రిటైర్మెంట్ ప్లానింగ్: గ్యారంటీ వడ్డీ స్కీములు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏది మంచిది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఐవీబీ కార్తికేయ
- హోదా, బీబీసీ కోసం
2050 నాటికి మన దేశ జనాభాలో ఎక్కువ శాతం ఉద్యోగం చేసే వయసు దాటిన వారు ఉంటారని సెఫాలజిస్టులు అంచనా వేస్తున్నారు. అనేక మంది నిపుణుల అంచనాల ప్రకారం, భవిష్యత్తులో మన దేశ ప్రభుత్వానికి వచ్చే అతిపెద్ద సమస్య ఏంటంటే, పదవీ విరమణ చేసిన వారి బాగోగులు చూసుకోవడం.
అలాంటి తరుణంలో రిటైర్మెంట్ వయసులో ఉన్న వారి సంక్షేమానికి తగిన పథకాలు రూపొందించడం ఏ ప్రభుత్వానికైనా కత్తిమీదసాము.
అందువల్ల అటు ప్రభుత్వం నుంచి కానీ, ఇటు పని చేసిన సంస్థ నుంచి కానీ వచ్చే ఆర్థిక మద్దతు మీద ఆధారపడకుండా, తమ కంటూ ఒక ప్రత్యేకమైన రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవడం ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారు చేయాల్సిన తెలివైన పని.
దురదృష్టవశాత్తు చాలామంది ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. దీనికి ప్రధాన కారణం అవగాహనా లేమి. గతంలో అనేకసార్లు చెప్పినట్టు జీవిత బీమా, ఆరోగ్య బీమా కూడా రిటైర్మెంట్ ప్లానింగ్ విషయంలో కీలకపాత్ర పోషిస్తాయి.
ప్రతి ఆర్థిక లక్ష్యానికి ఒక విలక్షణమైన గుణం ఉంటుంది. అలాగే రిటైర్మెంట్ ప్లానింగ్ విషయంలో ఉన్న ముఖ్యమైన అంశం కొన్ని దశాబ్దాల తర్వాత అవసరమయ్యే మొత్తం కోసం ఇప్పటి నుంచే మదుపు చేసే అవకాశం ఉండటం.
ఈ కోణంలో చూస్తే మదుపరులకు తమ పోర్ట్ ఫోలియోలో మార్పులు చేసుకునేందుకు తగినంత సమయం ఉంటుంది. మొదటి ఐదేళ్ళు ఎక్కువ రిస్క్ ఉన్న మదుపు మార్గాలలో మదుపు చేసి, అవి తగిన రాబడిని ఇవ్వకపోయినా ఆర్థిక లక్ష్యం దెబ్బతినకుండా మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
అలాగే, ఆరోగ్య బీమా తీసుకోవడం ద్వారా కూడా రిటైర్మెంట్ వయసులో వచ్చే హాస్పిటల్ ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఇలాంటి అవకాశం ఇతర ఆర్థిక లక్ష్యాలలో ఉండదు.
రిటైర్మెంట్ అవసరాలకు మదుపు చేసే సమయంలో గ్యారంటీ ఆదాయం ఇచ్చే మదుపు మార్గాలు అత్యంత ఆకర్షణీయంగా కనిపించడం సహజం. కానీ, అలాంటి మదుపు మార్గాలలో ఎన్నో లోటుపాట్లు ఉంటాయి.
ముఖ్యంగా ఈ గ్యారంటీ ఆదాయం ఇచ్చే పథకాలలో ప్రస్తుతం ఇచ్చే వడ్డీ రేటు పదేళ్ళు లేదా ఇరవై ఏళ్ళ తర్వాత కూడా వర్తిస్తుంది. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం.
ఈ విషయాన్ని కింద ఇచ్చిన ఉదాహరణలో చూద్దాం:

ఫొటో సోర్స్, Getty Images
వయసు: 35
గ్యారంటీ వడ్డీ: 7%
కాలపరిమితి: 20 సంవత్సరాలు
ఈ పథకం ప్రకారం 20 ఏళ్ళ పాటూ మదుపు చేస్తే రిటైర్మెంట్ వయసు వచ్చాక 7% వార్షిక వడ్డీ ఖాతాదారుడికి గ్యారంటీగా అందుతుంది. గ్యారంటీగా 7% వడ్డీ వచ్చే ఈ మదుపు మార్గం చాలా ఉపయోగపడే పథకం లాగా కనిపిస్తుంది.
కానీ, ఇందులో ఉన్న అతి పెద్ద సమస్య కాలానికి అనుగుణంగా మదుపు చేసే అవకాశాన్ని కోల్పోవడం. అంటే 35 ఏళ్ళున్న వ్యక్తికి రిటైర్మెంట్ వయసు మరో పాతిక సంవత్సరాలకు గానీ రాదు. అంటే కనీసం ఒక పదేళ్ళ పాటు ఆ వ్యక్తి అధిక రాబడిని ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర స్టాక్ మార్కెట్ మదుపు మార్గాలను కోల్పోతున్నాడు.
అలాగే 30% పన్ను స్లాబులో ఉన్నవారికి పన్ను కట్టగా నికరంగా వచ్చే వడ్డీ 4.9% మాత్రమే. ఇది ద్రవ్యోల్బణం కంటే కూడా తక్కువ.
అందుకే గ్యారంటీ ఆదాయం అన్న పథకాలలో పదేళ్ళ కంటే ఎక్కువ కాలపరిమితి ఉన్న పథకాలు మన ఆర్థిక లక్ష్యాలకు ఉపయోగపడవు.

ఫొటో సోర్స్, Getty Images
అంతేకాక గ్యారంటీ ఆదాయం ఇచ్చే పథకాలలో తీసుకోవలసిన ఇతర జాగ్రత్తలు ఏమిటో ఒకసారి చూద్దాం.
1. గ్యారంటీ ఆదాయం ఇచ్చే మదుపు మార్గాలలో వస్తున్న వడ్డీ ఎంతో గణించాలి. ద్రవ్యోల్బణం కంటే అధికంగా వడ్డీ ఇచ్చే మదుపు మార్గాలను మాత్రమే ఆర్థిక లక్ష్యాలకు తగినవని గుర్తించాలి.
2. సదరు గ్యారంటీ ఆదాయం మీద పన్ను కట్టాల్సిన అవసరం ఉందా అనే విషయాన్ని పరిశీలించాలి. చాలా మదుపు మార్గాల మీద మన ఆదాయపు పన్ను స్లాబ్ ఆధారంగా పన్ను కట్టాల్సి రావచ్చు. దీని వల్ల గ్యారంటీ అనుకున్న ఆదాయంలో చాలా ఎక్కువ మొత్తం కోత పడుతుంది. వివిధ పథకాల గురించి వచ్చే వ్యాపార ప్రకటనలు ఈ ఆదాయపు పన్ను అంశాన్ని స్పష్టంగా చెప్పవు. 10% పన్ను కట్టే మ్యూచువల్ ఫండ్స్, 30% స్లాబ్ పన్ను కట్టే గ్యారంటీ మదుపు మార్గాల మధ్య ఉండే తేడా గమనించాలి.
3. డెబిట్ మ్యూచువల్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ లాంటి ఫండ్స్ ఇచ్చే రాబడిని గ్యారంటీ రాబడితో పోల్చి చూసుకోవాలి. ఎందుకంటే మదుపు చేసే కాలపరిధి పెరిగినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ కూడా తగ్గుతూ వస్తుంది. ఆ రకంగా చూస్తే మ్యూచువల్ ఫండ్స్ కూడా గ్యారంటీ ఆదాయం అనుకోవడంలో తప్పు లేదు.
4. గ్యారంటీ మదుపు మార్గాలను ఎన్నుకోవడం ద్వారా ఇతర మదుపు మార్గాలను కోల్పోకుండా జాగ్రత్త పడాలి. ఉదాహరణకు మన రిటైర్మెంట్ పోర్ట్ ఫోలియోలో ఎక్కువగా 7% గ్యారంటీ వడ్డీ ఇచ్చే పథకం ఉంటే 12% వడ్డీ ఇచ్చే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మదుపు చేసే అవకాశం కోల్పోతున్నాం అని గుర్తించాలి.
5. గ్యారంటీ ఆదాయం ఇచ్చే మదుపు మార్గాలలో కనిపించే ఆకర్షణ సదరు పథకం చెబుతున్న గ్యారంటీ అనే అంశం. అసలు ఆ కంపెనీ గ్యారంటీ అని గతంలో చెప్పిన పథకాల పనితీరు ఎలా ఉందో పరిశీలించాలి.

ఫొటో సోర్స్, Getty Images
పైన చెప్పిన కారణాల ప్రకారంగా ఆలోచిస్తే రిటైర్మెంట్ అవసరాలకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అన్ని రకాలుగా తగిన మదుపు మార్గం. ఎందుకంటే, దీర్ఘకాల పరిధితో మదుపు చేస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కూడా అతి తక్కువ రిస్క్ కలిగి ఉంటాయి. తద్వారా మనకు కావలసిన ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
మరోవైపు స్థూలంగా చూస్తే గ్యారంటీ రాబడి మాత్రమే కాక ఇలాంటి ఎన్నో పథకాలు మదుపుదార్లను ఆకట్టుకోవడానికి ప్రధాన కారణం రిస్క్-రాబడి మధ్య సంబంధం గురించిన అవగాహన లేకపోవడం.
ఏ మదుపు మార్గమైన ఎంతో కొంత రిస్క్ తప్పకుండా ఉంటుంది. రిస్క్ ఎక్కువ అనగానే పెట్టుబడి నష్టపోతాం అన్న కోణంలో ఆలోచించడం, రాబడి అనగానే మదుపు చేయాలని తపనతో ముందుకు వెళ్ళడం ఏ ఆర్థిక లక్ష్యానైనా అందుకోవడానికీ పనికిరాదు.
మదుపు చేసే వారు స్వతహాగా అధ్యయనం చేసి లేదా వ్యక్తిగత ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహా మేరకు మదుపు చేయడం చెప్పదగిన సూచన.
ఇవి కూడా చదవండి:
- పరీక్షల్లో ‘చీటింగ్’ను అరికట్టేందుకు తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల ఫలితం ఉంటుందా... అసలు ఈ చట్టంలో ఏముంది?
- దివ్య దేశ్‌ముఖ్: చెస్ క్రీడాకారిణులకు ఎదురయ్యే వేధింపులు ఏమిటి? ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్టుపై చర్చ ఎందుకు?
- మోదీ ప్రభుత్వం పన్నుల ఆదాయం పంపిణీలో దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తోందా?
- రేవంత్ రెడ్డి X కేసీఆర్: ముఖ్యమంత్రులు బూతులు మాట్లాడొచ్చా? నేతల దిగజారుడు భాషను ఎలా చూడాలి?
- బీజేపీ 'వైట్ పేపర్' x కాంగ్రెస్ 'బ్లాక్ పేపర్': ఆర్థిక వ్యవస్థ ఎవరి పాలనలో ఎలా ఉంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














