'టక్కర్' సినిమా రివ్యూ - సిద్ధార్థ్: సెక్స్ తర్వాత ప్రేమ ఉండదా?

ఫొటో సోర్స్, PASSION STUDIOS/TWITTER
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
ఏ సినిమా అయితే క్రేజ్ తెచ్చిందో అదే సినిమా కెరీర్‌కు గుదిబండగా మారడం సిద్దార్థ్ విషయంలో జరిగింది.
'బొమ్మరిల్లు'తో పక్కింటి అబ్బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు సిద్దూ. తన కెరీర్‌కు అదో టర్నింగ్ పాయింట్. ప్రేమకథలకు తను పక్కాగా సూటైపోతాడన్న నమ్మకం ప్రేక్షకులకూ, దర్శకులకూ కలిగింది.
అయితే, ఆ ఇమేజ్‌నుంచి బయటపడాలని సిద్దార్థ్ ఎప్పటికప్పుడు తన జోనర్‌ను మార్చుకుంటూ వెళ్లాడు. ముఖ్యంగా మాస్ ఇమేజ్ కోసం పరితపించాడు. కానీ, అది అందని ద్రాక్షే అయింది. అయినా తన ప్రయత్నం మాత్రం మానలేదు. అందులో భాగంగా చేసిన సినిమానే 'టక్కర్'.
మరి ఈ సినిమా అయినా సిద్దూకు కొత్త ఇమేజ్ తీసుకొస్తుందా, లేదా? ఇంతకూ టక్కర్ గొడవేంటి? ఇందులో ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నాయా?
కోటీశ్వరుడు కావడం ఎలా?
బాగా సంపాదించి లైఫ్‌లో సెటిల్ కావాలని చాలా మంది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ కుర్రాళ్లు అనుకుంటారు.
డబ్బున్నవాళ్లలో కొంత మందేమో డబ్బుదేముంది, మనశ్శాంతి కావాలి అనుకుంటారు.
ఈ రెండు రకాల మనస్తత్వాలకూ నిదర్శనం ఈ సినిమాలోని హీరో, హీరోయిన్‌ల పాత్రలు.
గుణ (సిద్దార్థ్) పేదరికంలో బతుకుతుంటాడు. జీవితంపై ఓ రకమైన అసహనం ఉంటుంది. పైగా ప్రతీ చోటా అవమానాలు ఎదురవుతుంటాయి. అందుకే ఎలాగైనా డబ్బులు సంపాదించాలనుకుంటాడు.
లక్కీ (దివ్యాంశ కౌశిక్) కోటీశ్వరుడి కూతురు. కానీ ఇంట్లో సంతోషం లేదు. తన ఇష్టాలకు విలువ ఇచ్చే వ్యక్తి లేడు. తండ్రి బలవంతంగా తనకో సంబంధం ఫిక్స్ చేస్తాడు. ఆ పెళ్లి లక్కీకి ఇష్టం లేదు.
భిన్నమైన సామాజిక స్థితినీ, విభిన్నమైన జీవితాల్నీ గడుపుతున్న గుణ, లక్కీ ఎలా కలిశారు? వారిద్దరి ప్రయాణం ఎలా మొదలైంది? డబ్బు సంపాదించాలన్న గుణ ఆశ తీరిందా, లేదా? కోట్ల ఆస్తిని వదులుకొని వచ్చిన లక్కీకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఇదే టక్కర్ కథ.

ఫొటో సోర్స్, PASSION STUDIOS/TWITTER
ప్రేమలో పడడం రూలా?
ఆత్మహత్య చేసుకోవాలనుకొన్న గుణ ఆలోచనల నుంచి ఈ సినిమా మొదలవుతుంది.
గుణ కలలు, ఎదురవుతున్న పరాభవాలు, తన ఆర్థిక స్థితిగతులూ చూపిస్తూ కథను ముందుకు తీసుకెళ్లారు. గుణ కచ్చితంగా డబ్బులు సంపాదిస్తాడని, తను ఎదుర్కొన్న పరాభవాలకు సమాధానం చెబుతాడన్న నమ్మకం ప్రేక్షకులకు కలుగుతుంది.
కథను దర్శకుడు కార్తీక్ జి.కృష్ అటు వైపు లాక్కెళ్తే బాగుండేది. కానీ, హీరో మొదలెట్టిన ప్రయాణం ఒకటి, చేరిన గమ్యం మరోటి అన్నట్టు తయారైంది వ్యవహారం.
హీరోయిన్‌గా లక్కీ పాత్రను కూడా చాలా పాష్‌గా, రిచ్‌గా చూపించాడు దర్శకుడు. తన పరిచయం కూడా ఆసక్తిని కలిగిస్తుంది. తనను తాను ఓ ఫెమినిస్ట్‌గా పరిచయం చేసుకుంటుంది లక్కీ. అయితే ఆ భావజాలం తనలో ఏ కోశానా కనిపించదు. పాత్ర చిత్రణలో అదే ప్రధానమైన లోపం.
ప్రేమ అంటే ఎలాంటి నమ్మకం లేని ఓ అమ్మాయి, సెక్స్ తరవాత ప్రేమ ఉండదని బలంగా వాదించే ఓ మోడ్రన్ అమ్మాయి, రెండే రెండు గంటల ప్రయాణంలోనే హీరోతో ప్రేమలో పడిపోతుంది. ఆ తరవాత, ఓ సగటు అమ్మాయిలానే ఆలోచిస్తుంది. క్యారెక్టరైజేషన్‌లో మరో లోపం ఇది.
ఇలాంటి లోపాలు ఈ కథలో అడుగడుగునా కనిపిస్తాయి. డబ్బే జీవితం, డబ్బుంటేనే సుఖం ఉంటుందని నమ్మిన గుణ కళ్ల ముందు కోట్ల కొద్ది డబ్బున్నా పట్టించుకోడు. ప్రేమ కోసం పరితపిస్తాడు. ప్రేమలో ఉన్న మ్యాజిక్ అది. కానీ, ఆ స్థాయిలో తనకు ప్రేమ దక్కిందంటే ఆ ప్రేమ కథ ఎంత ఉన్నతంగా, ఇంకెంత కొత్తగా ఉండాలి?
కానీ, 'టక్కర్'లో హీరో, హీరోయిన్ల లవ్ స్టోరీ చాలా సాదా సీదాగా ఉంటుంది. హీరో హీరోయిన్‌ను ఎందుకు ప్రేమించాడో, హీరోయిన్ చటుక్కున హీరోపై ఎందుకు మనసు పారేసుకుంటుందో అర్థం కాదు.

ఫొటో సోర్స్, Passion studios/Facebook
అతకని కిడ్నాప్ డ్రామా
కథలో కిడ్నాప్ డ్రామా ఒకటి ఉంది. హీరోయిన్‌ను కిడ్నాప్ చేసి, కోట్లు గుంజుదామనే ప్రయత్నంలో ఉంటుంది ఓ ముఠా. ఆ చెర నుంచి హీరోయిన్‌ను రక్షిస్తాడు హీరో.
అక్కడి నుంచి భారీ ఛేజింగులు మొదలవుతాయి. సంతోషాన్ని వెదుక్కుంటూ హీరో, హీరోయిన్లు.. వాళ్లను అన్వేషిస్తూ విలన్ గ్యాంగ్ ప్రయాణం చేస్తుంటుంది.
ద్వితీయార్ధంలో ఈ గేమ్‌నే నమ్ముకున్నాడు దర్శకుడు. అయితే, ఇది కాస్తా పేలవంగా మారిపోయింది.
కిడ్నాప్ గ్యాంగ్‌కు హీరోయిన్ దొరుకుతుందా, దొరికితే ఏమవుతుంది అనే ఆత్రుత, ఉత్కంఠ ప్రేక్షకుల్లో కలిగినప్పుడే ఇలాంటి డ్రామాలు వర్కవుట్ అవుతాయి.
మార్గమధ్యలో హీరోకు పజిల్స్ ఎదురైనప్పుడు ఇలాంటి సీన్లు రక్తి కడతాయి. కానీ, అవేం జరగవు. హైవేపై ప్రయాణంలా హీరోకు ఎలాంటి ఆటంకాలూ ఉండవు.
విలన్ హైవేపై పిచ్చి చూపులు చూస్తూ ప్రయాణం సాగిస్తుంటాడు. మధ్యలో 'పచ్చ కారు - ఎర్ర కారు' అనే కామెడీ అస్సలు పండలేదు.

ఫొటో సోర్స్, PASSION STUDIOS/TWITTER
లుక్ మార్చిన సిద్దార్థ్
పక్కింటి అబ్బాయి పాత్రల్లో సిద్దార్థ్‌ను చూసిన ప్రేక్షకులకు గుణ కొత్తగానే ఉంటాడు. తన పాత్రలో హడావుడి ఏం ఉండదు. సగటు అబ్బాయిలానే ఉంటుంది. డబ్బు సంపాదించాలన్న తపనను తన నటనలో బాగా చూపించాడు.
హీరోయిజం కోసం హీరోయిజం అనే కాన్సెప్టు తన పాత్రకు అంటకుండా చూసుకున్నాడు. తన లుక్ కూడా కొత్తగా ఉంది. అందుకే ఈ సినిమాలోనూ సిద్దార్థ్ నచ్చుతాడు.
కాకపోతే, తనకు అలవాటైన లవర్ బాయ్ సెకండాఫ్‌లోకి వచ్చేస్తాడు. అక్కడ మాత్రం పాత సిద్దార్థ్ కనిపిస్తాడు.
దివ్యాంశ కౌశిక్ అందంగా ఉంది. ఈ కథలో తన పాత్రకు ప్రాధాన్యం ఉంది. కాకపోతే, ఆ క్యారెక్టరైజేషన్‌లో స్థిరత్వం లేకపోవడం పెద్ద లోపం.
అభిమన్యు సింగ్‌ది సగటు విలన్ రోలే. విలన్లు ఎంత బలంగా ఉంటే, హీరో పాత్ర అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. కానీ ఈ సినిమాలో విలన్‌ను సిల్లీగా చూపించారు.
దానికి తోడు, యోగి బాబు పాత్రొకటి. హాస్యం కోసం యోగిబాబును కథలోకి తీసుకొచ్చినా, ఆ పాత్ర వచ్చినప్పుడల్లా ప్రేక్షకుల్లో చికాకే కలుగుతుంది.
థ్రిల్లర్ చిత్రాలు టెక్నికల్‌గా బాగుండాలి. నేపథ్య సంగీతం, ఎడిటింగ్ కట్స్ వీటిలో వైవిధ్యం చూపించాలి. అయితే అవేం 'టక్కర్'లో కనిపించవు. పాటలు కథాగమనానికి అడ్డు పడ్డాయే తప్ప, వాటి వల్ల ప్రయోజనం లేదు.
చివర్లో పేథోస్ సాంగ్ వచ్చినప్పుడే సినిమా అయిపోయిందన్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్‌లో ఏం జరుగుతుందన్న దానిపై ప్రేక్షకులకు అప్పటికే ఓ క్లారిటీ వస్తుంది. అందుకే ఆ పాటకూ కనెక్ట్ అవ్వరు.
'ఆవారా' లాంటి స్క్రీన్ ప్లేని, మ్యాజిక్‌ని రీ క్రియేట్ చేయాలని ప్రయత్నించి చేసిన సినిమా ఇదనిపిస్తుంది. కానీ, ఆ సినిమాకి అందనంత దూరంలో 'టక్కర్' నిలిచిపోతుంది.
లుక్ పరంగానూ, క్యారెక్టరైజేషన్ పరంగానూ ఇది సిద్దార్థ్‌కు కొత్త సినిమా కావొచ్చు. కానీ ఇలాంటి జోనర్‌లోనే వందల సినిమాలు చూసేసిన ప్రేక్షకులకు ఇది ఏ మాత్రం కొత్త కాదు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) తెస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన వైఎస్ జగన్... ఇప్పుడు జీపీఎస్ అంటున్నారేంటి?
- బిర్సా ముండా: ఈ ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడి స్వగ్రామం ఎలా ఉంది, ఆయన వారసులు ఏం చేస్తున్నారు?
- హైదరాబాద్: కలెక్షన్లు తక్కువ తెచ్చారని ఫ్లెక్సీలతో కండక్టర్ల పరువు తీసిన ఆర్టీసీ
- 'అప్పులు తీరేవరకు ఈ వృత్తి తప్పదు' - ఒక సెక్స్ వర్కర్ కథ
- ఫస్ట్ డే-ఫస్ట్ షో, ఏపీ ఫైబర్‌నెట్: కొత్త సినిమాలను నేరుగా ఇంట్లోనే రిలీజ్ రోజే చూసే సదుపాయం
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















