జీ7: ప్రధాని నరేంద్ర మోదీ జపాన్, పాపువా న్యూగినీ, ఆస్ట్రేలియా పర్యటనలో ప్రస్తావించే అంశాలేంటి?

    • రచయిత, కీర్తి దూబే
    • హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Getty Images

భారత ప్రధాని నరేంద్రమోదీ మే 19 నుంచి 24 వరకు జపాన్, పాపువా న్యూ గినీ, ఆస్ట్రేలియా దేశాలలో పర్యటించనున్నారు.

జపాన్‌లోని హిరోషిమాలో ఈ శుక్రవారం నుంచి జీ-7 సదస్సు ప్రారంభం కానుంది. ఇది మే 21 వరకు కొనసాగుతుంది. ఈ సదస్సులో పాల్గొనడానికి ప్రధాని మోదీ శుక్రవారం జపాన్ చేరుకోనున్నారు.

జీ-7లో జపాన్, ఇటలీ, కెనడా, ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్, జర్మనీ సభ్య దేశాలుగా ఉన్నాయి.

జీ-7 సమావేశంలో ప్రధాని మోదీ శాంతి, స్థిరత్వం, ఆహార ధాన్యాలు, ఇంధనం, ఎరువులు తదితర అంశాలపై ఇతర దేశాలతో మాట్లాడతారని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

జపాన్ తర్వాత ప్రధాని మోదీ పపువా న్యూ గినియాకు వెళ్లి అక్కడ 'ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కో-ఆపరేషన్' సదస్సులో పాల్గొంటారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లనున్నారు.

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో క్వాడ్ సమావేశం జరగాల్సి ఉంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా కూడా ఇందులో పాల్గొనాల్సి ఉంది.

అయితే, అమెరికాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం దృష్ట్యా బైడెన్ ఆస్ట్రేలియా పర్యటన, క్వాడ్ సమావేశం రద్దయిందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ చెప్పారు.

హీరోషిమా

ఫొటో సోర్స్, ANI

హిరోషిమా పర్యటనకు ఎందుకంత ప్రాధాన్యం?

హిరోషిమా నగరానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. ఆ నగరం రెండో ప్రపంచ యుద్ధంలో అణుదాడితో నాశనమైంది. ఈ నగరాన్ని1957లో భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సందర్శించారు.

ఆ నగరానికి వెళ్లనున్న రెండో భారత ప్రధాని నరేంద్ర మోదీ.

జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడాకు హిరోషిమా ప్రత్యేకమైనది ఎందుకంటే ఆయన ఈ నగరానికి చెందినవాడు. సెంట్రల్ హిరోషిమా ఆయన నియోజకవర్గం.

అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)లో ఇండియా లేనందున ప్రధాని మోదీ హీరోషిమా పర్యటన ప్రాముఖ్యత సంతరించుకుంది.

వాస్తవానికి ఎన్‌పీటీలో 1969 జనవరి1కి ముందు అణ్వాయుధాలను అభివృద్ధి చేసిన దేశాలు మాత్రమే ఉన్నాయి.

దీని తర్వాత అణు పరీక్షలు నిర్వహించిన లేదా ఆయుధాలను అభివృద్ధి చేసిన దేశాలు ఇందులో చేర్చలేదు.

అణ్వాయుధాలు ఉన్నాయని బహిరంగంగా మాట్లాడిన దేశాలు భారతదేశం, పాకిస్తాన్, ఉత్తర కొరియా. అయితే ఎన్‌పీటీపై సంతకం చేసిన వాటిలో ఈ దేశాలు లేవు.

చైనా, రష్యా దేశాల అధినేతలు

ఫొటో సోర్స్, Getty Images

ఏయే దేశాలు, సంస్థలు సమావేశంలో పాల్గొంటున్నాయి?

ప్రధాని మోదీ జీ-7 దేశాల ప్రతినిధులతో కలిసి హిరోషిమా శాంతి స్మారకాన్ని కూడా సందర్శించనున్నారు.

అణు దాడిలో మరణించిన వారి జ్ఞాపకార్థం దీనిని నిర్మించారు.

ప్రధాని మోదీ గతంలో మూడుసార్లు జీ-7 సమావేశానికి హాజరయ్యారు.

ఈ ఈ సదస్సుకు జీ-7 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇండోనేషియా (ఆసియాన్ గ్రూప్ సభ్య దేశం), కుక్ ఐలాండ్ (పసిఫిక్ ఐలాండ్స్ ఫోరమ్ సభ్య దేశం), దక్షిణ కొరియా, వియత్నాంలను కూడా ఆహ్వానించారు.

ఐఎంఎఫ్, ఐక్యరాజ్యసమితి, డబ్ల్యూటీవో వంటి అనేక ప్రపంచ సంస్థలకు కూడా ఆహ్వానం అందాయి.

జపాన్ ప్రధానితో బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

మోదీకి ఈ పర్యటన ఎందుకు ముఖ్యమైనది?

మూడో ప్రపంచ దేశాల నాన్-అలైన్డ్ గ్రూప్‌కు ఒకప్పుడు భారతదేశాన్ని నాయకుడిగా పరిగణించారని ప్రొఫెసర్ స్వరణ్ సింగ్ తెలిపారు.

స్వరణ్ సింగ్ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలోని ఇంటర్నేషనల్ పాలిటిక్స్, ఆర్గనైజేషన్, నిరాయుధీకరణ కేంద్రం ప్రొఫెసర్ .

''ఈరోజు భారతదేశం చైనా, రష్యా, అమెరికా, బ్రిటన్, యూరోపియన్ దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు కనిపిస్తోంది.

గత కొన్నేళ్లుగా జీ-7లో ఇండియాను ఆహ్వానిస్తున్నారు. కానీ ఈసారి భారత స్థానం మరింత బలంగా ఉంది. ఎందుకంటే భారత్ జీ-20 దేశాలకు చైర్మన్ స్థానంలో ఉంది.

నేడు జీ-7 కంటే జీ-20 ఎక్కువ ప్రభావవంతమైన సమూహం.'' అని స్వరణ్ సింగ్ చెప్పారు.

స్వరణ్ సింగ్ మాట్లాడుతూ “ అమెరికా, కెనడా మినహా ఈ సమావేశంలో పాల్గొంటున్న జీ-7 దేశాలు లేదా ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థ వృద్ధి నెగెటివ్‌లోకి వెళుతుంది.

అక్కడ సమావేశమవుతున్న దేశాల్లో ఆర్థిక వృద్ధి రేటు అత్యంత వేగంగా ఉన్న దేశం భారత్. ఇవన్నీ ఇండియాను ప్రముఖంగా నిలిచేలా చేస్తాయి.

మీడియా రిపోర్టుల ప్రకారం ముఖ్యమైన అంశాలపై జీ-7 దేశాల నుంచి మద్దతు పొందేందుకు ఈ సమావేశంలో భారతదేశం ప్రయత్నించనుంది.

జీ-20కి చెందిన 12 దేశాలు జీ-7 సదస్సులో పాల్గొంటున్నాయి. అలాగే ప్రధాని మోదీ అనేక దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది'' అని తెలిపారు.

జపాన్, భారత ప్రధానులు

ఫొటో సోర్స్, Getty Images

భారత్-జపాన్ సంబంధాలు ఎలా ఉన్నాయి?

1952లో భారత్, జపాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి.

అయితే 1974లో పోఖ్రాన్‌లో భారత్ అణుపరీక్ష నిర్వహించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

1998 మేలో 'భారత రెండో అణు పరీక్ష'ను జపాన్ ఖండించింది.

కానీ, 2000 సంవత్సరంలో అప్పటి జపాన్ ప్రధాని యోషిరో మోరీ దిల్లీ పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు పుంజుకోవడం ప్రారంభమయ్యాయి.

2023 జనవరిలో భారతదేశం, జపాన్ మధ్య 'వీర్ గార్డియన్ 2023 ఎయిర్ కంబాట్' వ్యాయామం జరిగింది.

రెండు దేశాల మధ్య ఇలాంటి కసరత్తు జరగడం ఇదే తొలిసారి.

"పరస్పర అవగాహనను పెంపొందించడానికి, వైమానిక దళాల మధ్య రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడానికి, వ్యూహాత్మక నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఈ వ్యాయామం జరిగింది" అని జపాన్ వైమానిక దళం ప్రకటన విడుదల చేసింది

ఇంతకుముందు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీలతో మాత్రమే జపాన్ ఇలాంటి కసరత్తులు చేసింది.

జపాన్ "ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో-పసిఫిక్ విజన్"లో భారతదేశం ముఖ్యమైన భాగస్వామి.

ఆసియాలో పెరుగుతున్న చైనా దూకుడు కారణంగా భారత్‌తో రక్షణ సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని జపాన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

రష్యాతో భారతదేశం స్నేహం గురించి జపాన్ ఒకింత అసహనంగా ఉన్నప్పటికీ, గత దశాబ్దాలుగా భారతదేశం, జపాన్ మధ్య సాన్నిహిత్యం పెరిగింది.

భారత ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Getty Images

భారత విదేశాంగ విధానంలో మార్పులు

గత కొన్నేళ్లుగా భారతదేశం తన విదేశాంగ విధానం ద్వారా ఇతర దేశాల ఒత్తిడికి గురికాకుండా తన ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టంచేస్తూ వస్తోంది.

రష్యా-యుక్రెయిన్ యుద్ధమే దీనికి ఉదాహరణ. అక్కడ పాశ్చాత్య దేశాల ఒత్తిడి, విమర్శలను దాటవేస్తూ భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగించింది.

ప్రొఫెసర్ స్వరణ్ సింగ్ మాట్లాడుతూ "అమెరికా, రష్యాలతో మరింత మెరుగైన సంబంధాలు ఉన్నందున భారత్ ప్రపంచానికి ముఖ్యమైన దేశం.

చైనా-భారత్‌ల మధ్య ఉద్రిక్తత ఉంది. అయితే చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా జీ-20కి రానున్నారు.

రష్యా, అమెరికా, చైనాలను ఒకే దగ్గరికి తీసుకొచ్చే శక్తి భారత్‌కు మాత్రమే ఉంది.

జీ-20 సమావేశం కెనడాలో జరిగితే రష్యా దానికి హాజరుకాకపోవచ్చు. బహుశా చైనా కూడా కెనడాకు వెళ్లకపోవచ్చు.

ఇలా బహిరంగంగా వ్యతిరేకంగా ఉన్న దేశాలను కూడా ఒకే వేదికపైకి తీసుకురావడం భారత్ వల్లే సాధ్యమవుతుంది" అని అన్నారు.

మోదీ

ఫొటో సోర్స్, MEA@TWITTER

పాపువా న్యూగినీని సందర్శించడం ఎందుకు ముఖ్యం?

ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని పాపువా న్యూ గినీను సందర్శించనున్న తొలి భారత ప్రధాని నరేంద్రమోదీ.

ఇక్కడ మే 22న జరగనున్న 'ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కో-ఆపరేషన్' సదస్సుకు ప్రధాని మోదీ కో-ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

ఇండియా-పసిఫిక్ దీవుల్లో కో ఆపరేషన్ చర్యలు 2014లో ప్రారంభమయ్యాయి.

ఇందులో భారత్, 14 పసిఫిక్ ద్వీప దేశాలైన ఫిజి, పపువా న్యూ గినియా, టోంగా, తువాలు, కిరిబాటి, సమోవా, వనాటు, నియు, మైక్రోనేషియా, మార్షల్ దీవులు, కుక్ దీవులు, పలావు, నౌరు, సోలమన్ దీవులు ఉన్నాయి.

1.5 కోట్ల జనాభా ఉన్న పపువా న్యూ గినియా పర్యటన భారత్‌కు కూడా ముఖ్యమైంది. ఎందుకంటే ఇక్కడ చైనా ప్రభావం చాలా ఎక్కువ.

ఇక్కడ 'బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్' కింద చైనా పెట్టుబడులు పెట్టింది. చైనా, పాపువా న్యూ గినియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కూడా ఉంది.

ప్రొఫెసర్ స్వరణ్ సింగ్ మాట్లాడుతూ "దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని దేశాలలో 2006 నుంచి చైనా నిరంతరం పెట్టుబడులు పెడుతోంది.

2006లో చైనా ఈ దేశాలతో ఒక ఫోరమ్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో చైనా ప్రభావం కొనసాగుతోంది.

ఇక్కడ చైనా మొదట తన వాణిజ్యం,పెట్టుబడిని పెంచుతూ వచ్చింది. ఆ తర్వాత దానిని వ్యూహాత్మకంగా ఉపయోగించడం ప్రారంభించింది'' అని తెలిపారు.

గత ఏడాది అమెరికా-పసిఫిక్ దీవుల దేశాల శిఖరాగ్ర సమావేశాన్ని అమెరికా నిర్వహించింది.

ఇందులో పాల్గొనేందుకు ఈ దేశాల ప్రతినిధులు వాషింగ్టన్ వెళ్లారు.

ఈ ప్రాంతాలకు ఆర్థిక సహకారం, సముద్ర భద్రత, వాతావరణ మార్పు సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి రూ. 6,600 కోట్లు ఖర్చు చేయడంపై చర్చలు జరిగాయి.

అంతేకాకుండా జీ-7 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే ముందు అమెరికా అధ్యక్షుడు పపువా న్యూ గినియాకు వెళతారని ప్రకటించారు.

అయితే దేశీయ ఆర్థిక సంక్షోభం కారణంగా బైడెన్ ఆస్ట్రేలియా పర్యటన ఇప్పుడు రద్దయింది. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం పాపువా న్యూగినీకి వెళ్తున్నారు.

మోదీ

ఫొటో సోర్స్, Getty Images

బైడెన్ పర్యటన రద్దు వల్ల భారత్‌కు ప్రయోజనం?

జో బైడెన్ పర్యటన రద్దుతో భారత్ లాభపడుతుందని స్వరణ్ సింగ్ అభిప్రాయపడ్డారు.

"ఇప్పుడు మోదీ అక్కడికి వెళ్లడం వల్ల ఆయన పర్యటన చాలామంది దృష్టిని ఆకర్షిస్తుంది.

భారత్ ఈ దేశాలతో మెరుగైన రీతిలో చర్చలు జరిపి, ఒప్పందాలు చేసుకోగలదు. ఇది రెండు పార్టీలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

లేకపోతే శాంతియుతంగా మాట్లాడే అవకాశం మనకు లభించి ఉండేది కాదేమో" అని స్వరణ్ సింగ్ అన్నారు.

బైడెన్ జీ7 దేశాల సదస్సుకు హాజరవుతున్నారు. కానీ, ఆయన ఆస్ట్రేలియా పర్యటన రద్దయింది. దాంతో, సిడ్నీలో జరిగే క్వాడ్ సమావేశానికి ఆయన హాజరు కాావడం లేదు.

యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం "జూన్ 1 తర్వాత అమెరికా ప్రభుత్వం వద్ద నిధులు ఖాళీ అవనున్నాయి.

దీనర్థం వృద్ధులకు పెన్షన్లు ఆగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగులు, సైనికులకూ ఆలస్యం అవుతాయి''. అదే సమయంలో అమెరికా వడ్డీ రేట్లలో భారీగా జంప్ ఉండవచ్చు.

ఈ నేపథ్యంలో రిపబ్లికన్, డెమొక్రాట్ నేతలు మంగళవారం వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు బైడెన్‌తో సమావేశమయ్యారు.

అయితే, అమెరికా రుణ పరిమితిని (రుణాలు తీసుకునే సామర్థ్యం) జూన్ 1 వరకు పెంచడానికి వీలుగా ఇరుపక్షాల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదు.

ఈ నేపథ్యంలో బైడెన్ పర్యటనలను రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)