మోదీ-స్వామి నారాయణ్ మందిర్: యూఏఈ, గల్ఫ్‌లోని ఇతర ముస్లిం దేశాలలో హిందూ ఆలయాల పరిస్థితి ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎహ్తేశామ్ షాహిద్
- హోదా, సీనియర్ జర్నలిస్ట్, దుబయి నుంచి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2015 ఆగస్ట్‌లో తన బిజీ షెడ్యూల్ మధ్యే అబుదాబీలోని షేక్ జాయెద్ మసీదును సందర్శించారు.
ఆ తరువాత రోజు ఆయన పొరుగునే ఉన్న దుబయిలో ప్రసంగించాల్సి ఉంది.
2007లో పూర్తయిన ఆ విశాలమైన మసీదు అప్పటికే అబుదాబిలో తప్పనిసరి దర్శనీయ స్థలాలలో ఒకటిగా మారిపోయింది.
మసీదు కాంప్లెక్స్‌ను సందర్శించిన అనంతరం మోదీ యూఏఈకి చెందిన ఇద్దరు సీనియర్ అధికారులతో సెల్ఫీ కూడా దిగారు.
‘మోదీ మోదీ’ అంటూ అక్కడ నినాదాలు చేసిన ప్రజలకు చేయి ఊపుతూ అభివాదం కూడా చేశారు. అప్పుడు అక్కడంతా పండుగ వాతావరణం కనిపించింది.
ఇది జరిగిన కొద్దిసేపటికే ఓ భారతీయ న్యూస్ చానల్ యాంకర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. లైవ్‌లో ఆ యాంకర్ నన్ను ఓ ప్రశ్న అడిగారు.. ‘బురఖాలో ఉన్న మహిళలు మసీదులో మోదీ.. మోదీ.. అంటూ నినాదాలు చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు’ అని అన్నారు.
అప్పుడు అక్కడ మసీదులో ఉన్న భారతీయ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు నినాదాలు చేయడం నిజమే. అందులో కొందరు బురఖా ధరించిన మహిళలూ ఉన్నారు. అయితే, ఇక్కడ మరో విషయం చెప్పాలి. మసీదులో ప్రవేశించే మహిళలు ఏ మతానికి చెందినవారైనా సరే హిజాబ్ ధరించాలి.
కాబట్టి ఒక ముస్లిం దేశంలో మసీదులో నిల్చుని మోదీ మోదీ అంటూ నినదించిన వారంతా ముస్లిం మహిళలు అని చెప్పలేం.

ఫొటో సోర్స్, @NARENDRAMODI/X
గత పదేళ్లలో ప్రధాని మోదీ యూఏఈకి వెళ్లిన ప్రతిసారీ అది మెగా ఈవెంట్‌గానే నిలిచింది.
2015లో దుబయి క్రికెట్ స్టేడియంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభ, 2018లో ‘వరల్డ్ గవర్నమెంట్ సమిట్’లో ఆయన చేసిన కీలకోపన్యాసం, నిరుడు జరిగిన కాప్28 సదస్సులో ఆయన ప్రసంగం వంటివన్నీ ప్రజల్లో ఆసక్తి కలిగించాయి.
ఆయన పర్యటనల చుట్టూ ఏర్పడే హడావుడిలో తరచూ వాస్తవాలు, భావనల మధ్య ఉన్న విభజన రేఖను అస్పష్టంగా మారుస్తుంది.
చాలాసార్లు ఈ హడావుడిలో జర్నలిస్టులు, పొలిటికల్ అనలిస్టులు కూడా భావనలు, వాస్తవాల మధ్య వ్యత్యాసాలను గుర్తించడంలో విఫలమవుతుంటారు.
ఫిబ్రవరి 13న నరేంద్ర మోదీ మరోసారి యూఏఈ వెళ్లారు. 13, 14 తేదీలలో ఆయన యూఏఈలో పర్యటిస్తున్నారు. 2015 నుంచి ఇప్పటివరకు ఆయన యూఏఈ వెళ్లడం ఇది ఏడోసారి. గత ఎనిమిది నెలల్లోనే ఆయన మూడుసార్లు ఆ దేశానికి వెళ్లారు.
తాజా పర్యటనలో యూఏఈ రాజధాని అబుదాబీలో ‘అహ్లాన్ మోదీ’ అనే పేరుతో ఓ జరిగింది. యూఏఈలోని భారతీయ సమాజం దీన్ని చాలా పెద్ద కార్యక్రమంగా చెప్తోంది.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 60 వేల మంది రిజిస్టర్ చేసుకున్నట్లు నిర్వాహకులు చెప్పారు.
అనంతరం దుబయిలో జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్-2024లో మోదీ ప్రసంగిస్తారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్తోంది.
మరోవైపు మోదీ పర్యటన సమయంలోనే ఫిబ్రవరి 14న అబుదాబీలో స్వామి నారాయణ్ ఆలయాన్ని ప్రారంభిస్తున్నారు.
ఈ ఆలయ నిర్మాణం 2019 డిసెంబర్‌లో ప్రారంభమైంది. ఆలయానికి ఏడు శిఖరాలు, 5 గోపురాలు ఉన్నాయి. ఆలయాన్ని బాప్స్ స్వామినారాయణ సంస్థ నిర్మించింది.
ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బాప్స్ స్వామి నారాయణ్ సంస్థ అధిపతి మహంత్ స్వామి మహరాజ్ నేతృత్వం వహిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అరబ్ దేశాల్లో ఎన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి?
ఇప్పుడు అబుదాబీలో ప్రారంభిస్తున్న ఆలయం అరబ్ ప్రపంచంలోనే మొట్టమొదటి హిందూ ఆలయం అనే ప్రచారం ఒకటి జరుగుతోంది. కానీ.. అరబ్ దేశాలలో ఇంతకుముందు కూడా హిందూ దేవాలయాలున్నాయి.
యూఏఈతో పాటు ఒమన్, బహ్రెయిన్‌లలోనూ హిందూ దేవాలయాలు ఉన్నాయి.
బహ్రెయిన్ రాజధాని మనామాలో నిర్మించిన శ్రీనాథ్‌జీ దేవాలయం శతాబ్దం కిందటిది. భారతదేశ విభజనకు చాలా ఏళ్ల ముందు థట్టా నుంచి వచ్చిన సింధీ కమ్యూనిటీ దీన్ని నిర్మించింది.
సౌదీ అరేబియాలో నివసించే, అక్కడ పని చేసే హిందువులు కూడా పండుగలు, ప్రత్యేక దినాలలో ఈ ఆలయంలో పూజలు చేయడానికి వస్తారు.
ఒమన్ రాజధాని మస్కట్‌లోనూ రెండు హిందూ ఆలయాలున్నాయి. పాత మస్కట్‌లోని ముత్రాహ్ ప్రాంతంలో మోతీశ్వర్ ఆలయం ఉంది.
ఇది 125 ఏళ్ల కిందటిదని చెప్తుంటారు. మధ్య ప్రాచ్యంలోని పురాతన హిందూ ఆలయాలలో ఇది కూడా ఒకటని చెప్తుంటారు.
మస్కట్‌లోని రువీలో కృష్ణ-విష్ణు ఆలయం ఉంది. ఇది 150 ఏళ్ల కిందటిదని చెప్తారు. ఒమన్‌లో స్థిరపడిన గుజరాతీ కమ్యూనిటీతో స్నేహానికి గుర్తుగా ఒమన్ సుల్తాన్ ఈ ఆలయాన్ని నిర్మించారు.
దుబయిలోని భారతీయ సమాజంలో సింధీలు, మరాఠీలు, గుజరాతీ, పంజాబీలతో పాటు దక్షిణ భారతీయులూ చాలామంది ఉంటారు. ఇక్కడా వివిధ ప్రార్థనాస్థలాలున్నాయి.
దుబయి, దాని చుట్టూ ఉన్న నగరాలు, గల్ఫ్‌లోని అనేక ఇతర ప్రాంతాలలో దీపావళి రోజు రాత్రి భారతదేశంలో ఉన్నట్లే ఆకాశమంతా వెలుగుజిలుగులతో నిండిపోతుంది.

ఫొటో సోర్స్, Getty Images
మతం, రాజకీయాలు
నిరంతర కృషి, పట్టుదలతో ముందుకు సాగినప్పుడు ఒక సమాజం తగిన స్థానం దక్కించుకుంటుందనడానికి యూఏఈ సహా గల్ఫ్ దేశాలలో భారతీయుల సమష్టి విజయగాథలు ఉదాహరణ.
భారత మాజీ రాయబారి ఒకరు చెప్పినట్లుగా భారతీయులు తమ హార్డ్ వర్క్ కారణంగా ప్రపంచలోనే ‘ఎంప్లాయీస్ ఆఫ్ చాయిస్’గా మారారు.
అయితే, బలీయమైన జాతీయవాదాన్ని ముందుపెట్టి ఈ సుహృద్భావాన్ని చెడగొట్టడం వంటివి ఈ గుర్తింపును దెబ్బతీస్తాయి. నూపుర్ శర్మ ఉదంతం వంటివి దానికి ఉదాహరణలు.
అరబిక్‌లో భారతీయులందరినీ హిందీస్ అని పిలుస్తారు. హిందువులనే కాదు అన్ని రకాల భారతీయులను అరబిక్‌లో హిందీస్ అనే అంటారు.
ఇక స్వామి నారాయణ్ ఆలయం విషయానికొస్తే ప్రధాని నరేంద్ర మోదీ దీని నిర్మాణంలో ప్రభావవంతమైన పాత్ర పోషించారు. దీన్ని రాజకీయ విజయంగానో, మత విజయంగానో చూస్తే అది సరికాదు.
ప్రస్తుత రోజుల్లో భారత్‌లో మతానికి సంబంధించిన ఏదైనా రాజకీయ అంశంగా మారుతోంది. కానీ, ఇందుకు విరుద్ధంగా అరబ్ ప్రపంచంలో అలాంటిది జరగలేదు.
ప్రపంచంలోని ఈ ప్రాంతంలో మతం ప్రజా జీవితంలో కనిపించొచ్చుగానీ రాజకీయ చర్చలలో మాత్రం పెద్దగా కనిపించదు.

ఫొటో సోర్స్, Getty Images
గల్ఫ్ దేశాల్లో పెరుగుతున్న భారతీయుల ప్రభావం
అరబ్ ప్రపంచం.. ముఖ్యంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ) దేశాలు మారుతున్నాయి. మరోవైపు ఇక్కడి భారతీయ సమాజం కూడా మారుతోంది.
మంచి జీతాలు, మెరుగైన జీవన ప్రమాణాల కోసం అరబ్ దేశాలకు వస్తుంటారు. కొన్నిసార్లు పాశ్చాత్య దేశాలకు వెళ్లినవారు, అక్కడి పౌరసత్వం పొందినవారు కూడా మరింత డబ్బు సంపాదించడం కోసం అరబ్ దేశాలకు వస్తుంటారు.
భారతీయులు గల్ఫ్ దేశాలలో సంపాదించి తిరిగి ఆ డబ్బు పంపడం వల్ల భారత్‌లోని ఎన్నో కుటుంబాల జీవితాలు మారిపోయాయి. కేరళ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో పూరిళ్లు పక్కా ఇళ్లుగా మారడం వెనుక గల్ఫ్ దేశాలకు వెళ్లినవారి కష్టం ఉంది.
గల్ఫ్ ప్రాంతంలో సంపాదించిన డబ్బుతో భారత్‌లో అనేక వ్యాపారాలు ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది కెరీర్ నిర్మితమైంది.
ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలోని భారతీయుల ప్రొఫైల్ కూడా మారింది. ఒకప్పుటిలా వారు గల్ఫ్ దేశాలలోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో కార్మికులు మాత్రమే కారు. డాక్టర్లు, ఇంజినీర్లు, కార్పొరేట్ సంస్థల అధిపతులుగానూ గౌరవం పొందుతున్నారు.
గల్ఫ్ ప్రాంతాలు నిరంతరం కాస్మోపాలిటన్‌గా మారుతున్నాయి, చమురుపై ఆధారపడకుండా హైటెక్ ఆర్థిక వ్యవస్థను సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ మార్పు భారతీయుల ప్రతిభకు, ఐటీ వర్క్‌ఫోర్స్‌కు ఉపయోగకరంగా మారనుంది. మత పరమైన విషయాలు పక్కనపెడితే గల్ఫ్, భారతీయుల మధ్య ఏళ్లుగా బంధం ఏర్పడింది. ఇది భవిష్యత్తులోనూ మరింత బలపడనుంది.

ఫొటో సోర్స్, Getty Images
యూఏఈ వేరు సౌదీ అరేబియా వేరు
ఇక్కడ మరో విషయం కూడా ఉంది. యూఏఈ అనేది రెండు ప్రధాన మసీదులు ఉన్న సౌదీ అరేబియా కాదు. సౌదీ అరేబియా అనేది ఇటీవల కాలంలో ఆధునికీకరణ దిశగా సాగుతున్నప్పటికీ అది దాని సొంత మార్గాన్ని అనుసరించాల్సి ఉంటుంది.
ఇందుకు విరుద్ధంగా యూఏఈ అనేది చిన్న దేశమే అయినా ఏవియేషన్ హబ్‌గా మారడం, రీఎక్స్‌పోర్ట్ బిజినెస్ మోడల్స్ సృష్టించడం, ప్రపంచం నలుమూలల నుంచి ప్రతిభావంతులను ఆహ్వానించడంలో ముందుంది.
ఇతరుల విశ్వాసాలు, అవసరాలు, సున్నితత్వాలను అంగీకరించడం వల్ల ఇదంతా సాధ్యమవుతుంది.
అబుదాబిలోని అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్ దీనికి ఉదాహరణ. ఇందులో మసీదు, చర్చి, ప్రార్థనా మందిరం ఉన్నాయి.
ఈ అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్ ‘విశ్వాసాలలో భిన్నత్వం ఉన్నా మానవత్వం, శాంతిలో ఏకత్వం’ అనేదానికి నిర్వచనంగా ఉంటుంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కాగా అబుదాబి ఆలయ ప్రాజెక్ట్ ప్రకటించిన రోజు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దుబయికి చెందిన ఓ ప్రొఫెషనల్ ట్వీట్ చేస్తూ.. ‘యూఏఈలో చాలా మంది భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆలయం ఎలా పరిష్కరిస్తుంది?’ అని ప్రశ్నించారు.
అయితే, ఆ ట్వీట్ డిలీట్ చేసేవరకు ఆయన్ను ట్రోల్ చేశారు.
గ్రాండ్ షేక్ జాయెద్ మసీదు చుట్టూ ఉన్న ఒక గొప్ప ఆలయం యూఏఈ ఆదరణ స్ఫూర్తిని చాటుతుంది.
అందుకే ఒక గొప్ప దేవాలయాన్ని రాజకీయ విజయం కంటే శాంతి సామరస్యానికి ప్రతీకగా చూడాలి.
ఇవి కూడా చదవండి:
- ఉత్తరాఖండ్ యూసీసీ: 'లివ్-ఇన్ రిలేషన్షిప్'లో ఉన్నవారు రిజిస్ట్రార్‌కు సమాచారం ఇవ్వాలి, లేకుంటే శిక్ష తప్పదంటున్నకొత్త చట్టం
- రేవంత్ రెడ్డి X కేసీఆర్: ముఖ్యమంత్రులు బూతులు మాట్లాడొచ్చా? నేతల దిగజారుడు భాషను ఎలా చూడాలి?
- తమిళనాడు అభివృద్ధి మంత్రమేంటి? ఈ రాష్ట్రాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ ఎందుకు పొగిడింది?
- ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ కాదని రాహుల్ గాంధీ ఎందుకు అన్నారు... బీజేపీ రియాక్షన్ ఏంటి?
- మోదీ ప్రభుత్వం పన్నుల ఆదాయం పంపిణీలో దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














