స్త్రీ ద్వేషం ఆమెను జైలుకి పంపితే, సైన్స్ విడిపించింది.. ఎలా?

ఫొటో సోర్స్, Supplied
క్యాథ్‌లీన్ ఫొల్బిగ్... ఓ బేబీ కిల్లర్, ఆస్ట్రేలియాలో చరిత్రలోనే ఓ దుర్మార్గురాలైన తల్లి, ఒక రాక్షసి అంటూా ఆమెను చాలా పేర్లతో పిలిచేవారు.
కానీ, ''గత ఇరవై ఏళ్లలో ఇంత స్వేచ్ఛగా నడిచింది ఇప్పుడే. చాలా గొప్పగా ఉంది'' అని ఫొల్బిగ్ ఈ సోమవారం అన్నారు. తన నలుగురు పిల్లలను హత్య చేశారనే కేసులో క్షమాభిక్ష లభించిన తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆస్ట్రేలియా న్యాయచరిత్రలో గర్భంలోనే న్యాయాన్ని చంపేసిన కేసులో కోర్టు చారిత్రక తీర్పు చెప్పిందని ఆమె తరఫు న్యాయవాదులు అన్నారు. 2003లో ఆమెను దోషిగా తేల్చేందుకు కారణమైన నమ్మశక్యంకాని వాదనలను, స్త్రీద్వేషాన్ని ఇది ఎత్తిచూపిందని చెప్పారు.
అప్పట్లో మీడియాలో సంచలనం సృష్టించిన ఈ కేసులో, చివరికి ఆమె భర్త కూడా ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు.
కానీ.,స్నేహితుల సాయం, శాస్త్రవేత్తల నూతన ఆవిష్కరణల కారణంగా ఆమె ఇప్పుడు విడుదలయ్యారు.
అసలు నేరారోపణలేంటి?
ఎప్పుడూ అమాయకంగా ఉండే ఫొల్బిగ్ జీవితం పూర్తిగా విషాదంతో నిండిపోయింది.
నిత్యం తల్లిని వేధింపులకు గురిచేసే ఆమె తండ్రి, ఓ రోజు కత్తితో పొడిచి చంపేశాడు. అప్పటికి ఫొల్బిగ్‌కు రెండేళ్లు కూడా నిండలేదు. తల్లి హత్య తర్వాత ఫొల్బిగ్ బంధువుల ఇళ్లలో పెరుగుతూ చివరికి, న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని న్యూక్యాసిల్‌లోని బంధువుల ఇంటికి చేరింది.
అయితే, ఆమెకున్న ఈ నేపథ్యమే ఆమెను హింసకు ప్రేరేపించిందని కేసు విచారణ సమయంలో న్యాయవాదులు వాదించారు.
దీంతో 2003లో ఆమెకు నలభై ఏళ్ల జైలు శిక్ష పడింది. తన పిల్లలు సారా, ప్యాట్రిక్, లారా సహా ఆమె మొదటి కొడుకు కాలెబ్‌ను కూడా హత్య చేసిందనే కేసులో కోర్టు ఈ శిక్ష విధించింది.
19 రోజుల నుంచి 18 నెలల వయసున్న ఆమె నలుగురు పిల్లలు 1989 నుంచి 1999 మధ్య కాలంలో హఠాత్తుగా చనిపోయారు. వారిని ఫొల్బిగ్ హత్యచేసిందని ఆరోపణలు వచ్చాయి.
ఆమె కొడుకు కాలెబ్ లరింగోమలేసియా అనే వ్యాధితో బాధపడేవాడు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో 1989లో నిద్రలోనే కాలెబ్ చనిపోయాడు.
ఆ తర్వాత కొద్దికాలానికే కార్టికల్ బ్లైండ్‌నెస్ (అంధత్వం), ఎపిలెప్సీ(మూర్చ)తో బాధపడుతున్న ప్యాట్రిక్ చనిపోయాడు. మరో ఇద్దరు పిల్లలు సారా, లారా శ్వాసకోశ వ్యాధులతో ఇంట్లోనే చనిపోయారు.

ఫొటో సోర్స్, EPA
ఈ కేసులో శిక్ష పడినప్పటికీ, ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఆమెకు విధించిన శిక్షను 30 ఏళ్లకు తగ్గించింది. అయితే, తనపై ఉన్న నేరారోపణలను సవాల్ చేసే అవకాశాలను ఆమె కోల్పోయింది.
2019లో మళ్లీ జరిగిన విచారణ, ఆమెను జైలుకి పంపేందుకు కారణమైన సాక్ష్యాధారాలపై మరింత అధ్యయనం జరిపేందుకు కారణమైంది.
ఆమెపై మోపిన నేరారోపణల్లో వ్యక్తమైన సందేహాలు సహేతుకమైనవేనని ఈ కేసును మళ్లీ విచారణ జరిపిన రిటైర్డ్ జడ్జి టామ్ బతర్స్ట్ నిర్ధారణకు వచ్చారు. అరుదైన జన్యు మ్యుటేషన్ల (ఉత్పరివర్తనాలు) వల్లే ఆమె పిల్లలు చనిపోయినట్లు నూతన శాస్త్రీయ పరిశోధనల్లోనూ తేలింది.
అరుదైన జన్యు మ్యుటేషన్లు
ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీలో ఇమ్యునాలజీ అండ్ జినోమిక్ మెడిసిన్ ప్రొఫెసర్ కరోలా వినుయెసా ఈ పరిశోధనలకు నాయకత్వం వహించారు. వైద్య నిపుణుల నుంచి పెద్దఎత్తున ఆందోళనలు వ్యక్తం కావడంతో 2018 నుంచి కరోలా ఈ కేసుపై దృష్టి పెట్టారు.
కరోలా, ఆమె బృందం ఫొల్బిగ్ డీఎన్‌ఏపై పరిశోధనలు జరిపి ఆమె డీఎన్‌ఏ మ్యాప్‌ను రూపొందించింది. దీంతో ఆమె జన్యువుల్లో మ్యుటేషన్లను గుర్తించడం సాధ్యమైంది.
ఫొల్బిగ్, ఆమె ఇద్దరు కూతుళ్ల జన్యువుల్లో సీఏఎల్ఎం2 జీ114ఆర్ అనే మ్యుటేషన్ కనిపించింది. అది తీవ్రమైన గుండెజబ్బులకు కారణమయ్యే అవకాశం ఉందని, దాదాపు 35 మిలియన్ల (3.5 కోట్లు) మందిలో ఒకరికి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని తేలింది.
జీవకణాల్లోకి కాల్షియం అయాన్ల ప్రవాహానికి ఈ సీఏఎల్ఎం2 జీ114ఆర్ మ్యుటేషన్ ఆటంకం కలిగిస్తుంది. అది గుండె ఆగిపోవడానికి కారణమవుతుంది.
కాలెబ్, ప్యాట్రిక్ మరో రకం జన్యు మ్యుటేషన్ కలిగి ఉన్నారని, దానికి ఎలుకల్లో అనూహ్యంగా వచ్చే (సడెన్ ఆన్‌పెట్ ఎపిలెప్సి ) మూర్ఛలాంటి లక్షణాలు ఉన్నాయని ప్రొఫెసర్ వినుయెసా బృందం పరిశోధనలో వెల్లడైంది.
ఫొల్బిగ్ పిల్లల్లో గుండె సంబంధిత వ్యాధులతో చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ పరిశోధనలు రుజువు చేశాయి.

ఫొటో సోర్స్, FAIRFAX MEDIA/GETTY IMAGES
రుజువు చేయలేకపోతే హత్యేనన్న వాదన
1999లో ఆమె కూతురు లారా మరణంతో ఫొల్బిగ్‌పై పోలీసు విచారణ మొదలైంది.
ఆరోజు ఇంటి నుంచి అంబులెన్స్ ఆపరేటర్‌కి ఫొల్బిగ్ ఫోన్ చేశారు. ''మా అమ్మాయికి ఊపిరాడడం లేదు'' అని ఆమె చెప్పారు.
''ఇప్పటికే ముగ్గురు పిల్లలు చనిపోయారు'' అని ఆమె చెప్పిన మాటలు రికార్డ్ అయ్యాయి. ఈ రికార్డింగ్స్‌ను ఆ తర్వాత విచారణ సమయంలోనూ వినిపించారు.
లారా మరణంతో ఫొల్బిగ్, ఆమె భర్త తమ అందరు పిల్లలను కోల్పోయినట్లు అయింది.
విచారణలో భాగంగా ఫొల్బిగ్ భర్తను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆ తర్వాత భార్యకి వ్యతిరేకంగా ఆమె భర్త పోలీసులకు సహకరించడం మొదలుపెట్టాడు. ఆమె ఈ నేరాలకు పాల్పడిందని నిర్ధారించేలా పర్సనల్ డైరీలను పోలీసులకు అప్పగించాడు.
2019లో ఈ కేసు పునర్విచారణ సమయంలో తన డీఎన్‌ఏ శాంపిల్స్ ఇవ్వాలని ఫొల్బిగ్ తరఫు న్యాయవాదులు కోరినప్పటికీ అతను నిరాకరించాడు. తన మాజీ భార్య ఈ దారుణాలకు పాల్పడిందని ఆయన ఇప్పటికీ నమ్ముతున్నారని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు.
2003లో జరిగిన విచారణలో ఫొల్బిగ్ నలుగురు పిల్లలు ప్రమాదవశాత్తూ మరణించడం అసంభవమనేది ప్రాసిక్యూషన్ వాదన. అప్పటికి బాగా ప్రాచుర్యంలో ఉన్న మేడో లాని అందుకు ఉదహరించారు.
ఈ మేడో లా ప్రకారం, ''ఒక బిడ్డ చనిపోతే విషాదమని, రెండో బిడ్డ కూడా చనిపోవడం అనుమానాస్పదమని, మరో బిడ్డ కూడా చనిపోతే ఆ మూడూ హత్యలేనని, అవి హత్యలు కాదని కచ్చితంగా రుజువు చేయగలిగేంత వరకూ అవి హత్యలే'' అనేది వారి వాదన.
అయితే, ఈ సిద్ధాంతం ఆ తర్వాత అపఖ్యాతి పాలైంది.
ఈ నిర్వచనాన్ని బ్రిటన్‌లో అప్పట్లో ప్రఖ్యాత పీడియాట్రిషియన్‌గా (చిన్నపిల్లల వైద్యులు) పేరుపొందిన రాయ్ మేడో ప్రతిపాదించారు. అతని సిద్ధాంతం ఆధారంగా కేసుల్లో తప్పుడు నేరారోపణలు పెరిగిపోవడంతో ఆ తర్వాతి కాలంలో ఆయన పరపతి పడిపోయింది.
1999లో ఇద్దరు పసికందులను హత్య చేశారని న్యాయవాది సాలీ క్లార్క్‌పై నమోదైన కేసు విచారణలో తప్పుదోవ పట్టించే సాక్ష్యం ఇచ్చినందుకు, 2005లో యూకే మెడికల్ రిజిస్టర్ నుంచి రాయ్ మేడోను తొలగించారు.
క్లార్క్‌పై నమోదైన కేసును 2003లో కోర్టు కొట్టివేసింది. అయితే, ఆమె ఆ విషాదం నుంచి కోలుకోలేకపోయారని, ఆల్కహాల్‌కి బానిసై 2007లో చనిపోయారని ఆమె బంధువులు చెప్పారు.
''మేడో లాని తొలి నుంచీ వైద్య పరిశోధనలు సవాల్ చేస్తూనే ఉన్నాయి. సహేతుకమైన సందేహాలను పక్కనబెట్టి నేరాన్ని నిరూపించే పద్ధతి సరికాదు.'' అని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాకి చెందిన లా ప్రొఫెసర్ ఎమ్మా కన్‌లిఫే చెప్పారు. ఆమె ఫొల్బిగ్ కేసును క్షుణ్ణంగా పరిశీలించి పుస్తకం కూడా రాశారు.
ఒక కుటుంబంలో పసికందుల మరణాలు సంభవించినప్పుడు అనుమానాలు ఉన్నాయని చెబుతూ వారి తల్లులపై కేసులు నమోదు చేయడం 2004 తర్వాత కామన్వెల్త్ దేశాల్లో బాగా తగ్గిందని, దాదాపు రద్దు చేసేశారని కన్‌లిఫే చెప్పారు.
2004లో ఏంజెలా కన్నింగ్స్ కేసులోనూ 'మేడో లా' వంటి వాదనలకు తావులేదని బ్రిటన్ కోర్టు తేల్చిచెప్పింది.
''ఇలాంటి సిద్ధాంతాలను చట్టపరమైన వాదనల నుంచి పూర్తిగా తొలగించాలి. అయితే, ఆస్ట్రేలియాలో అందుకు కాస్త ఎక్కువ సమయం పట్టింది'' అని ప్రొఫెసర్ కన్‌లిఫే చెప్పారు.
ఈ లోపం ఒక్క ఫొల్బిగ్ కేసులో జరిగింది మాత్రమే కాదు. ఫొల్బిగ్ కేసులో ఆమె డైరీలు, సంఘటన స్థలంలో దొరికిన వాటినే సాక్ష్యాలుగా పరిగణనలోకి తీసుకున్నారు. ఆమె పరిస్థితి సరిగ్గా లేదని నిర్ధారించేందుకు కనీసం సైకియాట్రిస్టులతో పరీక్షలు కూడా చేయించలేదు.
''వాళ్లలాగే ఒకరోజు ఈమె కూడా వెళ్లిపోతుంది. అయితే, అది వాళ్ల తరహాలోనే కాకపోవచ్చు. ఈసారి నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. ఏ చిన్న విషయం జరిగినా గమనిస్తుంటాను.'' అని సారా పుట్టిన తర్వాత 1997లో ఫొల్బిగ్ తన డైరీలో రాసుకుంది.
అయితే, డైరీలో రాసుకున్న మాటల ఆధారంగా ఆమె నేరం చేసేందుకు అవకాశం ఉందని వాదించారు. అయితే, ఆ వాదనలను 2022లో విచారణ సందర్భంగా సైకియాట్రిస్టులు కొట్టిపారేశారు.
''డైరీలో రాసిన మాటలు పిల్లలను హత్య చేశారనే అభియోగాలకు భిగ్నంగా ఉన్నాయి. తన బిడ్డల మరణానికి తానే కారణమయ్యాననే ఆత్మన్యూనతా భావంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన ఒక తల్లి భావనలా ఉన్నాయి'' అని ఫొల్బిగ్‌కు క్షమాభిక్ష ప్రకటిస్తున్న సందర్భంగా న్యూసౌత్‌వేల్స్ అటార్నీ జనరల్ మైఖేల్ డాలే అన్నారు.

ఫొటో సోర్స్, EPA
20 ఏళ్లలో తొలిసారి ప్రశాంతంగా నిద్రపోయా
''క్షమాభిక్ష దొరకడం సంతోషంగా ఉంది. కానీ నలుగురు పిల్లలను కోల్పోవడం ఎప్పుడూ దు:ఖాన్నే కలిగిస్తుంది.'' అని జైలు నుంచి విడుదలైన తర్వాత ఫొల్బిగ్ ఓ వీడియోలో చెప్పారు.
''20 ఏళ్లలో తాను ప్రశాంతంగా నిద్రపోయింది ఇప్పుడేనని ఆమె అన్నారు'' అని ఫొల్బిగ్ స్నేహితురాలు ట్రేసీ చాప్‌మన్ చెప్పారు. ఫొల్బిగ్ విడుదల కోసం జరిగిన ఉద్యమానికి చాప్‌మన్ నాయకత్వం వహించారు.
ఫొల్బిగ్‌కు క్షమాభిక్ష దొరికినప్పటికీ ఆమెపై నేరారోపణలు అలాగే ఉన్నాయి. అంటే, తనపై నేరారోపణలను పూర్తిగా కొట్టివేసి, పరిహారం పొందాలంటే మాత్రం ఆమె సుదీర్ఘ పోరాటాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
''తప్పుడు నేరారోపణలుగా రుజువైనప్పుడు ఆటోమేటిక్‌గా పరిహారం అందించే ప్రక్రియ ఆస్ట్రేలియాలో లేదు. పరిహారం పొందేందుకు తాను అర్హురాలినేనని నిరూపించుకునేందుకు ఫ్లొబిగ్ వాదనలు వినిపించాల్సి ఉంటుంది.'' అని కన్‌లిఫే చెప్పారు.
సైన్స్ నూతన ఆవిష్కరణలకు అనుగుణంగా స్పందించడంలో ఆస్ట్రేలియా న్యాయ వ్యవస్థ ఎంత నెమ్మదిగా ఉందో ఫ్లొబిగ్ కేసు ఎత్తిచూపుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న సైన్స్‌ను న్యాయవ్యవస్థతో ఎలా అనుసంధానం చేయాలన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్న అని ఆస్ట్రేలియా అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ వారంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- వర్జిన్ బర్త్: మగ మొసలితో కలవకుండానే సొంతంగా గర్భం దాల్చిన ఆడ మొసలి
- మధ్యప్రదేశ్: ఆ పాఠశాలలో మతమార్పిళ్లకు పాల్పడుతున్నారా? హిందూ బాలికలు హిజాబ్ ధరిస్తున్నారా?
- లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్...ఈ పదాల మధ్య తేడా ఏంటి?
- వీర్యదానం: ఆమె ముగ్గురు నాన్నల కూతురు...థ్రిల్లర్‌ను తలపించే స్టోరీ
- ఆడవాళ్ల మెదడు ఎలా పనిచేస్తుంది? 'బికినీ మెడిసిన్' వల్ల స్త్రీలు నష్టపోతున్నారా?














