‘బెడ్ రూమ్ వరకు వచ్చేస్తారా’ అని ఫొటోగ్రాఫర్లపై బాలీవుడ్ నటులు ఎందుకు విసుక్కుంటున్నారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, చెరిలాన్ మోలాన్, మెరిల్ సెబాస్టియన్
- హోదా, బీబీసీ న్యూస్
వరీందర్ చావ్లా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముంబయికి 96 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలీబాగ్ అనే తీర పట్టణంలోని హెలీప్యాడ్ వద్ద ఆయన ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్, ముంబయిలోని తన ఇంటికి ఈ హెలీప్యాడ్ నుంచే హెలీకాప్టర్‌లో బయల్దేరనున్నట్లు ఆయనకు సమాచారం అందింది.
అది 2022 నవంబర్ 2వ తేదీ. ఆరోజు షారూఖ్ ఖాన్ పుట్టినరోజు. జన్మదిన శుభాకాంక్షలు అందజేయడానికి ముంబయిలోని తన ఇంటికి వద్దకు వచ్చే వేలాదిమంది అభిమానులను ఆయన ఎప్పుడూ పలకరిస్తారు.
అభిమానులను షారూఖ్ ఖాన్ నిరాశపరచరనే సంగతి చావ్లాకు తెలుసు. అందుకే ఆయన చాలా ఓపికగా ఎదురు చూశారు.
ఎట్టకేలకు, షారూఖ్ ఖాన్ ఉన్న కారు వచ్చింది. వెంటనే చావ్లా, ఆయనకు కనిపించేలా సైగ చేశారు. షారూఖ్ ఖాన్ కూడా ఆయన వైపు చేయి చూపారు. మరుక్షణమే చావ్లా ఆ దృశ్యాన్ని ‘క్లిక్’ మనిపించారు.
‘‘అది అద్భుతమైన ఫొటో. నా కష్టానికి ప్రతిఫలం లభించింది’’ అని చావ్లా అన్నారు.
సెలెబ్రిటీల క్యాండిడ్ మూమెంట్స్‌ను ఫొటోలో బంధించడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసే ఫొటోగ్రఫర్ల (paaprazzi)లో ఆయన కూడా ఒకరు. బాలీవుడ్‌లో ఇలాంటి ఫొటోగ్రఫర్లు పెరుగుతున్నారు.
సెలెబ్రిటీల ఫొటోల కోసం బైక్‌లపై వారిని అనుసరించడం, వారి రాకపోకల వివరాలు తెలుసుకోవడం కోసం వారి మేనేజర్‌లు, డ్రైవర్లతో స్నేహం చేయడం, ఎయిర్‌పోర్ట్‌లు, హోటళ్ల వద్ద పడిగాపులు గాయడం, చివరకు సెలెబ్రిటీల వాహనాల నెంబర్లను గుర్తుపెట్టుకోవడం లాంటి పనులను కూడా వీరు చేస్తుంటారు.
బాలీవుడ్ ప్రముఖులకు, ఈ ఫొటోగ్రఫర్లకు మధ్య ‘పరస్పర సహకార సంబంధం’ ఉంటుందని మాండ్వీ శర్మ అన్నారు. ఆమె షారూఖ్ ఖాన్ వద్ద ప్రచారకర్తగా పనిచేశారు. ఇప్పుడు సొంతంగా పబ్లిక్ రిలేషన్స్ కంపెనీని నడుపుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పబ్లిసిటీ కోసం బాలీవుడ్ స్టార్లు ఫొటోగ్రఫర్లపై ఆధారపడితే, జీవనోపాధి కోసం వీరు స్టార్లపై ఆధారపడుతారు.
కానీ, ఇది ఒక్కోసారి అసౌకర్యంగా కూడా మారొచ్చని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా తరంలో దీని తీరు మారుతోందని చెబుతున్నారు.
ఇంట్లోని లివింగ్ రూమ్‌లో ఉన్న తనను ఫొటోలు తీయడంపై నటి అలియా భట్, ఫొటోగ్రఫర్లను విమర్శించారు. తన ప్రైవసీపై దాడిగా దీన్ని ఆమె అభివర్ణించారు. ఫిబ్రవరిలో ఈ ఘటన జరిగింది.
ఈ నెల ప్రారంభంలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూడా ఈ ఫొటోగ్రాఫర్లపై వ్యంగ్యంగా స్పందించారు. ‘‘నా బెడ్‌రూమ్ వరకు కూడా నన్ను అనుసరించండి’’ అని ఫొటోగ్రఫర్లను ఉద్దేశించి ఆయన అన్నారు. భవనం లోపలి వరకు తనను, తన భార్య కరీనా కపూర్‌ను ఫొటోగ్రఫర్లు అనుసరించడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
విరాల్ భయానీ అనే ఒక ప్రముఖ ఫొటోగ్రఫర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ వీడియో కనిపించినప్పటి నుంచి అది సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయింది.
తన బిడ్డ ఫొటో కోసం తన ఇంటి బయట ఫొటోగ్రఫర్లు కాచుకొని ఉండటం చాలా ఇబ్బందికరంగా ఉందని 2019లో సైఫ్ అలీఖాన్ అన్నారు.
సెలెబ్రిటీలకు సంబంధించిన ఫొటోలకు సోషల్ మీడియా వల్లే విపరీత ఆదరణ దక్కుతుందని మానవ్ మంగ్లానీ అన్నారు. ఆయన 20 ఏళ్ల పాటు ఫొటోగ్రఫర్‌గా పనిచేశారు. ఇప్పుడు ఆయన వద్ద 15 మంది ఫొటోగ్రఫర్లు పని చేస్తున్నారు.

ఫొటో సోర్స్, VARINDER CHAWLA
20 ఏళ్ల కిందట కేవలం వార్తా పత్రికలు, మ్యాగజీన్లు మాత్రమే పాపరాజీల నుంచి ఫొటోలను కొనుగోలు చేసేవారు.
భారత్‌లో డిజిటల్ మీడియా ప్రవాహంతో 2015లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
అప్పుడే తమ పని, పరపతి కోసం మీడియా సంస్థలు, సెలెబ్రిటీలు సోషల్ మీడియాను ఉపయోగించడం నేర్చుకున్నారని మాండ్వీ శర్మ అన్నారు.
‘‘మేం ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, రోపోసో, స్నాప్‌చాట్ వంటి యాప్‌లలో సెలెబ్రిటీల చిత్రాలను అప్‌లోడ్ చేస్తున్నాం. వాటిని స్టోరీల్లా పోస్ట్ చేస్తున్నాం. వారికి సంబంధించి లైవ్ స్ట్రీమింగ్ నిర్వహిస్తున్నాం’’ అని మంగ్లానీ చెప్పారు.
ప్రముఖులుగా పేరు పొందిన ఈ ఫొటోగ్రఫర్లలో చాలామంది, అత్యధిక ప్రజాదరణ ఉన్న సోషల్ మీడియా మాధ్యమం ‘ఇన్‌స్టాగ్రామ్’లో సెలెబ్రిటీ కంటెంట్‌ను పోస్ట్ చేస్తుంటారు.
విరాల్ భయానీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను 50 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉండగా, మంగ్లానీకి 26 లక్షల మంది, చావ్లాకు 13 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
సెలెబ్రిటీలకు చెందిన ఒక మంచి ఫొటోను తీసుకోవాలనే పోటీ నెలకొందని, దీని వల్లే ఒక్కోసారి హద్దులు దాటుతుంటారని చావ్లా అంగీకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
అనిత ఒక మాజీ ఫొటోగ్రాఫర్. పాపరాజీ అసైన్‌మెంట్స్ (సెలెబ్రిటీలకు సంబంధించిన ఫొటోలు తీయడం) చాలా ఒత్తిడిగా అనిపించేవని, ఒక్కోసారి చాలా బాధాకరంగా ఉండేదని అనిత అన్నారు.
‘‘ఒకవేళ ఇతరులకు దొరికిన మంచి షాట్, నేను తీయలేకపోతే నా బాస్ నాపై అరిచేవారు. ప్రత్యేకమైన ఫొటోలను తీసినవారికి అదనపు డబ్బు ఇచ్చేవారు’’ అని ఆమె తెలిపారు.
ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్‌లలో ఫొటోలు, వీడియోలు చూసి తమకు కూడా అలాంటి ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు కావాలని టీవీ చానెళ్లు, వార్తా ఏజెన్సీల నుంచి కూడా ఒత్తిడి ఉండేదని మంగ్లానీ చెప్పారు.
1990ల వరకు పరిస్థితి దీనికి భిన్నంగా ఉండేది. వరీందర్ చావ్లా తండ్రి కూడా ఫొటోగ్రఫీ వృత్తిలోనే ఉండేవారు. తన తండ్రితో సినిమా సెట్‌లకు వెళ్లినప్పటి అనుభవాన్ని వరీందర్ గుర్తు చేసుకున్నారు.
ప్రమోషనల్ ఫొటోల కోసం ఒక సెలెబ్రిటీ మేనేజర్ తమను ఆహ్వానించారని ఆయన చెప్పారు.
‘‘మేం వారితో కలిసి డిన్నర్ లేదా లంచ్ చేసేవాళ్లం. వాళ్లతో మాట్లాడేవాళ్లం. అలా స్నేహం పెరిగేది. షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ ఫొటోల కోసం నటులు వివిధ కాస్ట్యూమ్‌లు ధరించి ఫొటోలకు ఫోజులు ఇచ్చేవారు. అప్పట్లో ఈ పాపరాజీ సంస్కృతి లేదు’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఇకపై సెలెబ్రిటీ ఫోటోలు స్టేజ్ లుక్‌ను, ఆ అనుభూతిని కలిగించవు. ఇప్పుడు వారి ఫొటోలన్నీ క్యాండిడ్ లేదా సాధారణంగా మారాయి’’ అని రంజనా బెనర్జీ అన్నారు. ఆమె ఒక స్వతంత్ర జర్నలిస్టు.
అదే సమయంలో బాలీవుడ్ మరింతగా కార్పోరేటీకరణ చెందుతోంది. సినిమాలకు, సినీ స్టార్లకు ఇప్పుడు బ్యాంకులు, స్టూడియోలు ఆర్థిక సహాయం అందించడం మొదలు పెట్టాయి.
సాధారణంగా స్టార్లకు ఒకప్పుడు ఒకే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఉండేవారు. కానీ, ఇప్పుడు వారికి పీఆర్ టీమ్స్ సేవలు అందిస్తున్నాయి.
‘‘ఇది సెలెబ్రిటీలకు, ఫొటోగ్రఫర్లకు మధ్య ఒక విచిత్రమైన దూరాన్ని సృష్టించింది. బహుశా ముందుకంటే ఎక్కువగా ఇప్పుడు సెలెబ్రిటీలను కలిసే అవకాశం ఫొటోగ్రఫర్లకు ఉన్నప్పటికీ, ఆత్మీయ స్నేహాన్ని కోల్పోయాం’’ అని చావ్లా అన్నారు.
భారత్‌లో ఈ పాపరాజీ సంస్కృతి ఎప్పుడు పుట్టుకొచ్చిందో స్పష్టంగా తెలియదు. కానీ, ఇది 2000 తొలి నాళ్ల నుంచి మొదలై ఉండొచ్చని సినీ రంగంలోని సీనియర్లు అంటున్నారు.
అభిషేక్ బచ్చన్ పెళ్లి ఫొటోను దొంగతనంగా తీసుకోవడం ద్వారా తాను కూడా ఈ ట్రెండ్‌ను ప్రారంభించానని చావ్లా చెప్పారు. అభిషేక్ బచ్చన్ పెళ్లి వేదిక వద్దకు ఫొటోగ్రఫర్లకు నిషేధించారు.
ప్రైవసీకి విఘాతం కల్పించినందుకు అమెరికా, యూకేలోని పలువురు సెలెబ్రిటీలు కోర్టుకు వెళ్లి విజయం సాధించిన కేసులు అనేకం ఉన్నాయి. త్వరలోనే భారత్‌లో కూడా ఇలా జరగొచ్చు.
ఇవి కూడా చదవండి:
- గోళ్లు ఎందుకు కొరుకుతారు?
- యువ అథ్లెట్లలో కొందరికి గుండెపోటు ఎందుకు వస్తోంది?
- ఈ స్కూలు పిల్లలు రోజూ రెండుసార్లు డబ్బాలు పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు?
- తెలంగాణ: ఇంటర్ విద్యార్థులకు హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్వేర్ జాబ్... ఎంపిక ఎలా?
- గుజరాత్: శివాలయం మీద హక్కులను హిందూ సంస్థలకు ఇచ్చేందుకు జైనులు ఎందుకు ఒప్పుకోవడం లేదు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















