాధికారికంగా అనిపించింది’’ అని లెఫ్టినెంట్, పైలట్ అపూర్వ్ గీతె చెప్పారు.

భూమ్మీద, సముద్రంలో నిఘా విధులు నిర్వహించడంలో తేడా ఏమిటో ఈ మిషన్ కమాండర్‌.. లెఫ్ట్‌నెంట్ కమాండర్, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ ఆంచల్ శర్మ వివరిస్తూ.. ‘‘మనం భూమ్మీద నిఘా నిర్వహించేటప్పుడు నావిగేషన్ కోసం మన దగ్గర చాలా ఆధారాలు ఉంటాయి. ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. కొండలు, బిల్డింగులను చూసినప్పుడు మీరు ఎక్కడున్నారో అర్థమవుతుంది. సముద్రం మీద ఉన్నప్పుడు మీరెక్కడున్నారో తెలియదు. ఉపరితలం అంతా నీరే ఉంటుంది. అక్కడ మీరెక్కడున్నారో, కనిపెట్టడానికి మేం గ్రౌండ్‌లో ప్లాన్ చేస్తాం. ఇంత దూరం తర్వాత ఇక్కడ టర్న్ తీసుకుంటే ఇక్కడికి చేరుకుంటాం. అదంతా ప్లానింగ్‌తోనే సాధ్యమవుతుంది. అక్కడ వేరే మార్గమేమీ లేదు’’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)