మణిపుర్: వందల చర్చిలను ధ్వంసం చేశారని క్రైస్తవ సంఘాల ఆరోపణ

మణిపూర్‌

ఫొటో సోర్స్, Khongsai

    • రచయిత, స్వామినాథన్ నటరాజన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మణిపుర్‌లో విస్తృతంగా జరిగిన హింసాకాండలో వందలాది చర్చిలు ధ్వంసమయ్యాయని క్రైస్తవ సంఘాలు చెబుతున్నాయి.

ఆ రాష్ట్రంలో మూడు ప్రధాన తెగలు ఉన్నాయి. వాటిలో ఒక తెగ ప్రభుత్వం నుంచి మరింత సహాయం కోరుతోంది. ఉద్యోగాలు, భూముల విషయంలో తమకు అదనపు కోటా కావాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో హింస చెలరేగింది.

"మాకు తెలిసినంతవరకు 508 చర్చిలను ధ్వంసం చేశారు" అని యునైటెడ్ క్రిస్టియన్ ఫోరమ్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా ప్రతినిధి అలెన్ బ్రూక్స్ బీబీసీతో చెప్పారు.

"మణిపుర్‌లో వివిధ శాఖలకు చెందిన చర్చి పూజారులు, పాస్టర్లు, నాయకుల నుంచి మేం ఈ డాటా సేకరించాం. ఇది దిగ్భ్రాంతి కలిగిస్తున్న విషయం. చాలా బాధగా, భయంగా ఉంది" అని ఆయన అన్నారు.

బీబీసీ కూడా దాడులకు గురైన చర్చిల వివరాలను మణిపుర్‌లోని మరో క్రైస్తవ మత నాయకుడి నుంచి సేకరించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన పేరును బయటపెట్టవద్దన్నారు.

ఆయన ఇచ్చిన జాబితా ప్రకారం, మే 3 నుంచి జూన్ 2 మధ్య మణిపుర్‌లో 260కి పైగా చర్చిలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది.

అయితే, క్రైస్తవ సంస్థలు ఈ లెక్కలను పెద్దవి చేసి చూపిస్తున్నాయని ఇంతకుముందు భారత ప్రభుత్వం ఆరోపించింది. అదే సమయంలో, భారతదేశంలో మత స్వేచ్ఛ గురించి యూఎస్ కాంగ్రెస్ నివేదికను కోరగా, ప్రభుత్వం నిరాకరించింది.

ఈ విషయమై, మణిపుర్ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కొత్తగా నియమితులైన భద్రతా సలహాదారులను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. వారం పాటు ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ చేసినా ఎలాంటి స్పందనా లభించలేదు.

కాగా, మణిపుర్‌లో జూన్ మొదటి వారం వరకు మొత్తం 256 చర్చిలు దగ్ధమయ్యాయని, అలాగే 128 హిందూ దేవాలయాలపై కూడా దాడులు జరిగాయని ప్రభుత్వ వర్గం బీబీసీ రిపోర్టర్ నితిన్ శ్రీవాస్తసకు తెలిపింది.

మణిపుర్‌

ఫొటో సోర్స్, Handout

ఘర్షణలకు మూలం ఏమిటి?

మణిపుర్‌లో ఉన్న మూడు ప్రధాన తెగలు.. మెయితెయి, నాగా, కుకి. వీటిలో మెయితెయి జనాభా ఎక్కువ. మెయితెయ్ వర్గం ప్రజలు ఎక్కువగా ఇంఫాల్ లోయలో స్థిరపడ్డారు. మెయితెయ్ వర్గాన్ని షెడ్యూల్డ్ తెగలు కింద గుర్తించాలని వాళ్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.

రాజధాని ఇంఫాల్‌లో ఉన్న హైకోర్టు వాళ్ల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఇంఫాల్ ప్రభుత్వాన్ని కోరింది.

ఇటీవల మెయితెయి ట్రైబ్ యూనియన్ దాఖలు చేసిన ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు పై సూచన చేసింది.

దాంతో, మెయితెయి, కుకి తెగల మధ్య ఘర్షణలు చెలరేగాయి.

మెయితెయి వర్గాన్ని షెడ్యూల్ తెగల కింద గుర్తిస్తే, వారికి చదువుల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్ వస్తుంది. అలాగే, గిరిజన ప్రాంతాల్లోని భూముల్లో కోటా ఉంటుంది.

అయితే, దీనివల్ల కుకి లాంటి ఆదివాసీ సమూహాలు మరింత వెనుబడిపోతాయన్న ఆగ్రహం వ్యక్తమయింది.

ఇప్పటికే అధిక జనాభా కలిగిన మెయితెయి సమూహం అభివృద్ధిలో ముందుందని, రాజకీయంగా పలుకుబడి ఉన్నదని, ఎస్సీ, ఓబీసీ, ఆర్థికంగా వెనుబడిన వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్లను అందుకుంటోందని, వీటికి అదనంగా ఎస్టీ కోటా అక్కర్లేదని కుకీ సమూహం వాదిస్తోంది.

రాష్ట్రమంతటా హింస పెచ్చుమీరడంతో, ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. చాలాచోట్ల ఇంటర్నెట్ కట్ చేయడంతో హింసకు సంబంధించిన వార్తలు అందించడం కష్టమైంది.

"రెండు తెగల మధ్య ఘర్షణ అని ప్రధాన స్రవంతి కథనం. డ్రగ్స్ ఉన్మాదానికి వ్యతిరేకంగా, శరణార్థుల ప్రవాహాన్ని అడ్డుకోవడానికీ పోరాడుతున్నామని మెయితెయి వర్గం చెబుతోంది. మెయితెయి వర్గం తమ తెగను నాశనం చేసేందుకు పూనుకుంటోందని కుకి వర్గం ఆరోపిస్తోంది" అని అలెన్ బ్రూక్స్ అన్నారు.

మణిపుర్‌

ఫొటో సోర్స్, Handout

ఇందులో మతం కోణం ఉందా?

అయితే, ఈ ఘర్షణల్లో మతం కోణం కూడా ఉందని చాలామంది అంటున్నారు.

మెయితెయి వర్గంలో మెజారిటీ హిందువులు. కొద్దిమంది పాత ఆదివాసీ సంప్రదాయాలను అంటే ఆత్మలను విశ్వసిస్తారు. మరికొద్దిమంది క్రైస్తవులు, ముస్లింలు కూడా ఉన్నారు.

కుకీ సమూహంలో అందరూ క్రైస్తవులే.

అయితే, మెయితెయి సమూహంలో క్రైస్తవులపై కూడా దాడులు జరుగుతున్నాయని, ధ్వంసమైపోయిన చర్చిల్లో సగం వీరివేనని బ్రూక్స్ చెబుతున్నారు.

"రాజధాని ఇంఫాల్‌లో గట్టి బందోబస్తు ఉండే ఎయిర్‌పోర్టు రోడ్డులో ఒక పెద్ద కాథలిక్ చర్చి ఉంది. దానిపై మూకదాడి చేశారు. ఆ చర్చికి వివిధ తెగలవారు వెళతారు. దానిపై దాడి వీడియోను నేను చూశాను. ఒక వ్యక్తి ఇనుప రాడ్డుతో ఏసుక్రీస్తు విగ్రహాన్ని విరగ్గొట్టాడు" అని చెప్పారాయన.

పోలీసులు, మిలటరీ బలగాలు పటిష్టంగా ఉన్న రాజధానిలో ఇంత హింస చెలరేగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇద్దరూ ఘర్షణలను ఆపడానికి తగినంత ప్రయత్నం చేయలేదనే ఆరోపణలు వచ్చాయి.

ఈ దాడులను ఎవరు పురికొల్పుతున్నారో కచ్చితంగా తెలీదు. మెయితెయి సమూహంలో ఆత్మలు ఉన్నాయని నమ్మే వర్గం హింసకు పాల్పడుతోందని బ్రూక్స్ భావిస్తున్నారు. మణిపుర్ పోలీసు విభాగానికి చెందిన ఆయుధాలు పెద్ద సంఖ్యలో అదృశ్యమవడాన్ని ఆయన గుర్తుచేశారు.

మణిపుర్‌

ఫొటో సోర్స్, Khongsai

'మా మూలాలను నాశనం చేశారు'

పాక్షికంగా లేదా పూర్తిగా ధ్వంసమైన ఆరు చర్చిల ఫొటోలను బీబీసీ పరిశీలించింది. అవి ఉన్న ప్రదేశాలను స్వతంత్రంగా ధృవీకరించింది.

ప్రజలు భయాందోళనలతో బతుకుతున్నారని ఇంఫాల్‌కు దక్షిణంగా ఉన్న చురచంద్‌పూర్ జిల్లా పాస్టర్ బీబీసీతో చెప్పారు.

ఈ ప్రాంతంలో ఎవాంజెలికల్ చర్చి అసోసియేషన్‌కు చెందిన అనేక చర్చిలు దాడికి గురయ్యాయి.

"మా చర్చికి వివిధ తెగలవాళ్లు వస్తారు. ఆదివారం క్రీస్తుకు ప్రార్థనలు చేస్తాం. రంగురంగుల సంప్రదాయ దుస్తులు ధరించి, ఆటపాటలతో పూజలు చేస్తాం. ఇవన్నీ మా మూలాలకు సంబంధించిన సంప్రదాయాలు. ఒక గుహలో మా మూలాలు మొదలయ్యాయని కథగా చెప్పుకుంటాం. చర్చి ధ్వసం అయినప్పుడే, మా మూలాలు నాశనం అయిపోయాయి" అన్నారాయన. భద్రతా కారణాలతో తన పేరును గోప్యంగా ఉంచమని కోరారు.

హింస ప్రారంభమైన రోజే అంటే మే 3న చురచంద్‌పూర్‌లోని డోప్‌కాన్ ఈసీఏ చర్చికి నిప్పంటించారని ఆయన చెప్పారు. తరువాత మిగతా చర్చిలను కూడా నాశనం చేశారని చెప్పారు.

మణిపుర్‌

ఫొటో సోర్స్, Handout

'ఉద్దేశపూర్వకంగా చేసిన దాడులు'

కుకి పాస్టర్ థంగ్‌మిన్‌లున్ వయ్‌ఫెయ్ నివాసాలు కోల్పోయిన క్రైస్తవులకు సహాయం చేస్తున్నారు. వీరంతా పక్క రాష్ట్రం అస్సాంలో తలదాచుకుంటున్నారు.

తమ చర్చిపై దాడి ఎలా జరిగిందో పాస్టర్ థంగ్‌మిన్‌లున్ బీబీసీకి వివరించి చెప్పారు.

"మొదట, ఇంఫాల్‌లో ఉన్న కుకి క్రిస్టియన్ చర్చి ప్రధానకార్యాలయాన్ని ఒక గుంపు దోచుకుంది. విలువైన వస్తువులు తీసుకున్నాక చర్చికి నిప్పంటించారు" అని ఆయన చెప్పారు.

ఈ చర్చి ధ్వంసం అవుతున్న 52 సెకెండ్ల వీడియోను బీబీసీ చూసింది. రెండు ఆర్మీ వాహనాలు అటు పక్కగా వెళుతుండడం వీడియోలో కనిపించింది. అగ్నిమాపక దళం మంటలను ఆర్పడానికి ప్రయ్తత్నిస్తోంది.

మే 4న ఆ చర్చిపై దాడి జరిగిందని థంగ్‌మిన్‌లున్ చెప్పారు. పక్కనే మరొక తెగకు చెందిన చర్చికి అంటుకున్న మంటలను అర్పడానికి ప్రయత్నించారు గానీ, తమ కుకి చర్చిని కాపాడడానికి ఎలాంటి ప్రయత్నాలూ జరగలేదని ఆయన చెబుతున్నారు.

700 మంది పట్టే చర్చి బాగా దెబ్బతిన్నదని, పక్కనే ఉన్న సిబ్బంది క్వార్టర్లు పూర్తిగా నాశనమైపోయాయని చెప్పారు.

ఒక మెయితెయి పాస్టర్ తయారుచేసిన చర్చిల జాబితాను బీబీసీకి చూపిస్తూ, 271 మెయితెయి చర్చిలపై దాడి జరిగిందని థంగ్‌మిన్‌లున్ చెప్పారు. అయితే, హిందూ గ్రూపుల మద్దతును కూడదీసుకోవడానికి ఈ చర్చిలపై దాడులు చేసి ఉంటారని థంగ్‌మిన్‌లున్ అనుమానిస్తున్నారు.

"ఓ మూక ఒక మెయితెయి పాస్టర్‌ను పట్టుకున్నారు. క్రైస్తవం వదిలి ఆత్మలను విశ్వసించే సంప్రదాయానికి వస్తారా అని అడిగారు. తన పూర్వీకుల నమ్మకాలతో తనకు ఎలాంటి సమస్యా లేదని ఆ పాస్టర్ చెప్పారు. అయితే, బైబిల్‌ను కాల్చేయమని ఆ మూక ఆయన్ను బలవంతపెట్టింది. అందుకు ఆయన అంగీకరించకపోవడంతో తీవ్రంగా కొట్టారు. కొన ఊపిరితో ఆయన ప్రాణాలు దక్కించుకున్నారు" అని థంగ్‌మిన్‌లున్ చెప్పారు.

కొంతమంది కుకి వర్గం వాళ్లు భయంతో ఇళ్లు వదిలి, కొండల్లో తలదాచుకుంటున్నారు

మే 28న తన ఇల్లు, చర్చిని ధ్వంసం చేశారని కుకి క్రిస్టియన్ ఖొంగ్సై బీబీసీతో చెప్పారు.

అప్పటికే ఆమె తన తల్లిదండ్రులతో పాటు ఇల్లు విడిపెట్టడంతో ప్రాణాలతో బయటపడ్డారు.

"చాలా భయంగా ఉంది. తిండి, నిద్ర లేదు. చాలా వేదన అనుభవిస్తున్నాం" అని ఆమె చెప్పారు.

చర్చికి వెళ్లలేకపోతున్నామని, ఒక క్రిస్టియన్‌గా బాధ్యతలు నిర్వహించలేక్పోతున్నందుకు సిగ్గుపడుతున్నాని అన్నారామె.

ఖొంగ్సై తండ్రి ఆర్మీలో పనిచేశారు. ఆమె గ్రామంలో చాలామంది ఆర్మీలో పనిచేసినవారే.

"చాలామంది పేదవాళ్లు. అయినా కూడా అందరం డబ్బులు వేసుకుని 2012లో కాంక్రీటు చర్చి కట్టుకున్నాం. మా అమ్మనాన్న, పక్కింటివాళ్లు అందరూ అన్నీ కోల్పోయారు" అని ఆమె చెప్పారు.

27 ఏళ్ల ఖొంగ్సై సివిల్ సర్వీస్‌లో చేరాలనుకుంటున్నారు. ఎలాగోలా దిల్లీ చేరుకున్నారు. ఆమె తల్లితండ్రులు వేరేచోటుకు తరలిపోయారు.

వెళుతున్నప్పుడు ఆమె తన సర్టిఫికెట్లన్ని తీసుకెళ్లిపోయారు. తమ ఇంటిని కూల్చేస్తారని ఆమె ముందే ఊహించారు.

"మే 4 సాయంత్రం అల్లరి మూకలు జేసీబీ పట్టుకుని కుకి గ్రామాలపై దాడిచేశాయి. స్థానిక మెయితెయిలు వాళ్లను అడ్దుకున్నారు. వాళ్లు వాపోక్పి వెళ్ళి అక్కడున్న మెయితెయి చర్చిని ధ్వంసం చేశారు" అని ఖొంగ్సై చెప్పారు.

మెయితెయి వర్గంలో ఒక చిన్న గ్రూపు ఈ హింసలకు పాల్పడుతోందని ఆమె ఆరోపిస్తున్నారు.

"మణిపుర్ ఇంకా మండుతోంది. మేం వెనక్కి వెళ్లి ఇళ్లు, చర్చిలు కట్టుకోగమని నాకనిపించట్లేదు" అన్నారామె.

మణిపుర్‌

ఫొటో సోర్స్, Getty Images

కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?

మణిపుర్ పోలీసులకు సహాయంగా భారత ప్రభుత్వం 20,000 మందికి పైగా సైన్యం, కేంద్ర పోలీసు సిబ్బందిని పంపించింది. ఈ నేరాల విచారణకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఒక శాంతి కమిటీని ఏర్పాటు చేశారు.

మెయితెయి తెగను ఎస్టీలుగా పరిగణించాలన్న డిమాండ్‌ను పరిశీలించమని రాష్ట్ర ప్రభుత్వానికి మణిపుర్ హైకోర్టు సూచించడం "పూర్తిగా తప్పు" అని సుప్రీంకోర్టు పేర్కొంది.

మే చివర్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మణిపుర్‌లో పర్యటించారు. జరుగుతున్న హింస గురించి కాథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి బృందంతో మాట్లాడారు.

ఇవి కూడా చదవండి: