ఏఐ మారథాన్‌లో అమెరికాను చైనా అందుకోగలదా? సెమీకండక్టర్ ఎగుమతులపై యూఎస్ ఆంక్షల ప్రభావం ఏమిటి?

రోబోటిక్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డెరెక్ కై, అన్నాబెల్లె లియాంగ్
    • హోదా, బీబీసీ న్యూస్

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో అమెరికా ముందుంది.

చైనా టెక్నాలజీ పురోగతిని దెబ్బతీసేలా, చైనాకు సెమీకండక్టర్ ఎగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలతో ఇది సాధ్యమైంది.

అయితే ఏఐ సొల్యూషన్స్‌ పరిపూర్ణత సాధించేందుకు ఏళ్ల సమయం పడుతుండటంతో, ఈ రేసులో అమెరికాను చైనా అందుకోగలదని నిపుణులు చెబుతున్నారు.

అమెరికా ఇంటర్నెట్ కంపెనీలతో పోలిస్తే చైనీస్ ఇంటర్నెట్ కంపెనీలు మరింత అధునాతనంగా ఉంటాయని ట్రివియం చైనాకు చెందిన టెక్ పాలసీ రీసెర్చ్ హెడ్ కేంద్ర స్కేఫర్ బీబీసీతో చెప్పారు.

అయినప్పటికీ, గ్లోబల్ లీడర్ల కంటే 10 నుంచి 15 ఏళ్ల వెనకాలే హైఎండ్ ఇక్విప్‌మెంట్‌ను, కాంపోనెంట్లను తయారు చేసే సామర్థ్యాన్ని చైనా కలిగి ఉందని ఆమె అన్నారు.

సిలికాన్ వ్యాలీ విషయానికొస్తే..

అమెరికా అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే సిలికాన్ వ్యాలీ. సరికొత్తగా వ్యాపారాలు ప్రారంభించుకునేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద హాట్‌స్పాట్‌గా సిలికాన్ వ్యాలీ నిలుస్తోంది. ఆధునిక జీవితానికి బాటలు వేసిన గూగుల్, ఆపిల్, ఇంటెల్ వంటి టెక్నాలజీ దిగ్గజాలు పుట్టింది సిలికాన్ వ్యాలీలోనే.

దీని ప్రత్యేకమైన పరిశోధనాత్మక సంస్కృతి అమెరికాలోని ఇన్నోవేటర్లకు ఎంతో సాయపడినట్లు హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రీసర్చ్ కేంద్రానికి డైరెక్టర్ పాస్కేల్ ఫంగ్ చెప్పారు.

ప్రొడక్ట్‌ గురించి ఎలాంటి ఆలోచన లేకుండానే టెక్నాలజీని మెరుగుపరిచేందుకు ఎన్నో ఏళ్ల పాటు రీసర్చర్లు పనిచేస్తుంటారని ఫంగ్ చెప్పారు.

ఉదాహరణకు లాభాపేక్ష లేని కంపెనీగా కొనసాగుతున్న ఓపెన్ఏఐ, ట్రాన్స్‌ఫార్మర్స్ మెషిన్ లెర్నింగ్‌ మోడల్‌పై ఎన్నో ఏళ్ల పాటు పనిచేసి చివరికి చాట్‌జీపీటీని తీసుకొచ్చింది.

‘‘అయితే, ఇలాంటి వాతావరణం చాలా చైనీస్ కంపెనీల్లో లేదు. పాపులారిటీని చూసిన తర్వాతనే వారు డీప్ లెర్నింగ్ సిస్టమ్స్‌ను లేదా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ను అభివృద్ధి చేస్తుంటారు’’ అని ఆమె చెప్పారు. చైనీస్ ఏఐకి ఇదే ప్రధాన సవాలుగా నిలుస్తుందన్నారు.

అమెరికా పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అమెరికా ఇన్వెస్టర్లు ఎల్లవేళలా చేదోడుగా ఉంటుంటారు.చాట్‌జీపీటీ రూపొందించిన ఓపెన్ఏఐలో 1 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులను పెట్టనున్నట్లు 2019లోనే మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.

చైనా వద్ద పెద్ద మొత్తంలో డేటా

చైనాకు ఉన్న అతిపెద్ద కన్జూమర్ బేస్‌తో దానికి ప్రయోజనం చేకూరుతుంది. సుమారు 140 కోట్ల మంది జనాభాతో ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా ఇది ఉంది.

అలాగే, చైనాకు బలమైన ఇంటర్నెట్ రంగం ఉందని రేస్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ పార్టనర్ ఎడిత్ యెంగ్ చెప్పారు.

ఉదాహరణకు చైనాలో ప్రతి ఒక్కరూ సూపర్ యాప్ వీచాట్‌ను వాడతారు. టెక్ట్స్ మెసేజ్‌లు పంపుకోవడం నుంచి డాక్టర్ అపాయింట్‌మెంట్ల బుకింగ్, ట్యాక్స్ ఫైలింగ్ వరకు ప్రతి దానికి ఈ యాప్‌ ఉపయోగపడుతుంది.

ఈ యాప్ ద్వారా లభ్యమయ్యే సమాచారంతో ప్రొడక్ట్‌లను మెరుగుపర్చుకునేందుకు వాడుకోవచ్చు.

‘‘మంచో చెడో, చైనా మాత్రం గోప్యత విషయంలో చాలా తక్కువ నిబంధనలనే వాడుతోంది. కానీ, అమెరికాతో పోలిస్తే చైనాలో డేటా పెద్ద మొత్తంలో ఉంది. ప్రతి దగ్గర సీసీటీవీ ఫేసిషియల్ రికగ్నిషన్ ఉంటుంది. ఏఐ జనరేటెడ్ ఫోటోలకు ఇదెంత ఉపయోగకరమో ఒకసారి ఊహించుకోండి’’ అన్నారు.

అలాగే, చైనా టెక్ కమ్యూనిటీ అమెరికా కంటే వెనుకబడి ఉన్నట్లు కనిపించవచ్చని, కానీ దీన్ని చేరుకునేందుకు డెవలపర్లు చిట్టచివరి దశలో ఉన్నారని లీ కై-ఫు తాను రాసిన ఏఐ సూపర్‌పవర్స్: చైనా, సిలికాన్ వ్యాలీ, న్యూ వరల్డ్ ఆర్డర్‌లో చెప్పారు.

‘‘వేగం అవసరమయ్యే ప్రపంచంలో వీరున్నారు. కానీ కాపీ అనేది వీరికి ఆమోదిత విధానంగా మారింది. కొత్త మార్కెట్‌ను గెలుచుకునేందుకు పోటీదారులను ఏదీ ఆపలేదు’’ అని లీ అన్నారు. బీజింగ్ ఇంటర్నెట్ రంగంలో ప్రముఖ వ్యక్తిగా లీ ఉన్నారు. తాను గూగుల్ చైనాకు అధినేతగా కూడా పనిచేశారు.

చైనాకు చెందిన ఈ కాపీక్యాట్ విధానం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. మేధో హక్కుల విషయంలో తీవ్రమైన సమస్యలు కూడా ఉన్నాయి.

1980 నుంచి చైనా తన ఆర్థిక వ్యవస్థను విస్తరించుకోవడం ప్రారంభించింది. ప్రధానంగా తయారీ రంగం నుంచి టెక్నాలజీ ఆధారితంగా తన ఆర్థిక వ్యవస్థను విస్తరించుకుంటూ వస్తోందని పాస్కేల్ ఫంగ్ చెప్పారు.

గత దశాబ్ద కాలంగా చైనీస్ ఇంటర్నెట్ కంపెనీలకు చెందిన మరిన్ని నూతనావిష్కరణలను, హైఎండ్ చైనీస్ డిజైన్లను మనం చూస్తున్నామని అన్నారు.

చాట్‌జీపీటీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చాట్‌జీపీటీ

ఏఐలో చైనా అమెరికాను చేరుకోగలదా?

చైనీస్ టెక్ కంపెనీలు ప్రత్యేకమైన ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, బీజింగ్ నిరంకుశత్వ ప్రభావం ఇంకా అస్పష్టంగానే ఉంది.

చైనీస్ ఏఐ చాట్‌బోట్ల అభివృద్ధిపై సెన్సార్‌షిప్ ప్రభావం చూపుతుందా? అన్న దానిపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇవి ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్ గురించి సున్నితమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలుగుతాయా? అన్నది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది.

‘‘చైనాలో ఎవరైనా వివాదాస్పదమైన ప్రశ్నలు అడుగుతారని నేననుకోవడం లేదు. వారికి తెలుసు ఇవి సెన్సార్‌తో కూడుకున్నవై ఉంటాయని. సున్నితమైన అంశాలను చాలా తక్కువగానే చాట్‌బోట్లపై వాడుతుంటారు’’ అని యాంగ్ చెప్పారు.

అయితే చైనా అతిపెద్ద సమస్య ఏంటంటే.. స్పెషలైజ్డ్ టెక్నాలజీ చైనాకు అందకుండా అమెరికా విధిస్తున్న ఆంక్షలు, ఆ ఏఐ ఇండస్ట్రీపై ప్రభావం చూపనున్నాయి.

అధిక పనితీరు గల కంప్యూటర్ చిప్‌లు లేదా సెమీ కండక్టర్లు ప్రస్తుతం వాషింగ్టన్, బీజింగ్‌లకు మధ్య ఆందోళనకర పరిస్థితులకు కారణంగా నిలుస్తున్నాయి.

ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్ వంటి రోజువారీ ఉత్పత్తుల్లో వీటిని వాడుతుంటారు. మిలటరీ అప్లికేషన్లలో కూడా వీటిని వాడుతుంటారు. ఏఐ లెర్నింగ్‌కు అవసరమైన హార్డ్‌వేర్‌కి ఇవెంతో కీలకం.

చాట్‌జీపీటీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చాట్‌జీపీటీ

ఏఐ చిప్‌లను అభివృద్ధి చేయడంలో ఎన్విడియా లాంటి అమెరికా కంపెనీలు ముందంజలో ఉన్నాయని ఫంగ్ చెప్పారు. ఎగుమతులపై ఆంక్షలతో, కొన్ని చైనీస్ కంపెనీలు చాట్‌జీపీటీకి గట్టి పోటీ ఇవ్వగలవని ఫంగ్ అన్నారు.

ఎగుమతులపై ఆంక్షలు కట్టింగ్ ఎడ్జ్ ఏఐ లాంటి చైనాలోని హై-టెక్ ఇండస్ట్రీలను దెబ్బకొట్టనున్నాయని, కానీ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి వినియోగదారుల సాంకేతికతను తయారు చేయడంపై ఇవి ప్రభావం చూపవని స్కేఫర్ అన్నారు.

చైనా తన ఆర్మీ అవసరాలకు అధునాతన ఏఐను అభివృద్ధి చేసుకోకుండా ఈ ఎగుమతులపై ఆంక్షలను తీసుకొచ్చింది అమెరికా.

అమెరికా ఆంక్షలను అధిగమించేందుకు చైనాకు కూడా సొంతంగా సిలికాన్ వ్యాలీ కావాల్సి ఉందని ఫంగ్ అన్నారు. వివిధ విభాగాల నుంచి ప్రతిభను ఆకట్టుకునేలా రీసర్చ్ సంస్కృతి ఉండాలని అన్నారు.

‘‘బిగ్ ఫండ్’’ ద్వారా చిప్ కంపెనీలకు పెద్ద మొత్తంలో ప్రోత్సాహకాలను బీజింగ్ అందిస్తోంది.

అయితే ఇదే సమయంలో ఈ రంగంపై తన పట్టును కూడా బీజింగ్ ప్రభుత్వం బిగిస్తోంది. మార్చి నెలలో టెక్నాలజీ టైకూన్ జావో వీగువోను అవినీతి ఆరోపణలపై అధికారులు అరెస్ట్ చేశారు.

కొన్ని ప్రత్యేకమైన పరిశ్రమలపై దృష్టి సారించిన బీజింగ్ వాటికి ఆర్థిక ప్రోత్సాహకాలను అందించగలదు. కానీ, ఇదే సమయంలో వాటిపై తన స్క్రుటినీ కూడా పెంచుతోంది. దీంతో ఈ పరిశ్రమల్లో భయాలు పెరిగి, అస్పష్టత నెలకొంటోంది.

ప్రజల సంపదతో ఆడుకోవద్దని ముఖ్యంగా చిప్ స్పేస్‌లో అనే మెసేజ్‌ను జావో అరెస్ట్‌తో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు అందించినట్లైందని స్కేఫర్ అన్నారు.

ఈ మెసేజ్ భవిష్యత్‌లో చైనా ఏఐ పరిశ్రమపై ఎలా ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)