లాన్సెట్: భారత్‌లో 10 కోట్ల మందికి మధుమేహం, 13 కోట్ల మందికి ప్రీడయాబెటిస్

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో దాదాపుగా 10 కోట్ల మంది అంటే దేశ జనాభాలో 11.4 శాతం మంది మధుమేహంతో జీవిస్తున్నారని ‘లాన్సెట్’లో పబ్లిష్ చేసిన ఒక అధ్యయనం తెలిపింది.
కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన ఈ అధ్యయనంలో దాదాపు 13.6 కోట్ల మందికి అంటే దేశ జనాభాలో దాదాపు 15.3 శాతం మందికి ప్రీడయాబెటిస్ ఉందని అంచనా వేశారు.
టైప్ 2 డయాబెటిస్ చాలా సాధారణమైన కండీషన్.
మనుషుల్లో తగినంత ఇన్సులిన్, హార్మోన్ తయారుకాకపోవడం లేదా ఆ పరిస్థితిలో సరిగ్గా ప్రతిస్పందించలేకపోవటం వల్ల హై బ్లడ్ షుగర్ వస్తుంది.
ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీలో వెలువడ్డ తాజా అధ్యయనం భారత్‌లోని అసంక్రమిత వ్యాధుల భారాన్ని అంచనా వేయడానికి ప్రతి రాష్ట్రాన్ని సమగ్రంగా కవర్ చేసిన మొదటి పరిశోధన.
భారత జనాభాలో మధుమేహం వ్యాప్తి గతంలో అంచనా వేసిన దానికంటే చాలా ఎక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు.
గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) 7.7 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు అంచనా వేసింది. అంతేకాకుండా దాదాపు రెండున్నర కోట్ల మందికి ప్రీ-డయాబెటిస్ ఉందని, వారికి సమీప భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపింది.

ఫొటో సోర్స్, AFP
ప్రీ డయాబెటిస్ ఉన్నవారి పరిస్థితేంటి?
"ఇది టిక్కింగ్ టైమ్ బాంబ్ (భవిష్యత్తులో ప్రమాదకరం)" అని ఈ అధ్యయనం ప్రధాన రచయిత, డాక్టర్ ఆర్ఎం అంజనా 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' వార్తాపత్రికకు తెలిపారు.
ఆమె 'డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీస్ సెంటర్' మేనేజింగ్ డైరెక్టర్.
"ప్రీ-డయాబెటిస్ ఉంటే, అది డయాబెటిస్‌గా మారడం చాలా వేగంగా జరుగుతుంది. ప్రీ-డయాబెటిస్ ఉన్నవారిలో 60 శాతం కంటే ఎక్కువ మంది వచ్చే ఐదేళ్లలో డయాబెటిస్ బారిన పడతారు" అని ఆమె చెబుతున్నారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)తో కలిసి మద్రాస్ డయాబెటిస్ రీసర్చ్ ఫౌండేషన్ దశాబ్ద కాలం పాటు జరిపిన ఈ అధ్యయనంలో భారతదేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి 20 ఏళ్లు పైబడిన 1,13,000 మంది పాల్గొన్నారు.
2008లో సేకరించిన డేటాను తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో జనాభాను ఉపయోగించి 2021కి విస్తరించారు.
ఆయా రాష్ట్రాలను పరిశీలిస్తే గోవా (26.4 శాతం), పుదుచ్చేరి (26.3శాతం), కేరళ (25.5 శాతం)లో మధుమేహ బాధితులు ఎక్కువగా ఉన్నారు.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, అరుణాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మధుమేహం బాగా పెరుగుతోందని ఈ అధ్యయనం హెచ్చరించింది.

ఫొటో సోర్స్, AFP
పట్టణాల్లో ఎక్కువా? గ్రామీణ ప్రాంతాల్లోనా?
గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో మధుమేహం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం తెలిపింది.
"మారుతున్న జీవనశైలి, మెరుగైన జీవన ప్రమాణాలు, నగరాలకు వలసలు, అస్తవ్యస్తమైన పని గంటలు, కూర్చునే అలవాట్లు, ఒత్తిడి, కాలుష్యం, ఆహారపు అలవాట్లలో మార్పు, ఫాస్ట్ ఫుడ్ సులభంగా అందుబాటులో ఉండటం వంటివి భారతదేశంలో మధుమేహం పెరగడానికి కొన్ని కారణాలు" అని బీబీసీతో బాంబే హాస్పిటల్‌లోని కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ రాహుల్ బాక్సీ చెప్పారు.
డయాబెటీస్ "ఇకపై సంపన్నులకు లేదా నగరాల్లో నివసించే వారికి వచ్చే వ్యాధి మాత్రమే కాదు" అని డాక్టర్ బాక్సీ అభిప్రాయపడ్డారు.
"చిన్న పట్టణాల నుంచి చాలా మంది రోగులు ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రీ-డయాబెటిస్ వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంది. అందులో చాలా మందిని గుర్తించలేదు." అని అన్నారు.
గత కొన్నేళ్లుగా తాను చాలా సంఖ్యలో యుక్త వయసులో ఉన్న పేషెంట్లను చూస్తున్నానని డాక్టర్ బాక్సీ చెప్పారు. "నా పేషెంట్ల పిల్లలు ఇంట్లో వారి గ్లూకోజ్ స్థాయులను చెక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వారి తల్లిదండ్రులు చెక్ చేయించుకోవడం, వారి స్థాయులు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడమే కారణం" అన్నారు.
ఇప్పటివరకున్న గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 11 మంది(పెద్ద వారు)లో ఒకరిని మధుమేహం ప్రభావితం చేస్తోంది. గుండెపోటు, హార్ట్‌స్ట్రోక్, అంధత్వం, మూత్రపిండాల వైఫల్యం ముప్పును, అవయవాలను పూర్తిగా లేదా పాక్షికంగా తొలగించాల్సిన పరిస్థితులను ఇది కల్పిస్తోంది.
డయాబెటిస్‌ను సాధారణంగా టైప్ 1, టైప్ 2గా విభజిస్తారు.
టైప్ 1 డయాబెటిస్ రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. ఇది శరీరంలోని బీటా-కణాలు వంటి ఇన్సులిన్ ఫ్యాక్టరీస్‌పై దాడి చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడానికి తగినంత హార్మోన్ ఉండదు.
టైప్ 2 డయాబెటిస్ ఎక్కువగా పేలవమైన జీవనశైలి వ్యాధిగా పరిగణిస్తారు. ఎందుకంటే శరీర కొవ్వు ఇన్సులిన్ పని చేసే విధానాన్ని ప్రభావితం చేస్తుంది.

ఫొటో సోర్స్, AFP
డయాబెటిస్ లక్షణాలేంటి?
అధికంగా దాహం వేయడం, రాత్రి పూట ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు లేవడం, విపరీతమైన అలసట , ఎటువంటి ప్రయత్నమూ లేకుండానే బరువు కోల్పోవడం, కంటి చూపు మందగింపు, గాయాలు మానకపోవడం డయాబెటిస్ లక్షణాలని బ్రిటిష్ నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది.
ఈ లక్షణాలేవీ కనిపించకున్నా కూడా డయాబెటిస్ రావచ్చని డాక్టర్ లక్ష్మి లావణ్య ఆలపాటి బీబీసీతో చెప్పారు.
డయాబెటిస్ వచ్చినట్లు ఎలా నిర్ధరిస్తారు?
ఫాస్టింగ్‌లో అంటే పొద్దున ఏమీ తినక ముందు శరీరంలో గ్లూకోజ్ స్థాయులు 70 - 100 రేంజ్‌లో ఉంటే అది సాధారణ స్థాయి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
ఈ రేంజ్ 100 - 125 మిల్లీగ్రాములకు చేరితే ప్రీ డయాబెటిస్ అని, 126, ఆ పైన ఉంటే మధుమేహం ఉన్నట్లని సూచిస్తోంది.
డబ్ల్యూహెచ్‌ఓతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర వైద్య సంస్థలు కూడా ఎర్లీ స్క్రీనింగ్‌ను సూచిస్తున్నాయని డాక్టర్ లక్ష్మి అంటున్నారు.
కోవిడ్ మహమ్మారి తర్వాత భారతదేశంలో డయాబెటిస్ సోకిన వారి సంఖ్య మరింత పెరిగినట్లు డయాబెటిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ అనూప్ మిశ్రా ఇంతకుముందు బీబీసీతో చెప్పారు.
కరోనా కూడా డయాబెటిస్ రోగుల సంఖ్య పెరగడానికి ఒక కారణమని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
శరీరం కార్బో హైడ్రేట్లను గ్రహించే స్థాయిని కోల్పోవడమే మధుమేహానికి సంకేతమని 1923లో సర్ విలియం ఆస్లర్ రాసిన వైద్య పత్రంలో తెలిపారు.
"కానీ, ఇన్సులిన్ అందుబాటులోకి రావడంతో, కార్బోహైడ్రేట్లను తీసుకోవడం మరింత పెరిగింది" అని జ్యాసన్ ఫాంగ్ అంటారు.
ఆహారంలో కార్బోహైడ్రేట్లు, చక్కెర స్థాయులు తగ్గించడం ద్వారా ఇన్సులిన్ స్థాయులు తగ్గించుకోవచ్చని సూచించారు.
ఉపవాసం, మితాహారం, పోషకాహారం టైప్ 2 డయాబెటిస్ నియంత్రణకు బాగా పని చేస్తాయని డయాబెటిస్ ఎడ్యుకేటర్, న్యూట్రిషనిస్ట్ డాక్టర్ శుభ శ్రీ రే చెప్పారు.
అధిక పీచుతో కూడిన పదార్ధాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వుతో కూడిన ఆహారాన్ని తీసుకోవచ్చని ఆమె చెప్పారు.
కార్బోహైడ్రేట్లు లేని ఆరెంజ్, పుచ్చకాయ, పీచ్, జామ వంటి పళ్లు, ప్రోటీన్ ఉండే బీన్స్, పప్పు ధాన్యాలు, చిక్కుడు గింజలు, కొవ్వు తక్కువగా ఉండే చికెన్, టోఫు, చేపలు తీసుకోవచ్చని చెప్పారు.
ఆకుకూరలు, చిరుధాన్యాలు, ఓట్స్, దంపుడు బియ్యం, బాదాం, వాల్‌నట్ , పిస్తా, జీడిపప్పు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆమె వివరించారు. ఆలివ్ నూనె, నెయ్యి, కొబ్బరి నూనె లాంటివి ఆహారంలో వాడవచ్చని చెప్పారు. చక్కెరతో చేసిన స్వీట్లు, సోడా, బిస్కట్లు, కూల్ డ్రింకులు, ఐస్ క్రీములు, కేకులు, ఎక్కువ నూనెలో వేపిన పదార్థాలు, ఇతర ప్రాసెస్డ్ ఆహారానికి దూరంగా ఉండాలని సూచించారు.
డయాబెటిస్ ఉన్న వారు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారపదార్ధాలను తీసుకోవచ్చని శుభశ్రీ సూచించారు. వీటి వల్ల రక్తంలో చక్కర స్థాయులు అమాంతం పెరగవన్నారు.
ఇవి కూడా చదవండి:
- పాంబన్-ధనుష్కోడి: 130 మంది ప్రయాణిస్తున్న రైలు సముద్రంలో మునిగిపోయిన క్షణాలు
- గేదెలను చంపుతున్నారు, గోవులను వధిస్తే ఇబ్బంది ఏమిటన్న మంత్రి.. ఇరకాటంలో పడ్డ కాంగ్రెస్
- కరీంనగర్ - ఆశ: ఒకప్పుడు భిక్షాటనతో బతికిన హిజ్రా.. ఇప్పుడు ఫొటోగ్రాఫర్ ఎలా అయ్యారు?
- రూ. 2,000 నోట్ల వాడకాన్ని ఆపేసిన ఆర్బీఐ.. మీ దగ్గర ఉన్న నోట్లను ఎలా మార్చుకోవాలి?
- నాసిక్: త్రయంబకేశ్వర ఆలయంలో ముస్లింలు ధూపం సమర్పించారా... వైరల్ వీడియోలో ఏముంది, అసలేం జరిగింది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















