మొదటి ప్రపంచ యుద్ధం నాటి టెక్నాలజీతో రష్యాను బురిడీ కొట్టిస్తున్న యుక్రెయిన్

వ్లాద్
    • రచయిత, జొనాథన్ బీల్
    • హోదా, డిఫెన్స్ కరస్పాండెంట్, ఈస్టర్న్ యుక్రెయిన్

భారీ దాడికి సన్నాహాలు చేస్తున్న యుక్రెయిన్‌కు తన బలగాలను రష్యా కంటపడకుండా కాపాడుకొవడం కష్టమైన పనే. అందుకోసం యుక్రెయిన్ తన శత్రువును గందరగోళానికి గురిచేసే మార్గాలను అన్వేషిస్తోంది.

యుక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని ఓ కందకంలో ఆ దేశానికి చెందిన మోర్టార్ టీమ్ ఒకటి ఉంది. రష్యా డ్రోన్లను ఉపయోగించి తమను వేటాడుతుండడమే కాకుండా తమను గుర్తించేందుకు ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ ఉపయోగిస్తోందని ఆ టీమ్‌కు తెలుసు.

యుక్రెయిన్‌కు చెందిన 28వ బ్రిగేడ్‌లో ఉన్నవారికి కమ్యూనికేషన్స్, టార్గెట్స్ గుర్తించడానికి శాటిలైట్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు వంటి 21వ శతాబ్దపు ఆధునిక సాంకేతికతలకు యాక్సెస్ ఉండొచ్చు. వీటితోపాటు వారు పాత కాలపు యంత్రం ఒకటి వాడుతున్నారు.

మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో కందకాలలో వాడే వైండ్ అప్ ఫోన్‌ను వారు ఇప్పటికీ వాడుతున్నారు.

వ్లాద్, ఆయన టీం మోర్టార్‌ను పేల్చడానికి ముందు ఫీల్డ్ ఫోన్‌ను ఎత్తి మాట్లాడుతారు. పాతాళం నుంచి వచ్చినట్లుగా వినిపిస్తుంది దాని రింగ్. దాంతో కాల్ చేయాలంటే వారు వైండ్ అప్ హ్యాండిల్ వాడాల్సి ఉంటుంది. ఇదంతా చూస్తుంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలో సన్నివేశంలా ఉంటుంది.

చుట్టుపక్కల ఉన్న కందకాలకు దారి తీసే కేబుళ్లను వ్లాద్ పట్టుకుంటారు. ఇది అత్యంత సురక్షితమైన కమ్యూనికేషన్ సాధనమని, దీన్ని ఇతరులు వినడం అసాధ్యమని అంటారాయన.

మొబైల్ ఫోన్లు, రేడియోలను వాడితే రష్యా ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్స్‌కు దొరికిపోతామని, వాటితో జరిపే కమ్యూనికేషన్‌కు అంతరాయాలూ కలిగించగలరని వ్లాద్ అంటారు.

వైండ్ అప్ ఫోన్ టెక్నాలజీ చాలా పాతదైనప్పటికీ బాగా పనిచేస్తుందని చెప్పారాయన.

కందకాలలో సైనికుడు

ఇప్పటివరకు రష్యా సంప్రదాయ దళాలు భారీగా నష్టపోయాయి. కానీ, ఇప్పటికీ ప్రపంచంలోని కొన్ని అత్యాధునిక వార్ ఫేర్ సిస్టమ్స్ రష్యా దగ్గర ఉన్నాయి.

శత్రువులను ట్రాక్ చేయడానికి, కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగించడానికి ఉపయోగించే గుప్త సాధనాలు లాంటివి రష్యా వాడుతుంటుంది.

ట్యాంకర్లు, ఫిరంగుల నుంచి జరిపే కాల్పులను రష్యాకు చెందిన జూపార్క్ రాడార్లు గుర్తించగలవు. రష్యాకు చెందిన జిటెల్ వాహనాలు రేడియో ఫ్రీక్వెన్సీలను గుర్తించి బ్లాక్ చేస్తాయి. శాటిలైట్ కమ్యూనికేషన్లకు బోరిసోగ్లెస్క్-2 అంతరాయం కలిగించగలదు.

రష్యా ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వల్ల యుక్రెయిన్ డ్రోన్ వ్యవస్థకూ కష్టాలు తప్పడంలేదు.

తూర్పు ప్రాంతంలోని మరో చోట యుక్రెయిన్ 59వ బ్రిగేడ్‌లో పనిచేసే ఓలెక్సీ, ఆయన డ్రోన్ ఇంటెలిజెన్స్ యూనిట్ రష్యా దాడిలో ధ్వంసమైన భవనం స్థావరంగా పనిచేస్తున్నారు. అక్కడి నుంచి వారు తమ చిన్నపాటి చైనీస్ కమర్షియల్ డ్రోన్లను ఉపయోగిస్తూ రష్యా సైన్యం పొజిషన్లను గుర్తిస్తున్నారు.

యుక్రెయిన్ డ్రోన్

యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలో యుక్రెయిన్ డ్రోన్లను సమర్థంగా ఉపయోగించుకున్నట్లు కనిపించింది. అయితే ఇప్పుడు గగనతలమంతా డ్రోన్లతోనే నిండిపోయిందని, రష్యా తమలాంటి మోడళ్లే వాడుతోందని, తమకంటే ఎక్కువ సంఖ్యలో వినియోగిస్తోందని, అందుకే వారికి డ్రోన్లంటే పెద్దగా లెక్కలేదని ఓలెక్సీ అన్నారు.

రోజుకు మూడు నుంచి నాలుగు డ్రోన్లను కోల్పోతుంటామని ఓలెక్సీ చెప్పారు. తమ శత్రువు(రష్యా)కు రేడియో ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ స్టేషన్లు, యాంటీ డ్రోన్ గన్‌లు ఉన్నాయని, తమ డ్రోన్ల కమ్యూనికేషన్ల వ్యవస్థలకు వారు అంతరాయం కలిగించగలరని ఓలెక్సీ చెప్పారు.

కానీ బాగా ఆపరేట్ చేయగలిగేవారి చేతిలో ఉండే చిన్న డ్రోన్ కూడా రెండు మూడు వారాలు యుద్ధక్షేత్రంలో మనగలుగుతుందని ఓలెక్సీ చెప్పారు.

జియోలొకేషన్లు మార్చడం, ఎన్‌క్రిప్షన్ వంటి టెక్నిక్‌లతో తమ డ్రోన్లను రష్యా గుర్తించకుండా వీరు జాగ్రత్త పడుతుంటారు. ఓలెక్సీ ఆపరేట్ చేస్తున్న డ్రోన్ రష్యా కందకాలపై ఎగురుతున్నప్పటికీ దానికి ఆస్ట్రేలియా వీపీఎన్ ఉపయోగిస్తున్నారు. అంటే రష్యన్లు దాన్ని ట్రేస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు వేరే లొకేషన్లో కనిపిస్తుంది.. కానీ, ఈ ఎత్తుగడ అన్నిసార్లూ పనిచేయదు.

యుక్రెయిన్, రష్యా యుద్ధం

రష్యా డ్రోన్లను కూల్చడానికి యుక్రెయిన్ వైపు జరిగే ప్రయత్నాలు చాలా సాధారణమైనవి. ఇది మేం వేరే స్థావరం నుంచి చూశాం.

దూరంగా ఎగురుతున్న ఓ డ్రోన్‌ను యుక్రెయిన్ దళాలు చూస్తున్నాయి.. అది రష్యన్ తయారీ ఓర్లాన్ డ్రోన్. కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం కలిగించగలిగే నిఘా డ్రోన్ అది. అప్పుడది ఫిరంగి కాల్పులకు సూచనలిచ్చే యుక్రెయిన్ రక్షణ స్థావరాల సమీపంలో ఎగురుతోంది.

పొగ, కాల్పుల ప్రభావం కనిపించడానికి ముందే కాల్పుల శబ్దం వినిపిస్తుంది.

అయితే, యుక్రెయిన్ దళాలు ఆటోమేటిక్ రైఫిళ్లతో కాల్పులు జరిపినా రష్యా డ్రోన్ ఆకాశంలో ఎత్తున ఉండడంతో బుల్లెట్లన్నీ వ్యర్థమయ్యాయి.

అక్కడికి సమీపంలోని కమాండ్ సెంటర్‌లో ఉన్న యుక్రెయిన్ 10వ బ్రిగేడ్‌కు చెందిన బోహ్డాన్.. తాము ఇంతకంటే చేయలేమంటూ నిరాశ వ్యక్తంచేశారు.

ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్‌లో రష్యా ముందుండడం, ఎక్కువ డ్రోన్లు కలిగి ఉండడం వల్ల రష్యాకు ప్రయోజనం ఉండొచ్చు. కానీ, యుక్రెయిన్ గగనతలంపై పట్టు సాధించే స్థితిలోగానీ, యుక్రెయిన్ ప్రతిఘటన, చాకచక్యాలపై విజయం సాధించే స్థితిలోగానీ రష్యా ఇప్పటికీ లేదు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)