'సహజీవనం చేస్తున్న మహిళ మృతదేహాన్ని ముక్కలుగా కోసి కుక్కర్‌లో ఉడికించాడు'

వీడియో క్యాప్షన్, అక్కడ మనోజ్ సహాని, సరస్వతి వైద్య మూడేళ్లుగా కలిసి ఉంటున్నారు.

మహిళ దారుణ హత్యతో ముంబయి సమీపంలోని మీరా రోడ్ సిటీ ఉలిక్కిపడింది.

తనతో సహజీవనం చేస్తున్న 36 ఏళ్ల మహిళను ఆమె ప్రియుడు అత్యంత కిరాతకంగా చంపేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి శరీర భాగాలను పారేసేందుకు యత్నించారని పోలీసులు చెబుతున్నారు. అయితే, వాళ్లు నివాసముంటున్న ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు జూన్ 7న పోలీసులకు సమాచారం అందించారు.

ఈ కేసులో మీరా భయందర్ ప్రాంత పోలీసులు 56 ఏళ్ల మనోజ్ సానేను అరెస్టు చేశారు. నయా నగర్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై హత్య కేసు నమోదు చేశారు. హత్యకు గురైన మహిళను సరస్వతి వైద్యగా గుర్తించారు.

సహజీవనం చేస్తున్న మహిళను ఎందుకు హత్య చేశాడనే వివరాలు ఇంకా తెలియలేదు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

గతంలో దిల్లీలో శ్రద్ధా వాల్కర్ హత్య కేసులోనూ నిందితుడు ఇదే తరహాలో ఆమె శరీరాన్ని ముక్కలు చేసి పారేసేందుకు యత్నించి పట్టుబడ్డాడు.

సరస్వతి హత్య కేసులోనూ అలాంటి దారుణ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి ఇంట్లో పలు చోట్ల ఉంచినట్లు గుర్తించారు.

గీతా అక్షర్‌దీప్ సొసైటీలోని ఫ్లాట్ నంబర్ 704లో మనోజ్ సహాని, సరస్వతి వైద్య మూడేళ్లుగా నివాసముంటున్నారు. ఈ నెల 7వ తేదీ ఉదయం వారి ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

వాళ్లు పెద్దగా ఎవరితో కలిసేవారు కాదని స్థానికులు చెబుతున్నారు. ఉదయం నుంచి దుర్వాసన వస్తోందని, కానీ, సాయంత్రం ఆ ఫ్లాట్ తలుపులు తెరిచినట్లు స్థానికుడు ఒకరు మీడియా సంస్థ ఏబీపీ మాఝాకు చెప్పారు.

హత్య

ఫొటో సోర్స్, ANI

నిన్న ఉదయం నుంచి దుర్వాసన

''వాళ్లిద్దరూ భార్యాభర్తలనే అనుకున్నాం. సహజీవనం గురించి మాకు తెలియదు. వాళ్లతో పెద్దగా మాట్లాడింది లేదు.

నిన్న ఉదయం దుర్వాసన వస్తుండడంతో ఏదైనా జంతువు చనిపోయిందేమో అనుకున్నాం. ఈ ఫ్లోర్‌లో ఒక్క 704 ఫ్లాట్ తలుపులు మినహా అందరి ఫ్లాట్ తలుపులు తీసే ఉన్నాయి.

మా అబ్బాయి ఆ ఫ్లాట్ డోర్ కొట్టి, ఇంట్లో నుంచి వాసన వస్తోందని అతనికి చెప్పాడు. సాయంత్రం కల్లా వాసన రాకుండా చూసుకుంటానని మనోజ్ చెప్పాడు. ఏదో ఫ్రెషనర్ లాంటివి కొట్టి అతను బయటకు వెళ్లిపోయాడు'' అని ఆయన చెప్పారు.

''నాకు అనుమానం వచ్చి సొసైటీలో మిగతా వారికి చెప్పా. అప్పటికే చాలా మంది వాళ్ల పనుల మీద బయటికి వెళ్లిపోయారు.

సాయంత్రం అందరూ వచ్చాక ఫ్లాట్ బ్రోకర్‌కు, పోలీసులకు సమాచారం ఇచ్చాం. పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడడంతో ఈ విషయం బయటపడింది.

పోలీసులు ఉన్నప్పుడే మనోజ్ ఇంటికి వచ్చాడు. అతన్ని బ్రోకర్ గుర్తుపట్టి చెప్పడంతో పోలీసులు వెంటనే అతన్ని పట్టుకున్నారు.

మేము ఫ్లాట్ లోపలికి వెళ్లి చూడలేదు. కానీ, ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసినట్లు తెలిసింది'' అని ఆయన తెలిపారు.

హత్య

ఫొటో సోర్స్, ANI

నాలుగు రోజుల క్రితమే హత్య

నాలుగు రోజుల క్రితమే సరస్వతిని హత్య చేసినట్లు పోలీసు విచారణలో తేలింది.

ఆమె మృతదేహాన్ని మాయం చేసేందుకు మనోజ్ రెండు, మూడు రోజులుగా యత్నిస్తున్నట్లు గుర్తించారు.

''చెట్లను నరికే ఒక రంపం కొని తెచ్చి ఆమె శరీర భాగాలను ముక్కలుగా కోసి కుక్కర్‌లో ఉడికించాడని, తరువాత వాటిని ప్లాస్టిక్ సంచిలో ఉంచి పారవేశాడని, సుమారు 12-13 ముక్కలు ఘటనా స్థలంలో దొరికాయని పోలీసులు చెప్పారు'' అని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

కుక్కలకు వేశాడా?

అపార్ట్‌మెంట్ చుట్టుపక్కల తిరిగే కుక్కలకు మనోజ్ రెండు, మూడు రోజులుగా ఆహారం వేయడం చూశామని స్థానికులు చెబుతున్నారు. అయితే, అది ఎంతవరకూ నిజమో నిర్ధరించాల్సి ఉంది.

''ఘటనా స్థలంలో ముక్కలు ముక్కలుగా ఉన్న మృతదేహాన్ని గుర్తించాం. మనోజ్ సానే, సరస్వతి వైద్య సహజీవనం చేస్తున్నట్లు విచారణలో తేలింది.

నయా నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నాం'' అని మీరా భయందర్ ఏసీపీ బజాలె మీడియాకు చెప్పారు.

ఇవి కూడా చదవండి: