యుక్రెయిన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తే జైలు శిక్షలా? పుతిన్ పాలన స్టాలిన్‌ను తలపిస్తోంది: హక్కుల కార్యకర్త అర్లావ్

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, స్టీవ్ రోజెన్‌బర్గ్
- హోదా, రష్యా ఎడిటర్, మాస్కో
యుక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త ఓలెగ్ అర్లావ్ ఒక కేసులో మాస్కో కోర్టులో విచారణకు హాజరయ్యారు.
కోర్టు రూమ్‌లోకి ప్రవేశించిన వెంటనే, అర్లావ్ ఈ ట్రయల్‌పై తనకున్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఆయన తన బ్రీఫ్ కేసు తెరిచి, దానిలో ఉన్న ఒక పుస్తకం బయటకు తీశారు. పుస్తకాన్ని టీవీ కెమెరాలకు చూపించారు. ఆ పుస్తకం పేరు ‘ఎండ్ ఆఫ్ ది రెజీమ్’.
‘‘ఇది చాలా మంచి టైటిల్. దీన్ని చదవాలని నేను సూచిస్తున్నాను’’ అని అర్లావ్ అన్నారు.
రష్యాలో అత్యంత ఎక్కువ మంది గౌరవించే మానవ హక్కుల కార్యకర్తల్లో అర్లావ్ ఒకరు.
నియంతృత్వ, నిరంకుశ ప్రభుత్వాలు చివరకు ఎలా అంతమయ్యాయో చెబుతుందీ పుస్తకం.
యుక్రెయిన్‌లో యుద్ధాన్ని, స్వదేశంలో అసమ్మతిపై ‘యుద్ధాన్ని’ తప్పుబడుతూ రష్యా ప్రభుత్వంపై అర్లావ్ బహిరంగంగా విమర్శించారు.
2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయిలో దాడి ప్రారంభించినప్పటి నుంచి, తమ దేశం చేస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకించిన, విమర్శించిన వేల మంది రష్యన్లను తాను తీసుకొచ్చిన సరికొత్త చట్టాల కింద వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం శిక్షిస్తోంది.
ఈ చట్టాల్లో ఒకదాన్ని ఉల్లఘించారన్న ఆరోపణలతో 70 ఏళ్ల అర్లావ్‌పై విచారణ ప్రారంభమైంది.
యుక్రెయిన్‌లో యుద్ధం చేస్తున్న రష్యన్ సైన్యాన్ని కించపరిచేందుకు తన విమర్శలతో పదే పదే యత్నించారనే ఆరోపణలు రుజువైతే అర్లావ్ మూడేళ్ల వరకు జైలు శిక్ష ఎదుర్కోనున్నారు.

‘‘తొలుత రష్యా రాజ్యాంగం వాక్ స్వాతంత్ర్యానికి ప్రజలకు హామీ ఇస్తుంది. ఈ పరిణామాలపై నేను చేసిన పరిశోధనను తెలియజేస్తూ ఒక ఆర్టికల్ రాశాను. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ నన్ను శిక్షిస్తున్నారు.’’
‘‘ఇక రెండోది యుక్రెయిన్‌లో ఏం జరుగుతోంది? ఇది అందరికీ స్పష్టంగా తెలిసిందే. రష్యా, రష్యా ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఈ యుద్ధం జరుగుతోంది. అంతర్జాతీయ శాంతిని, భద్రతను కాపాడేందుకు ఈ యుద్ధం అన్నది పెద్ద జోక్. నవలా రచయిత జార్జ్ ఆర్వెల్ చెప్పిన ‘యుద్ధమే శాంతి, స్వేచ్ఛనే బానిసత్వం’ అనే దాన్ని ఇది గుర్తుకు చేస్తుంది. అంతర్జాతీయ శాంతి ప్రయోజనాల కోసం యుక్రెయిన్‌లో యుద్ధం చేస్తున్నామని చెప్పడం అర్థం లేనిది’’ అని అర్లావ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
అణచివేత చట్టాలు ప్రయోగం
రష్యా రాజ్యాంగం ఆర్టికల్ 29, వాక్ స్వాతంత్య్రానికి హామీ ఇస్తుంది.
అది కేవలం పేపర్‌పై మాత్రమే.
వాస్తవంగా, అధికారంలో ఉన్న వారిని విమర్శించే రష్యన్లు ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
యుక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న వారిని, ప్రభుత్వాన్ని విమర్శించే వారిని శిక్షించేందుకు అణచివేత చట్టాలను రష్యా అధికారులు ప్రయోగిస్తున్నారు.
ఆర్మీని నిందించడాన్ని నేరంగా పరిగణిస్తూ, రష్యా క్రిమినల్ కోడ్ కింద రష్యన్ సాయుధ దళాలపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై వారిని శిక్షిస్తున్నారు.
ఇలియా యాసిన్ వంటి క్రెమ్లిన్ విమర్శకులను శిక్షించేందుకు‘‘లా ఆన్ ఫేక్స్’ను తరచుగా వాడుతున్నారు. గత ఏడాది యాసిన్‌కు ఎనిమిదన్నరేళ్ల జైలు శిక్ష పడింది.
ఇది మాత్రమే కాక, ఇతర చట్టాల ద్వారా కూడా ప్రభుత్వ, యుద్ధ విమర్శకులను రష్యా శిక్షిస్తోంది.
రష్యా థియేటర్ డైరెక్టర్ జెన్యా బెర్కోవిచ్ యుద్ధానికి వ్యతిరేకంగా కవితలను రాశారు. ఉగ్రవాదాన్ని సమర్థించారన్న పేరుతో ఆమెను శిక్షించారు. ఆమె ఏడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.
ఏప్రిల్‌లో కూడా క్రెమ్లిన్ విమర్శకులు, యుద్ధ వ్యతిరేక కార్యకర్త వ్లాదిమిర్ కరా-ముర్జాకి కూడా రాజద్రోహం కింద 25 ఏళ్ల జైలు శిక్ష వేశారు.
‘స్టాలిన్ కాలంలో ఉన్నట్లు ఉంది’
‘‘అణచివేత స్థాయి, కేసుల సంఖ్య సోవియట్ నేత లియోనిడ్ బ్రెజ్‌నెవ్ కాలాన్ని గుర్తుకు చేస్తుంది’’ అని అర్లావ్ అన్నారు. కానీ, క్రూరత్వం స్థాయిని, జైలు శిక్ష కాలాన్ని చూస్తే మాత్రం ఇది స్టాలిన్ కాలంలో ఉన్నట్లు ఉందన్నారు.
అర్లావ్‌పై జరుగుతున్న విచారణ పట్ల అంతర్జాతీయంగా వ్యతిరేకత వస్తోంది.
ఈ కేసు న్యాయాన్ని అవహేళన చేస్తుందని, యూరప్‌లో ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను సమర్థించే లక్ష్యంతో పనిచేసే సుదీర్ఘ చరిత్ర ఉన్న రాజకీయ సంస్థ కౌన్సిల్ ఆఫ్ యూరప్ లిపింది.
‘‘రష్యా ప్రభుత్వం ప్రజల ఆలోచనలను నియంత్రించాలనుకుంటోంది. యుద్ధాన్ని ప్రారంభించే సమయంలో కూడా వారి విధానాలను సమ్మతించే అభిప్రాయాలను మాత్రమే వారు కోరుకున్నారు’’ అని కౌన్సిల్ ఆఫ్ యూరప్ మానవ హక్కుల కమిషనర్ దుంజా మిజాటోవిక్ చెప్పారు.
రష్యా పరిణామాలను పర్యవేక్షించే తామందరం కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించకూడదని చాలా స్పష్టతతో ఉన్నామన్నారు.

రాజకీయ ఖైదీలకు లేఖలు రాస్తున్న ప్రజలు
రష్యాలో జైలులో ఉన్న వారిని మర్చిపోలేమని అక్కడి ప్రజలంటున్నారు. రష్యా రాజధాని కేంద్రంలో మాస్కో ప్రజలు టేబుల్స్‌పై కూర్చుని రాజకీయ ఖైదీలకు లేఖలు రాస్తున్నారు.
ఖైదీల్లో ఉన్న వారి చిత్రాలను, వారి బయోగ్రఫీలతో పాటు ఫ్లయర్స్‌పై ముద్రిస్తున్నారు. టేబుల్స్‌పైన ఒకరికొకరు సమాచారం పంచుకుంటున్నారు.
అక్కడికి వచ్చే వాళ్లు ఎంత మందికి వీలైతే అంత మందికి మెసేజ్‌లను రాసి పంపొచ్చు.
‘‘నేను ఇక్కడికి ఎంతో అపరాధ భావనతో వచ్చాను’’ అని ఇల్యా అనే యువకుడు చెప్పారు.
తమ అభిప్రాయాలను తెలియజేసే వారు జైళ్లకు వెళ్తున్నారని, ఇది తప్పని తాననుకుంటున్నానని, వారికి మద్దతు తెలపాల్సి ఉందని ఆయన చెప్పారు.
రష్యాలో రాజకీయ ఖైదీలుగా మారుతున్న వారికి మద్దతివ్వడం నేడు చాలా ముఖ్యమని అలినా అన్నారు.
‘‘ఖైదీల్లో కొంత మందితో నాకు పరిచయాలున్నాయి. ఈ లేఖలు వారి జీవితాలను కాపాడతాయని నాకు అనిపిస్తోంది’’ అని అలినా చెప్పారు.
‘‘చేయడానికి మీ వద్ద ఏం లేనప్పుడు, మీరు ఒంటరి వారని మీ మనస్సు భావిస్తుంది. మీరు తీవ్ర మానసిక క్షోభకు గురవుతారు. ఈ కార్డులను, లేఖలను వారు చదివినప్పుడు, వారికి కాస్త మంచి అనుభూతి కలుగుతుందని భావిస్తున్నాను’’ అని యుల్యా అన్నారు.
అణచివేత పెరుగుతున్నప్పటికీ, తాము మౌనంగా ఉండబోమని తెలియజేసేందుకు జైళ్లలో ఉన్న ఖైదీలకు ఈ లేఖలు రాయడం ఒక మార్గమని వీరు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- యుద్ధానికి పిలుస్తారన్న భయంతో అడవిలోకి పారిపోయిన వ్యక్తి, అక్కడెలా బతుకుతున్నారంటే...
- యుక్రెయిన్: యుద్ధ క్షేత్రంలో కొడుకు మృతదేహాన్ని ఈ తల్లి ఎలా కనిపెట్టారు?
- సైనికుల వీర్యాన్ని ఉచితంగా ఫ్రీజర్‌లో భద్రపరిచేందుకు రష్యా ఎందుకు అనుమతిస్తోంది?
- రష్యా - యుక్రెయిన్ యుద్ధం: ‘‘రష్యాను తప్పుపట్టొద్దు.. ఇరు దేశాలకూ అది విషాదమే’’: పుతిన్
- ఆర్థికంగా దూసుకుపోతున్న అతి చిన్న దేశం, ఏడాదిలోనే ఆ దేశ కరెన్సీ విలువ డాలర్‌తో పోల్చితే 15% పెరిగింది... ఎలా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














