కెనడా నుంచి వందల మంది భారతీయ విద్యార్థులు వెనక్కి వచ్చేయాల్సిందేనా?

కెనడాలో భారతీయ విద్యార్థులు

ఫొటో సోర్స్, FRÉDÉRIC SOLTAN/CORBIS VIA GETTY IMAGES

  • కెనడాకి వెళ్లేందుకు ఫేక్ డాక్యుమెంట్లు వాడినట్లు వందలాది మంది భారతీయ విద్యార్థులపై ఆరోపణ
  • ఫేక్ డాక్యుమెంట్ల కారణంతో కెనడాలో శాశ్వత నివాసానికి అడ్డంకులు
  • చదువుకునేందుకు కెనడా వెళ్లిన ఈ విద్యార్థుల్లో చాలా మంది 2016-17 లో వెళ్లినవారే.
  • నేరస్తులను గుర్తించడమే తమ లక్ష్యమని, బాధితులను శిక్షించడం కాదన్న కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో

కెనడా నుంచి దేశ బహిష్కరణకు గురయ్యే ప్రమాదమున్న వందల మంది భారతీయ విద్యార్థులలో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటన సరికొత్త ఆశలు చిగురింపజేసింది.

‘‘మా లక్ష్యం నేరస్తులను గుర్తించడం, బాధితులను శిక్షించడం కాదు’’ అని జస్టిన్ ట్రూడో అన్నారు.

ఆ దేశ పార్లమెంట్‌లో ఎన్‌డీపీ నేత జగ్మీత్ సింగ్ అడిగిన ప్రశ్నలకు ట్రూడో ఇలా సమాధానమిచ్చారు.

చదువు పూర్తి చేసుకున్న వందల మంది భారతీయ విద్యార్థులు కెనడాకు వచ్చేందుకు నకిలీ పత్రాలను వాడారని ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

దీని ఫలితంగా వారు కెనడాలో శాశ్వత నివాసాన్ని పొందలేకపోతున్నారు.

చదువులు పూర్తి చేసుకున్న ఈ విద్యార్థులను ప్రస్తుతం ఆ దేశం నుంచి బహిష్కరించే ప్రమాదం ఉంది.

అయితే, ఈ విషయంలో తమ తప్పేమీ లేదని, తాము కెనడాకు వచ్చేందుకు సహకరించిన ఏజెంట్లే తమల్ని మోసం చేశారని భారతీయ విద్యార్థులు ఆ దేశంలో ఆందోళన చేస్తున్నారు.

కెనడాలో భారతీయ విద్యార్థులు

ఫొటో సోర్స్, PARKASH SINGH

ఫొటో క్యాప్షన్, కెనడాలో నిరసనలు చేస్తున్న భారతీయ విద్యార్థులు

కెనడా పార్లమెంట్‌లో భారతీయ విద్యార్థుల సమస్యపై చర్చ

ఇమ్మిగ్రేషన్ మోసానికి గురైన భారతీయ బాధిత విద్యార్థులకు శాశ్వత నివాసం ఇచ్చే అంశాన్ని ప్రధాన మంత్రి పరిగణనలోకి తీసుకోనున్నారా? అని ఎన్‌డీపీ నేత జగ్మీత్ సింగ్ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రతి కేసునూ పరిశీలించనున్నామని, బాధితులు తమ వెర్షన్‌ను తెలియజేసేందుకు అవకాశం ఇస్తామని జస్టిన్ ట్రూడో అన్నారు.

దీంతో పాటు మోసానికి గురైన బాధితులను శిక్షించడం తమ ఉద్దేశం కాదని, కానీ నేరస్తులను గుర్తించనున్నామని ఆయన చెప్పారు.

ట్రూడో ఈ ప్రకటన చేసిన తర్వాత, మోసానికి గురైన భారతీయ విద్యార్థులకు కాస్త ఊరట లభించినట్లైంది.

కెనడా ప్రధాన మంత్రి

ఫొటో సోర్స్, Getty Images

అంతర్జాతీయ భారతీయ విద్యార్థుల కేసు

నకిలీ పత్రాలపై వందలాది మంది భారతీయ విద్యార్థులు కెనడాకు వచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలు ఉన్నవారిలో చాలా వరకు 2016-17లో కెనడా వెళ్లినవారే ఉన్నారు.

అక్కడ చదువులు పూర్తి చేసుకున్న ఈ విద్యార్థులను కెనడా నుంచి పంపించి వేయనున్నారు.

అయితే, తాము అమాయకులమని, తమకేమీ తెలియదని ఆ విద్యార్థులు చెబుతున్నారు.

స్టడీ వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు సాయం చేసిన ఏజెంట్ల ద్వారా తాము మోసానికి గురైనట్లు వారు ఆరోపిస్తున్నారు.

తమను కెనడా నుంచి బహిష్కరించవద్దంటూ భారతీయ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.

నకిలీ పత్రాల కేసులో భాగమైన భారతీయ విద్యార్థులు 150 నుంచి 200 మంది వరకు ఉండొచ్చని న్యాయవాదులు చెబుతున్నారు.

ఈ విద్యార్థుల్లో ఒకరైన పంజాబ్‌కు చెందిన లవ్‌ప్రీత్ సింగ్ జూన్ 13న ఆ దేశం నుంచి వచ్చేయాల్సి ఉంది.

కెనడాలో భారతీయ విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

విద్యార్థులు ఏం చెబుతున్నారు?

కెనడా నుంచి బహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఉన్న పంజాబీ విద్యార్థులతో ఈ ఏడాది మార్చిలో బీబీసీ ప్రతినిధి వినీత్ ఖరే మాట్లాడారు.

తాము అమాయకులమని, జలంధర్‌లోని ఇమ్మిగ్రేషన్ కన్సల్టేషన్ ఏజెన్సీ తమల్ని మోసం చేసిందని వారు చెప్పారు. అయితే, ఇతర ఏజెన్సీలు ఈ మోసం చేశారా? లేదా? అన్నది ఇంకా తెలియరాలేదు.

ఇంతకుముందు కూడా అమెరికాలో నకిలీ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందిన 100 మందికి పైగా భారతీయ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.

కెనడాలో ప్రస్తుతం బహిష్కరణ వేటును ఎదుర్కొంటున్న విద్యార్థులలో డింపుల్ ఒకరు. కెనడాలో ఉన్న ఆమెతో బీబీసీ ఫోన్‌లో మాట్లాడింది.

‘‘నా కళ్ల ముందు అంతా చీకటిగా ఉంది. ముందుకు వెళ్లలేను, వెనక్కి రాలేను’’ అని డింపుల్ అన్నారు.

విద్యార్థి వీసాపై డింపుల్ డిసెంబర్ 2017లో కెనడా వెళ్లారు. ప్రస్తుతం ఆమెకు పెళ్లైంది. ఆమె భర్త భారత్‌లో ఉంటున్నారు.

మధ్యతరగతి కుటుంబానికి చెందిన డింపుల్‌కి ముగ్గురు తోబుట్టువులున్నారు. ఆమె తండ్రి టైలర్, తల్లి గృహిణి. పంజాబ్‌లోని జలంధర్‌లో వారు నివసిస్తున్నారు.

సైన్స్‌లో మాస్టర్స్ చేసిన డింపుల్ ఎంతో కాలంగా ఉద్యోగం కోసం చూశారు.

‘‘రెండు సార్లు బ్యాంకు ఎగ్జామ్ రాశాను. కానీ, రాలేదు. వాటన్నింటితో విసిగిపోయి కెనడాకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నాను. ఇక్కడైనా ఏదైనా ఉద్యోగం దొరుకుతుందని అనుకున్నాను.

ఆ సమయంలో మా బంధువుల్లో ఒకరి ద్వారా జలంధర్‌లోని ఎడ్యుకేషన్ అండ్ మైగ్రేషన్ సర్వీసెస్, దానిని నడిపే బ్రజేష్ మిశ్రా గురించి చెప్పారు. ఆ సమయంలో నా డాక్యుమెంట్లన్నింటినీ చూశారు. 2017 నవంబర్‌లో నాకు కెనడా వీసా వచ్చింది’’ అని డింపుల్ ఫోన్‌లో చెప్పారు.

తన డాక్యుమెంట్లను కాలేజీ ఆమోదించిందని వారు చెప్పారని, కాలేజీ అడ్మిషన్ లెటర్ కూడా తనకు వచ్చినట్లు ఆమె ఫోన్ కాల్‌లో తెలిపారు.

కెనడాలో భారతీయ విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

కెనడాలో కంప్యూటర్ నెట్‌వర్కింగ్ కోర్సును డింపుల్ దరఖాస్తు చేశారు. దాని కోసం ఆమె ఆ సమయంలో రూ.12 లక్షలను నగదు రూపంలో చెల్లించారు. దీనిలో ఆమె కాలేజీ ఫీజులు, ఇతర ఖర్చులు కూడా ఉన్నాయి.

కెనడాకి వచ్చిన రెండు రోజుల తర్వాత తన కాలేజీలో నిరసన జరుగుతున్నట్లు తెలిసిందన్నారు డింపుల్.

వేరే కాలేజీకి దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. పాత కాలేజీ తన ఫీజులన్నింటిన్ని రీఫండ్ చేసిందన్నారు.

2019లో డింపుల్ కెనడాలో తన చదువును పూర్తి చేసుకున్నారు. తనకు వర్క్ పర్మిట్ కూడా వచ్చింది.

కానీ 2022 మేలో శాశ్వత నివాసానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు, తన అడ్మిషన్‌ను ఆమోదిస్తున్నట్లు తాను ముందు ఎంపిక చేసుకున్న కాలేజీ పంపిన లేఖ నకిలీదని తెలిసిందన్నారు. ఆ విషయం తెలిసి చాలా షాక్‌కి గురయ్యాయని అన్నారు.

ఈ లేఖ వల్లనే తనకు కెనడా స్టుడెంట్ వీసా వచ్చిందని, ఆ దేశంలో అడ్మిషన్ పొందినట్లు తెలిపారు.

కానీ, ఇదెలా జరిగిందో ఇప్పటికీ అర్థం కావడం లేదని, తన మెదడులో ఎన్నో ప్రశ్నలు మెదలుతున్నాయని చెప్పారు.

కెనడాలో భారతీయ విద్యార్థులు

ఫొటో సోర్స్, PARKASH SINGH

తప్పుడు సమాచారమిస్తే ఐదేళ్ల పాటు నిషేధం

ఇమ్మిగ్రేషన్ అధికారులను కలిసినట్లు డింపుల్ చెప్పారు. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో తనకి ‘ఎక్స్‌క్లూజన్ ఆర్డర్’ ఇచ్చారని అన్నారు.

ఈ ఆర్డర్ కింద ఏడాది లోపల కెనడా నుంచి బహిష్కరించనున్నారు. ఒకవేళ తమ గురించి తాము తప్పుగా సమాచారం ఇచ్చినట్లు తేలితే, ఐదేళ్ల పాటు కెనడాకి రాకుండా నిషేధం విధించనున్నారు.

ఇమ్మిగ్రేషన్ అధికారులతో జరిగిన సమావేశంలో తాను చాలా భయపడినట్లు డింపుల్ చెప్పారు. తనని తక్షణమే భారత్‌కి తరలించనున్నారని అనుకున్నానని తెలిపారు.

ఈ ఎక్స్‌క్లూజన్ ఆర్డర్‌ను సవాలు చేస్తూ కెనడాలోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

భారీ మొత్తంలో ఫీజులను వసూలు చేస్తూ నకిలీ అడ్మిట్ కార్డులను జారీ చేసిన కేసులు ఎక్కువగా ఉన్నాయని ఆమె న్యాయవాది జస్వంత్ సింగ్ మంగట్ చెప్పారు.

ఈ డాక్యుమెంట్ల ఆధారంగానే వీసా అప్లికేషన్లను సమర్పించారని, వీసాలను జారీ చేశారని తెలిపారు.

కెనడాలో సమస్యలు ఎదుర్కొంటోన్న భారతీయ విద్యార్థులు

ఫొటో సోర్స్, @BRADREDEKOPP

ఫొటో క్యాప్షన్, విదేశీ విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామన్న కెనడా

అసలేం జరిగింది?

విద్యార్థులు కెనడాకు వచ్చిన తర్వాత లేదా కెనడాకు రావడానికి ముందు, భారతీయ విద్యార్థులు కొన్ని కారణాలతో తమ అడ్మిషన్‌ను ఇతర కాలేజీల్లో పొందాలని భారతీయ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ కోరింది.

చాలా మంది విద్యార్థులు కొత్త కాలేజీల్లో తమ కోర్సులను పూర్తి చేసి, వర్క్ పర్మిట్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

కానీ, ఎప్పుడైతే శాశ్వత నివాసానికి వారు దరఖాస్తు చేసుకున్నారో, అప్పుడు తొలుత అడ్మిషన్ లేఖలు పొందిన కాలేజీలు నకిలీవని తెలిసింది.

‘‘విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు, వీసాలు జారీ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్లు నకిలీవని గుర్తించలేనప్పుడు, మేమెలా ఇవి నకిలీవనుకుంటాం’’ అని డింపుల్ అన్నారు.

ఎడ్యుకేషన్ అండ్ మైగ్రేషన్ సర్వీసెస్‌ను, బ్రజేష్ మిశ్రాను ఈ విషయం గురించి అడిగేందుకు కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నించామని, కానీ వారిని సంప్రదించ లేకపోతున్నామని అన్నారు.

నకిలీ పత్రాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నకిలీ పత్రాలు వాడారని విద్యార్థులపై ఆరోపణ

మంచి జీవితం ఉంటుందనే ఆశతో...

పంజాబ్‌లోని మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఛమన్‌దీప్ సింగ్, మంచి జీవితం దొరుకుతుందనే ఆశతో కెనడాకు మైగ్రేట్ అయ్యారు.

తాను విద్యార్థి వీసా పొందేటప్పుడు, తనకు ఈ విధానం గురించి తెలియదని, అందుకే ఏజెంట్ ద్వారా వెళ్లినట్లు తెలిపారు.

వారు ఇలాంటి నకిలీ డాక్యుమెంట్లను సృష్టిస్తారని తనకు తెలియదన్నారు.

కెనడాలో ఇంజనీరింగ్ కోర్సుకు దరఖాస్తు చేసుకున్న ఛమన్‌దీప్ సింగ్, దాని కోసం రూ.14-15 లక్షలు చెల్లించారు. ఈ మనీ కోసం ఆయన బ్యాంకు రుణం తీసుకున్నారు.

‘‘జలంధర్ వెళ్లినప్పుడు మనకు ప్రతి దగ్గర ఏజెంట్లు కనిపిస్తారు. ఆ ఏజెన్సీకి వ్యతిరేకంగా మనం ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోలేం. ఎందుకంటే వారు మన ఫైల్‌ను సిద్ధం చేసినట్లు మన దగ్గర ఎలాంటి ప్రూఫ్ ఉండదు’’ అని ఛమన్‌దీప్ సింగ్ అన్నారు.

‘‘జీవితం బాగుంటుందని నేను కలలు కన్నాను. కలలకు, వాస్తవానికి చాలా తేడా ఉంటుంది’’ అని ఛమన్‌దీప్ సింగ్ తెలిపారు. ఛమన్‌దీప్ సింగ్ లాగా మోసపోయిన విద్యార్థులందరూ ప్రస్తుతం వాట్సాప్ గ్రూప్‌లో టచ్‌లో ఉన్నారు.

నకిలీ పత్రాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నకిలీ పత్రాలు ఆధారంగా చేసుకునే విద్యార్థులకు వీసాలు

కెనడా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ ఏం చెబుతోంది?

తమ దేశంలో విదేశీ విద్యార్థులు ఎదుర్కొంటోన్న సమస్యలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రేజర్ ట్వీట్ చేశారు.

‘‘నకిలీ కాలేజీ అడ్మిషన్ లేఖతో కెనడాకి వచ్చి, అస్థిరత ఎదుర్కొంటోన్న విద్యార్థుల సమస్యలకు పరిష్కారాలను చూస్తున్నాం’’ అని ఆయన ట్వీట్ చేశారు.

నిజాయితీగా ఇక్కడ చదువుకోవాలని అనుకున్న విద్యార్థుల కోరికను అడ్వాంటేజ్‌గా తీసుకున్న వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

విద్యార్థులను మోసం చేస్తోన్న ఏజెన్సీలకు వ్యతిరేకంగా భారతీయ అధికారులు న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని నిపుణులు కోరారు.

విద్యార్థులు కూడా ఏదైనా నిర్ణయం తీసుకునేముందు దాని గురించి పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యార్థులు తాము నమ్మిన ఏజెంట్లు, కాలేజీల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలన్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)