వక్షోజాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకుంటే ఏమవుతుంది?

అమ్మాయిలకు యుక్త వయసు వచ్చాక శరీరంలో హార్మోన్ల ప్రభావం వల్ల అనేక మార్పులు జరుగుతాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమ్మాయిలకు యుక్త వయసు వచ్చాక శరీరంలో హార్మోన్ల ప్రభావం వల్ల అనేక మార్పులు జరుగుతాయి
    • రచయిత, డాక్టర్ ప్రతిభా లక్ష్మి
    • హోదా, బీబీసీ కోసం

తాజాగా విజయనగరంలో జరిగిన ఒక సంఘటన సంచలనం సృష్టించింది. హీరోయిన్‌ను చేయాలనే కోరికతో ఒక మహిళ తన కూతురుకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇప్పిస్తుంటే, అది తట్టుకోలేక, ఆ అమ్మాయి చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమెను ప్రభుత్వ రక్షణ హోంకు తరలించి రక్షణ అందించారు.

ఈ సంఘటనలో డబ్బు, పేరు మీద వ్యామోహంతో పాటు.. మందుల దుష్ప్రభావాల మీద అవగాహనా రాహిత్యం, వైద్య వ్యవస్థలో లోపిస్తున్న నియంత్రణ కనిపిస్తున్నాయి.

నిజానికి కృత్రిమంగా మందుల వల్ల శరీరం లేక శరీర భాగాలు పెరగడం ఎంత వరకు సాధ్యం అనేది ముందు తెలుసుకోవాలి.

అమ్మాయిలకు యుక్త వయసు వచ్చాక శరీరంలో హార్మోన్ల ప్రభావం వల్ల అనేక మార్పులు జరుగుతాయి. సాధారణంగా ఇది పది సంవత్సరాల వయసులో ప్రారంభమై.. పద్నాలుగు ఏళ్ల వరకు జరుగుతుంది.

ఎనిమిది సంవత్సరాల లోపు ఈ మార్పులు కనిపిస్తే, లేక పది సంవత్సరాల లోపు రుతుక్రమం ప్రారంభం అయితే దాన్ని ‘‘ప్రికాషియస్ ప్యూబర్టీ’’ అంటారు.

రజస్వల ఆలస్యం కావడంతో కొంతవరకు ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రజస్వల ఆలస్యం కావడంతో కొంతవరకు ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది

యుక్త వయసు రావడంతో వచ్చే మార్పులివీ..

  • ఛాతీ (రొమ్ము) పెరుగుదల
  • చేతుల కింద (సంకల్లో), జననాంగాల వద్ద రోమాలు పెరగడం
  • ఎత్తు పెరగడం
  • మూడు దశలు దాటాక.. రుతుక్రమం ప్రారంభం అవుతుంది.

అయితే, ఎత్తు పెరగడానికి కృత్రిమంగా హార్మోన్లు ఇవ్వాల్సిన అవసరం ఎప్పుడు కలుగుతుంది అంటే.. పుట్టుకతో వచ్చే కొన్ని జన్యు పరమైన సమస్యల్లో (Turner's syndrome), లేక హార్మోన్ లోపం (అవ్వవలసిన దాని కన్నా తక్కువ ఉత్పత్తి అవుతుంటే) లేదా కుటుంబ పరంగా తక్కువ ఎత్తుతో ఉండే వారికి, ఈ హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది.

దీని వల్ల రజస్వల ఆలస్యం కావడంతో కొంతవరకు ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకసారి రుతుక్రమం ప్రారంభం అయితే, ఎత్తు పెరగడం తగ్గిపోతుంది.

అవయవాలు పెరగడానికి నిజానికి డాక్టర్లు మందులు ఏమీ ఇవ్వరు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అవయవాలు పెరగడానికి నిజానికి డాక్టర్లు మందులు ఏమీ ఇవ్వరు

అవయవాల పెరుగుదలకు మందులు ఇవ్వరు

శరీర అవయవాలు పెరగడానికి నిజానికి డాక్టర్లు మందులు ఏమీ ఇవ్వరు.

ఈస్ట్రోజెన్ (మహిళల సెక్స్ హార్మోన్)తో కొంతవరకు లాభం ఉండొచ్చు. కానీ, దాని వల్ల అనేక దుష్ప్రభావాలు ఉంటాయి.

రొమ్ముల్లో నొప్పి, ఒళ్ళు మంటలు, శరీరం అంతా నొప్పులు, నెలసరి తరహాలో రక్తస్రావం లాంటి తాత్కాలిక సమస్యలు మొదలుకొని.. గర్భసంచి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, షుగర్ లాంటి దీర్ఘ కాలిక సమస్యలు తలెత్తవచ్చు.

సాధారణంగా వక్షోజాల ఎదుగుదల కృత్రిమంగా జరగడానికి ఈస్ట్రోజెన్ ఇస్తే, దాని వల్ల ఎత్తు ఎక్కువ పెరగడం ఆగిపోయే ప్రమాదం ఉంది.

అయితే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ వంటి హార్మోన్లను గర్భ నిరోధక మాత్రలుగా వాడడం వల్ల కూడా కొన్ని సార్లు మహిళలకు సమస్యలు కలుగవచ్చు.

దీర్ఘ కాలికంగా వీటిని వాడడం వల్ల క్యాన్సర్లతోపాటు రక్తం గడ్డకట్టడం వల్ల పక్షవాతం, గుండె పోటు లాంటి ప్రాణాపాయ స్థితులు కూడా కలిగే ప్రమాదం ఉంది.

అందుకే వైద్యులు అన్ని పరీక్షలు చేసి, ప్రమాదాల గురించి తెలిపిన తరవాత మాత్రమే ఇవి ప్రారంభిస్తారు.

వీడియో క్యాప్షన్, అమ్మాయిలకు యుక్త వయసు వచ్చాక శరీరంలో హార్మోన్ల ప్రభావం వల్ల అనేక మార్పులు జరుగుతాయి.

హార్మోన్ చికిత్సల మాటేమిటి?

బరువు పెరగడానికి, పుష్టిగా కనిపించడానికి ఇన్సులిన్, కార్టిసాల్ వంటివి ఇవ్వవచ్చు.

కానీ, వాటితో ఎముకలు బలహీన పడటం, షుగర్ రావడం, రోగ నిరోధక శక్తి తగ్గడం, బీపీ పెరగడం, వంటి దుష్ప్రభావాలు కలుగవచ్చు.

ఇతర సమస్యలకు చికిత్సగా వీటిని తప్పని పరిస్థితిలో వాడే సమయంలోనూ దుష్ప్రభావాలతో ఎందరో ఇబ్బంది పడుతుంటారు.

సాధారణంగా పురుషులు కండరాలు పెంచడానికి, పుష్టిగా అవ్వడానికి స్టెరాయిడ్స్ (టెస్టోస్టెరాన్) తీసుకోవడం గురించి వింటుంటాం. కానీ అవసరం లేకపోయినా, అలా కృత్రిమంగా తీసుకునే ఏ హార్మోన్ వల్ల అయినా తప్పకుండా దుష్ప్రభావాలు ఉంటాయి.

వీడియో క్యాప్షన్, హీరోయిన్లు, అందగత్తెలు తాగే బ్లాక్‌వాటర్ అంటే ఏంటి?

అవసరమైతేనే...

కాబట్టి కేవలం అవసరం ఉన్నప్పుడు, అది కూడా పూర్తి పరీక్షలు జరిపి, సరైన మోతాదులో, అవసరమైనన్ని రోజులు మాత్రమే ఇలాంటి మందులు వాడాలి.

ఈస్ట్రోజెన్ ఇవ్వడానికి ముందు చూడాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆ అమ్మాయి తల్లికి గానీ, లేదా రక్తసంబంధం ఉన్న వారికి రొమ్ము లేదా గర్భాశయ క్యాన్సర్ ఉండకూడదు.

అలా ఉన్న వారికి హార్మోన్లు ఇవ్వటం వల్ల క్యాన్సర్ కలిగే ప్రమాదం మరింత ఎక్కువ.

అందానికి కొన్నింటిని కొలమానాలుగా భావించి కృత్రిమంగా వాటిని పొందడానికి అనవసరంగా ఇలాంటి పద్ధతులను ఆశ్రయించడంతో ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు కొన్ని సార్లు ప్రాణాపాయం కూడా కలుగవచ్చు.

అలా ప్రాణాలు కోల్పోయిన కొందరు హీరోయిన్లు కూడా ఉన్నారు. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళ జీవనోపాధి వారి అందమే. వారిని చూసి సామాన్యులు ఇలాంటి తొందర పాటు పనులు చేయకూడదు. వాళ్ళు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, అన్ని పరీక్షలు జరిపి, సరైన మందు, సరైన డోసులో తీసుకుంటారు.

ఇలాంటి చికిత్సల మీద నియంత్రణ లేకపోవడం అనేది ప్రాణాలతో చెలగాటం లాంటిది. చికిత్స పేరుతో అశాస్త్రీయ వైద్యం అందిస్తున్న అనర్హులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలి.

హార్మోన్ల మందులను సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకుండా మందుల షాపులను నియంత్రించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. లేదంటే ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ జరిగే ప్రమాదం ఉంది.

(రచయిత వైద్యులురాలు, ఈ అంశంపై స్థూలమైన అవగాహన కోసమే ఈ కథనం)

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)