మణిపుర్ హింస: 'ఒక్క రాత్రిలోనే స్నేహితులు శత్రువులుగా ఎలా మారిపోతారు?'

ఫొటో సోర్స్, ANSHUL VERMA
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ న్యూస్
మియన్మార్ సరిహద్దుల్లోని అందమైన ఈశాన్య భారత రాష్ట్రం మణిపుర్ తెగల మధ్య ఘర్షణతో సతమతం అవుతోంది. రెండు నెలల నుంచి ఇక్కడ మెయితెయి, కుకీల మధ్య నిరంతరంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇలా మెయితెయిలపై దాడులు జరిగిన ఓ గ్రామాన్ని బీబీసీ ప్రతినిధి సౌతిక్ బిశ్వాస్ సందర్శించారు.
మే నెల మొదట్లో ఒక రోజు చిమ్మచీకట్లో పర్వతాల పైనుంచి కొందరు ఇక్కడకు వచ్చారు.
నిశ్శబ్దాన్ని పటాపంచలు చేసేలా గట్టిగా అరుస్తూ, వారు కాల్పులు జరపడం మొదలుపెట్టారు. వీరిలో కొందరు కత్తులతో దూసుకొచ్చారు. మరికొందరు పెట్రోల్, డీజిల్ బాటిళ్లతో నిప్పు పెట్టారు.
‘‘వారిని చంపేయండి, కాల్చేయండి!” అని ఆ రోజు వినిపించిన అరుపులు ఖునైజం శాంతికి ఇంకా గుర్తున్నాయి.
అప్పటికే తెగల మధ్య ఘర్షణల వార్తలు మొబైల్‌ఫోన్లు, అటూఇటూ పోయే వారి ద్వారా వ్యాపించడంతో తమపై ఎప్పుడు దాడి జరుగుతుందోనని శాంతి, తోటి గ్రామస్థులు భయపడుతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఇళ్లపైకి వచ్చిన మూకల నుంచి తప్పించుకునేందుకు వీరు పరుగులు తీశారు.
మే 3న మణిపుర్‌లో ఈ హింస మొదలైంది. మెజారిటీ మెయితెయి, మైనారిటీ కుకీల మధ్య ఇప్పటివరకు చోటుచేసుకున్న ఘర్షణల్లో 130 మందికి పైగా మరణించారు. దాదాపు 60 వేల మంది నిరాశ్రయులయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
మెయితెయిలలో శాంతి లాంటి హిందువుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీరు రాజధాని ఇంఫాల్‌తోపాటు లోయలోని ప్రాంతాల్లో జీవిస్తుంటారు.
కుకీలలో క్రైస్తవుల సంఖ్య ఎక్కువ. వీరు లోయకు చుట్టుపక్కల కొండల ప్రాంతాల్లో జీవిస్తుంటారు.
ప్రస్తుత హింస కారణంగా రెండు వర్గాలూ పూర్తిగా చీలిపోయినట్లుగా కనిపిస్తోంది.
ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఆ రోజు అర్ధరాత్రి కుకీలు దాడిచేసిన ప్రాంతాల్లో శాంతి జీవించే డోలైథాబీతోపాటు ఎకోయి, యంగ్‌ఖమాన్, లీతాన్‌పోక్పి గ్రామాలు ఉన్నాయి.
మెయితెయిలు ఎక్కువగా ఉండే ఈ గ్రామాల్లో మొత్తంగా 3,000 మంది వరకూ జీవిస్తున్నారు. కుకీలు జీవించే ప్రాంతాలకు పొరుగున ఉండటంతో ఇవి దాడులకు అనువుగా ఉంటాయి.
రెండు వర్గాల గ్రామాల మధ్య దూరం ఇక్కడ 1,500 మీటర్లు మాత్రమే ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో ప్రస్తుతం శాంతి, భద్రతలను పరిక్షించేందుకు భద్రతా బలగాలను మోహరించారు.
రెండువైపులా గ్రామస్థులు ‘‘విలేజ్ డిఫెన్స్ ఫోర్సెస్’’గా పిలిచే బలగాలను ఏర్పాటుచేసుకున్నారు. కొన్నిచోట్ల బంకర్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. మరికొన్నిచోట్ల సాయుధ వాలంటీర్లు కూడా ఇక్కడ కాపలా కాస్తున్నారు.
అందమైన, ప్రశాంతంగా కనిపించే ఒక గ్రామంలో ఇలాంటి హింస చెలరేగుతోందని ఊహించుకోవడం కూడా చాలా కష్టంగా అనిపిస్తోంది.
ఇరిల్‌గా పిలిచే ఓ నది ఇక్కడి గ్రామాల పక్క నుంచి ప్రవహిస్తోంది. ఇక్కడి మైదానాలు వరి పంటలతో పరుచుకున్నట్లుగా పచ్చగా కనిపిస్తున్నాయి. ఏటవాలు పర్వత ప్రాంతాలు కూడా ఓక్, పైన్ చెట్లతో కళకళలాడుతున్నాయి.
‘‘ఇది చుట్టూ పర్వతాలున్న లోయ. కుకీలకు దాడికి అనువుగా ఉంటుంది. కొండల పైనుంచి ఏం జరుగుతోందో వారు గమనించొచ్చు. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు.’’ అని మణిపుర్ మిలిటరీ ఫోర్స్‌లోని సీనియర్ అధికారి లెనిన్ లమబం చెప్పారు.
ఆయనతోపాటు 80 మంది మణిపుర్ మిలిటరీ ఫోర్స్, వందల మంది సరిహద్దు భద్రతా దళం జవాన్లు ఇక్కడి ప్రాంతాల్లో ప్రస్తుతం గస్తీ కాస్తున్నారు.

ఫొటో సోర్స్, ANSHUL VERMA
మే నెలలో హింస తర్వాత, ఇక్కడ మరికొన్ని దాడులు కూడా జరిగాయి. దీంతో ఇక్కడి జీవించే సగం కంటే ఎక్కువ మంది ప్రజలు ప్రస్తుతం తమ బంధువుల ఇళ్లలో లేదా సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఇక్కడున్న చాలా మంది ఇళ్లను ధ్వంసం చేశారు. ధాన్యం నిల్వలతోపాటు టీవీలు, వాషింగ్ మెషీన్లను దోచుకుపోయారు. ఒకప్పుడు అందంగా కనిపించే గ్రామాల్లో నేడు కాలిపోయిన ఇళ్లు, వాహనాలు ఎదురుపడుతున్నాయి.
కొంత మంది మగవారు మాత్రం పగటిపూట పొలాలు, పశువులను చూసుకునేందుకు ఇక్కడకు వస్తున్నారు. నేడు ఇక్కడ జీవించడం ప్రమాదకరంగా మారిపోయింది. పొలాల్లో పనిచేస్తున్న రెండు వర్గాలకు చెందిన రైతుల మీదా దాడులు జరిగాయి.
‘‘పరిస్థితులు ఇంత తీవ్రంగా ఎలా మారిపోయాయో ఇప్పటికీ అర్థం కావడం లేదు.’’ అని శిబిరంలో గడుపుతున్న 60 ఏళ్ల వితంతువు చనం తాఫా చెప్పారు.

ఫొటో సోర్స్, ANSHUL VERMA
లీతాన్‌పోక్పి గ్రామంలోని వంద ఇళ్లలో సగం నేడు ఖాళీగా ఉన్నాయి. ఇళ్లతోపాటు ఫార్మసీలు, బజార్, ప్రైమరీ స్కూల్‌పైనా దాడుల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఒక టిన్ రేకుపై ‘‘డ్రగ్స్‌పై యుద్ధానికి మద్దతు ప్రకటిస్తున్నాం’’ అనే కాగితం అంటించి కనిపించింది.
నల్ల మందును పండించడం ఆపేసి, భవిష్యత్ తరాలను కాపాడుకుందాం అని దీనిలో స్థానిక ‘కమిటీ ఫర్ ద వార్ ఆన్ డ్రగ్స్’ పిలుపునిచ్చింది.
మణిపుర్‌లో ప్రస్తుత హింసకు చాలా కారణాలు ఉన్నాయి. వీటిలో మాదకద్రవ్యాలపై అణచివేత కూడా ఒకటి. ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం నల్లమందు పండించే వారిని లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకుంటోంది.
బీరేన్ సింగ్ మెయితెయి వర్గానికి చెందినవారు. 2017 నుంచి ప్రభుత్వం 18,600 ఎకరాల్లో నల్లమందు పంటలను ధ్వంసం చేశామని వెల్లడించింది. అయితే, ఈ ప్రాంతాలన్నీ ఎక్కువగా కుకీలు జీవించే గ్రామాల్లో ఉన్నాయి.

ఫొటో సోర్స్, SOUTIK BISWAS
బీరేన్ సింగ్ ప్రభుత్వ విధానాలు కూడా రెండు వర్గాల మధ్య విభేదాలకు కారణం అయ్యేవి.
నల్లమందు పండించే గ్రామాలకు (ఎక్కువగా కుకీలు జీవించే గ్రామాలకు) ప్రభుత్వ పథకాలను కూడా వెనక్కి తీసేసుకుంటామని బీరేన్ సింగ్ గతంలో చెప్పారు. అంతేకాదు కుకీలు మాదకద్రవ్యాలతో వ్యాపారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కుకీలను కావాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారనే ఆరోపణలను ఆయన ఖండించారు.
లీతాన్‌పోక్పిలో గ్రామస్థులు.. కొండల ఏటవాలు ప్రాంతాలను కొందరు చదునుచేసి నల్లమందు పండిస్తున్నారని చెప్పారు. ‘‘ఇక్కడుండే మెయితెయిలలో ఎక్కువ మంది రైతులు లేదా కలప వ్యాపారులు. వీరు కుకీల ఆధీనంలోని పొలాలను మూడేళ్ల లీజుకు తీసుకుంటారు. అక్కడి చెట్లను కొట్టి, కలపను మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. ఆ తర్వాత వ్యవసాయం చేస్తుంటారు’’ అని టీచర్‌గా పనిచేసిన తరుణ్ ఎంగన్‌గోం చెప్పారు.
‘‘కానీ, ఇటీవల కాలంలో ఇలా లీజుకు ఇవ్వడం తగ్గిపోయింది. ఎందుకంటే అక్కడ వారే నల్లమందు మొక్కలను పండించడం మొదలుపెట్టారు’’ అని ఆయన అన్నారు. ఆయన చెప్పిన మాటలను ధ్రువీకరించడం సాధ్యపడలేదు.
2017 నుంచి ఇంఫాల్ తూర్పు జిల్లాలో 730 ఎకరాల్లో నల్లమందు పంటను ధ్వంసంచేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
రాష్ట్ర జనాభాలో 16 శాతం ఈ జిల్లాలో జీవిస్తున్నారు. ఇక్కడ కుకీ, మెయితెయిలతోపాటు నాగా, నేపాలీ గ్రామాలు కూడా ఉన్నాయి.
మియన్మార్ నుంచి కూడా అక్రమ వలసదారులు రాష్ట్రంలోకి వస్తున్నారనే ఆరోపణలు ఇక్కడ వినిపిస్తున్నాయి.
మియన్మార్‌తో రాష్ట్రానికి 400 కి.మీ. పొడవైన సరిహద్దు ఉంది. ‘‘బర్మా శరణార్థులు వెనక్కి వెళ్లిపోవాలి’’ లాంటి నినాదాలు రాసిన కాగితాలు కూడా మెయితెయి గ్రామాల్లో కనిపించాయి.
మియన్మార్ శరణార్థుల వల్ల రాష్ట్రంలో అంతర్యుద్ధం చెలరేగే ముప్పుందని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తరచూ చెప్పేవారు. అయితే, ఆ తెగలతో కుకీలకు దగ్గరి సంబంధాలు ఉంటాయి.
మణిపుర్‌లోని నాలుగు జిల్లాల్లో ఏప్రిల్ చివరి నాటికి 2,187 మంది శరణార్థులను ప్రభుత్వ కమిటీ గుర్తించింది.
‘‘వీరిలో ఎక్కువ మంది అక్రమ శరణార్థులే. తాజా హింసకు మియన్మార్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి నల్లమందు వ్యాపారం చేస్తున్న వారే ఆజ్యం పోస్తున్నారు’’ అని ఓ ప్రభుత్వ అధికారి వ్యాఖ్యానించారు.
అయితే, హింసకు ముందు ఇక్కడ రెండు వర్గాల మధ్య జనజీవనం ప్రశాంతంగా ఉండేది. లోయలో జీవించే మెయితెయిలు కలప కోసం పర్వత ప్రాంతాలకు వెళ్లేవారు. అంతేకాదు కుకీలు కూడా వ్యాపారాలు చేసేందుకు లోయకు వచ్చేవారు.
‘‘మా పొరుగున ఉండే కుకీలతో మేం ఏళ్లపాటు ప్రశాంతంగా జీవించాం. మేం వారి గ్రామాల్లోకి వెళ్లేవాళ్లం. వారు కూడా మా గ్రామాలకు వచ్చేవారు.’’ అని శాంతి చెప్పారు.
‘‘ఒక్క రాత్రిలోనే స్నేహితులు శత్రువులుగా ఎలా మారిపోతారు? వారిని ఎవరైనా బయటివారు రెచ్చగొడుతున్నారా’’ అని ఆమె ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
- డాక్టర్‌కే మా బంధం అర్ధం కాలేదు, సామాన్యులకు ఎలా తెలుస్తుంది?: కేరళ లెస్బియన్ జంట ఆవేదన
- అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















