కొలంబియా అమెజాన్: ప్రపంచాన్ని షాక్ చేసిన 4 దారుణ ప్రమాదాలు... చావు తప్పి బతికి బయటపడ్డ ఘటనలు

ఫొటో సోర్స్, Reuters
ఒక విషాదకరమైన సంఘటన తర్వాత, గతంలో జరిగిన ఇలాంటి ప్రమాదాల గురించి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు.
కొలంబియా అడవుల్లో తప్పిపోయిన నలుగురు చిన్నారులను 40 రోజుల తర్వాత కాపాడారు. ఈ చిన్నారులు తల్లితో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో వారు వెళ్తున్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో వారి తల్లితో పాటు మరో ఇద్దరు చనిపోయారు. ఈ సంఘటన ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది.
అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన నాలుగేళ్ల లెస్లీ, 9 ఏళ్ల టియెన్, 13 ఏళ్ల క్రిస్టిన్‌తో పాటు ఏడాది వయసున్న పసికందును సైనిక బలగాలు గుర్తించాయి. చిన్నారులు డీహైడ్రేషన్‌కు గురవడంతో పాటు, క్రిమికీటకాల బారిన పడినప్పటికీ వారు క్షేమంగానే బయటపడ్డారు.
దాదాపు బతకడం అసాధ్యమనుకున్న సందర్భాల్లోనూ ప్రాణాలతో బతికి బయటపడ్డ సంఘటనలు చరిత్రలో చాలానే ఉన్నాయి. అలాంటి నాలుగు ప్రధాన ఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
ఉరుగ్వే రగ్బీ ఆటగాళ్ళ విమాన ప్రమాదం
ఉరుగ్వేలోని మాంటెవీడియో ఓల్డ్ క్రిస్టియన్స్ క్లబ్‌కి చెందిన రగ్బీ ఆటగాళ్లు పలు దేశాల జట్ల మధ్య జరుగుతున్న టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి 1972వ సంవత్సరం అక్టోబర్ 13న శాంటియాగో డి చిలీకి బయలుదేరారు.
కానీ, వారు ప్రయాణించిన ఉరుగ్వే ఎయిర్‌ఫోర్స్ విమానం ఆండీస్ పర్వత శ్రేణుల్లో ప్రమాదానికి గురైంది.
ఈ విమానం ఎక్కడ కుప్పకూలిందో తెలియనప్పటికీ, ఈ విమాన అవశేషాలు, గల్లంతైన ప్రయాణికులను గుర్తించేందుకు సహాయక బృందాలు ఆ మంచు పర్వతాల్లో ఎన్నో రోజులు వెతికాయి. అయినా వారి ఆచూకీ దొరక్కపోవడంతో సహాయక చర్యలను నిలిపివేశారు.
వాళ్లందరూ ఆ ప్రమాదంలో చనిపోయి ఉంటారని అంతా భావించారు.
కానీ, ప్రమాదం జరిగిన సమయంలో, విమానంలో ప్రయాణిస్తున్న 45 మందిలో 12 మందే మరణించారు. రోజులు గడుస్తున్న కొద్దీ మరికొందరు చనిపోయారు. మంచుచరియలు విరగిపడడంతో అందులో కూరుకుపోయి మరో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
విమానంలో ఆహారం అయిపోవడంతో చనిపోయిన వారి మాంసం తిని మిగిలిన వారు ప్రాణాలు నిలుపుకున్నారు.
అదే ఏడాది డిసెంబర్‌లో రగ్బీ ఆటగాళ్లు రాబర్టో కానెస్సా, ఫెర్నాండో పరాడోలు సాయం కోసం పది రోజుల పాటు నడుచుకుంటూ వెళ్లారు. విమాన ప్రమాదం జరిగిన 72 రోజుల తర్వాత పర్వతాల్లో చిక్కుకుపోయిన మరో 14 మందిని కాపాడారు.

ఫొటో సోర్స్, Getty Images
మెక్సికో మిరాకిల్
1985 సెప్టెంబర్ 19న మెక్సికో నగరంలో 8.1 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం ధాటికి వేల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకుని వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఎంత మంది చనిపోయారో లెక్కలు కచ్చితంగా తేలలేదు. ప్రభుత్వం 3,692 మంది చనిపోయారని చెప్పగా, 10 వేల మందికి పైగానే చనిపోయారని రెడ్ క్రాస్ సంస్థ తెలిపింది.
సహాయక సిబ్బంది కుప్పకూలిన భవనాల శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టారు. భూకంపం సంభవించిన రోజులు గడిచినా శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న శిశువులను సిబ్బంది బయటకు తీశారు. అన్ని రోజుల తర్వాత పసికందులు ప్రాణాలతో బయటపడడంతో వారిని మిరాకిల్ బేబీస్‌గా అభివర్ణించారు.
భూకంప బాలుడు లేదా మిరాకిల్ బాయ్‌గా పిలిచే జీసస్ ఫ్రాన్సిస్కో ఫ్లోర్స్ వారిలో ఒకరు. భూకంపం వచ్చినప్పుడు ఆయన తల్లి గర్భంలో ఉన్నాడు.
ఇల్లు కూలిపోవడంతో గర్భంతో ఉన్న అతని తల్లి చనిపోయింది. కడుపులో బిడ్డను కాపాడేందుకు తన అమ్మమ్మ ఒక బ్లేడుతో తల్లి కడుపును కోసి బిడ్డను బయటకు తీసింది.

ఫొటో సోర్స్, AFP
భూగర్భంలో 69 రోజులు
చిలీలోని అటకమా ఎడారిలో ఉన్న కోపియాపో బంగారు, రాగి గనుల్లో 2010 ఆగస్ట్ 5న పైకప్పు కుప్పకూలి సుమారు 33 మంది మైనింగ్ సిబ్బంది 700 మీటర్ల అడుగున చిక్కుకుపోయారు.
గనిలో చిక్కుకుపోయిన వారు బతికుండే అవకాశం లేదని తొలుత అనుకున్నారు. అంతా నిరాశ అలుముకుంది. కానీ, బతికి ఉంటారేమోనన్న ఒక చిన్న ఆశతో బాధితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఆగస్టు 22న వారు ఒకచోట క్షేమంగా ఉన్నట్లు గుర్తించారు. ''మేం 33 మంది క్షేమంగా ఉన్నాం'' అనే సమాచారం బయటి ప్రపంచానికి తెలిసింది.
ఆ వెంటనే సహాయక సిబ్బంది బండరాళ్లను కట్ చేసే భారీ యంత్రాలను తెప్పించి సహాయక చర్యలు చేపట్టారు. లోపల చిక్కుకుపోయిన కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా జాగ్రత్త వహించారు.
బయటికి తీసుకొచ్చే ప్లాన్‌ను లోపల చిక్కుకుపోయిన వారికి తెలియజేసి, ఒక్కొక్కరిగా అందరినీ బయటకు తీశారు.
ప్రమాదం జరిగిన 69 రోజుల తర్వాత, భూగర్భంలో చిక్కుకుపోయిన కార్మికులు బయటపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
థాయిలాండ్ గుహలో 9 రోజులు
థాయ్‌లాండ్‌లోని చియాంగ్ రాయ్ ప్రావిన్స్‌కి చెందిన 12 మంది చిన్నారులు 2018 జూన్ 23న తమ సాకర్ కోచ్‌తో కలిసి వాకింగ్‌కి వెళ్లారు.
ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత పంట పొలాలు, కొండ ప్రాంతాల మీదుగా తమ బైకులపై రేసుకి వెళ్లారు. అప్పటికి కొద్దిరోజుల ముందే అక్కడ బాగా వర్షాలు పడ్డాయి.
అక్కడి థామ్ లువాంగ్ గుహకు వెళ్లాలనేది వారి ప్లాన్. మయి సాయ్ పర్వత శ్రేణుల అందాలు, అక్కడి ప్రకృతిని ఆస్వాదించేందుకు టీనేజర్లు ఇష్టపడుతుంటారు.
కేవలం తమ వద్ద ఉన్న ఫ్లాష్‌లైట్లతోనే చిన్నారులు గుహలోకి ప్రవేశించారు. అక్కడ ఒక గంట సేపు గడిపి తిరిగి వచ్చేద్దామనుకున్నారు.
అయితే, ఒక్కసారిగా వరద ప్రవాహం గుహను చుట్టుముట్టడంతో వారు అక్కడే చిక్కుకుపోయారు. నీరు లోపలికి చొచ్చుకొస్తుండడంతో వారు గుహలో మరింత లోపలికి వెళ్లిపోయారు.
గుహలో నీరు చేరని ప్రాంతం కోసం వెతుకుతూ వారు మరింత లోపలికి వెళ్లారు.
సుమారు నాలుగు కిలోమీటర్ల లోపలికి వెళ్లిపోయారు. ఒక చిన్న రాళ్ల సముదాయాన్ని ఆసరాగా చేసుకుని, అక్కడ దొరికిన రాళ్లతోనే 5 మీటర్ల లోతు మరో చిన్న గుహ తవ్వి, ఆ ప్రదేశంలో తలదాచుకున్నారు.
గుహలో చిక్కుకుపోయిన చిన్నారులను రక్షించేందుకు పలు దేశాలకు చెందిన కేవ్ డైవర్స్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. చీకటి గుహలో చిక్కుకుపోయిన ఆ చిన్నారులు తొమ్మిది రోజుల తర్వాత వెలుగును చూశారు.
ఇవి కూడా చదవండి:
- అంతర్జాతీయ స్నాన దినోత్సవం: 50 ఏళ్లుగా స్నానం చేయని మనిషి - స్నానం చేయించిన కొన్నాళ్లకే జబ్బు పడి మృతి
- దిండి: కేరళను తలపించే ఈ కోనసీమ రిసార్ట్స్ ప్రత్యేకత ఏమిటి?
- అమృత్సర్: ఆకలి ఎరుగని నగరం.. సిక్కుల సేవాగుణానికి ఇది ఎలా ఉదాహరణగా నిలుస్తోంది?
- హిమాలయాల్లోని 'రహస్య స్వర్గపు లోయల' మర్మమేంటి? ఈ ‘బీయూల్’ల గురించి ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టారా?
- కారు వాడుతున్నారా? ఈ 9 టిప్స్ మీకోసమే














