కంటి శుక్లాలను ఎలా గుర్తించాలి... ఆపరేషన్‌కు ముందు, తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రచిత పుర్బియా
    • హోదా, బీబీసీ కోసం

కంటి శుక్లం ఆపరేషన్ చాలా సున్నితమైన ఆపరేషన్. చిన్న పొరపాటు జరిగినా దాని దుష్ప్రభావాలు ఉంటాయి. ఒక్కోసారి రోగులు చూపును కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.

మరి, కంటి శుక్లాన్ని ఎలా గుర్తించాలి? దాని లక్షణాలేంటి? కంటి శుక్లం ఆపరేషన్‌కు ముందు, ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

కంటి శుక్లం సమస్య ఎలా వస్తుంది?

అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆప్తాల్మాలజీ (నేత్రవైద్యం) ప్రకారం, మన కళ్ళు సహజసిద్ధమైన లెన్స్ (కటకాలు).

కంటి బాహ్య పొర అయిన రెటీనా చాలా సున్నితమైనది, కాంతి పడినప్పుడు స్పందిస్తుంది.

కంటిలోని ఈ సహజ లెన్సులు (కటకాలు) కంటిపై పడే కాంతిని ప్రతిబింబించడం ద్వారా స్పష్టంగా చూడగలుగుతాం. అందువల్ల ఈ లెన్సులు శుభ్రంగా ఉండడం ముఖ్యం.

సాధారణంగా వయసుతో పాటు కంటి శుక్లాలు వృద్ధి చెందుతాయి. నలభై ఏళ్ల తర్వాత కళ్లలో వచ్చే మార్పుల వల్ల కంటి శుక్లాలు వస్తాయి.

కంటి శుక్లం వస్తే కంటి లెన్స్‌‌లోని ఫైబర్లు తెల్లగా మారడం మొదలవుతుంది. దీంతో రోగుల చూపు మసకబారడం ప్రారంభమవుతుంది.

సాధారణంగా వయసు పైబడిన వారిలో ఈ లక్షణాలు మొదలై కొన్నేళ్లకు చూపు మసకబారుతుంది.

కంటి శుక్లం ప్రారంభ దశలలో పెద్దగా సమస్య ఉండదు. మొదట్లో ఇది లెన్స్‌లోని కొంత భాగాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుంది. కానీ, ఈ బూడిద రంగు క్రమంగా పెరిగి లెన్స్ పూర్తిగా ప్రభావితమవుతుంది. అది చూపుపై ప్రభావం చూపుతుంది.

రెటీనాలోకి వచ్చే కాంతి పరిమాణం తగ్గినప్పుడు కంటి చూపు బూదరబూదరగా, అస్పష్టంగా మారుతుంది.

కంటి శుక్లాలు ఒక కంటి నుంచి మరో కంటికి వ్యాప్తి చెందవు. చాలా మందికి రెండు కళ్లలో శుక్లాలు కనిపిస్తాయి.

ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

కంటి శుక్లాలకు అనేక కారణాలు

ఏజ్ రిలేటెడ్ క్యాటరాక్ట్( వయసు సంబంధిత శుక్లం): చాలా వరకూ వయసు ఆధారంగానే కంటి శుక్లాలు వస్తాయి.

కాంజెనిటల్(పుట్టుకతో వచ్చే) కంటి శుక్లం: అప్పుడే పుట్టిన కొందరు శిశువులకు కూడా కంటిశుక్లం ఉండే అవకాశం ఉంది. అలాంటి వారిలో కొందరు పిల్లలకు, కొంత కాలం తర్వాత చూపు సమస్య మొదలవుతుంది. ఇలా పుట్టుకతో వచ్చే శుక్లంతో కొందరికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు, మరికొందరిలో చూపుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి, వాటిని తొలగించాల్సి ఉంటుంది.

సెకండరీ క్యాటరాక్ట్: ఇతర వ్యాధులు, అనారోగ్యాల వల్ల ఈ సెకండరీ క్యాటరాక్ట్ వస్తుంది. ఉదాహరణకు డయాబెటిస్. స్టెరాయిడ్ల వాడకం కూడా సెకండరీ క్యాటరాక్ట్‌కు దారితీయొచ్చు.

ట్రామాటిక్ క్యాటరాక్ట్: ఏదైనా గాయం ఒకటి లేదా రెండు కళ్లలో శుక్లాలకు కారణమవుతుంది. ప్రమాదం జరిగిన తర్వాత, లేదా కొన్నేళ్ల తర్వాత శుక్లాలు రావడం.

ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

వైద్యులు ఎలా గుర్తిస్తారు?

మీకు 60 లేదా, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే ఏడాదికొకసారి, లేదా రెండేళ్లకోసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కంటి పరీక్షలు చాలా సులభం, ఎలాంటి నొప్పి కూడా ఉండదు.

వైద్యులు కళ్లలో కొన్ని చుక్కల మందు వేస్తారు, అప్పుడు కళ్లు స్పష్టంగా తెరుచుకుంటాయి, ఆ తర్వాత కంటి శుక్లం, లేదా ఇతర కంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని వైద్యులు పరీక్షిస్తారు.

ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

కంటిశుక్లం లక్షణాలు

  • చూపు మసకబారడం
  • ఏదైనా వస్తువు బూదరబూదరగా కనిపించడం
  • రాత్రిళ్లు చూపు మందగించడం
  • వెలుతురును చూడలేకపోవడం, లేదా కళ్లు మరింత సున్నితంగా అనిపించడం
  • ప్రకాశవంతమైన రంగులు లేత, పసుపు రంగుల్లో కనిపించడం

ఒకవేళ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కంటి వైద్యులను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఆపరేషన్ ఎలా చేస్తారు?

సహజమైన మన లెన్స్ వల్ల చూపు స్పష్టంగా ఉంటుంది. అయితే, శుక్లాలు ఆ చూపును మసకబారుస్తాయి.

కంటి శుక్లం మూడు రకాలుగా ఉంటుందని సూరత్‌కు చెందిన నేత్రవైద్య నిపుణులు మహేంద్ర చౌహాన్ తెలిపారు.

వాటిలో, లెన్స్ మధ్యలో ఏర్పడే కంటిశుక్లం మొదటి రకం.

లెన్స్‌కు వెనక వైపు శుక్లం ఏర్పడడం రెండో రకం.

కంటి బయటి పొర (కార్టెక్స్)‌లో కంటి శుక్లం ఏర్పడటం మూడో రకం.

''కంటి శుక్లం ఆపరేషన్‌లో శుక్లాన్ని తొలగించి, అక్కడ కృత్రిమ లెన్స్ అమర్చేందుకు కార్నియా అంచున చిన్నకోత అవసరమవుతుంది. కృత్రిమ లెన్స్‌ను ఇంట్రాకోక్యులర్ లెన్స్ అంటారు. ఇంకా సరళంగా చెప్పాలంటే, ఒక చిన్న బంతి లాంటి దానిని(ప్రోబ్) కంటి లోపలికి పంపుతారు. ఆ చిన్న వస్తువు లోపల కదులుతూ, అల్ట్రాసౌండ్ తరంగాలతో శుక్లాన్ని విచ్ఛిన్నం చేసి ద్రవరూపంలో గ్రహిస్తుంది. అదే చిన్న రంధ్రం ద్వారా ఒక ఫోల్డబుల్ లెన్స్‌ను లోపలికి ప్రవేశపెడతారు. ఇది మునుపటి లెన్స్‌ను భర్తీ చేస్తుంది'' అని డాక్టర్ చౌహాన్ బీబీసీతో చెప్పారు.

వివిధ రకాల కృత్రిమ లెన్సులు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. ఉదాహరణకు, డయాగ్నల్ నంబర్ లెన్సెస్, లాంగ్ విజన్ లెన్సెస్, బైఫోకల్ లెన్సెస్ (దూరం, దగ్గరివి చూసేందుకు), ట్రైఫోకల్ లెన్సెస్ (ఏటవాలు, దూరం, దగ్గరివి చూసేందుకు) ఉన్నాయి.

వాటితో పాటు అనేక రకాల లెన్సులు ఉన్నాయి. రోగి కంటి అవసరాలకు అనుగుణంగా వాటిని అమర్చుతారు. వీటి ధర కూడా మారుతుంది.

ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఆపరేషన్‌‌కు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అహ్మదాబాద్‌కు చెందిన కంటివైద్య నిపుణుడు డాక్టర్ పరిమళ్ దేశాయ్, అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆప్తాల్మాలజీ సమాచారం ప్రకారం కంటి శుక్లం ఆపరేషన్‌కు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ:

  • ఆపరేషన్‌కు ముందు బీపీ, షుగర్ నార్మల్‌గా ఉండాలి.
  • హైబీపీ కంట్రోల్‌లో ఉండడం ముఖ్యం.
  • ఎలాంటి యాంటీబయాటిక్స్ తీసుకోకుండా ఉండాలి.
  • ఆపరేషన్‌కు ముందు కంటిలోని సూక్ష్మజీవులను అంతం చేసేందుకు డాక్టర్ కంట్లో యాంటీబయాటిక్ చుక్కల మందు వేస్తారు.

ఆపరేషన్ తర్వాత

ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకునేందుకు పరిశుభ్రత చాలా అవసరమని డాక్టర్ పరిమళ్ చెప్పారు.

ఇన్ఫెక్షన్ల వల్ల కూడా కంటిశుక్లాలు వచ్చే అవకాశం ఉంటుంది. దానిని నివారించేందుకు కొన్ని చిట్కాలు ఇవీ:

  • బీపీ, షుగర్ నార్మల్‌లో ఉండేలా చూసుకోవాలి.
  • రోగి శుభ్రంగా ఉండడంతో పాటు చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
  • సబ్బు కళ్లలోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి.
  • గోళ్లు కత్తిరించుకోవాలి.
  • ఇన్ఫెక్షన్లు నివారించేందుకు ఎప్పుడూ చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి.

ఆపరేషన్ తర్వాత కొందరికి చూపు ఎందుకు పోతుంది?

కంటిశుక్లం ఆపరేషన్ తర్వాత కొందరు చూపు కోల్పోవడానికి ఇన్ఫెక్షనే ప్రధాన కారణమని, అపరిశుభ్రతతో అది సంక్రమిస్తుందని డాక్టర్ మహేంద్ర చౌహాన్ చెప్పారు. సిరంజిల వాడకంలో నిర్లక్ష్యం కూడా కంటి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.

ఇలాంటివి కంటిలో బ్యాక్టీరియా లేదా ఫంగస్ పెరిగేందుకు లేదా కంటిలో మంటకు కారణమవుతాయి. అలాంటి పరిస్థితుల్లో చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. దీనిని ఎండోఫ్తాల్మిటీస్ అంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)