అలీనా: 13 వేల మందికి ఒకే డాక్టర్, చెరగని చిరునవ్వుతో వైద్యం చేస్తుంటే రోగులే ఆమెను బెదిరిస్తున్నారు...

ఫొటో సోర్స్, BBC/VIRMA SIMONETTE
- రచయిత, రూపెర్ట్ వింగ్‌ఫీల్డ్-హయెస్
- హోదా, అగుటాయా, మనీలా
ఎలుథెరా అబుస్ ఆరు నెలల క్రితం కింద పడిపోయారు. అప్పటినుంచి ఆమె కుడి చేతి నొప్పితో బాధపడుతున్నారు. అబుస్ వయస్సు 99 ఏళ్లు. విరిగిన ఎముక కదలడంతో కుడి చేతిని పైకి ఎత్తేటప్పుడు ఆమె నొప్పితో బాధపడ్డారు.
‘‘నేను చేయగలిగిందల్లా ఆమె నొప్పిని తగ్గించేందుకు ప్రయత్నించడమే. ఆమె చేతి ఎముకను పిన్ చేయాల్సి ఉంది. కానీ, కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి నిరాకరిస్తున్నారు’’ అని 28 ఏళ్ల డాక్టర్ అన్నారు. అబుస్ ఇంట్లోనే ఆమె చికిత్స అందిస్తున్నారు.
ఎలుథెరా కూతుళ్ళు మనసు లేని వారేమీ కాదు,పేదవాళ్లు.
వారు డీట్ అనే చిన్న ద్వీపంలో నివసిస్తారు. సముద్రం మీదుగా వందల మైళ్ల దూరంలో ఒక శస్త్ర చికిత్స కేంద్రం ఉంది. ఇదే వారికి అత్యంత దగ్గరగా ఉన్న శస్త్ర చికిత్స కేంద్రం.
అగుటాయా ద్వీపసమూహంలో డీట్ కూడా ఒక భాగం. పిలిప్పీన్స్‌లోని సులు సముద్రంలో ఈ ద్వీప సమూహాలు ఉన్నాయి.
అక్కడ నివసించే 13 వేల మంది ప్రజలు తమకు ఒక్కరే డాక్టర్ ఉన్నారని చెబుతుంటారు. ఆమె పేరు అలీనా.
సన్నగా, నాజూకుగా ఉండే అలీనా ముఖంపై ఎప్పుడూ నవ్వు ఉంటుంది. నవ్వులో ఆమె సంకల్పం కనిపిస్తుంది.
అక్కడి ద్వీపసమూహాల్లో ఆమె సందర్శించని ఒకే ఒక ద్వీపం అమన్‌పులో. టామ్ క్రూజ్, బియాన్స్ వంటి స్టార్లకు ఈ ద్వీపం ఆతిథ్యం ఇచ్చింది. ఇక్కడ విలాసవంతమైన రిసార్టులు ఉంటాయి. డీట్ బీచ్‌ల నుంచి 20 కి.మీ దూరంలో అమన్‌పులో ఉంటుంది.
కరోనా వైరస్ కంటే ముందు ఆమె డీట్ ద్వీపానికి చేరుకున్నారు. వైరస్ బారిన పడకుండా సామాజిక దూరం పాటించాలని ప్రజలపై ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా చంపేస్తామంటూ ఆమెకు బెదిరింపులు కూడా వచ్చాయి. అయినప్పటికీ అలాంటి బెదిరింపులకు అలవాటు పడి ఆమె అక్కడ జీవించడం నేర్చుకున్నారు.
ఆమె అక్కడ కొత్త వ్యాధులు, పాత వ్యాధులపై పోరాడారు. అగుటాయా ద్వీపంలో అసలైన మార్పులు తీసుకొచ్చేందుకే తాను అక్కడికి వెల్లినట్లు అలీనా చెప్పారు.
ఈ మారుమూల ద్వీపంలో ఒక్క గ్రాడ్యుయేట్‌ను కూడా మీరు చూడలేరు.
దేశంలోని అగ్రశ్రేణి వైద్య కళాశాలలో చదువుకున్న అలీనా, తన జీవితం అంతా మనీలాలోనే గడిపారు.
తన తోటివారిలా మెరుగైన జీవితం కోసం ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ బాట పట్టకుండా దేశంలోనే అత్యంత పేద మున్సిపాలిటీల్లో ఒకటైన డీట్ ద్వీపంలో సేవ చేయడం కోసం ఆమె స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.
డీట్‌లో వైద్య సేవలందించే ప్రభుత్వ కార్యక్రమంలో ఆమె స్వచ్ఛందంగా చేరారు.

ఫొటో సోర్స్, BBC/VIRMA SIMONETTE
కోవిడ్ సమయంలో సేవలు
మనీలా నుంచి అగుటాయా ప్రధాన ద్వీపానికి రెండున్నర రోజుల ప్రయాణం. మొదట విమాన ప్రయాణం. ఆ తర్వాత ఇలోయిలో అనే నగరం నుంచి ఓపెన్ డెక్ ఫెర్రీలో రాత్రిపూట 15 గంటల పాటు ప్రయాణించి క్యుయో అనే ద్వీపానికి చేరుకోవాలి. అక్కడ నుంచి అగుటాయాకు రాకపోకలు సాగించడానికి ఒకే ఒక మార్గం కనోయిలో ప్రయాణించడం.
ఇక్కడి భౌగోళిక పరిస్థితులు ఈ ద్వీపానికి వరం లాంటివి, అలాగే శాపం కూడా. ఈ ద్వీపసముదాయంలోని 12 లేదా అంతకంటే ఎక్కువ ద్వీపాల మధ్య రుతుపవనాలు వచ్చినప్పుడు కొన్ని రోజులు, వారాల పాటు సంబంధాలు తెగిపోతాయి. ఈ ద్వీపాలు సముద్రంలో వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో చెల్లాచెదురుగా విసిరేసినట్లుగా ఉంటాయి.
అక్కడ సాగు చేయగల భూమి తక్కువగా ఉంటుంది. ద్వీపంలో నివసించే వారంతా ప్రతీ దానికి సముద్రంపైనే ఆధారపడతారు.
డాక్టర్ అలీనా 2020 ఫిబ్రవరిలో అగుటాయాకు చేరుకున్నారు.
‘‘నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు 26 ఏళ్లు. చాలామంది నన్ను హైస్కూల్ విద్యార్థిగా పొరబడేవారు. నేను డాక్టర్ అని చెబితే ఎవరూ నమ్మకపోయేవారు’’ అని ఆమె నవ్వుతూ చెప్పారు.
అక్కడికి చేరుకున్న నెల రోజుల్లోపే ఆమెకు సవాలు ఎదురైంది. కరోనా వల్ల ఫిలిప్పీన్స్‌లో లాక్‌డౌన్ విధించారు. ద్వీపాలను మూసి వేశారు.

ఫొటో సోర్స్, BBC/ VIRMA SIMONETTE
‘‘తొలి ఏడాది బాగానే గడిచింది. స్థానికంగా కరోనా కేసులు పెద్దగా లేవు. కానీ, 2021లో పరిస్థితి మారిపోయింది. మనీలా నుంచి కూడా ఇక్కడికి రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో నాకు క్వారంటైన్ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రజలను క్వారంటైన్‌లో ఉండాలని చెప్పినప్పుడు వారు హింసాత్మకంగా స్పందించారు. చంపేస్తామంటూ బెదిరింపులు కూడా వచ్చాయి. నన్ను కాల్చేస్తామని కూడా నాకు చెప్పారు’’ అని ఆమె ఆరోజులను గుర్తు చేసుకున్నారు.
ప్రజలు ఎందుకు అంత తీవ్రంగా స్పందిస్తున్నారో ఆమెకు అర్థమైంది. అక్కడి ప్రజలకు ఉదయం పూట సముద్రంలో వేటాడితేనే రాత్రికి భోజనం ఉంటుంది. వారు ఇంటి నుంచి బయటకు వెళ్లకపోతే తినడానికి ఏమీ దొరకని పరిస్థితి. చేపలు పట్టేందుకు వెళ్లకపోతే వారు ఆకలితోనే ఉండిపోవాల్సి ఉంటుంది.
అప్పుడు ఏడ్వటం తప్ప ఏమీ చేయలేని రోజులు ఉన్నాయని ఆమె చెప్పారు.
2021 వేసవిలో టీకాలు ఇవ్వడం మొదలైనప్పుడు ఆమెకు మరో సవాలు ఎదురైంది.
‘‘ప్రతీ ద్వీపంలోని ఇంటింటికీ మేం వెళ్లాల్సి వచ్చింది. మూడు గంటల పాటు పడవలో ప్రయాణిస్తే అత్యంత దూరంలో ఉండే ద్వీపానికి చేరుకోవచ్చు. క్లినిక్‌కు రావడానికి చాలామంది ప్రజల వద్ద చార్జీలు కూడా ఉండవు. కాబట్టి వారు టీకా తీసుకోవడానికి క్లినిక్‌కు రాలేదు.
దూరం ఒక్కటే ఇక్కడ సమస్య కాదు. టీకాల గురించి కూడా చాలా తప్పుడు వార్తలు వచ్చాయి. టీకాలు మనుషుల్ని చంపగలవనే దుష్ప్రచారం జరిగింది. ఇక్కడి ప్రజలు సోషల్ మీడియాలో ఇలాంటివన్నీ చూస్తారు. అసలు వాస్తవాలను వారు గ్రహించలేరు’’ అని అలీనా చెప్పుకొచ్చారు.
ప్రజల నుంచి ప్రతిఘటన ఉన్నప్పటికీ టీకా కార్యక్రమం విజయవంతమైంది. ద్వీపసమూహం అంతటా 8 మంది మాత్రమే వైరస్ కారణంగా చనిపోయారు. ఇది కాస్త ఆమెకు ఉపశమనాన్ని కలిగించింది

ఫొటో సోర్స్, BBC/ VIRMA SIMONETT
‘‘మెడిసిన్ లేడీ’’
ప్రతిరోజు ఉదయం డాక్టర్ అలీనా,ఆమె బృందానికి మధ్య మీటింగ్ జరుగుతుండగా క్లినిక్ బయట ప్రజలు క్యూ కట్టడం మొదలవుతుంది.
ఆరోజు లైన్‌లో మొదట నిల్చొన్న వ్యక్తి యాబై ఏళ్ల వయస్సులో ఉన్నారు.
‘‘నేను ఇక్కడికి రాకముందు, ఇక్కడ అంతా సేంద్రీయ, తాజా ఆహారం దొరుకుతుందని అనుకున్నా. కానీ, ఇక్కడ పౌష్టికాహారం దొరకడం చాలా కష్టం. ’’ అని ఆమె చెప్పారు.
స్థానికులు ఉప్పులో ఆరబెట్టిన ఎండు చేపలను తింటారు. ఇది హై బీపీకి దారి తీస్తుంది. ఇక్కడ మంచి నీటి కంటే సులభంగా సాఫ్ట్ డ్రింక్స్ లభిస్తాయి. అది డయాబెటిస్‌కు కారణం అవుతోంది.
ఇవే కాకుండా టీబీ కేసులు కూడా అక్కడ ఎక్కువగా నమోదు అవుతాయి.
2022లో 45 కేసులను నమోదు చేసినట్లు అలీనా చెప్పారు. నిర్ధారణ కానీ కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని ఆమె తెలిపారు.
ఫిలిప్పీన్స్‌లో 10 లక్షల కంటే ఎక్కువ టీబీ కేసులు ఉన్నట్లు అంచనా. ‘‘ ఈ వ్యాధిని నిర్మూలించడమే లక్ష్యం. కానీ, సమీప భవిష్యత్‌లో ఇది అసాధ్యం’’ అని ఆమె అన్నారు.
ఆ ద్వీపంలో డెంగ్యూ వ్యాధి కొత్తది. జనవరిలో ఒక డెంగ్యూ కేసు నమోదు కాగా, మార్చి నాటికి వాటి సంఖ్య పదికి పెరిగింది.
డాక్టర్ అలీనా బృందం పాఠశాలల్లో దోమల నివారణకు మందులు పిచికారీ చేశారు. ప్రజలకు దోమతెరలను అందజేశారు.
అగుటాయా నుంచి డీట్‌కు వెళ్లడానికి ఆమె 11 గంటలకల్లా క్లినిక్ నుంచి బయటకు వచ్చారు. పడవలో 40 నిమిషాలు ప్రయాణించి డీట్‌కు చేరుకోవాలి.
అగుటాయా కంటే డీట్ మరింత సుందరంగా ఉంటుంది. కానీ, అగుటాయా కంటే పేద ద్వీపం. అక్కడ విద్యుత్ సౌకర్యం ఉండదు. మొబైల్ ఫోన్ టవర్ కూడా లేదు.
డాక్టర్ అలీనాను అక్కడివారు ‘‘మెడిసిన్ లేడీ’’ అని పిలుచుకుంటారు. ఆమెకు వారు చాలా ఉత్సాహంగా స్వాగతం పలికారు. బీచ్‌ల నుంచి పిల్లలు పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వచ్చారు.
గ్రామాల గుండా నడుస్తున్నప్పుడు ఆమె వెంటే పిల్లలు కూడా నడుస్తుంటారు.
వీల్‌చెయిర్‌లో ఇంటి ముందు కూర్చున్న ఇద్దరు వృద్ధులను ఆమె పరీక్షించారు. వారిద్దరూ పక్షపాతంతో బాధపడుతున్నారు.

ఫొటో సోర్స్, BBC/VIRMA SIMONETTE
40 ఏళ్ల మహిళ ఒడిలో కూర్చున్న మరో బాలుడిని ఆమె పరీక్షించారు. అతని పొత్తికడుపులో హెర్నియా ఉన్నట్లు ఆమె గుర్తించారు.
బాలుడికి శస్త్రచికిత్స అవసరం అని ఆ తల్లికి ఆమె చెప్పారు. వెంటనే ఆ తల్లి కళ్లలో ఆశ స్థానంలో ఆందోళన కనిపించినట్లు ఆమె తెలిపారు.
‘‘ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని నేను చెప్పినప్పుడు వారి కళ్లలో భయం, విచారాన్ని మీరు చూడొచ్చు. ఎందుకంటే దాన్ని నయం చేసే మందు నా దగ్గర లేదని వారికి అర్థం అవుతుంది. దాని ఖర్చులను ఎలా భరించాలి అని వారు ఆందోళన పడుతుంటారు. వారికి ఈ విషయాలు చెప్పడం నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది’’ అని అలీనా వివరించారు.
ప్రపంచంలోని మరో భాగంలో హెర్నియా అనేది చాలా చిన్న వైద్య ప్రక్రియ. కానీ, ఇక్కడ ఒక కుటుంబం పొదుపులను ఇది తుడిచిపెట్టేస్తుంది. వాళ్లను ఏళ్ల తరబడి అప్పుల్లోకి నెట్టుతుంది.
రవాణాను సులభతరం చేస్తే అది ఇక్కడ చాలా మార్పులను తెస్తుంది. కానీ, దానికి చాలా వనరులు అవసరం’’ అని ఆమె చెప్పారు.
ఆశావాదం, ఆశయంతో ఉండే అలీనా ఈ ద్వీపంలో మూడేళ్లు ఉన్న తర్వాత నిరుత్సాహానికి గురవుతున్నారు. దేనికైనా వనరులు, డబ్బు అతిపెద్ద సవాలుగా నిలుస్తాయని ఆమె నిరాశ చెందుతున్నారు.

ఫొటో సోర్స్, BBC/VIRMA SIMONETTE
‘‘నేను చాలా ఆదర్శాలతో ఇక్కడికి వచ్చాను. స్థానిక ఆరోగ్య వ్యవస్థ పనితీరును మార్చేందుకు నేను చాలా దూకుడుగా ప్రయత్నించా. కానీ, ఇక్కడి వ్యవస్థలో పెద్ద మార్పులు తీసుకురావడానికి మూడేళ్ల సమయం చాలా తక్కువ వ్యవధి అని అర్థమైంది’’ అని అలీనా నిరాశ వ్యక్తం చేశారు.
అలీనా మూడేళ్ల కాంట్రాక్టు మీద అగుటాయాకు వచ్చారు. ఇప్పుడు అది ముగిసింది. ఆమె వెళ్లిపోవడం చాలా బాధగా ఉందని చాలామంది ద్వీపవాసులు చెప్పారు.
‘‘సమయం చాలా తొందరగా గడిచిపోతుంది. అలీనా నిస్వార్థపరురాలు, కష్టపడి పనిచేసే వ్యక్తి’’ అని అక్కడి సీనియర్ నర్సింగ్ అసిస్టెంట్లలో ఒకరైన రికార్డో అన్నారు.
మనీలాకు తిరిగొచ్చిన తర్వాత ఆమెకు పలవాన్‌లోని ప్రావిన్షియల్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్‌లో ఉద్యోగం ఆఫర్ చేశారు. కానీ, ఆమె దాన్ని తిరస్కరించారు. బదులుగా ఆమె చారిటీలో లేదా ఎన్జీవోలు పని చేయాలని ఉన్నట్లు చెప్పారు.
గత వారం ఆమె ఎన్జీవో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా స్పెషలిస్టు వైద్యులతో కలిసి అగుటాయాకు చేరుకున్నారు. ఈ బృందం చిన్న చిన్న సర్జరీలను చేస్తుంది.
కానీ, ఈసారి ఆమెకు అగుటాయా చేరుకోవడానికి మూడు రోజుల సమయం పట్టలేదు. మనీలా నుంచి అమన్‌పులో ద్వీపానికి వారు ప్రైవేట్ విమానంలో మూడుగంటల్లో చేరుకున్నారు. అంతర్జాతీయ దాతలు వారికి నిధులు సమకూర్చారు.
ఇవి కూడా చదవండి:
- కెనడా నుంచి వందల మంది భారతీయ విద్యార్థులు వెనక్కి వచ్చేయాల్సిందేనా? అసలేం జరిగింది?
- అమెజాన్ అడవుల్లో కూలిన విమానంలోని నలుగురు పిల్లలు 40 రోజుల తర్వాత ప్రాణాలతో దొరికారు
- వక్షోజాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకుంటే ఏమవుతుంది?
- రాక్ క్లైంబింగ్ సురక్షితంగా చేయడం ఎలా... ట్రైనర్ చెప్పే పాఠాలేంటి?
- మీ డేటా చోరీకి గురైతే ఏమవుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














