కరోనావైరస్ సోకితే ఐబుప్రోఫెన్ తీసుకోవడం ప్రమాదకరమా... ఈ ప్రచారంలో నిజమెంత?

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రియాలిటీ చెక్, బీబీసీ మానిటరింగ్
    • హోదా, బీబీసీ న్యూస్

కరోనావైరస్ లక్షణాలు కనిపించినప్పుడు ఐబుప్రోఫెన్ లాంటి మందులు వాడటం మరింత ప్రమాదానికి దారి తీస్తుందనే వార్తలు ఆన్లైన్ లో ప్రచారమవుతున్నాయి. వైద్య సలహాల రూపంలో అసలు విషయాన్ని తప్పు దారి పట్టిస్తూ తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది.

కరోనా‌వైరస్‌కు ముందుగా ఐబుప్రోఫెన్ పని చేయదని వైద్య నిపుణులు బీబీసీ కి చెప్పారు. ఒక వేళ ఇతర ఆరోగ్య సమస్యలకి ఐబుప్రోఫెన్ తీసుకుంటూ ఉంటే డాక్టర్ సలహా లేకుండా మానవద్దని సూచించారు.

పారాసెటమాల్, ఐబుప్రోఫెన్ మందులు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి, జలుబు లాంటి లక్షణాలకి పని చేస్తాయి. కానీ ఈ మందులు అందరికీ పడవని వాటి వలన ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిపారు. ముఖ్యంగా ఆస్తమా, గుండెకు సంబంధించిన సమస్యలు, రక్త ప్రసరణ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత చేటు చేస్తుందని తెలిపారు.

గతంలో నేషనల్ హెల్త్ సర్వీస్ వెబ్ సైట్‌లో పారాసెటమాల్, ఐబుప్రోఫెన్ వాడవచ్చని సూచించింది. కానీ, ఈ సమాచారాన్ని తర్వాత సవరిస్తూ, ఐబుప్రోఫెన్ వలన కరోనావైరస్ తీవ్రత మరింత పెరుగుతుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని, ఒకవేళ కరోనావైరస్ లక్షణాలు గుర్తిస్తే తగిన మందులు తెలిసేవరకు పారాసెటమాల్ వాడమని సూచించింది. డాక్టర్ పారాసెటమాల్ పడదని సూచిస్తే వాడొద్దని పేర్కొంది.

ఐబుప్రోఫెన్ తీసుకోవడం వలన కరోనా వైరస్ సోకిన వ్యక్తులకు వేరే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనడానికి శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవని లండన్ స్కూల్ అఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌కి చెందిన వైద్యుడు డాక్టర్ చార్లొట్ గారెన్ వాష్ చెప్పారు. వ్యాధి లక్షణాలు కన్పించగానే పారాసెటమాల్ తీసుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు.

అసత్య ప్రచారం

సలహా ఏదైనా కానీ, ఆన్లైన్‌లో చాలా వదంతులు ప్రచారమవుతున్నాయి. వాట్సాప్ లో అసత్య సమాచారం ఫార్వర్డ్ అవుతోంది.

కార్క్ లోని ఒక ఇంటెన్సివ్ కేర్ యూని‌ట్లో ఏ జబ్బులూ లేని ఒక నలుగురు యుక్త వయస్కులు ఉన్నారు. వీళ్లంతా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు తీసుకోవడం వలన వారి పరిస్థితి విషమించింది. (ఇది అసత్యం)

కరోనావైరస్ లక్షణాలతో బాధ పడుతున్న వారిని ఐబుప్రోఫెన్ తీసుకోవద్దని యూనివర్సిటీ అఫ్ వియన్నా మెమో ఇచ్చింది. ఈ మందు తీసుకోవడం వలన కరోనా వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతుందని అందుకే ఇటలీలో తీవ్ర స్థాయిలో ఈ వైరస్ ప్రబలింది. (ఇది అసత్యం).

ఫ్రాన్స్ లోని టౌలోస్ లోని యూనివర్సిటీ హాస్పిటల్‌లో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని యుక్త వయసులో ఉన్న నాలుగు ప్రమాదకరమైన కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. వీరు వైరస్ లక్షణాలు కన్పించగానే ఐబుప్రోఫెన్ తీసుకోవడం మొదలుపెట్టారు. (ఇది అసత్యం)

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

సాధారణంగా ఇలాంటి కాపీ టెక్స్ట్ చేసిన పోస్టులు ఎవరో తెలిసిన వైద్య నిపుణుల నుంచి ఫార్వర్డ్ చేసినట్లుగా ఉంటాయి.

ఈ వాదనలన్నీ అసత్యం

కార్క్ లో కరోనావైరస్ రోగుల గురించి వాట్సాప్‌లో ప్రచారమవుతున్న సమాచారం అసత్యమని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ అఫ్ ఐర్లాండ్ పేర్కొంది. అటువంటి సమాచారాన్ని పట్టించుకోవద్దని, తొలగించమని చెప్పింది

టౌలోస్ యూనివర్సిటీ కూడా సోషల్ నెట్వర్క్ లలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని పేర్కొంది. రోగుల సమాచారాన్ని వైద్య పరమైన గోప్యతా అవసరాల దృష్ట్యా బయటకి వెల్లడించకూడదని తెలిపింది.

ఐబుప్రోఫెన్, కోవిడ్-19 గురించి మనకేం తెలుసు

ఇబు ప్రోఫెన్ వాడితే కోవిడ్ 19 లక్షణాలకి పని చేస్తుందా లేదా అనే అంశం పై ఇప్పటి వరకు ఎటువంటి పరిశోధనలు జరగలేదు.

కానీ, ఇతర శ్వాస సంబంధిత సమస్యల్లో ఐబుప్రోఫెన్ వాడటం వలన మరిన్ని సమస్యలకి దారి తీయడం కానీ, వ్యాధి పెంపొందడం కానీ జరగవచ్చని కొన్ని వైద్య అధ్యయనాలు ఉన్నట్లు యూనివర్సిటీ అఫ్ సౌత్ అంప్తన్ ప్రైమరీ కేర్ రీసెర్చ్ ప్రొఫెసర్ పాల్ లిటిల్ పేర్కొన్నారు. అయితే ఇది ఐబుప్రోఫెన్ వలన జరుగుతుందని నిర్ధారించలేమని ఆయన చెప్పారు.

కొంత మంది వైద్య నిపుణులు ఐబుప్రోఫెన్‌లో ఉన్న కొన్ని పదార్ధాలు శరీరపు రోగ నిరోధక శక్తిని తగ్గించవచ్చని చెబుతారు.

ఏదైనా శ్వాస సంబంధిత సమస్య తలెత్తినప్పుడు ఐబుప్రోఫెన్ వాడితే సమస్య మరింత జఠిలమవుతుందని యూనివర్సిటీ అఫ్ రీడింగ్ ప్రొఫెసర్ పరస్టూ డోన్యై చెప్పారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

అసత్య వార్తల ప్రచారం అనుమానాల్ని పుట్టిస్తోంది

టౌలోస్ యూనివర్సిటీ‌లో డాక్టర్ జీన్ లూయిస్ మొంటాస్ట్రక్, జ్వరం కానీ, ఇతర ఇన్ఫెక్షన్ కానీ వస్తే బ్రూఫెన్ లాంటి మందులు వలన వచ్చే సమస్యలని దృష్టిలో ఉంచుకోవాలని ట్వీట్ చేయడంతో , ఫ్రాన్స్ ‌లో ఇబు ప్రోఫెన్ వాడకం గురించి విచారం మొదలయింది. అయన ఆ ట్వీట్ ని కరోనావైరస్ ప్రబలుతున్న సమయంలో చేసారు.

ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రి ఒలీవియర్ వేరన్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందుల వాడకం వలన ఇన్ఫెక్షన్‌ పెరిగే అవకాశాలు ఉన్నాయని చేసిన ట్వీట్ 43,000 సార్లు రీట్వీట్ అయింది. ఎవరైనా అటువంటి మందుల వాడకం ఆపే ముందు డాక్టర్‌ని సంప్రదించాలని కూడా అయన ట్వీట్‌లో పేర్కొన్నారు,

ఐబుప్రోఫెన్ ఇన్ఫెక్షన్ తీవ్రతను యుక్త వయస్కుల్లో, మధ్య వయసు వారిలో కూడా మరింత పెంచుతుందని చేసిన ఇతర ట్వీట్ లు కూడా 94,000 సార్లు ట్విట్టర్లో షేర్ అయ్యాయి.

ఫేస్‌బుక్ పోస్టు

ఫొటో సోర్స్, FACEBOOK

వైద్య నిపుణులు ఈ విషయం పై ఒక సాధారణ అంగీకారానికి రాకపోవడంతో ఆన్లైన్ లో తప్పుడు ప్రచారం జరిగింది.

వియన్నా యూనివర్సిటీలో ప్రచారమైన సమాచారం ఒక ప్రాణాన్ని కూడా బలిగొంది,

కొన్ని వదంతులు వాళ్ళ కుటుంబాలలో డాక్టర్లు ఉన్నారని వియన్నా ప్రయోగ శాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా సందేశం పంపుతున్నట్లుగా ఉన్నాయి. బ్రూఫెన్ వాడటం వలెనే కరోనా వైరస్ మరణాలు సంభవించాయని ట్విట్టర్, ఫేస్ బుక్ లో ప్రచారమయిన సందేశాలకి సరైన ఆధారాలు లేవు.

ఈ వదంతులు జర్మన్ భాషలో వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్‌గా కూడా ప్రచారమయ్యాయి. ఇవన్నీ ఇటలీ‌లో చోటు చేసుకున్న కోవిడ్ 19 మరణాలన్నిటిలో రోగులు డాక్టర్ సలహా లేకుండా ఐబుప్రోఫెన్ వాడారని చిన్న పిల్లలున్న తల్లి చెబుతున్నట్లుగా ఉన్నాయి.

అయితే, వీటిని నిర్ధారించే ఆధారాలు ఏవి ఆ వదంతుల్లో లేవు. ఇటువంటి వదంతులు కుట్ర చేయడం కోసం చేసేవని జర్మనీ కి చెందిన అఫానేట్ డి ఫార్మాస్యూటికల్ వెబ్ సైట్ పేర్కొంది.

రిపోర్టింగ్ : రేచెల్ స్క్రేయెర్ , జాక్ గుడ్ మాన్, అలిస్టయిర్ కొలెమన్

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్