ఆంధ్రప్రదేశ్: ఆయిల్ ట్యాంక్ ప్రమాదంలో ఏడుగురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో పెద్దాపురం మండలం రాగంపేట గ్రామంలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
ఆయిల్ ప్యాకేజింగ్ పరిశ్రమలో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆక్సిజన్ అందక ఊపిరాడని పరిస్థితుల్లో వీళ్లు మృతి చెందినట్టు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రకటించారు.
ప్రమాదంలో మరణించిన ఏడుగురికి ప్రభుత్వం రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఆమె ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. పరిశ్రమలో నిర్వహణ లోపాలు ఉన్నాయేమో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 304 ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు ఆమె వెల్లడించారు.
నిర్వహణా లోపాలు ఉంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే పరిశ్రమను సీజ్ చేసినట్టు ఆమె వెల్లడించారు.
పెద్దాపురం ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తదితర నేతలు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
పరిశ్రమలో చాలా కాలంగా నిర్వహణా లోపాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నా తగిన చర్యలు తీసుకోవటంలో యంత్రాంగం విఫలమైందని తప్పుపట్టారు.
ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. జీ రాగంపేట సమీపంలో పలు పరిశ్రమలు ఉన్నాయి. వాటన్నింటిలో కూడా పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ, ఇతర అధికారులు ఎటువంటి తనిఖీ నిర్వహించకుండా, అశ్రద్ధ చేయటంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు చెప్తున్నాయి.
ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారిలో ఐదుగురు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. మరో ఇద్దరు స్థానికంగా పొలిమేరు గ్రామస్థులుగా అధికారికంగా ధృవీకరించారు.
ఏడుగురు మృతులను పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పోస్ట్‌మార్టం అనంతరం బంధువులకు అప్పగిస్తామని అధికారులు చెప్పారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- పిల్లల భవిష్యత్ బంగారంలా ఉండాలంటే ఏ దేశానికి వెళ్లాలి? టాప్ 5 దేశాలు ఇవీ...
- అదానీ విల్మర్ గ్రూపు.. మీరు వాడే వంటనూనెలో మూడో వంతు అదానీ కంపెనీలదే
- రాణి రూపమతి: భర్తను ఓడించిన శత్రువును పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి విషం తాగిన రాణి
- వేలిముద్రలను సర్జరీతో మార్చవచ్చా.. పోలీసులనే ఆశ్చర్యపరిచిన వాస్తవాలు
- చాట్‌జీపీటీ: డిగ్రీ కూడా పాసవని సామ్ ఆల్ట్మాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో సంచలనాలు సృష్టిస్తున్నారు.. ఇంతకీ ఎవరీయన?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)