ఫాషియా: ఇది ఒళ్లంతా ఉంటుంది.. కీళ్ల నొప్పికీ, దీనికీ సంబంధం ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, విదినా సువారెజ్ రోడ్రిగ్జ్
- హోదా, ద కన్వర్జేషన్
మనకు ఏదైనా నొప్పి కలిగినప్పుడు లేదా పట్టేసినట్లుగా అనిపించినప్పుడు అది కండరమో లేదా కీళ్లలో ఏర్పడిన ఇబ్బందిగా భావిస్తాం.
అయితే, చాలా సందర్భాల్లో ఈ రకమైన అసౌకర్యాలు మన శరీరంలోని ఒక భాగం నుంచి ఉత్పన్నం అవుతాయి. అసలు ఆ భాగం గురించి మనం ఇప్పటివరకు విని ఉండకపోవచ్చు కూడా. దాని పేరు ఏంటంటే-‘‘ఫాషియా’’
గతంలో దీనికి ఇప్పుడున్నంత ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. ఇటీవలి సంవత్సరాల్లో దీని ప్రాధాన్యం పెరుగుతోంది. ఎందుకో చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
జారే గుణం
ఫాషియా అనేది ఒక రకమైన బంధన కణజాలం. ఇందులో ముఖ్యంగా ఫైబర్ ఉంటుంది. ఇది దృఢంగా కనిపిస్తుంది. శరీరంలోని కండరాలు, ఎముకలు, నరాలు, నాళాలు, కడుపులోని అవయవాలను ఇది కప్పి ఉంచుతుంది. శరీర భాగాలకు రక్షణగా నిలవడంతోపాటు వాటికి ఆకారాన్ని ఇస్తుంది. వాటికి మద్దతుగా నిలుస్తుంది.
ఫాషియా శరీరం అంతటా విస్తరించి ఉంటుంది. చూడటానికి ఇది ఒక షీట్‌లా కనిపించినప్పటికీ, నిజానికి ఇది అనేక పొరలతో తయారవుతుంది. ఈ పొరల మధ్యలో ద్రవాలు నిండి ఉంటాయి.
శరీరం సరైన రీతిలో కదలాలంటే, ఈ పొరలు ఒకదానితో ఒకటి మృదువుగా జారిపోవాలి. ఇలా జారిపోవడానికి హైలురోనిక్ ఆమ్లం లేదా హైలురోనేట్ అనే గ్రీజులాంటి పదార్థం సహాయపడుతుంది.
ఫాషియాలోని నీటి లభ్యతపై దీని జారేగుణం, స్థిరత్వం ఆధారపడి ఉంటాయి.
ఫాషియాలో తగినంత నీరు ఉన్నప్పుడు హైలురోనిక్ ఆమ్లం ఈ ద్రవంలో కలిసిపోయి, జారేలా ఉండే జిగట పదార్థంగా మారి, ఫాషియా సున్నితంగా కదిలేలా చేస్తుంది.
ఒకవేళ తగినంత నీరు లేకపోతే హైలురోనేట్‌కు చెందిన మాక్రోమాలిక్యూల్ ఉత్పత్తి అవుతుంది. ఇది జిగటను బాగా చిక్కగా మార్చి దాని సాంద్రతను పెంచుతుంది. ఫలితంగా ఫాషియా సున్నితంగా కదల్లేదు.
ఫాషియా అనేది నరాలతో కూడిన కణజాలం అని చాలా అధ్యయనాలు చూపిస్తున్నాయి. చర్మం కంటే కూడా దీనిలో ఎక్కువ నరాలు ఉంటాయి.
ఫాషియాలో ముఖ్యంగా నొప్పి, కదలికలకు సంబంధించిన గ్రాహకాలు ఉంటాయి. ఈ గ్రాహకాలు ఫాషియా కణజాలం అంతటా అమరి ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
హై ఓల్టేజ్
ఆరోగ్యకరమైన ఫాసియా మృదువుగా, మెత్తగా ఉంటుంది. ఇది శరీర కదలికలు సరైన రీతిలో ఉండేలా చేస్తుంది.
ఫాసియాలో ఒక భాగంలో జిగట సాంద్రత పెరిగినప్పుడు ఆ భాగంలో కలిగిన ఘర్షణను ఇతర భాగాలకు పంపిస్తుంది.
ఆయా భాగంలో తలెత్తిన ఘర్షణ, నరాల గ్రాహకాలను ప్రభావితం చేస్తుంది. తద్వారా కణజాలంలో మార్పులు వస్తాయి. మనకు నొప్పి సంకేతాలు విడుదల అవుతాయి.
ఒకవేళ ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఆ నొప్పి నుంచి తప్పించుకోవడానికి ఆ భాగంలోని కదలికలను పునురుద్ధరించడానికి మన శరీరం ప్రయత్నిస్తుంది.
ఈ క్రమంలో శరీరంలోని ఇతర భాగాల్లో ఇబ్బంది కలుగుతుంది. కీళ్ల కదలిక, భంగిమ, కొన్ని అవయవాల పనితీరులో ఆటంకాలు కలుగుతాయి. చివరకు ఈ నొప్పి దీర్ఘకాలికంగా మారొచ్చు.
ఈ పరిస్థితి ఏర్పడటానికి అనేక అంశాలు కారణం కావొచ్చు:
- తక్కువ శారీరక శ్రమ
- సుదీర్ఘ సమయం తప్పుడు భంగిమలో ఉండటం
- సర్జరీలు, గాయాలతోపాటు జీర్ణక్రియ సరిగా లేకపోవడం
- రుతుక్రమ నొప్పులు

ఫొటో సోర్స్, Getty Images
ఫాషియా వల్లే మనకు నొప్పి కలుగుతుందా?
ఫాషియా వల్ల అసౌకర్యం కలిగినట్లయితే మనం ఆ విషయాన్ని ఎలా తెలుసుకోగలం?
ఒకవేళ కండరాలు లేదా కీళ్ల వల్ల నొప్పి కలిగితే, మనం ఎంత కదిలితే ఆ నొప్పి అంత తీవ్రం అవుతుంది.
అదే ఫాసియా వల్ల ఇబ్బంది ఎదుర్కొంటుంటే, మనం కదిలిన కొద్దీ ఆ నొప్పి తగ్గుతుంది. పైగా వేడి చికిత్సలు (హీట్ థెరపీ) దీనికి బాగా ఉపయోగపడతాయి. ఈ చికిత్స వల్ల కణజాలానికి ఉండే సాగేగుణం తిరిగి సాధారణ స్థితికి వస్తుంది.
ఫాషియా వల్ల కలిగే నొప్పిని తగ్గించడానికి, నొప్పిగా ఉన్న ప్రాంతంలో కాపాలి. లేదా వేడి నీటితో స్నానం చేయాలి. సులభమైన స్ట్రెచింగ్ వ్యాయామం కూడా చేయొచ్చు.
అప్పుడప్పుడు ఇలాంటి నొప్పి రావడం సాధారణమే. సాధారణంగా ఇది త్వరగానే తగ్గిపోతుంది. కానీ, ఇది తరచూ వస్తుంటే, తీవ్రంగా ఉంటే, దీర్ఘకాలికంగా వేధిస్తుంటే వైద్యులను సంప్రదించాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఫాషియాను ఎలా ఆరోగ్యంగా ఉంచవచ్చు?
ఫాషియా ఆరోగ్యంగా ఉంటే శరీరంలో కీళ్ల కదలిక మెరుగ్గా ఉండటంతో పాటు సులభంగా మనం కదలగలుగుతాం. అలాగే శరీరం తక్కువగా నొప్పి బారిన పడుతుంది.
ఆరోగ్యకరమైన ఫాషియా కారణంగా మనం తక్కువగా అలసిపోతాం. ఎందుకంటే శరీరం సమర్థవంతంగా పని చేయడం వల్ల ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.
ఫాషియా సమస్యలను నివారించడానికి కొన్ని సిఫార్సులు ఉన్నాయి.
ఎక్కువగా కదలాలి. ఎక్కువగా కదలడం అంటే తరచూ శారీరక వ్యాయామాలు చేయడం మాత్రమే కాదు. ఒకవేళ మీది కూర్చొని చేసే ఉద్యోగమైతే అప్పుడప్పుడు కూర్చొనే భంగిమ మార్చండి. మధ్యలో లేచి కాస్త అటూ ఇటూ నడవండి. నడుస్తూ చేయగలిగే పనులు ఏవైనా ఉంటే, వాటిని నడుస్తూనే చేయండి.
ఎలివేటర్‌కు బదులుగా మెట్లు ఎక్కండి, దిగండి.
తరచూ స్ట్రెచింగ్ చేయండి
శరీరంపై అవగాహన పెంచుకోండి. ఒకవేళ మీ శరీర భంగిమ సరిగా లేకపోతే మార్చుకోండి.
(గమనిక: ఈ వ్యాసం ఈ అంశంపై స్థూలమైన అవగాహనం కోసమే. వ్యాస రచయిత విదినా సువారెజ్ రోడ్రిగ్జ్ ఒక ఫిజియో థెరపిస్ట్. స్పెయిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లాస్ పల్మాస్ డి గ్రాన్ కానరియాలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఈ కథనం మొదట ‘ద కన్వర్జేషన్’లో వెలువడింది.)
ఇవి కూడా చదవండి:
- పదిహేనేళ్ల కిందట షేన్ వార్న్, ఇప్పుడు ధోనీ.. 41 ఏళ్ల ‘మిస్టర్ కూల్’ టీ20 కెప్టెన్సీని ఎలా మార్చేశాడు
- మిల్క్ డే: పచ్చిపాలా, మరగబెట్టినవా? ఆరోగ్యానికి ఏవి మంచివి?
- భారీగా రూ.500 దొంగ నోట్లు.. నకిలీ నోటును ఇలా గుర్తించవచ్చు
- మీరు సూర్యుడిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు
- రెజ్లర్ల నిరసన: బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలు రుజువైతే ఎన్నేళ్ల శిక్ష పడుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














