పేటీఎం: ఈ డిజిటల్ పేమెంట్ యాప్ చేసిన తప్పేంటి... ఈ గండం నుంచి అది గట్టెక్కుతుందా?

పేటీఎం

ఫొటో సోర్స్, Getty Images

ముంబయి శివారు ప్రాంతంలోని ఓ కిరాణా దుకాణంలో "పేటీఎం కరో" అనే శబ్దం ఆగిపోయింది. అత్యంత ప్రజాదరణ పొందిన పేటీఎం యాప్ ద్వారా కస్టమర్లు చేసిన చెల్లింపుల గురించి అప్రమత్తం చేసే పేటీఎం సౌండ్‌బాక్స్ దుకాణంలో ఒక మూలకు చేరింది.

దేశంలోని ఎంతోమంది దుకాణదారుల్లో ఈ కిరాణా వ్యాపారి ఒకరు. పేటీఎం చెల్లింపులపై నెలకొన్న అనిశ్చితితో ఇలాంటి వ్యాపారులు డిజిటల్ నగదు సేవలు అందించే ఇతర యాప్‌ల ద్వారా చెల్లింపులు చేయాలని కోరుతున్నారు.

డిజిటల్ వ్యాలెట్, డిజిటల్ నగదు సేవల్లో విప్లవాత్మక మార్పు తెచ్చిన పేటీఎం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభాల్లో ఇదొకటి. ఇది సొంతంగా కొనితెచ్చుకున్న సమస్య.

తరచూ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా సంస్థ పేమెంట్స్ బ్యాంకింగ్ విభాగంపై ఆంక్షలు విధించడం, సంస్థ పర్యవేక్షణ లోపాలు మొత్తం ఆ సంస్థ భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చాయి.

మార్చి 1 నుంచి డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు, వ్యాలెట్ టాప్-అప్‌లు, బిల్లుల చెల్లింపుల వంటి అన్ని సేవలనూ నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత వారం పేటీఎం బ్యాంకింగ్ విభాగానికి ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి ఇన్వెస్టర్ల వందల కోట్ల పెట్టుబడులు ఆవిరైపోయాయి. కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా 2022 మార్చిలో బ్యాంకులు నిషేధం విధించిన తర్వాత, మళ్లీ ఇప్పుడు ఆర్బీఐ ఈ చర్యలకు ఉపక్రమించింది.

కస్టమర్లకు సంబంధించి తప్పుడు సమాచారం సమర్పించడం, సైబర్ సెక్యూరిటీ లోపాలు, మనీలాండరింగ్ వంటి తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనలకు పేటీఎం పాల్పడిందని ఆర్బీఐ గుర్తించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఆర్బీఐ నిబంధనలను పదేపదే ధిక్కరించడంతో పేటీఎం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.

పేటీఎం

ఫొటో సోర్స్, Getty Images

తప్పులను సరిదిద్దుకునేందుకు పేటీఎంకు తగినంత సమయం ఇచ్చినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ తెలిపారు. గురువారం మానెటరీ పాలసీ డెసిషన్ (ద్రవ్య విధాన నిర్ణయం) అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

"ఉల్లంఘనల తీవ్రతను బట్టి ఆర్‌బీఐ చర్యలు ఉంటాయి. వ్యవస్థలో స్థిరత్వం, వినియోగదారుల ప్రయోజనాలకు సంబంధించి సంస్థలు అవసరమైన చర్యలు తీసుకోకపోతే, వాటిపై ఆర్బీఐ చర్యలు తీసుకుంటుది'' అని దాస్ చెప్పారు.

ఆర్బీఐ చర్య రానున్న కొద్దిరోజుల్లోనే పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ కోల్పోయేందుకు సంకేతం కావొచ్చని అదే ఇండస్ట్రీకి చెందిన చాలా మంది నిపుణులు బీబీసీతో తమ అభిప్రాయం చెప్పారు. ఇది పెట్టుబడిదారుల్లో మరింత ఆందోళనను పెంచుతుందన్నారు.

ఆర్బీఐ ఆదేశాల అనంతరం కేవలం మూడు ట్రేడింగ్ సెషన్లలోనే డిజిటల్ పేమెంట్స్ బిజినెస్, డిజిటల్ పేమెంట్స్ బ్యాంక్‌ల మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ మార్కెట్ విలువ 42 శాతం కంటే పైనే ఆవిరైంది. గురువారం ఆర్బీఐ ప్రకటనతో కంపెనీ స్టాక్స్ ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి.

పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఒకప్పుడు దేశంలో అత్యంత చిన్నవయస్కుడైన బిలియనీర్‌గా పేరుపొందారు. ఉద్యోగులకు, ఇన్వెస్టర్లకు, వ్యాపారులకు భరోసా కల్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. శర్మ ఆర్బీఐ అధికారులను కలిశారని, సాయం కోసం కేంద్ర ఆర్థిక మంత్రిని కూడా సంప్రదించారని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.

ఆడంబరంగా వ్యవహరించే శర్మకు వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోలతో మొదటి పేజీ ప్రకటనలిచ్చి విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ, ఈ సంక్షోభం సంస్థ అస్తిత్వానికే ముప్పుగా పరిణమించింది.

“పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కి సంబంధించి ఇటీవల ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాలను అంగీకరించడంతో పాటు వాటిని సీరియస్‌గా పరిశీలిస్తున్నాం. ఆర్బీఐ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. అలాగే, ఆర్బీఐ లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం'' అని బీబీసీ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ పేటీఎం ప్రతినిధి చెప్పారు.

ఫిబ్రవరి 5న స్టాక్ మార్కెట్‌కి ఇచ్చిన వివరణలో కంపెనీ లేదా దాని అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ద్వారా విదేశీ మారకపు నిబంధనలను ఉల్లంఘించినట్లు వస్తున్న వార్తలను కంపెనీ ఖండించింది.

పేటీఎం

ఫొటో సోర్స్, Getty Images

2018 నుంచి వరుస ఉల్లంఘనలపై ఇప్పటి వరకూ నాలుగు సార్లు ఆర్బీఐ కంపెనీకి హెచ్చరికలు చేసింది.

''ఏదైనా పరిష్కారం లభిస్తే ఫర్వాలేదు, కానీ ఇది ఇబ్బందికరమే. పేటీఎంపై ఆర్బీఐ నమ్మకం కోల్పోయింది'' అని కార్పొరేట్ సలహాదారు, ఆర్థిక సేవల నిపుణులు శ్రీనాథ్ శ్రీధరన్ అన్నారు.

భారత్‌కు చెందిన అతిపెద్ద స్టార్టప్ కంపెనీలలో ఒకటైన ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ దాదాపుగా పతనానికి చేరువైంది. ఇప్పుడు ఈ పేటీఎం సంక్షోభం, హైప్రొఫైల్ స్టార్టప్స్‌ విషయంలో కార్పొరేట్ గవర్నెన్స్, నిబంధనల అమలు వంటివి ప్రథమ ప్రాధాన్యంగా లేవనే ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి.

2010లో ప్రారంభమైన పేటీఎం అనతికాలంలోనే డిజిటల్ లావాదేవీలకు పర్యాయపదంగా మారింది. 2016లో పెద్దనోట్ల రద్దు సమయంలో కంపెనీ సంపద అమాంతం పెరిగింది. నోట్ల రద్దు నిర్ణయం నగదుకు బదులు డిజిటల్ లావాదేవీలను భారీగా పెంచింది. ప్రస్తుతం 33 కోట్ల పేటీఎం వ్యాలెట్లు ఉన్నాయి. వాటి ద్వారా కస్టమర్లు గృహోపకరణాలు, రిక్షా రైడ్‌ల నుంచి సేవల బిల్లుల వరకూ ఎలాంటి చెల్లింపులైనా చేయొచ్చు. జపనీస్ టెక్నాలజీ ఇన్వెస్టర్ సాఫ్ట్‌బ్యాంక్‌తో పాటు, కంపెనీ ప్రారంభ సమయంలో వారెన్ బఫెట్, అలీబాబా కూడా పేటీఎంలో పెట్టుబడులు పెట్టారు.

ప్రస్తుత సంక్షోభానికి కేంద్రమైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు 2017లో లైసెన్స్ మంజూరైంది. ఈ బ్యాంకులో 2 లక్షల రూపాయల వరకూ డిపాజిట్లు తీసుకోవచ్చు. కానీ రుణాలు ఇవ్వకూడదు. ఇందులో ఉన్న నగదుతో యాప్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. అలాగే, థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్, రుణాలను కూడా విక్రయిస్తుంది ఈ కంపెనీ. పేటీఎం యాప్ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు స్వీకరించే వ్యాపారులతో సహా, ఈ బ్యాంక్‌లో 5 కోట్ల అకౌంట్లు ఉన్నాయి.

పేమెంట్స్ యాప్ బిజినెస్‌పై ఈ ఆదేశాల ప్రభావం లేకపోయినప్పటికీ, వీటి పర్యవసానంగా వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పేటీఎం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సీఈవో విజయ్ శేఖర్ శర్మ

పేటీఎం ఆదాయంలో సగానికి పైగా ఆదాయం ఆర్జించి పెడుతున్న పేటీఎం మర్చంట్ పేమెంట్స్ బిజినెస్‌‌కి బ్యాక్ ఎండ్ సపోర్ట్ కోసం థర్డ్ పార్టీ బ్యాంకులను అన్వేషిస్తున్నట్లు ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చేందుకు చేసిన ప్రకటనలో శర్మ చెప్పారు.

ఇది పేటీఎంని థర్డ్ పార్టీ యాప్‌గా మారుస్తుంది. అప్పుడు డిపాజిట్లు, లావాదేవీలపై వచ్చిన ఆదాయాన్ని భాగస్వామి బ్యాంకులతో పంచుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న కంపెనీ మరిన్ని నష్టాలను భరించాల్సి వస్తుంది.

''ఇప్పుడిది మనుగడ కోసం పోరాటం. లాభాలు వచ్చేందుకు మరింత కాలం పట్టొచ్చు'' అని ముంబయికి చెందిన బ్రోకరేజీ విశ్లేషకులు చెప్పారు.

స్టాక్ మార్కెట్ లిస్టింగ్ అయిన తర్వాత రెండేళ్లలో కంపెనీ దాదాపు 80 శాతం మార్కెట్ విలువను కోల్పోయింది.

ఆర్బీఐతో ఇబ్బందికర వాతావరణం, నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాల వల్ల బ్యాంకింగ్ పార్టనర్‌తో ఒప్పందం కూడా అంత సులభం కాకపోవచ్చు.

అయితే, ''పేటీఎం పూర్తిగా పనిచేస్తుంది, మా సేవలకు ఎలాంటి ఇబ్బందీ లేదు'' అని పేటీఎం ఒక ప్రకటనలో తెలిపింది.

పేటీఎం

ఫొటో సోర్స్, MONEY SHARMA/AFP/GETTY IMAGES

కస్టమర్లను నిలుపుకోవడం, చెల్లింపులు, లోన్ ఉత్పత్తులు విక్రయించగలిగే సామర్థ్యం తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఆర్బీఐ ఆదేశాలతో వ్యాపారుల సంఘం సీఏఐటీ పేటీఎం నుంచి ఇతర పేమెంట్స్ యాప్‌లకు మారాలని ఇప్పటికే సూచించింది. ప్రత్యర్థి సంస్థలు కూడా వేగంగా అడుగులు వేస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ఇతర బ్యాంకులు ఇప్పటికే కొత్త క్యూఆర్ కోడ్‌లు, పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్లతో వ్యాపారుల వద్దకు వెళ్తున్నాయి.

ఆర్బీఐ ఆదేశాల తర్వాత పేటీఎం యాప్ డౌన్‌లోడ్‌లలో 20 శాతం క్షీణతను సెన్సార్ టవర్ డేటా చూపిస్తోంది. గూగుల్ పే, ఫోన్ పే వంటి పోటీ యాప్‌ల డౌన్‌లోడ్‌లు 50 శాతం పెరిగినట్లు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.

మార్కెట్ పోటీని తట్టుకుని నిలబడాలంటే రెప్యుటేషన్ కీలకం. ''ప్రభుత్వ నిబంధనల విషయంలో తలెత్తే ఆందోళనలు వ్యాపారంపై ప్రభావం చూపుతాయి. రుణ వ్యాపారం కూడా సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది'' అని బ్రోకరేజీ సంస్థ జెఫెరీస్ పేర్కొంది.

ఆర్బీఐ చర్యలు పేటీఎంతో పాటు ఆ కంపెనీకి మద్దతుగా నిలుస్తున్న చాలా స్టార్టప్ కంపెనీల్లో అలజడి సృష్టించాయి. ఈ చర్యలు ఫైనాన్స్ వ్యాపార వాతావరణానికి విఘాతం కలిగించే అవకాశం ఉందని, పేటీఎంపై ఆంక్షలను వెనక్కి తీసుకోవాలని అభ్యర్థిస్తూ స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకుల సమూహం ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి, ఆర్బీఐకి లేఖలు రాసింది.

అందుకు ''ఇది ఒక సంస్థకు సంబంధించిన సమస్య'', మొత్తం వ్యవస్థ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు.

నిబంధనలు పాటించకపోతే ఎంతపెద్ద కంపెనీ అయినా తమ కార్యకలాపాలను నిలిపివేయాల్సి వస్తుందని ఆర్బీఐ సంకేతాలు పంపిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి: