‘మీ దయవల్లే బతికున్నా, సార్’.. 9 ఏళ్ల కిందట ప్రాణాలు కాపాడిన పోలీసు అధికారికి చేతులెత్తి మొక్కిన పేద మహిళ

పోలీసు అధికారి రవీంద్ర, కవిత

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, పోలీసు అధికారి రవీంద్ర, కవిత
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఈ ఏడాది రాఖీ పండగ సందర్భంగా హైదరాబాదీలు కొత్త అన్నాచెల్లెళ్లను చూస్తున్నారు. ఒక అనాథ మహిళకు, స్వయంగా సికింద్రాబాద్ మహంకాళి ఏసీపీ రవీంద్ర అన్నగా మారిన అరుదైన సందర్భం ఇది. తొమ్మిదేళ్ల క్రితం తన ప్రాణాలు నిలబెట్టిన ఈ పోలీసు అధికారికి ఆమె ఇప్పుడు రాఖీ కట్టబోతున్నారు.

2014లో తనకు సాయం చేసిన ఏసీపీని అనుకోకుండా రోడ్డుపై చూసి గుర్తుపట్టి, బస్సు దిగి పరుగున వెళ్లి, ఆమె కృతజ్ఞత చెప్పుకున్నారు.

2014లో రవీంద్ర హైదరాబాద్ పాతబస్తీలోని టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్‌లో సీఐగా పనిచేసేవారు.

అదే ప్రాంతానికి చెందిన కవిత ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉండేవారు. ఒంటరిగా ఉంటూ దీనమైన స్థితిలో ఆ ప్రాంతంలో కనిపించేవారు.

కవితకు నా అనే వాళ్లు ఎవరూ దగ్గర లేరు. ఆమెది టప్పాచబుత్ర పక్కనే ఉండే కార్వాన్. ఆమెకు కడుపు నొప్పి, జ్వరం రావడంతో వైద్యులను కలిశారు. ఆమె కడుపులో కణతులు పెరిగాయని, ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. కానీ సాయం చేసే వారు లేరు.

అప్పటికి కవిత వయసు 28. ఉండటానికి ఇల్లు కూడా లేదు. గుడి మల్కాపూర్ మార్కెట్ దగ్గర షాపుల వాళ్ల సాయంతో, మిగిలిన కూరగాయలు అమ్ముతూ ఆమె జీవనం సాగించేవారు.

కవిత అనారోగ్యం గురించి తెలుసుకున్న రవీంద్ర

అదే సమయంలో కవిత విషయం పోలీసు అధికారి రవీంద్రకు తెలిసింది. ఆయన మనసు చలించింది.

కవితను ఆసుపత్రికి తీసుకెళ్లి, సొంత డబ్బుతో ఆపరేషన్ చేయించారు. కవితకు పూర్తిగా నయమయింది.

భరించలేని కడుపునొప్పితో విలవిల్లాడే కవిత సాధారణ స్థితికి చేరుకున్నారు. ఆమెకు చేసిన సాయాన్ని ఇన్‌స్పెక్టర్ మర్చిపోయారు.

ఆ తరువాత ఆయనకు ట్రాన్స్‌ఫర్ అయింది. ప్రమోషన్ కూడా వచ్చింది. సీఐ నుంచి ఏసీపీ అయ్యారు. ప్రస్తుతం సికింద్రాబాద్ మహంకాళి ప్రాంతానికి ఏసీపీగా పనిచేస్తున్నారు.

ఆదివారం(ఆగస్టు 27) నాడు సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్డు దగ్గర ఒక మంత్రి పర్యటన ఉంది. దీంతో బందోబస్తు డ్యూటీలో ఉన్నారు ఏసీపీ రవీంద్ర. అదే రోడ్డులో బస్సులో వెళ్తున్న కవిత బస్సులో నుంచి రవీంద్రను చూసి గుర్తుపట్టారు.

ఆ వెంటనే వచ్చిన సిగ్నల్ దగ్గర బస్సు దిగారు. పరుగు పరుగున రవీంద్ర దగ్గరకు వచ్చారు. రెండు చేతులెత్తి దండం పెట్టారు.

మంత్రి పర్యటనను కవర్ చేసేందుకు అప్పటికే అక్కడున్న మీడియాకు ఈ దృశ్యం కనిపించింది.

కవిత తనను తాను ఏసీపీకి పరిచయం చేసుకున్నారు. తొమ్మిదేళ్ల క్రితం ఆయన చేసిన సాయాన్ని గుర్తుచేసుకున్నారు, సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

అప్పటి ఘటనను అక్కడున్న అందరికీ వివరంగా చెప్పారు కవిత.

తొమ్మిదేళ్ల క్రితం ఘటనను ఆవిడ ఇలా గుర్తుంచుకోవడం, అనుకోకుండా ఏసీపీని చూసి గుర్తుపట్టి రావడం అక్కడున్న వారికి ఆశ్చర్యంగా అనిపించింది.

‘‘నేను బస్సులో వెళ్తూ సార్‌ను చూశాను. బస్సు అక్కడ ఆపమంటే ఆపేలోపు ఆయన వెళ్ళిపోతారేమోనని నేనే దిగేశాను. పరుగు పరుగున సార్ దగ్గరకు వెళ్లాను’’ అంటూ బీబీసీతో చెప్పారు కవిత.

కవిత, రవీంద్ర

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కవిత, ఏసీపీ రవీంద్ర

‘మీ దయవల్లే బతికున్నాను’

కవిత సెల్ ఫోన్లో ఏసీపీ రవీంద్ర సీఐగా ఉన్నప్పటి పాత ఫోటో చూసి ఆశ్చర్యపోయారు అక్కడున్న సిబ్బంది. అప్పటి నుంచీ మిమ్మల్ని కలవడం కోసం చూస్తున్నానని రవీంద్రకు ఆమె తెలిపారు. రవీంద్ర పాత ఫోటోను ఆమె చూపించారు. ‘‘మీ దయవల్లే బతికున్నాను’’ అంటూ కన్నీటితో చెప్పారు.

‘‘రేపు రాఖీ పండుగ నాడు మీకు వెండి రాఖీ కడతాను. మీ నంబర్ ఇవ్వండి సార్’’ అంటూ ఆమె, రవీంద్ర నంబర్ తీసుకుని వెళ్లారు.

కవిత ఇప్పటికీ గుడి మల్కాపూర్ మార్కెట్ దగ్గర షాపుల వారికి సాయం చేస్తూ, సాయంత్రం పూట మిగిలిన కూరగాయలు అమ్ముతూ పొట్ట పోసుకుంటున్నారు.

‘‘రవీంద్ర సార్ చాలా మంచి వాళ్లు. పోలీసులంతా సార్‌లాగా ఉండాలి. ఆయన ఎప్పుడూ చల్లగా ఉండాలి. నాకు సొంత ఇల్లు లేదు. ఈ మార్కెట్ ఆధారంగా బతుకుతున్నాను. నాకు ఇలా సమస్య ఉంది. నాకు ఏ దిక్కూ లేదని చెప్పగానే ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను నాతో పంపి వైద్యం చేయించారు సార్. ఆసుపత్రిలో చికిత్స కోసం ముందు అనుకున్నదాని కంటే ఎక్కువ ఖర్చయింది. అది కూడా సార్ ఇచ్చారు నాకు’’ అని ఆమె వివరించారు.

‘‘సార్‌కు కట్టడానికి వెండి రాఖీ కొనిపెట్టుకున్నాను. రేపు వెళ్లి కడతాను’’ అని ఆగస్టు 30న కవిత బీబీసీతో అన్నారు.

రవీంద్ర పాత ఫోటో

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, రవీంద్ర సీఐగా ఉన్నప్పటి పాత ఫోటోను కవిత తన సెల్ ఫోన్లో పెట్టుకున్నారు.

నేను పెద్దగా చేసిందేమీ లేదు: రవీంద్ర

‘‘ఆవిడ బస్ రన్నింగ్ లో దిగేసి నా దగ్గరకు వేగంగా వచ్చింది. రావడంతోనే ఎక్కి ఎక్కి ఏడుస్తోంది. నా దగ్గరకు వచ్చిన వెంటనే కాళ్లపై పడిపోయింది. చిన్న పిల్లలా ఏడ్చింది. పక్కనే ఉన్న మీడియా వారికి మొదట్లో ఇదేంటా అని ఆశ్చర్యపోయారు. ఆ తరువాత ఆవిడ మాట్లాడింది విని వెంటనే ఫోటోలు, వీడియోలు తీయడంతో విషయం అందరికీ తెలిసింది.’’ అని రవీంద్ర బీబీసీతో చెప్పారు.

‘‘ఆవిడను చూడగానే నేను గుర్తుపట్టాను. ఆవిడకు నేను పెద్దగా చేసిందేమీ లేదు. ఏదో ఆమె అభిమానం, అంతే..’’ అని ఆయన తెలిపారు.

మహబూబ్ నగర్ జిల్లా బండమీదిపల్లికి చెందిన బండి రవీంద్ర 1996లో ఎస్సైగా ఉద్యోగం ప్రారంభించారు. 2010లో ఇన్‌స్పెక్టర్ అయ్యారు.

తరువాత గ్రేహౌండ్స్, ఎస్ఐబీ, ఎకనమిక్ అఫెన్సస్ వింగ్‌లలో, టప్పాచబుత్ర, నారాయణగూడ, గోల్కొండ, చందానగర్, రాంగోపాలపేట పోలీసు స్టేషన్లలో పని చేశారు. తర్వాత ఏసీపీగా పదోన్నతి పొందారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)