కరోనావైరస్: ఒలింపిక్ క్రీడల నుంచి తప్పుకున్న కెనడా.. ఇది వాయిదాకి సంకేతమా?

రియో ఒలింపిక్ క్రీడలు

ఫొటో సోర్స్, Getty Images

టోక్యోలో జులై 24వ తేదీ, 2020 నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్ క్రీడల నుంచి కెనడా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో క్రీడల నిర్వహణపై మరిన్ని అనుమానాలు తలెత్తాయి.

ఒలింపిక్ క్రీడల తేదీ మారవచ్చని జపాన్ ప్రధాని షింజో అబే చెప్పిన వెంటనే వెంటనే కెనడా తన నిర్ణయాన్ని ప్రకటించింది.

క్రీడలు చోటు చేసుకునే పరిస్థితులు కనిపించకపోవడంతో ఆస్ట్రేలియా కూడా 2021 సంవత్సరానికి ఒలంపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు సన్నద్ధం అవ్వమని తమ దేశపు క్రీడాకారులకు చెప్పింది.

ఈ ఏడాది జులై 24 నుంచి టోక్యోలో ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కావల్సి ఉన్నాయి.

కెనడా ఏమి చెప్పింది?

కెనడా క్రీడాకారులు, క్రీడా సంఘాలు, కెనడా ప్రభుత్వంతో కెనడా ఒలింపిక్, పారా ఒలింపిక్ కమిటీ చర్చలు జరిపిన తర్వాత క్రీడల నుంచి ఉపసంహరించుకునే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఈ క్రీడలని సంవత్సరం పాటు వాయిదా వేయాలని అంతర్జాతీయ ఒలింపిక్, పారా ఒలింపిక్ కమిటీని, ప్రపంచ ఆరోగ్య సంస్థని కోరినట్లు తెలిపింది.

క్రీడలను వాయిదా వేయడం ఇబ్బంది అయినప్పటికీ క్రీడాకారుల ఆరోగ్యం, రక్షణ కంటే ఏది పెద్ద విషయం కాదని కమిటీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

'ఈ రోజు వాయిదా వేయండి, రేపు గెలవండి' అని టీం కెనడా ట్వీట్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

షింజో అబే ఏమి చెప్పారు?

ఒలింపిక్ క్రీడలు ముందుగా నిర్ణయించినట్లే జరుగుతాయని గత కొన్ని వారాలుగా జపాన్ ప్రకటిస్తూ వచ్చింది.

కానీ, జపాన్ ప్రధాని షింజో సోమవారం పార్లమెంట్‌లో మాట్లాడుతూ టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడొచ్చని అన్నారు

క్రీడాకారుల ఆరోగ్యం, భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం అనివార్యమని అయన అన్నారు.

అలాగే, క్రీడలను పూర్తిగా రద్దు చేసే ప్రసక్తి లేదని చెప్పారు.

శాంతియుత పరిస్థితుల్లో ఒలింపిక్ క్రీడలు ఇప్పటి వరకు ఎప్పుడూ వాయిదా పడటం కానీ, రద్దు కావటం కానీ జరగలేదు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మాత్రం టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు రద్దు అయ్యాయి.

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏమంటోంది?

ఒలింపిక్ క్రీడల నిర్వహణ పై నాలుగు వారాలలో తుది నిర్ణయం తీసుకోవాలని అనుకున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆదివారం ప్రకటించింది.

పూర్తిగా రద్దు చేయడం వలన ఎవరికీ ఉపయోగం ఉండదని వీటి తేదీని పొడిగించడమే ఒక మార్గమని పేర్కొంది.

'మానవ జీవితం కంటే ఏది ముఖ్యం కాదని' క్రీడాకారులకు రాసిన ఉత్తరంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బ్యాక్ పేర్కొన్నారు.

"ఈ చీకటి గుహలో మనం అందరం కలిసి ప్రయాణిస్తున్నాం. ఇది ఎంత దూరమో తెలియదు. ఈ గుహ చివర వెలిగే ఒలింపిక్ జ్యోతి వెలుగు ఇస్తుందని ఆశిద్దాం " అని రాశారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

ఇతర దేశాలు ఏమంటున్నాయి?

2021వేసవి ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు సన్నద్ధం కావాలని ఆస్ట్రేలియా తమ దేశపు క్రీడాకారులకు పిలుపునిచ్చింది.

ఈ ఏడాది జులైలో ఒలింపిక్ క్రీడలు జరిగే పరిస్థితి కన్పించటం లేదని, ఆస్ట్రేలియా చెఫ్-డి-మిషన్, ఐయాన్ చెస్టర్ మన్ అన్నారు.

జులైలో ఒలింపిక్ క్రీడలు నిర్వహించడం సాధ్యం కాని పని అని ప్రపంచ అథ్లెటిక్స్ అధికారి సెబాస్టియన్ కో , బ్యాక్ కి రాసిన లేఖలో తెలిపారు.

అమెరికాలోని క్రీడా సంఘాలు యుఎస్ఏ ట్రాక్ అండ్ ఫీల్డ్, గ్లోబల్ అథ్లెట్ కూడా క్రీడలని వాయిదా వేయమని విజ్ఞప్తి చేశాయి.

కరోనావైరస్ మహమ్మారి రోజు రోజుకి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుండడంతో మరిన్ని సాంఘిక నియంత్రణలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. క్రీడల నిర్వహణ పట్ల ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకోవల్సిన అవసరం ఉందని బ్రిటిష్ సైక్లిస్ట్ కేలం స్కిన్నర్ అన్నారు.

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)