జీన్స్ ప్యాంట్లను 200 సార్లు వేసుకున్నాకే ఉతకాలా? సబ్బు వాడకూడదా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మటిల్డా వెలిన్
- హోదా, బీబీసీ కల్చర్
ర్యాన్ సాబోతో పాటు ఆయన బృందం జీన్స్ ప్యాంట్ల ఫొటోలపై గంటల తరబడి సమయం వెచ్చిస్తారు. అవన్నీ బాగా వాడేసిన జీన్స్ ఫొటోలు. అందులో రంగు వెలిసినవి, చిరిగినవి, అతుకుల జీన్స్ కూడా ఉంటాయి.
ఈ జీన్స్ పాంట్లలో అత్యుత్తమైనదానికి ప్రశంసలు దక్కుతాయి.
‘‘ఆ అతుకుల జీన్స్ చాలా బాగుంది’’, ‘‘ఎంతో చాకచక్యంగా జీన్స్ నీలి రంగులో సమతౌల్యాన్ని తెచ్చారు’’ అంటూ వాటికి కితాబులు అందుతాయి. తర్వాత వాటిలో విజేతను ఎన్నుకుంటారు.
సరిగ్గా ‘‘ఇండిగో ఇన్విటేషనల్’’ పోటీలో ఇలాగే జీన్స్ ప్యాంట్‌లను పొగుడుతారు. ఈ పోటీలో ప్రపంచ నలుమూలలకు చెందిన ప్రజలు పాల్గొంటారు. ఈ పోటీలో పాల్గొనే వారంతా కొన్ని నిబంధనలను పాటిస్తూ ఏడాది పొడవునా జీన్స్‌ను ధరిస్తారు.
ఈ విచిత్రమైన పోటీలో ఉత్తమ జీన్స్ పురస్కారాన్ని గెలుపొందడానికి ఒక చిట్కాను పాటిస్తారు. అదేంటంటే జీన్స్‌ను తక్కువగా ఉతకడం. అందుకోసం తక్కువగా ఉతికే అవసరం ఉండే డెనిమ్ జీన్స్‌ను దీని కోసం ఎంచుకుంటారు.
సబ్బు నీటితో ఉతికితే డెనిమ్ దుస్తులు మృదువుగా మారతాయి. అందుకే దాని మన్నికను అలాగే కొనసాగించడానికి ఈ పోటీల్లో పాల్గొనేవారు డెనిమ్ ప్యాంట్లను ఎక్కువగా ఉతకరు. లాండ్రీని వ్యతిరేకించే పీపుల్స్ క్లబ్ సభ్యుల నుంచి లివైస్ బ్రాండ్ సీఈవో వరకు ప్రతీ ఒక్కరూ ఇదే వ్యూహాన్ని పాటిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
తక్కువగా ఉతికే సంస్కృతి
2010లో సాబో తొలిసారిగా రెండు జీన్స్ ప్యాంట్లను కొన్నారు. అప్పటి నుంచే వాటిని తక్కువగా ఉతకడం ఆయనకు అలవాటుగా మారింది.
కెనడా నుంచి యూరప్‌కు ఆరు నెలల పాటు సాగిన పర్యటనలో ఆ రెండు జీన్స్ ప్యాంట్లను సాబో ఉతకకుండా వాడారు.
‘‘కంపు కొట్టే ఆ జీన్స్‌ను వాడటం నాకు చాలా విచిత్రంగా అనిపించింది. వాటి వాసన భయంకరంగా ఉండేది’’ అని బీబీసీతో సాబో చెప్పారు.
ఇండిగో ఇన్విటేషనల్ అయిదో సీజన్ పోటీల్లో పాల్గొనే ప్రతీ పది మందిలో తొమ్మిది మంది తమ కొత్త జీన్స్‌ను 150 నుంచి 200 సార్లు ధరించిన తర్వాతే ఉతుకుతారని సాబో అంచనా వేశారు.
అప్పుడు కూడా వాటిని వాషింగ్ మెషీన్‌లో వేయడానికి బదులుగా ఆరుబయట ఆరేయడం (సాబో దీన్ని సన్‌బాత్ అని పిలుస్తారు) లేదా రాత్రి పూట గాలికి ఆరబెట్టడం వంటివి చేస్తుంటారు.
అయితే, కొన్నిసార్లు వాషింగ్ మెషీన్‌ను వాడుతున్నట్లు సాబో ఒప్పుకున్నారు.
‘‘జీన్స్ వాసన వస్తున్నట్లు నా భార్య పసిగడతారు. వెంటనే వాటిని వాషింగ్ మెషీన్‌లో వేస్తాం’’ అని సాబో చెప్పారు.
ఇలా అరుదుగా లేదా తక్కువగా ఉతకడం అనేది కేవలం జీన్స్ ధరించే వారికి మాత్రమే పరిమితం కాలేదు.
2019లో డిజైనర్ స్టెల్లా మెకార్తి ఇలాంటి వ్యాఖ్యలతోనే హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ‘‘ద గార్డియన్’’ వార్తాపత్రికతో మాట్లాడుతూ దుస్తుల్ని తక్కువగా ఉతుకుతానని ఆమె చెప్పారు.
‘‘జీవితంలో అతి సాధారణ నియమం ఏంటంటే, శుభ్రం చేయాల్సిన అవసరం లేని వస్తువులను శుభ్రం చేయకూడదు.
నేను ప్రతీరోజూ నా బ్రాను మార్చను. వేసుకున్న ప్రతీ వస్త్రాన్ని ఉతకడం కోసం వేయను. నేను పరిశుభ్రతను పాటిస్తాను. కానీ, ధరించిన ప్రతీదాన్ని డ్రై క్లీనింగ్‌కు ఇవ్వడం, ప్రతీరోజూ ఉతకడాన్ని ఇష్టపడను’’ అని ఆమె తన అలవాటు గురించి వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉతకకుండా 100 సార్లు
మరికొందరు పర్యావరణాన్ని లేదా విద్యుత్ చార్జిలను దృష్టిలో పెట్టుకొని లాండ్రీ అలవాట్లను మలుచుకుంటారు.
‘‘వూల్ అండ్ ప్రిన్స్’’ అనే దుస్తుల కంపెనీని మ్యాక్ బిషప్ ఏర్పాటు చేశారు.
దుస్తులు ఉతకడం అంటే ఇష్టపడని పురుష వినియోగదారులను ఆకర్షించే లక్ష్యంతో సౌకర్యంగా ఉండేలా, తక్కువగా ఉతికే అవసరం ఉండేలా ‘‘వూల్ అండ్ ప్రిన్స్’’ దుస్తులను రూపొందించడంపై తాను దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు.
ఇదే లక్ష్యంతో మహిళల కోసం ‘‘వూల్ అండ్’’ పేరుతో రూపొందించిన దుస్తులకు పెద్దగా మహిళల నుంచి ఆదరణ లభించలేదని తెలిపారు.
శతాబ్దాల పాటు లాండ్రీ ఉత్పత్తుల వాడకానికి అలవాటు పడిన మహిళలు, దుస్తులను అరుదుగా ఉతకడం అనే కాన్సెప్ట్‌ను ఆదరించలేకపోయారని అన్నారు.
‘‘100 రోజుల పాటు ఒకే ఉన్ని దుస్తులు’’ చాలెంజ్ పేరుతో ప్రస్తుతం వూల్ అండ్ కంపెనీ మెరినో ఉన్ని దుస్తులను అమ్ముతోంది.
ఈ మెరినో ఉన్ని దుస్తులను ప్రతీరోజూ వేసుకోవడం వల్ల లాండ్రీకి దూరంగా ఉండొచ్చు అని ఈ కంపెనీకి చెందిన రెబెక్కా ఈబీ అన్నారు.
టవల్, పైజామాలతో పాటు ధరించిన ప్రతీదాన్ని ఉతికే అలవాటు ఉన్న ఇంట్లో తాను పెరిగినట్లు బీబీసీతో అమెరికాకు చెందిన చెల్సియా హ్యారీ చెప్పారు. ఆమె ఇప్పుడు మెరినో ఉన్ని దుస్తులను వాడుతున్నారు.
రాత్రి వేసుకున్న పైజామాలను ఉదయం పూట మార్చుకొని వాటిని ఉతక్కుండా మళ్లీ అలాగే రాత్రి వేసుకొని పడుకోవాలని తన అమ్మమ్మ చెప్పినట్లు చెల్సియా గుర్తు చేసుకున్నారు.
ఆ తర్వాత అసలు లాండ్రీ అంటే ఇష్టపడని తన భర్తను కలుసుకున్నట్లు చెల్సియా చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో పరిస్థితులు అంతా మారిపోయాయని అన్నారు.
‘‘అప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను. రోజూవారీ జీవితంలో ఇలా ఎందుకు చేయకూడదు అనుకున్నాను. అందుకే తక్కువగా ఉతికే అవసరం ఉండే ఉన్ని దుస్తులను వాడుతున్నా’’ అని చెల్సియా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వాసన
దుస్తుల వాసన గురించి ఆమె పట్టించుకోరు. మిడిల్ ఈస్ట్ వంటి వేడి ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా ఆమె ఉన్ని దుస్తులనే వాడతారు.
సాబో తరహాలోనే దుస్తులను రాత్రిపూట గాలిలో ఆరబెట్టడం, లో దుస్తుల్లో వెనిగర్ లేదా వోడ్కాను స్ప్రే చేయడం వంటి చిట్కాలను వాడతారు.
‘‘నా ఉన్ని దుస్తులను, లెగ్గిన్స్‌ను, సాక్స్‌లను గాలికి ఆరేస్తాను. కిటికి పక్కన వాటిని తగిలిస్తాను. స్నానం అయ్యాక లో దుస్తులు కూడా అలాగే ఆరేస్తాను. మరుసటి రోజు వాటినే ధరిస్తాను’’ అనిచెల్సియా చెప్పారు.
‘‘దుస్తులు ఎక్కువ కాలం మన్నికతో ఉండాలనుకుంటాం. కానీ, వాటిని పదే పదే ఉతకుతుంటాం’’ అని లీడ్స్ యూనివర్సిటీలో ఫ్యాషన్ ప్రొఫెసర్ మార్క్ సమ్నర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వాషింగ్ మెషీన్లు
ఒక్కసారి ఉతకగానే దుస్తులు రంగు పోవచ్చు లేదా కుచించుకుపోవచ్చు లేదా ఒక్కోసారి చిరగవచ్చు కూడా అని సమ్నర్ చెప్పారు.
సముద్రంలోకి దుస్తుల నుంచి మైక్రోఫైబర్లు ఎలా కలుస్తాయి అనే అంశంపై తన పార్టనర్ మార్క్ టేలర్‌తో కలిసి సమ్నర్ అధ్యయనం చేశారు.
దుస్తులను వీలైనంత తక్కువగా ఉతకడం పర్యావరణానికి మంచిదని సమ్నర్ వాదిస్తున్నారు. అయితే, వాషింగ్ మెషీన్లను పూర్తిగా వాడకూడదని ఆయన చెప్పడం లేదు.
దుస్తులను ఉతికే అలవాట్లకు సంబంధించి ప్రజలకు ఆయన ఒక నిర్దిష్టమైనదాన్ని సిపార్సు చేయడం లేదు.
సాధారణంగా ప్రజలు వేర్వేరు విధాలుగా, తమకు నచ్చినట్లుగా దుస్తులను ఉతుకుతుంటారు. ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది.శాస్త్రవేత్తలు ఇందుకు మినహాయింపు కాదు.
‘‘నేను 30 ఏళ్లు వస్త్ర పరిశ్రమలో పనిచేశాను. ఉతికేటప్పుడు సింథటిక్ వస్త్రాల నుంచి కాటన్ దుస్తులను, రంగు దుస్తులను నుంచి తెలుపు వాటిని వేరు చేయాలని నాకు తెలుసు. కానీ, నిజం చెప్పాలంటే అలా చేసేంత ఓపిక నాకు లేదు’’ అని సమ్నర్ అంటున్నారు.
‘‘బెస్ట్ పని ఏంటంటే, మీ దుస్తుల నుంచి దుర్వాసన రానంత వరకు వాటిని ఉతక్కండి. అంతే’’ అని ఆయన సలహా ఇస్తున్నారు.
తక్కువ ఉష్ణోగ్రతల వద్ద లేదా సబ్బు వాడకుండా అప్పుడప్పుడు ఉతకడం వల్ల వస్త్రాలు ఎక్కువ కాలం మన్నుతాయని ఆయన అంటున్నారు.
తరచుగా దుస్తులు ఉతకడం వల్ల సమయం వృథా అవుతుందని, అందరికీ అంత టైమ్ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘నాకు పర్యావరణం, సహజ వనరుల నిర్వహణ, స్థిరత్వంపై చాలా ఆసక్తి. అలాగే నాకు సమయం కూడా చాలా కీలకమైనది’’ అని చెల్సియా హ్యారీ అన్నారు.
తనకు కూడా పర్యవరణ స్పృహ ఉందని, తరచుగా దుస్తులు ఉతికే అలవాటును మానుకోవడానికి తనకు ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయని సాబో చెబుతున్నారు.
‘‘బట్టలు ఉతకడమే కాకుండా నాకు ఇంకా వేరే పనులు కూడా ఉన్నాయి. నాకో పెంపుడు కుక్క ఉంది. దాన్ని వాకింగ్‌కు కూడా నేనే తీసుకెళ్లాలి’’ అంటూ సాబో సరదాగా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పదిహేనేళ్ల కిందట షేన్ వార్న్, ఇప్పుడు ధోనీ.. 41 ఏళ్ల ‘మిస్టర్ కూల్’ టీ20 కెప్టెన్సీని ఎలా మార్చేశాడు
- మిల్క్ డే: పచ్చిపాలా, మరగబెట్టినవా? ఆరోగ్యానికి ఏవి మంచివి?
- భారీగా రూ.500 దొంగ నోట్లు.. నకిలీ నోటును ఇలా గుర్తించవచ్చు
- మీరు సూర్యుడిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు
- రెజ్లర్ల నిరసన: బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలు రుజువైతే ఎన్నేళ్ల శిక్ష పడుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















