గుండెపోటు వచ్చిన వ్యక్తికి సీపీఆర్ చేసి, ప్రాణాలు కాపాడిన హైదరాబాద్ పోలీసులు.. ఈ అత్యవసర చికిత్స చేయడం ఎలా?

సీపీఆర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, డాక్టర్ ప్రతిభా లక్ష్మి
    • హోదా, బీబీసీ కోసం

హైదరాబాద్‌లో ఆగస్టు 30న బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తి గుండెపోటు వచ్చి కిందపడిపోగా, ఆయనకు నార్త్ జోన్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ మధుసూదన్ రెడ్డి, పోలీసులు హుటాహుటిన సీపీఆర్ చేసి కాపాడారు.

తర్వాత ఆయన్ను అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది.

సీపీఆర్ చేసి వ్యక్తిని కాపాడిన పోలీసులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఆగస్టు 30న గుండెపోటు వచ్చి పడిపోయిన వ్యక్తికి సీపీఆర్ చేస్తున్న హైదరాబాద్ పోలీసులు

సీపీఆర్: ఆగిపోయిన గుండెను పనిచేయించడం ఎలా?

అకస్మాత్తుగా గుండె ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. 85% సందర్భాల్లో దానికి కారణం గుండె పోటే.

కొన్నిసార్లు ఇతర గుండె జబ్బులు, ఆక్సిజన్ తగ్గిపోవడం, ఎలక్ట్రిక్ షాక్, పాము కాటు, భయం, లాంటి కారణాలు కూడా కార్డియాక్ అరెస్టుకు దారితీస్తాయి.

కొన్ని సందర్భాలలో గుండె ఆగిపోయినప్పుడు పక్క వాళ్ళు అందించే ప్రాథమిక చికిత్స వల్ల ఆ వ్యక్తికి పునర్జన్మ లభించే అవకాశం ఉంది. ఆ చికిత్సను కార్డియోపల్మనరీ రెససిటేషన్ (సీపీఆర్) అంటారు.

ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికా లాంటి పశ్చిమ దేశాలలో ఈ సీపీఆర్ అవగాహన కార్యక్రమాలు తరుచూ నిర్వహించే ప్రజలకు సర్టిఫికేట్ కూడా అందిస్తారు. కానీ మన దేశంలో ఈ అవగాహన తక్కువే.

సీపీఆర్

ఫొటో సోర్స్, Getty Images

ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది?

సాధారణంగా మనిషి గుండె కొట్టుకోవాల్సిన వేగం నిమిషానికి 60- 100 సార్లు ఉంటుంది. అయితే, గుండె కొట్టుకునే వ్యవస్థ (కండక్టింగ్ సిస్టమ్)లో లోపం వల్ల గుండె వేగం పెరగడం, తగ్గడం, లేక ఒక్క సారిగా గుండె ఆగిపోవడం జరుగుతుంది.

ఎవరికైనా అకస్మాత్తుగా గుండె ఆగిపోతే, పక్కన ఉండేవారు దాన్ని మళ్ళీ కొట్టుకునే లాగా చేసే ఒక అత్యవసర ప్రక్రియను కార్డియోపల్మనరీ రెససిటేషన్‌గా చెబుతారు.

ఇది చదివి చేయడం కన్నా, చూసి, చేతులతో చేసి నేర్చుకోవడమే మంచిది. అయితే, దీనిపై కొంతవరకైనా అవగాహన కలిగించడానికి చేసే ప్రయత్నమే ఈ కథనం.

సీపీఆర్

ఫొటో సోర్స్, Getty Images

సీపీఆర్‌లో ముఖ్యంగా మూడు అంశాలు ఉంటాయి. అవి ఏమిటంటే

  • చెస్ట్ కంప్రెషన్స్
  • ఎయిర్‌వే పేటెన్సీ
  • బ్రీతింగ్

వీటిలో ఒక్కోదాని గురించి వివరంగా తెలుసుకుందాం.

ఎవరైనా స్పృహ కోల్పోయి కనిపిస్తే, ముందుగా ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి, రెండు భుజాలను పట్టుకొని ఊపుతూ, తనను లేపే ప్రయత్నం చేయాలి.

అప్పటికీ లేవకపోతే, తన గొంతుకు ఏదైనా ఒక పక్క చేతి వేళ్లతో పల్స్ కోసం చూడాలి. అది తెలియక పోతే, ఊపిరి తీసుకుంటున్నారా లేదా అని గమనించాలి.

ఊపిరి తీసుకోవడం లేదు అని నిర్ధారణ అయితే, అప్పుడు వెంటనే ఎవరినైనా సహాయానికి పిలవడం, లేక దగ్గర్లో ఉండే వారికి, లేక 108కి ఫోన్ చేయాలి. తరవాత ఆ వ్యక్తికి సరిగ్గా గాలి ఆడేలాగా చూస్తూ, బట్టలు ఏమైనా బిగుతుగా ఉంటే వదులుగా చేయాలి.

సీపీఆర్

ఫొటో సోర్స్, Getty Images

చెస్ట్ కంప్రెషన్స్

మొదట ఆ వ్యక్తి పక్కన మోకాళ్ల మీద కూర్చోవాలి. ఆ వ్యక్తి రొమ్ము మధ్య ఎముక (స్టానమ్) కింద భాగంలో ఒక చేతి మీద ఒక చెయ్యి పెట్టి, వేళ్ళ మధ్య వేళ్ళను పెట్టి.. మన శరీరం బరువు మొత్తం పడే లాగా, పైకి లెక్కపెడుతూ (వేగం ఎక్కువ లేక తక్కువ అవ్వకుండా ఉండడానికి), నిమిషానికి 100-120 సార్లు ఛాతి మీద ఒత్తాలి.

దీన్నే చెస్ట్ కంప్రెషన్స్ అంటారు. ప్రతి సారీ 2-2.5 అంగుళాలు లోపలికి, లేక ఛాతిలో మూడవ వంతు లోపలికి వెళ్ళి వచ్చేలాగా నొక్కాల్సి ఉంటుంది.

అయితే, పక్కటి ఎముకల మీద ఆ బలం పెడితే అవి సులువుగా విరిగిపోతాయని గుర్తు పెట్టుకోవాలి.

కొన్ని సార్లు సరిగ్గా సీపీఆర్ చేసినప్పటికీ.. ఆ ఎముకలు విరిగే అవకాశం ఉంటుంది. కానీ దానికి కంగారు పడకూడదు. ప్రాణాలు నిలిస్తే అవి సులువుగానే అతుక్కుంటాయి.

సీపీఆర్

ఫొటో సోర్స్, Getty Images

ఎయిర్‌వే పేటెన్సీ

సాధారణంగా పడుకొని ఉన్నప్పుడు, ఆ వ్యక్తి నాలుక వెనుకకు పడిపోవడం వల్ల, గాలి ద్వారం మూసుకు పోయే ప్రమాదం ఉంటుంది. (అందుకే నిద్రలో గురక వస్తుంది. అప్పుడు పక్కకు పడుకుంటే తగ్గుతుంది.)

గాలి వెళ్ళే ద్వారం పూర్తిగా తెరిచి ఉండడానికి, ఆ వ్యక్తి తలను వెనక్కి అని, దవడ పైకి లేపి ఉంచాలి. దానితో గాలి ద్వారం తెరిచి ఉండడం వల్ల, కొంత వరకు గాలి ఊపిరితిత్తులలోకి వెళ్తుంది.

సీపీఆర్

ఫొటో సోర్స్, Getty Images

శ్వాస ఆడేలా చూడటం

ఆ వ్యక్తికి ఊపిరి అందించడానికి ఆక్సిజన్ మాస్క్ వెంటనే అందుబాటులో ఉండకపోవచ్చు. అప్పుడు సన్నటి రుమాలు లేక ఏదైనా గుడ్డను అడ్డుగా పెట్టుకొని గాలి అందించవచ్చు.

నోరు పూర్తిగా నోటితో మూస్తూ, ముక్కును వేళ్లతో గానీ, చెంపతో గానీ మూసి, గాలి ద్వారం తెరిచి ఉండేలా తలను పట్టుకొని, ఆ వ్యక్తి ఛాతి పైకి లేచేలాగా పూర్తిగా ఒక సెకండ్ గాలిని ఊదాలి.

ప్రతి 30 కంప్రెషన్స్‌కు రెండు సార్లు (30:2) గాలి అందిస్తూ సీపీఆర్‌ను కొనసాగించాలి.

వీడియో క్యాప్షన్, కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? ఇది ఎందుకు ప్రాణాలు తీస్తోంది?

పక్కవారి సాయం కూడా తీసుకోవాలి

ఇలా చేయడం చాలా అలసట కలిగిస్తుంది. అందుకే రెండు నిమిషాలకు ఒకసారి మరొకరి సహాయం తీసుకొనే ప్రయత్నం చేయాలి.

కొద్ది సేపటి తరవాత గుండె కొట్టుకోవడం మొదలు అయిందా? అని మళ్ళీ ఒక సారి మెడ పక్కన వేళ్ళు పెట్టి పల్స్ చూడాలి.

గుండె కొట్టుకోవడం మొదలు అయ్యి, ఊపిరి తీసుకుంటూ ఉండే వరకు ఇది కొనసాగించాలి.

ఆ తరవాత కూడా ఆ వ్యక్తి స్పృహలోకి రాకపోతే, ఒక పక్కకు తిప్పి (రికవరీ పొజిషన్‌లో) పడుకో పెట్టి ఉంచాలి.

(రచయిత వైద్యురాలు, ఈ అంశంపై స్థూలమైన అవగాహన కోసమే ఈ కథనం)

వీడియో క్యాప్షన్, కృత్రిమ గుండేతో చిన్నారిని కాపాడిన చెన్నై డాక్టర్లు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)