పురుషుల్లోనూ ప్రసవానంతర కుంగుబాటు, దీని నుంచి బయటపడేదెలా?

డిప్రెషన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆండ్రూ మేయర్స్
    • హోదా, ది కన్వర్జేషన్

పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ (ప్రసవానంతర కుంగుబాటు) కేవలం మహిళలపైనే ప్రభావం చూపుతుందని చాలా మంది అనుకుంటారు.

నిజానికి, అది పురుషులపై కూడా ప్రభావం చూపుతుంది. సుమారు 10 శాతం మంది తండ్రులపై ఈ డిప్రెషన్ ప్రభావం ఉండొచ్చని ఓ అధ్యయనం అంచనా వేసింది.

ఇది తరచుగా జరిగేదే అయినప్పటికీ, దాని గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. అందువల్ల పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కు గురైతే దాని నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవడం కష్టతరమవుతుంది.

ఎందుకలా జరుగుతుంది?

పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కి చాలా కారణాలున్నాయి. అందరూ అనుకున్నట్లుగా ఇది కేవలం హార్మోన్ల వల్ల మాత్రమే కలగదు. మహిళల్లోనూ ఈ తరహా డిప్రెషన్‌ కలగడంలో హార్మోన్ల ప్రభావం తక్కువే.

గతంలో డిప్రెషన్‌‌కి గురైన సందర్భాలు, బిడ్డ పుట్టిన తర్వాత నిద్రలేమి సమస్యలు, చుట్టూ ఉన్న వారి మద్దతు లేకపోవడం, ఆర్థిక సమస్యల వంటి ఇబ్బందికర పరిస్థితులు పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కి దారితీస్తాయి.

ఇది ఏ వయసు వారిలోనైనా కలిగే అవకాశముంది.

పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌ లక్షణాలు, డిప్రెషన్‌ లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. నిరాసక్తత, మోటివేషన్ లేకపోవడం, నిద్ర లేకపోవడం, తాను ఏం చేయలేనన్న భావన, ఏకాగ్రత లేకపోవడం, ఆకలిగా అనిపించకపోవడం, బరువు తగ్గినట్టుగా అనిపించడం, అలసట, మరణం గురించి లేదా ఆత్మహత్య ఆలోచనలు వారిలో కనిపిస్తాయి.

మనిషి ఎప్పుడైనా డిప్రెషన్‌‌కి గురయ్యే అవకాశం ఉంటుంది. కానీ, పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ బిడ్డ పుట్టిన తర్వాత మాత్రమే కలుగుతుంది. ఈ రెండింటికీ మధ్య ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఇదే.

బిడ్డ పుట్టిన తర్వాత మానసికంగా ఆరోగ్యంగా ఉండడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అది సహజమే. బిడ్డకు తండ్రి కావడం అనేది, దాదాపు జీవితంలోని అన్ని అంశాల్లో మార్పులు తీసుకొచ్చే ఒక భావోద్వేగ పరిస్థితి. రోజువారీ దినచర్య నుంచి, భాగస్వామితో సంబంధం, ప్రతి రోజూ రాత్రి నిద్రపై కూడా దాని ప్రభావం ఉంటుంది.

కొన్నివారాలుగా నిరాసక్తత, మోటివేషన్ లేకపోవడం వంటి లక్షణాలు కనిపించినా, లేదా పుట్టిన శిశువుకు దగ్గరవడం కష్టంగా అనిపించినా వెంటనే మీరు మానసిక వైద్య నిపుణుడిని సంప్రదించవచ్చు.

బిడ్డ పుట్టిన తర్వాత ఎప్పుడైనా ఈ పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ కలగొచ్చు. అది కేవలం బిడ్డ పుట్టిన కొన్ని నెలల్లోనే కలుగుతుందనడానికి లేదు. ఒక ఏడాది తర్వాత అయినా, లేదంటే రెండేళ్ల తర్వాత అయినా ఈ డిప్రెషన్ కలగొచ్చు.

డిప్రెషన్

ఫొటో సోర్స్, Getty Images

సాయం పొందడమెలా?

ఈ పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ దానంతట అదిగా తొలగిపోదు.

డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే మీరు సాయం తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అది కేవలం మీ ఒక్కరిపైనే కాకుండా పుట్టిన శిశువుకి, మీకు మధ్య బంధాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

అన్నింటికంటే ముందు, మనల్ని ప్రేమించేవారి నుంచి, లేదా స్నేహితులు, లేదా డాక్టర్ సాయం తీసుకోవడం తప్పేమీ కాదని తెలుసుకోవాలి. ఇందులో సిగ్గుపడాల్సిన విషయం కూడా లేదు. అది మిమ్నల్ని బలహీనపరుస్తుందని అనుకోవాల్సిన పని లేదు. అలాగని, పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ కారణంగా మీరు విఫలమవ్వాల్సిన అవసరం కూడా లేదు.

ఇతరుల సాయం అడగడం కొంచెం కష్టంగానే అనిపించొచ్చు. కానీ, అలా కష్టంగా అనిపించడాన్ని గుర్తించడమే అందులో ప్రధానం. ఇది ఇతరులతో మాట్లాడేందుకు మీలో కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు సాయపడుతుంది.

సంబంధిత కథనాలు
డిప్రెషన్

ఫొటో సోర్స్, Getty Images

ఎవరితోనైనా ఈ విషయం గురించి మాట్లాడేటప్పుడు మీకు నిజంగా ఎలా అనిపిస్తుందో చెప్పడం చాలా ముఖ్యం. ఇది చాలా సాధారణమైన విషయమే, ఈ మధ్య కోపం కూడా వస్తోందని అనిపిస్తుంది.

మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పురుషుల్లో ఎక్కువ మంది కోపంగా కనిపించడానికి వాళ్లు అలా ఫీలవ్వడమే కారణం. లేదా ప్రేమించిన వారు ఎక్కడ దూరమైపోతారోనన్న బాధ, లేదా తమను ఎవరూ పట్టించుకోవడం లేదన్న భయం కూడా కావొచ్చు. సంయమనంతో ఉండడం ద్వారా ఆ కోపాన్ని నియంత్రించొచ్చు.

మీ భావోద్వేగాలను పంచుకునేందుకు సరైన వాతావరణం ఉందో లేదో కూడా చూసుకోవాలి. ఉదాహరణకు కొంతమంది తమ భావోద్వేగాలను చాట్ గ్రూప్స్‌లో పంచుకుంటారు. మరికొందరు స్నేహితులతో చెప్పుకోవడాన్ని మరింత సౌకర్యంగా భావిస్తున్నట్లు తేలింది.

మీ అనుభవాలను పంచుకునే ముందు ఇలాంటి పరిస్థితులను ఇతరులు ఎలా ఎదుర్కొన్నారో అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. ఒక వేళ మీ స్నేహితుల్లో ఎవరికైనా బిడ్డ పుట్టిన సమయంలో పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌‌ వంటి అనుభవముంటే వారితో మాట్లాడొచ్చు.

మనం ప్రేమించే వ్యక్తులతో మాట్లాడడం కూడా ఇబ్బందిగా అనిపిస్తోందని భావిస్తే మెంటల్ హెల్త్ యాప్‌ల ద్వారా సాయం పొందవచ్చు. ఈ యాప్‌ల ద్వారా మీ ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం ఉందని గుర్తించారు. ఈ విషయంలో మీకు సహాయపడే యాప్‌లు చాలా ఉన్నాయి.

''తల్లిదండ్రుల్లో పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ కలగడం నిజమే. దాన్ని గుర్తించడం కూడా చాలా ముఖ్యం. గతంతో పోలిస్తే ఈ డిప్రెషన్‌‌పై అవగాహన చాలా పెరిగింది. అవసరమైన సాయం కూడా లభిస్తోంది.'' అని యూకేలోని బోర్న్‌మౌత్ యూనివర్సిటీ సైకాలజీ విభాగంలో సీనియర్ స్కాలర్ ఆండ్రూ మేయర్స్ చెప్పారు.

ఇవి కూడా చదవండి: