ESG ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏమిటి... ఈ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు వస్తాయా?

పర్సనల్ ఫైనాన్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఐవీబీ కార్తికేయ
    • హోదా, బీబీసీ కోసం

మదుపు ప్రధాన ధ్యేయం లాభం సంపాదించడం. అందుకే మదుపరులు సహజంగా ఏ మదుపు మార్గాలలో ఎక్కువ లాభం వస్తే అటు వైపు మొగ్గు చూపుతారు. కంపెనీల యాజమాన్యాలు కూడా మదుపరుల నమ్మకం చూరగొనడానికి అన్ని విధాల ప్రయత్నిస్తుంటాయి.

తమ సంస్థ కార్యకలాపాల గురించి పారదర్శకంగా ఉండటం మదుపరులలో నమ్మకం పెంచడానికి ఒక సులువైన మార్గం. మార్గదర్శకాలు రూపొందించే సెబీ లాంటి సంస్థలు కూడా కంపెనీలు ఎలాంటి విషయాలు తమ వార్షిక నివేదికలో తప్పనిసరిగా బహిర్గతం చెయ్యాలో స్పష్టంగా పేర్కొన్నాయి.

నిబంధనలకు అనుగుణంగా సమర్పించే వివరాలు కాకుండా కంపెనీల యాజమాన్యాలు మరిన్ని వివరాలు చొరవగా మదుపరులకు తెలియజేస్తున్నారు. తమ సామాజిక బాధ్యత, విపత్తు సమయాల్లో తాము పాల్గొన్న సహాయ కార్యక్రమాలు లాంటి విషయాలు మదుపరుల దృష్టి తీసుకు వచ్చేందుకు కంపెనీలు శ్రద్ధ పెడుతున్నాయి.

దీనికి కారణం ఇటీవలి కాలంలో తాము నమ్మిన విలువలకు అనుసంధానంగా ఉన్న కంపెనీలలో మదుపు చేయడానికి ప్రాధాన్యం ఇచ్చే ధోరణి పెరిగింది. ఈ ధోరణికి అనుగుణంగా కంపెనీలు కూడా తాము నమ్మిన విలువ గురించి, తాము పాటించే పద్దతుల గురించి మదుపరులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాయి. అలా వాడుకలోకి వచ్చిందే ఈ.ఎస్.జి. ఇన్వెస్టింగ్.

ఈఎస్‌జీ ఇన్వెస్టింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మంచి కంపెనీలలో పెట్టుబడి పెట్టాలని ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కోరుకుంటారు.

ఈ.ఎస్.జి. ఇన్వెస్టింగ్ నేపథ్యం ఏమిటి?

పర్యావరణ, సామాజిక, గవర్నెన్స్ ప్రాతిపదికన తమ ఆలోచనలు ఏమిటో మదుపరులకు పారదర్శకంగా తెలియచేస్తున్న కంపెనీలలో పెట్టుబడి పెట్టడాన్ని ఈ.ఎస్.జి. ఇన్వెస్టింగ్ (ఎన్విరాన్‌మెంట్, సోషల్, గవర్నెన్స్ ఇన్వెస్టింగ్ ) అంటారు.

నిజానికి ఈ ఆలోచనా ధోరణి 1960ల నుంచీ ఉంది. అప్పట్లో సోషల్ రెస్పాన్సిబుల్ ఇన్వెస్టింగ్ (ఎస్ఆర్‌ఐ) అనేవారు. తర్వాత కాలంలో ఈఎస్‌జీ అనే పేరు మీద ప్రాచుర్యం పొందింది.

ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచం నలుమూలలా జరుగుతున్న విషయాల మీద సదరు కంపెనీ యాజమాన్యపు ఆలోచన ఏంటి అనే విషయానికి మదుపరులు ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్, ఘర్షణలు, కరువు కాటకాలు ఇలాంటి సమస్యల పట్ల కంపెనీలు ఎలా స్పందిస్తున్నాయి అనే విషయం మదుపరులు తెలుసుకోవాలని అనుకుంటున్నారు.

ఉదాహరణకు, 2015 చెన్నై వరదల సమయంలో ఓలా కంపెనీ తమ యాప్ ద్వారా వరదల్లో చిక్కుకున్న వారికి సమీపంలో పడవ సహాయం అందజేయడంలో సాయపడింది.

కోవిడ్ సమయంలో ఎన్నో ఫ్యాక్టరీలు తమ కార్యకలాపాలు తాత్కాలికంగా ఆపేసి తమ యంత్ర సామగ్రిని పీపీఈ కిట్లు, ఇతర వైద్య సామగ్రి తయారు చేయడానికి వాడారు.

ఇలా సామాజిక బాధ్యత చూపించిన కంపెనీల పట్ల సహజంగా మదుపరులలో గౌరవ భావం పెరుగుతుంది. మరోవైపు గవర్నెన్స్ విషయంలో పారదర్శకత పాటించడం మదుపరులకు సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది.

2008లో ఎస్&పీ ఈఎస్జీ ఇండెక్స్ పేరు మీద క్రిసిల్ ఒక సూచీ విడుదల చేసింది. ఈ సూచీ ద్వారా సదరు కంపెనీ ఎంత పారదర్శకంగా ఉంది అనే విషయం మదుపరులకు తెలుస్తుంది.

ప్రస్తుతం ఆ సూచీలో ఎన్నో ప్రముఖ కంపెనీలు భాగంగా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్, యాపిల్, డెల్, హెచ్‌పీ లాంటి కంపెనీలు పర్యావరణం పట్ల తమ బాధ్యతను ఎలా నిర్వర్తిస్తున్నాయో మదుపరులకు తెలియజేయడానికి వార్షిక నివేదికలో ఆ వివరాలు ఇస్తున్నాయి.

ఈ.ఎస్.జి. కంపెనీలలో మదుపు చేయడం నిజంగా లాభదాయకమా?

పైన చెప్పుకున్నట్టు ఎలాంటి మదుపు చేసినా దాని ప్రధాన ఉద్దేశం లాభాపేక్ష మాత్రమే. అలాంటప్పుడు ఒక మదుపరిగా ఈ.ఎస్.జి. కంపెనీలలో మదుపు చేస్తే వచ్చే ప్రత్యేక ఉపయోగం ఏమిటి అనేది సహజంగా వచ్చే ప్రశ్న. దానికి సమాధానంగా కింద ఇచ్చిన అంశాలను పరిశీలిద్దాం.

ఈఎస్‌జీ ఇన్వెస్టింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ముందు అనేక విషయాలు పరిశీలించాలి.

పర్యావరణం విషయంలో కంపెనీల పనితీరు

గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమనీనదాలు కరగడం, భూమి ఉష్ణోగ్రత పెరగడం ఇటీవలి కాలంలో చూస్తున్నాం. పారిశ్రామిక ప్రగతి ఇలాంటి పర్యావరణ సమస్యలకు కారణం అని అనేక ప్రభుత్వాలు నమ్ముతూ కంపెనీల కార్యకలాపాల మీద అంక్షలు విధించాయి.

పర్యావరణ సమతౌల్యం కోసం కంపెనీల కార్యకలాపాలను నియంత్రించేందుకు అనేక నిబంధనలను రూపొందించాయి. ఈ నిబంధలను పాటించకపోతే కంపెనీల మీద పడే ఆర్థిక భారం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతే కాక కంపెనీలను పూర్తిగా మూసేసే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది.

ఇలాంటి తరుణంలో పర్యవరణ సహితంగా కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలలో మదుపు చేయడం చెప్పదగిన సూచన. దీని వల్ల మదుపరులు పెట్టుబడి కోల్పోయే అవకాశం ఉండదు.

ఈఎస్‌జీ ఇన్వెస్టింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అన్ని వర్గాల వారికి ఉపాధి ఇవ్వడం సోషల్ రెస్పాన్సిబిలిటీగా భావిస్తారు.

సామాజిక దృక్పథం

సామాజిక అంశాలపై కంపెనీల దృక్పథాన్ని మదుపరులు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఎలాంటి వివక్ష లేని సమాజానికి కట్టుబడి ఉండటానికి వివిధ కంపెనీలు కృషి చేస్తున్నాయి.

దీనికి కారణం అమానవీయ శక్తులను ప్రోత్సహించే కంపెనీలలో మదుపు చేయడం ద్వారా ఆ శక్తులను ప్రోత్సాహం కలుగుతోంది అని మదుపరులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం అనేక ప్రముఖ కంపెనీలు తాము అన్నివర్గాల వారికి సమానంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటిస్తున్నాయి. అలాగే కొన్ని వర్గాల వారికి తగినంత ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రత్యేక జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాయి.

ఇలాంటి కంపెనీలు సమాజంలోని వివిధ వర్గాలకు తమ సేవలు, ఉత్పత్తుల ద్వారా సులభంగా చేరుకుంటాయి. ఆ విధంగా ఇతర కంపెనీల కంటే లాభార్జన చేసే అవకాశం ఈ కంపెనీలకు ఎక్కువ.

విశాల సామాజిక దృక్పథం ఉన్న కంపెనీల పనితీరు మిగిలిన వాటి కంటే మెరుగ్గా ఉందనే విషయం హార్వర్డ్ బిజినెస్ స్కూల్, ఐఎంఎఫ్ లాంటి సంస్థలు చేసిన అనేక అధ్యయనాలలో తేలింది.

ఈఎస్‌జీ ఇన్వెస్టింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిబంధనలు పాటించే సంస్థలపై మదుపరులకు విశ్వాసం పెరుగుతుంది.

గవర్నెన్స్ విషయంలో పారదర్శకత

స్టాక్ మార్కెట్ అనే ప్రపంచంలో ఎందరో తమ మేధాశక్తితో విలువను సృష్టించారు. మరోవైపు ఎందరో తమ దురాశతో, పెడబుద్ధితో మదుపరులను మోసం చేశారు.

దాదాపు ప్రతి పెద్ద స్కాం బయటపడ్డ తర్వాత సెబీ నిబంధనల్లో మార్పులు రావడం ఇప్పటిదాకా చూశాం. ఇలాంటి తరుణంలో ఏదైనా కంపెనీ చొరవగా గవర్నెన్స్ విషయాలు మదుపరులకు తెలియజేస్తోంది అంటే ఆ కంపెనీలో స్కాం జరిగే ఆస్కారం తక్కువని అర్థం చేసుకోవాలి.

టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి ఐటీ దిగ్గజాలైన, ఎల్ & టీ లాంటి మౌలిక వసతుల కంపెనీలైనా మార్కెట్లో తమ మీద నమ్మకం పెరగడానికి తమ కార్యకలాపాల గురించిన ఎన్నో విషయాలు మదుపరులతో పంచుకుంటున్నాయి.

ఈ కంపెనీలన్నీ కొన్ని దశాబ్దాలుగా మదుపరులకు ఎంతో రాబడిని అర్జించిపెట్టాయి. సెన్సెక్స్-30, నిఫ్టీ-50 లాంటి ముఖ్యమైన సూచీల్లో స్థానం దక్కించుకోవాలంటే కంపెనీలు గవర్నెన్స్ విషయంలో ఎంతో పారదర్శకత పాటించాలి.

ఇండెక్స్ ఫండ్స్ ప్రాచుర్యంలోకి రావడానికి ఇది ఒక కారణం. ఆ కంపెనీల పనితీరును సదరు ఇండెక్స్ సంస్థలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాయి కాబట్టి సహజంగా రిస్క్ తక్కువ.

(నోట్: ఈ కథనం నిర్దిష్టమైన అంశంపై స్థూలమైన అవగాహన కోసం మాత్రమే. నిర్ణయాలు మీ వ్యక్తిగత ఆర్థిక సలహాదారులను సంప్రదించి తీసుకోవాలి.)

వీడియో క్యాప్షన్, మ్యూచువల్ ఫండ్స్ డబ్బుతో ఇల్లు కొనడం మంచిదేనా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)