సంక్షోభం నుంచి శ్రీలంక నిజంగానే కోలుకుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అర్చనా శుక్లా
- హోదా, బీబీసీ న్యూస్
శ్రీలంక ఆర్థిక రాజధాని కొలంబోలో పరిస్థితి సాధారణానికి వచ్చినట్లుగా పైకి కనిపిస్తోంది.
రోడ్లతోపాటు బహిరంగ ప్రాంతాలు, రెస్టారెంట్లలో జనం కనిపిస్తున్నారు. దుకాణాలు కూడా రద్దీగా ఉంటున్నాయి.
ఏడాది క్రితం, విదేశీ కరెన్సీ నిల్వలు నిండుకోవడంతో ఈ దేశం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంది. చమురు దిగుమతికి డబ్బులు లేకపోవడంతో రోడ్లు వెలవెలబోయాయి. ప్రభుత్వ రవాణా కూడా నిలిచిపోయింది. దీంతో ఆన్‌లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి కోవిడ్-19 తరహా చర్యలను మళ్లీ శ్రీలంక అమలుచేయాల్సి వచ్చింది. అయితే ఇవి కూడా కొన్నిచోట్ల సాధ్యంకాలేదు. విద్యుత్ సంక్షోభమే దీనికి కారణం. ఒక్కోసారి రోజుకు 13 గంటలపాటు కోతలు విధించేవారు.
ఆహారం, మందులు, ఇతర నిత్యవసరాల కొరతలు సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి. మండే ఎండలో భారీ వరుసల్లో ప్రజలు నిలబడాల్సి వచ్చింది. దీని వల్ల 16 మందికిపైగా మరణించారు.
ఏడాది తర్వాత ప్రస్తుతం, ఆహారం, ఇంధనం, ఔషధాలు అందుబాటులో ఉంటున్నాయి. మళ్లీ ఆఫీసులు, స్కూళ్లు, ఫ్యాక్టరీలు తెరచుకుంటున్నాయి. ప్రభుత్వ రవాణా సదుపాయాలు కూడా మళ్లీ ప్రారంభమయ్యాయి.
రెస్టారెంట్లు కూడా కళకళలాడుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
‘‘నిరుడు ఈ సమయానికి నా రెస్టారెంట్ అమ్మేసే పరిస్థితి వచ్చింది. కస్టమర్లు రాకపోవడంతోపాటు గ్యాస్ కూడా లేకపోవడంతో కొన్ని రోజులపాటు దీన్ని మూసేయాల్సి వచ్చింది. అయితే, మళ్లీ మునుపటితో పోలిస్తే 70 శాతం వరకూ కస్టమర్లు వస్తున్నారు’’ అని కొలంబోలో ఒక రెస్టారెంట్ నడిపిస్తున్న చతుర ఏకనాయకే చెప్పారు.
విదేశీ కరెన్సీకి ఎక్కువగా పర్యటకంపైనే శ్రీలంక ఆధారపడుతుంది. ప్రస్తుతం మళ్లీ ఇక్కడకు పర్యటకులు వస్తున్నారు. నిరుటితో పోలిస్తే, ప్రస్తుతం పర్యటక రెవెన్యూ కూడా 30 శాతం పెరిగింది.
‘‘పరిస్థితులు మళ్లీ ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. అసలు ఆ సంక్షోభం నుంచి కోలుకుంటామని కూడా మేం ఊహించలేదు’’ అని శ్రీలంకలో ప్రముఖ ట్రావెల్ సంస్థ జెట్‌వింగ్స్ సింఫనీ సీఈవో హిరణ్ కూరే చెప్పారు.
చాలా శుభవార్తలు వినిపిస్తున్నప్పటికీ, నేటికీ శ్రీలంక పరిస్థితి దారుణమైన స్థితిలోనే ఉంది.
దేశ రుణ భారం ఇప్పటికీ 80 బిలియన్ డాలర్లు(రూ.6.56 లక్షల కోట్ల)కు పైనే ఉంది. నిరుడు తొలిసారిగా విదేశీ రుణాలకు చెల్లింపులను శ్రీలంక చేయలేకపోయింది.
నిరసనల నడుమ అప్పటి అధ్యక్షుడు గోటాబయ రాజపక్షే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన రణిల్ విక్రమసింఘే అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి 2.9 బిలియన్ డాలర్ల (రూ.23.79 వేల కోట్లు) రుణాన్ని తీసుకురాగలిగారు.
మిగతా చోట్ల నుంచి రుణాలు పొందడంతోపాటు కొరతను పూడ్చుకునేందుకు ఈ నిధులు కీలకంగా మారాయి. అయితే, ఈ రుణం కోసం కఠినమైన ఆర్థిక, పాలనా పరమైన సంస్కరణలను శ్రీలంక అనుసరించాల్సి వచ్చింది.
ఇప్పుడు పాత రుణాల చెల్లింపుల నిబంధనలను పునర్‌వ్యవస్థీకరించాలని అప్పులు ఇచ్చిన దేశీయ, విదేశీ సంస్థలను శ్రీలంక కోరుతోంది. ముఖ్యంగా 36 బిలియన్ డాలర్ల (రూ.2.95 లక్షల కోట్లు) విదేశీ రుణాలపై ప్రస్తుతం దృష్టిపెట్టింది. దీనిలో చైనా నుంచి తీసుకున్న ఏడు బిలియన్ డాలర్ల(రూ.57.43 వేల కోట్లు) రుణం కూడా ఉంది.
అయితే, దేశీయ రుణ భారం పునర్‌వ్యవస్థీకరణతోనే శ్రీలంక ప్రజలపై మరింత భారం పడే అవకాశముంది. మొత్తం రుణాల్లో దేశీయ రుణ భారం 50 శాతం వరకూ ఉంది. తాజాగా ఈ రుణం నిబంధనలకు సంబంధించిన ప్రతిపాదనలకు శ్రీలంక క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అయితే, కార్మికుల పింఛన్లతోపాటు కొన్ని కోతలు పెట్టడంతో ప్రజల నుంచి భారీగా నిరసన వ్యక్తమైంది. వీటిపై కొలంబోలోనూ నిరసనలు చేపట్టాలని ఉద్యోగులు భావిస్తున్నారు.
జనజీవనం సాధారణానికి వచ్చినట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ, ఈ సమస్యలే పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
శ్రీలంకలో నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసే స్తోమత చాలా మందికి లేదు. సగానికి పైగా కుటుంబాలు సంపాదనలో 70 శాతం ఆహారంపైనే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆహారంతోపాటు బట్టల ధరలు, ఇంటి అద్దెలు అలానే పెరుగుతూనే ఉన్నాయి.
దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా 36 శాతం వరకూ ఆదాయపు పన్ను కూడా పెంచారు. మరోవైపు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను కూడా తొలగిస్తున్నారు.
ముఖ్యంగా విద్యుత్ బిల్లుల రూపంలో ప్రజలపై చాలా భారం పడుతోంది. రాయితీలను తీసేయడంతో ఈ బిల్లులు 65 శాతం వరకూ పెరుగుతున్నాయి.
‘‘చాలా మధ్యతరగతి కుటుంబాలు ప్రస్తుతం పేదరికంలోకి జారుకుంటున్నాయి’’ అని ప్రైవేటు థింక్ ట్యాంక్ వెరైట్ రీసెర్చ్‌కు చెందిన సీనియర్ ఎకానమిస్టు మాలతీ నైట్ చెప్పారు.
అయితే, మరికొన్ని రోజులు పరిస్థితులు ఇలానే ఉండొచ్చని ప్రపంచ బ్యాంకు చెబుతోంది.
‘‘కొన్ని సంవత్సరాలపాటు ఇక్కడ పేదరికం 25 శాతం కంటే ఎక్కువే ఉండొచ్చు. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి,’’ అని తాజాగా ఒక నివేదికలో ప్రపంచ బ్యాంకు పేర్కొంది.
ఈ సంస్థ కూడా 700 మిలియన్ల డాలర్లు (రూ.5,743 కోట్లు)ను సాయం అందిస్తోంది. దీనిలో 200 మిలియన్ల డాలర్లు(రూ.1,604 కోట్లు)ను పేదల కోసం ఇస్తోంది.
ఇక్కడి యువత చాలా మంది దేశం వదిలిపెట్టి బయటకు వెళ్లిపోవాలని చూస్తున్నారు.
2022లో 3,11,269 మంది దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇంత భారీ స్థాయిలో ప్రజలు ఇలా వెళ్లిపోవడం ఎప్పుడూ లేదు. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ఐటీ ఉద్యోగులు ఇలా మంది నిపుణులు కూడా వెళ్లిపోయినవారిలో ఉన్నారు.
ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంస్థలు నిపుణుల లేమితో ఇబ్బందులు పడుతున్నాయి.
‘‘మేం షెఫ్‌ల కోసం రోజూ ప్రకటనలు ఇస్తున్నాం. కానీ, ఎవరూ దొరకడం లేదు. నిరుడు మా కిచెన్‌లో 14 మంది షెఫ్‌లు ఉండేవారు. ప్రస్తుతం ఇద్దరితోనే నడిపిస్తున్నాం. మరిన్ని పెట్టుబడులతో వ్యాపారాన్ని విస్తరించాలని భావించేటప్పటికీ, అది సాధ్యపడటం లేదు,’’ అని ఏకనాయకే చెప్పారు.
దక్షిణాసియాలో సగటు ఆదాయం ఎక్కువగా ఉండే దేశాల్లో ఒకటైన శ్రీలంకలో ఇలాంటి పతనాన్ని చాలా మంది ఊహించలేదు. ఎందుకంటే ఇక్కడి మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, వ్యవస్థలు చాలా దేశాల కంటే కాస్త మెరుగ్గానే ఉంటాయి.
అసలు అలాంటి స్థితి నుంచి పరిస్థితి ఇంత దారుణంగా ఎలా దిగజారింది?
ఈ పరిస్థితికి కోవిడ్-19 వ్యాప్తితో పర్యటకం తిరోగమన బాట పట్టడమే కారణమని ప్రభుత్వం అంటోంది. అయితే, కరోనావైరస్ మహమ్మారి కొంతవరకూ కారణం అయినప్పటికీ, దీనిలో దేశ ఆర్థిక విధానాలకూ పాత్ర ఉంది.
ప్రజాప్రయోజనం పేరుతో 2019లో భారీగా తగ్గించిన పన్నులతో దేశ రెవెన్యూకు 1.4 బిలియన్ డాలర్లు (రూ.11.48 వేల కోట్లు) నష్టం సంభవించింది.
2021లో రసాయన ఎరువులపై దిగుమతి నిషేధం విధిస్తూ తీసుకున్న చర్యలు ఆహార కొరతకు కారణమయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం ఖర్చులను మరింత తగ్గించుకునేందుకు శ్రీలంక ఎయిర్‌లైన్స్, శ్రీలంక ఇన్సూరెన్స్ కార్పొరేషన్, శ్రీలంక టెలికాం లాంటి సంస్థలను ప్రైవేటీకరించాలనే ప్రతిపాదనలను ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిపై కార్మిక సంఘాల నుంచి కొత్త నిరసనలు మొదలయ్యాయి.
‘‘ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో సతమతం అవుతున్న మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగులపై సంస్కరణల భారం కూడా ప్రభుత్వం మోపకూడదు’’ అని సిలోన్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం వైస్‌ప్రెసిడెంట్ అనుప నందుల చెప్పారు.
శ్రీలంక ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తాజాగా అనుప, ఆయన సంఘానికి చెందిన ఉద్యోగులు నిరసనలు చేపట్టారు.
ప్రైవేటీకరణతో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తారని, ఫలితంగా ఉద్యోగులపై మరింత భారం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
నిరుడు చోటుచేసుకున్న నిరసనలు హింసాత్మకం అయినప్పటి నుంచీ వాటర్ క్యానన్స్, టియర్‌గ్యాస్‌లను నిరసనకారులపైకి భద్రతా బలగాలు ప్రయోగిస్తున్నాయి. అయితే, ఇలా బలప్రయోగం చేయకూడదని నిపుణులు అంటున్నారు.
‘‘బలాన్ని ప్రయోగించేకంటే, ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి. పరిస్థితి మెరుగుదలకు చర్యలు తీసుకోవాలి’’ అని సెంటర్ ఫర్ పాలసీ ఆల్టర్‌నేటివ్స్ కోసం పనిచేస్తున్న లాయర్ భవానీ ఫొన్సెకా చెప్పారు.
‘‘సంక్షోభం మొదలైనప్పటి నుంచి కష్టమైన జీవనశైలికి ప్రజలు అలవాటు పడ్డారు. అయితే, ఎలాంటి సమాచారం బయటకు రాకపోవడం, ఎవరూ సమాధానాలు చెప్పకపోవడంతో మళ్లీ పాత సంక్షోభానికి పరిస్థితులు వెళ్లిపోతాయేమోనని ప్రజలు భయపడుతున్నారు’’ అని భవానీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- డాక్టర్‌కే మా బంధం అర్ధం కాలేదు, సామాన్యులకు ఎలా తెలుస్తుంది?: కేరళ లెస్బియన్ జంట ఆవేదన
- అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















