ఆంధ్రప్రదేశ్: పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) తెస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన వైఎస్ జగన్... ఇప్పుడు జీపీఎస్ అంటున్నారేంటి?

ఫొటో సోర్స్, FACEBOOK/APCM
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
‘‘నాలుగేళ్లుగా అడుగుతున్నారు. పెన్షన్ చూస్తే 1500 కూడా వచ్చేది లేదు. అందుకే ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత ఎలా బతకగలుగుతామని అడుగుతుంటే పెద్దమనిషి చంద్రబాబు పట్టించుకోవడం లేదు. తెలంగాణలో రద్దు చేస్తామని మ్యానిఫెస్టోలో కూడా పెట్టారు. ఇక్కడ మాత్రం చేసింది ఏమీ లేదు. మేం ఎన్నికల్లో గెలిస్తే ఉద్యోగులు కోరుకున్న విధంగా సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇస్తున్నాం’’ అని 2018 డిసెంబర్ 11న శ్రీకాకుళం జిల్లాలో జరిగిన పాదయాత్ర సభలో వైఎస్ జగన్ అన్నారు.
‘‘సీపీఎస్ రద్దు చేస్తున్నాం. గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెడుతున్నాం. రిటైర్మెంట్ నాటి బేసిక్ వేతనం మీద 50 శాతం పెన్షన్ గ్యారంటీ చేస్తున్నాం. ప్రతీ ఏటా దానికి డీఆర్ కూడా కలుపుతాం. లక్ష రూపాయల వేతనంతో రిటైర్ అయిన ఉద్యోగికి రూ. 50వేల పెన్షన్ వస్తుంది. ఇది దేశానికే ఆదర్శం కాబోతోంది’’ అని 2023 జూన్ 7న ఏపీ సమాచార ప్రజాసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు చెప్పారు.
ఎన్నికలకు ముందు వివిధ సభల్లో చెప్పడమే కాకుండా, ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రస్తావించిన ‘‘సీపీఎస్ రద్దు’’ హామీని జగన్ ప్రభుత్వం నాలుగేళ్లు దాటినా అమలు చేయలేదు.
ఎట్టకేలకు తాజా క్యాబినెట్ భేటీలో కొత్త పెన్షన్ స్కీమ్‌ను ప్రవేశపెడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల హామీకి భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. అయితే, పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) పునఃప్రవేశపెట్టడం పెనుభారంగా మారుతుంది కాబట్టి కొత్త విధానం తీసుకొచ్చినట్టు ప్రభుత్వం చెబుతోంది.
ఇంతకీ సీపీఎస్ విధానం రద్దు చేయాలని ఉద్యోగులు ఎందుకు కోరుతున్నారు, ప్రభుత్వం తెచ్చిన కొత్త పెన్షన్ విధానం వల్ల ఏం ప్రయోజనం దక్కుతుందన్నది ఇప్పుడు కీలకాంశంగా ఉంది.

ఫొటో సోర్స్, UGC
ప్రభుత్వం ఏం చెబుతోంది?
ప్రస్తుతం అమలులో ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్( సీపీఎస్ )ను 2003 నుంచి అమలు చేస్తున్నారు. 2004 జనవరి 1 నుంచి విధుల్లో చేరుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు దీనిని అమలు చేస్తున్నారు. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి తన వేతనం నుంచి 10 శాతం, దాంతో సమానంగా ప్రభుత్వం తరుపున వాటా కూడా చెల్లిస్తారు. అంతకుముందు రిటైర్ అయిన ఉద్యోగులందరికీ ప్రభుత్వమే పెన్షన్ చెల్లించేది.
కానీ సీపీఎస్ వచ్చిన నాటి నుంచి సిబ్బంది తాము దాచుకున్న మొత్తం పెన్షన్ నిధిగా లెక్కిస్తూ నేషనల్ పెన్షన్ స్కీం-ఎన్‌పీఎస్ ట్రస్టు, నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్-ఎన్‌ఎస్‌డీఎల్ ద్వారా షేర్ మార్కెట్‌లో మదుపు చేస్తారు. ఉద్యోగి, ప్రభుత్వం వాటాగా జమ చేసిన మొత్తం షేర్ మార్కెట్ ఆధారంగా పెన్షన్ చెల్లింపు జరుగుతుంది.
దీని మీద తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అనేక రాష్ట్రాల్లో ఉద్యోగుల ఆందోళనలతో ప్రభుత్వాలు సీపీఎస్ రద్దు చేసి తిరిగి పాత పెన్షన్ విధానం(ఓపీఎస్) ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించాయి. అయితే దానికి కేంద్రం ససేమీరా అంటోంది.
సీపీఎస్‌లో పెన్షన్ గ్యారంటీ లేకపోవడంతో సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తుండడం వల్ల వారికి పెన్షన్ గ్యారంటీ చేసే విధానం తాము తీసుకొచ్చామని ఏపీ ప్రభుత్వం అంటోంది.

ఫొటో సోర్స్, UGC
జీపీఎస్‌లో ఏముంది?
ఉద్యోగుల డిమాండ్ మేరకు సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆచరణలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
ఏపీ గ్యారంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో దీనిని పేర్కొంది. ఏపీ క్యాబినెట్ ఆమోదించడంతో త్వరలోనే చట్టరూపం దాలుస్తుందని అంటోంది.
ఏపీలో ప్రస్తుతం సీపీఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగులు దాదాపు 3లక్షల మంది ఉన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో అత్యధికులకు ప్రస్తుతం సీపీఎస్ అమలవుతోంది. దాని స్థానంలో ప్రవేశపెడుతున్న జీపీఎస్ కారణంగా ఉద్యోగులకు పెన్షన్ గ్యారంటీ అవుతుందని దానివల్ల సమస్య తీరినట్టేనని ప్రభుత్వం అంటోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులకు ఇంతకుమించిన ప్రత్యామ్నాయం లేదని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కే వెంకట్రామిరెడ్డి అంటున్నారు.
"సీపీఎస్‌లో లేనిది పెన్షన్ గ్యారంటీ అయ్యింది. పైగా డీఆర్ కూడా దక్కుతుంది. కేవలం పీఆర్సీ ఒక్కటి మాత్రమే వర్తించదు. మిగిలిన పాత పెన్షన్ విధానం మాదిరిగానే ఇది ఉంది. దీనిని ఆహ్వానిస్తున్నాం. ఉద్యోగులు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను" అని ఆయన బీబీసీతో అన్నారు.
‘‘అప్పుడు ఒక మాట, ఇప్పుడు మరో మాట’’
జీపీఎస్‌ను ప్రవేశపెడుతూ ఏపీ క్యాబినెట్ తీర్మానం చేయడాన్ని ముఖ్యమైన ఉద్యోగ సంఘాల నేతలు ఆహ్వానించారు. అయితే ఉపాధ్యాయ సంఘాలతో పాటుగా సీపీఎస్ ఉద్యోగుల సంఘాలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశాయి. సీపీఎస్ రద్దు చేస్తున్నట్టు సాగుతున్న ప్రచారం నమ్మకంగా లేదని వ్యాఖ్యానిస్తున్నారు.
"పేరు మార్చారు తప్ప విధానాల్లో మార్పు లేదు. ఉద్యోగులు తన బేసిక్ పే, డీఏ నుంచి 10 శాతం కంట్రిబ్యూట్ చేస్తూనే ఉండాలి. ప్రభుత్వ వాటా సంగతి స్పష్టత లేదు. పెన్షన్ నిధిని ఎన్ఎస్డీఎల్‌కు జత చేయడం మానేస్తామని చెబుతున్నారు. గ్రాట్యూటీ(ఉద్యోగి చివరి 16 నెలల వేతనం) మాత్రం నిరాకరించారు. ఉద్యోగుల పెన్షన్ నుంచి ట్యాక్స్ వసూలు చేస్తారు. ఇది ప్రభుత్వానికి భారం తగ్గించుకునే ప్రయత్నంగానే ఉంది. ఉద్యోగులకు దీనివల్ల పెద్దగా ప్రయోజనం లేదు" అంటూ ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్ వ్యాఖ్యానించారు.
సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలన్నది ఉద్యోగుల డిమాండ్ అని, దానికి విపక్షంలో ఉండగా అంగీకరించిన జగన్ ఇప్పుడు భిన్నంగా వ్యవహరిస్తున్నారని బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, UGC
‘‘ఇతర రాష్ట్రాల్లో చేశారుగా’’
వివిధ రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానం పునరుద్ధరించినప్పటికీ ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతోందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు అన్నారు.
"రాజస్థాన్, చత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ సహా వివిధ రాష్ట్రాల్లో సీపీఎస్ తొలగించారు. పాత పెన్షన్ విధానం అమలవుతోంది. ఉద్యోగుల కంట్రిబ్యూషన్ కటింగ్ ఆగిపోయింది. ఏపీ ప్రభుత్వం మాత్రం విధానపరంగా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో కనిపించడం లేదు. సీపీఎస్ రద్దు విషయంలో చిత్తశుద్ధి లేదు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటుగా వైఎస్సార్సీపీ కూడా సీపీఎస్ రద్దుకి సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది. పేరు మారుస్తున్నప్పటికీ జీపీఎస్‌లో కూడా అనేక సమస్యలున్నాయి. రిటైర్మెంట్ తర్వాత బేసిక్‌లో సగం మాత్రమే పెన్షన్ అని చెప్పడం ద్వారా ఉద్యోగుల ఆశలపై నీళ్లు జల్లినట్టవుతోందని" అని ఆయన అభిప్రాయపడ్డారు.
"సీపీఎస్‌లో తీవ్ర అన్యాయం జరగడం వల్లనే ఉద్యమం వచ్చింది. కానీ ఇప్పుడు జీపీఎస్‌లో కూడా బేసిక్ పేలో సగం మాత్రమే పెన్షన్ అంటే అన్యాయం కొనసాగించినట్టే" అని ఆయన బీబీసీతో అన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేయాలని భావిస్తే ఓపీఎస్ అమలుచేయడమే మార్గమని ఆయన అన్నారు.
ఉద్యోగుల బడ్జెట్ పెరిగిపోతోంది
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల కోసం చేస్తున్న ఖర్చు చాలా ఎక్కువగా ఉందని కాగ్ నివేదిక చెబుతోంది. తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల కన్నా ఏపీలోనే ఉద్యోగుల వేతనాల వ్యయం అధికంగా ఉందని కాగ్ తెలిపింది
2021–22తో పోలిస్తే 2022–23లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల వ్యయం రూ.8,068 కోట్లు, దానికి అదనంగా పెన్షన్ల వ్యయం రూ.2,257 కోట్లు చొప్పున పెరిగినట్టు పేర్కొంది. మొత్తం ఒక్క ఏడాది వ్యవధిలోనే రూ.10 వేల 325 కోట్లు పెరిగడంతో అది రూ. 48,964 కోట్లకు చేరిందని వివరించింది.
సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తే ఆ ఖర్చు మరింత పెరిగిపోతుందని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ఉద్యోగులు నష్టపోకుండా పలుమార్లు చర్చించిన తర్వాత జీపీఎస్ ప్రవేశపెడుతున్నట్టు ఆయన బీబీసీతో అన్నారు.
"సీపీఎస్ రద్దు చేసిన రాష్ట్రాల్లోనే ఇంకా సందిగ్ధం ఉంది. ఏపీలో అలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఉద్యోగులకు పెన్షన్ గ్యారంటీ చేస్తూ ఈ విధానం తీసుకురావడానికి ముందు అనేక మార్లు చర్చించాం. వివిధ సంఘాల వాదనలను పరిగణలోకి తీసుకున్నాం. ఇంకా మరింత పటిష్టంగా అమలుచేసేందుకు అనుగుణంగా మార్పులు అవసరమైతే చట్టాన్ని రూపొందించినప్పుడు ఖచ్చితంగా చేరుస్తాం. ఉద్యోగుల ప్రయోజనాల కోసమే ఈ ప్రయత్నం" అని ఆయన వివరించారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటుగా సాధారణ ప్రభుత్వ సిబ్బందిలో కూడా కొత్త విధానం పట్ల పూర్తిస్థాయి సంతృప్తి వ్యక్తం కావడం లేదు.
ఇవి కూడా చదవండి:
- 'అప్పులు తీరేవరకు ఈ వృత్తి తప్పదు' - ఒక సెక్స్ వర్కర్ కథ
- ఫస్ట్ డే-ఫస్ట్ షో, ఏపీ ఫైబర్‌నెట్: కొత్త సినిమాలను నేరుగా ఇంట్లోనే రిలీజ్ రోజే చూసే సదుపాయం
- మనిషిని చంపేసి ఇంటర్నెట్లో ఏం వెతుకుతున్నారు? శవాన్ని ఎందుకు ముక్కలు చేస్తున్నారు?
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య: ట్రైన్ శబ్దంలో తేడాను గుర్తించి యాక్సిడెంట్ జరగబోతుందని ఊహించి చైన్ లాగి రైలు ఆపిన ఇంజినీర్
- పీఎం అయినా సీఎం అయినా ఆ కులం నుంచే.. బ్రాహ్మణులు, క్షత్రియులదే ఆధిపత్యం, కమ్యూనిస్ట్ పార్టీలోనూ వారే
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















