IPC 498: గృహహింస చట్టాన్నిమహిళలు దుర్వినియోగం చేస్తూ 'లీగల్ టెర్రర్' సృష్టిస్తున్నారా?

చట్టం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఉమంగ్ పొద్దార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 498 ఏ దుర్వినియోగం అవుతోందని ఇటీవల ఏడు కేసుల్లో వివిధ హైకోర్టులు విచారం వ్యక్తం చేశాయి.

పెళ్లయిన మహిళలకు గృహ హింస నుంచి రక్షణ కల్పించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.

ఈ సెక్షన్‌పై కోర్టులు చేసిన వ్యాఖ్యలపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వ్యాఖ్యల అర్థం చట్టం దుర్వినియోగం అవుతుందన్న వాస్తవాన్ని గుర్తించడమేనని పురుషుల హక్కుల సంఘాలు ఒకవైపు చెబుతున్నాయి.

మరోవైపు, కోర్టులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల మహిళా న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు విచారం వ్యక్తం చేస్తున్నారు.

చట్టాన్ని అమలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందువల్ల దానిని తప్పుగా చిత్రీకరిస్తున్నారని వారు అంటున్నారు.

చట్టం

ఫొటో సోర్స్, Getty Images

కోర్టులు ఏమన్నాయి?

498 ఏ సెక్షన్‌ను దుర్వినియోగం చేయడం ద్వారా మహిళలు 'లీగల్ టెర్రర్' సృష్టిస్తున్నారని కలకత్తా హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతకుముందు సుప్రీం కోర్టు కూడా ఇలాంటి పదబంధాన్ని ఉపయోగించింది.

ఇలాంటి కేసుల్లో భర్త తరఫు బంధువులందరినీ కూడా నిందితులుగా చూపుతున్నారని, భార్యాభర్తలకు దూరంగా ఎక్కడో నివాసం ఉంటున్న వారిని కూడా చేర్చుతున్నారని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది.

భర్త, అతని కుటుంబ సభ్యులపై పెట్టిన కేసును కోర్టు కొట్టివేసింది.

చాలా సందర్భాల్లో, ఇలాంటి కేసుల్లో చేస్తున్న ఆరోపణలు కూడా సాధారణమైనవి, అలాగే అస్పష్టమైనవని కోర్టులు రికార్డుల్లో నమోదు చేశాయి. కలకత్తా హైకోర్టులో విచారణ జరిగిన కేసులో హింసకు పాల్పడినట్లు నిరూపించేందుకు సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు పేర్కొంది.

ఉదాహరణకు, భార్య ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో గాయాల గురించి ప్రస్తావించకపోవడం.

ఉత్తర్‌ప్రదేశ్‌లో నమోదైన కేసులో రూ.50 లక్షలు కట్నం తీసుకురావాలని తన మామ డిమాండ్ చేశారని, అంత డబ్బు తీసుకురాకపోవడంతో తన భర్త, మామ కలిసి దాడి చేసి కొట్టారని భార్య ఆరోపించింది. తనకు ఇష్టం లేకుండా సెక్స్ చేయాలని ఒత్తిడి చేశారని ఆరోపణలు చేసింది.

అయితే, ఈ కేసులో శారీరక హింస, వరకట్న డిమాండ్‌కు సంబంధించి భార్య ఇచ్చిన వాంగ్మూలంలో తేడాలున్నాయని, అందువల్ల భర్త కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవడం కోసమే ఈ కేసు పెట్టినట్లు భావిస్తున్నట్టు కోర్టు పేర్కొంది.

దానితో పాటు, అత్తమామలు చాలా తక్కువ కాలమే ఆమెతో కలిసి ఉన్నారు. అందువల్ల అత్తమామలపై పెట్టిన కేసును కోర్టు కొట్టివేసింది. భర్తపై మాత్రమే కేసు కొనసాగుతోంది.

గుజరాత్‌లో జరిగిన ఒక కేసులో, భార్య తన 86 ఏళ్ల అత్తపై కేసు పెట్టడం భర్తను వేధించేందుకేనని కోర్టు పేర్కొంది.

ఆమెపై చేసిన ఆరోపణలు సాధారణమైనవేనని, భర్తపై కేసు కొనసాగుతుందని పేర్కొంటూ అత్తపై కేసును కొట్టివేసింది.

గృహ హింసను అరికట్టేందుకు తెచ్చిన ఈ చట్టం సామాజిక నిర్మాణంలో కూడా అడ్డంకులు సృష్టిస్తోందని కోర్టు పేర్కొంది.

పెళ్లికి సంబంధించిన ప్రతి కేసును వరకట్న వేధింపుల ఆరోపణలతో పెద్దది చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. అందుకే చాలా మంది జంటలు ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు లేని సహజీవనాన్ని ఎంచుకుంటున్నాయని పేర్కొంది.

ఈ చట్టం ఇలాగే దుర్వినియోగమవుతూ పోతే అది కచ్చితం వివాహ వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.

చట్టం

ఫొటో సోర్స్, Getty Images

చట్టం ఉద్దేశమేంటి?

భార్యలపై హింస, వరకట్న సంబంధిత మరణాల కేసులు పెరగడంతో 1983లో 498 ఏ సెక్షన్ భారతీయ శిక్షాస్మృతిలో చేర్చారు.

భర్త, అతని కుటుంబ సభ్యులు భార్యను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడితే ఈ చట్టం ప్రకారం మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు.

ఈ సెక్షన్ నాన్‌బెయిలబుల్. అంటే, ఈ కేసులో బెయిల్ వెంటనే రాదు, అలాగే వారెంట్ లేకుండానే పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేయొచ్చు.

ఈ చట్టం కేవలం వరకట్నం వేధింపుల నుంచే కాకుండా క్రూరమైన హింస నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది.

క్రూరత్వం అంటే వరకట్నం తీసుకురావాలని మహిళను వేధించడం, లేదా మానసిక, శారీరక వేధింపులు, మహిళను ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పడం వంటివి వస్తాయి.

గత కొన్నేళ్లుగా ఈ సెక్షన్ దుర్వినియోగాన్ని నివారించేందుకు కోర్టులు అనేక ఆదేశాలిచ్చాయి.

వివాహ సంబంధమైన, లేదా కుటుంబ వ్యహారాలకు సంబంధించి కేసు నమోదు చేసే ముందు పోలీసులు ప్రాథమిక విచారణ జరపాలని సుప్రీం కోర్టు 2008లో ఆదేశించింది.

2014లో ఒక 498ఏ కేసులో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.

ఆ సందర్భంలో, అరెస్టు చేసే ముందు పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వాలని, ఆ తర్వాత మేజిస్ట్రేట్ అనుమతించాకే అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు చెప్పింది.

ఇలాంటి కేసులను పరిశీలించి, పరిష్కారం చూపేందుకు ప్రతి జిల్లాలో కుటుంబ సంక్షేమ కమిటీ(ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ) ఉండాలని సుప్రీం కోర్టు 2017లో ఆదేశాలు జారీ చేసింది.

చట్టం

ఫొటో సోర్స్, Getty Images

దుర్వినియోగమవుతోందా?

ఈ చట్టం దుర్వినియోగంపై హైకోర్టులు చేసిన వ్యాఖ్యలను పురుషుల హక్కుల సంఘాలు సమర్థిస్తున్నాయి.

''ఒక్క వాంగ్మూలంతో భర్త, అతని కుటుంబ సభ్యులు జైలుపాలవుతున్నారు. వారి కెరీర్, ఆత్మవిశ్వాసం, బతుకుదెరువు అన్నీ నాశనమవుతున్నాయి'' అని మెన్స్ వెల్ఫేర్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు అమిత్ లఖాని చెప్పారు.

చాలా ఏళ్ల తర్వాత వారిలో చాలా మంది నిర్దోషులుగా విడుదల అవుతున్నారని, అది వారికి న్యాయం జరగకపోవడాన్ని తెలియజేస్తోందన్నారు.

లింగ సమానత్వం చట్టాలు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

''చట్టం సరైనదే. కానీ తప్పుడు ఆరోపణలు చేయడాన్నే మేం వ్యతిరేకిస్తున్నాం'' అని ఆల్ ఇండియా యాంటీ వైఫ్ టార్చర్ అసోసియేషన్ అధ్యక్షులు దశరథ్ దేవ్‌రా అభిప్రాయపడ్డారు.

కొన్ని కేసుల్లో భార్యను భర్త వేధిస్తే, 'మొత్తం కుటుంబంపై కేసు పెడుతున్నారు' అని ఆయన అన్నారు.

ఈ కేసుల్లో నేరం రుజువైన సంఘటనలు చాలా తక్కువగా ఉండడమే 498ఏ సెక్షన్ దుర్వినియోగం అవుతుందనడానికి నిదర్శనమనే వాదనలు ఉన్నాయి.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం, 498ఏ కేసుల్లో విచారణ అనంతరం దోషులకు శిక్షలు పడిన కేసులు కేవలం 17 శాతంగా ఉంది. హత్య కేసుల్లో అది 42 శాతంగా ఉంది.

నేరం రుజువైన కేసుల సంఖ్య ప్రకారం, 498ఏ కేసుల్లో ఎక్కువ శాతం తప్పుడు ఆరోపణలతో పెట్టినవేనని పురుషుల హక్కుల సంఘాల కార్యకర్తలు వాదిస్తున్నారు.

చట్టం

ఫొటో సోర్స్, Getty Images

అవి తప్పుడు కేసులా?

ఈ సెక్షన్ దుర్వినియోగం కావడం లేదని పలువురు న్యాయవాదులు, ఈ రంగంలో పరిశోధన చేస్తున్న వారు చెబుతున్నప్పటికీ, నేరారోపణలు రుజువై శిక్షలు పడిన వారి శాతం క్షేత్రస్థాయిలో వాస్తవిక పరిస్థితిని తప్పుగా చూపుతోంది.

''సెక్షన్ దుర్వినియోగం అవుతుందనే వాదనలతో నేను ఏకీభవించను. నిజానికి 498ఏ కేసు చాలా కష్టమైన పని'' అని దిల్లీకి చెందిన క్రిమినల్ లాయర్ అపర్ణ భట్ చెప్పారు.

లీగల్ టెర్రర్ అనే పదం వాడడం స్టీరియోటైపింగ్‌కి ఉదాహరణ లాంటిదని, ఒక విషయాన్ని సాధారణంగా మార్చే ప్రక్రియ లాంటిదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కి ఇటీవల సీనియర్ న్యాయవాది, మహిళా హక్కుల నిపుణులు ఇందిరా జైసింగ్ లేఖ కూడా రాశారు.

498ఏ కేసులు దుర్వినియోగం అవుతున్నాయన్న వాదనలను మహిళలపై హింసకు వ్యతిరేకంగా విస్తృతంగా కృషి చేసిన బల్వంత్ సింగ్ తోసిపుచ్చారు. ఆయన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సెస్, రిసోర్స్ సెంటర్ ఫర్ ఇంటర్వెన్షన్ ఆన్ వయొలెన్స్ అగనెస్ట్ ఉమెన్ కన్వీనర్‌గానూ ఉన్నారు.

అలాగే, రాజస్థాన్‌లోని నాలుగు పోలీస్ స్టేషన్లలో 498ఏ సెక్షన్ కింద నమోదైన 300 కేసులపై జరిగిన అధ్యయనంలోనూ ఆయన పాల్గొన్నారు.

ఈ కేసులు కోర్టుకు రాకముందే మూతపడ్డాయి. పోలీసులు వాటిని తప్పుడు కేసులు, అపార్థాల ఫలితంగా పెట్టిన కేసులుగా పేర్కొన్నారు.

''ఇలా మూసివేసిన కేసుల్లో చాలా మంది మహిళలు తమ భర్తలు, అత్తమామల నుంచి వేధింపులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధ్యయనంలో తేలింది'' అని బల్వంత్ సింగ్ చెప్పారు.

''498ఏ సెక్షన్ దుర్వినియోగం అవుతుందనే భావనకు కేసులో నిందితులు, బాధితుల పితృస్వామ్య ఆలోచనలే కారణం. పోలీసులు ఈ కేసులను వ్యక్తిగత వివాదాలుగా పరిగణిస్తున్నారు'' అని ఆయన చెప్పారు.

చట్టం

ఫొటో సోర్స్, Getty Images

498ఏ అమల్లో ఇబ్బందులు

సెక్షన్ 498ఏ కింద కేసు నమోదు చేయడం కూడా కష్టమేనని, ఎందుకంటే కేసు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయడానికి ముందే పోలీసులు దానిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారని అపర్ణ భట్ చెప్పారు.

ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ముందు పోలీసులు రాజీ చేసేందుకు ప్రయత్నిస్తారని, కుటుంబాలను కాపాడుకోవాలని దంపతులకు సలహా ఇస్తున్నారని గత నివేదికలు కూడా వెల్లడిస్తున్నాయి.

చాలా సందర్భాల్లో, శారీరక వేధింపులకు సంబంధించి స్పష్టమైన సంకేతాలు ఉంటేనే పోలీసులు ఫిర్యాదు నమోదు చేస్తారు.

''ఈ కేసులు నమోదు చేసేందుకు పోలీసులు వెనకడుగు వేస్తున్నారు. చాలా సందర్భాల్లో మహిళలు కేసు నమోదు చేయడానికి కోర్టుకు వెళ్లాల్సి వస్తోంది'' అని బల్వంత్ సింగ్ చెప్పారు.

''ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాత కూడా కేసు రాజీ చేసుకోవాలని మహిళలపై ఒత్తిడి వస్తోందని, కుటుంబం నుంచి, పోలీసుల నుంచి, కొన్నిసార్లు న్యాయమూర్తుల నుంచి కూడా ఒత్తిడి వస్తోంది'' అని అపర్ణ భట్ తెలిపారు.

పిల్లల సంరక్షణ అనేది రాజీకి ఆయుధంగా మారుతోందని, ఇది రాజీ చేసుకునేలా మహిళలపై ఒత్తిడి పెంచుతోందని ఆమె అన్నారు.

బంధువుల ఒత్తిడి, లేదా భార్యకు విడాకులు ఇచ్చేందుకు భర్త సిద్ధమవడం, లేదా భార్యను పుట్టింటికి పంపించేయాలని నిర్ణయించుకోవడం వల్ల మహిళలు కేసును కొనసాగించే విషయంలో నిస్సహాయులుగా మారుతున్నారని బల్వంత్ సింగ్ చెప్పారు.

ఒకవేళ కేసు కొనసాగినా, తమపై జరిగిన హింసను నిరూపించడం చాలా కష్టం.

''హింస చాలా రకాలుగా ఉంటుంది. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా. ఇలాంటి వాటికి వైద్యపరమైన ఆధారాలు ఉండవు'' అని అపర్ణ భట్ చెప్పారు.

చాలా సందర్భాల్లో, కేసు నమోదు చేయడం కోసం మహిళలు చాలా కాలం వేచిచూడాల్సి వస్తోంది. అప్పటికి సాక్ష్యాలను సేకరించడంలో చాలా సమయం వృథా అవుతోంది.

''మహిళపై హింస నాలుగు గోడల మధ్య జరుగుతుంది. దానికి ఆధారాలు చూపించడం చాలా కష్టం. అలాగే కేసు చాలా కాలం పాటు సాగదీయడంతో శిక్ష పడడం కూడా కష్టం'' అని బల్వంత్ సింగ్ చెప్పారు.

చట్టం

ఫొటో సోర్స్, Getty Images

దుర్వినియోగంలో నిజమెంత?

ఏ చట్టమైనా దుర్వినియోగమయ్యే అవకాశాలున్నాయని, మహిళలకు ప్రత్యేక రక్షణ అందించడం వల్లే 498ఏ దుర్వినియోగం వెలుగులోకి వచ్చిందని నిపుణులు విశ్వసిస్తున్నారు.

''మహిళల కోసం తెచ్చిన విప్లవాత్మక చట్టం 498ఏ. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టడంలో ఈ చట్టం కీలకపాత్ర పోషించింది'' అని గుజరాత్ మాజీ ఏడీజీ డాక్టర్ రాజన్ ప్రియదర్శి చెప్పారు.

ఏ చట్టమైనా దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు.

అబద్ధాలు, అపార్థం అనే కారణాలతో మూసేసిన కేసుల్లో భర్తలు, లేదా వారి కుటుంబాల నుంచి మహిళలు హింసకు గురవుతున్నారని బల్వంత్ సింగ్ అభిప్రాయపడ్డారు.

అయితే, 498ఏ సెక్షన్ అమలు చేయాలంటే దానికి వరకట్న వేధింపులను జోడించాల్సి ఉంటుందని కొందరు న్యాయవాదులు చెబుతున్నారని, అయితే, ఈ చట్టంలో అలాంటి అవసరం లేదని ఆయన అన్నారు.

''వరకట్న వేధింపులు జరగకపోయినా చాలా కేసుల్లో ఆ ఆరోపణలు ఉంటున్నాయి. అందువల్ల ఆ కేసులు తర్వాత కొట్టివేతకు గురవుతున్నాయి. అయితే, ఈ కేసులు అబద్ధమని, అసలు హింస జరగలేదని దానర్థం కాదు'' అని బల్వంత్ సింగ్ చెప్పారు.

ఇలాంటి కేసుల్లో మహిళలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారు, తక్కువ చదువుకున్నవారు. వారు న్యాయవాదులు, లేదంటే వారి బంధువులు, లేదంటే ఊరి పెద్ద మనుషులు చెప్పినట్లు నడుచుకుంటుంది.

''ఇంట్లో జరిగే హింసను నిరోధించడమే ఈ చట్టం లక్ష్యం. ఇందులో రాజీకి అవకాశం ఉన్నప్పటికీ, చాలా సందర్భాల్లో రాజీ తర్వాత కూడా హింస మొదలైంది'' అని బల్వంత్ సింగ్ చెప్పారు.

''అందువల్ల ఈ సెక్షన్ దుర్వినియోగం అవుతుందని చెప్పడం తప్పు. నిజానికి మహిళల ఆందోళనలను న్యాయవ్యవస్థ సరిగ్గా పరిష్కరించడం లేదు.''

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)