హిందూ మహాసముద్రంలోని అమెరికా-బ్రిటన్ రహస్య సైనిక స్థావరంలో 20 నెలలుగా ‘నరకం’ అనుభవిస్తున్న తమిళులు

ఫొటో సోర్స్, HANDOUT
- రచయిత, అలీస్ కడీ, స్వామినాథన్ నటరాజన్
- హోదా, బీబీసీ న్యూస్
పదుల సంఖ్యలో తమిళ వలసదారులు హిందూ మహాసముద్రంలోని ఒకచిన్న బ్రిటిష్ భూభాగంలో కొద్ది నెలలుగా చిక్కుకుపోయారు. ప్రమాదంలో చిక్కుకున్న ఫిషింగ్ బోటు నుంచి వారిని కాపాడి అక్కడికి తరలించారు.
అక్కడి పరిస్థితులు నరకాన్ని తలపిస్తున్నాయని వారు చెబుతున్నారు. అక్కడి చట్టాల కారణంగా వారు భయందోళనకు గురవుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని కోరుకుంటున్నప్పటికీ వారు నిస్సహాయ స్థితిలో ఉన్నారు.
గోప్యత కోసం వలసదారుల పేర్లు మార్చాం.
2021 అక్టోబర్‌లో ఓ రోజు ఉదయం డియెగో గర్సియా ద్వీపానికి సమీపంలో ఓ ఫిషింగ్ బోటు ప్రమాదంలో చిక్కుకుంది.
ఆ ఫిషింగ్ బోటు వ్యవహారం డియెగో గర్సియా ద్వీపం అధికారుల దృష్టికి వచ్చింది. హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్న ఆ ద్వీపం అమెరికా - బ్రిటన్ రహస్య సైనిక స్థావరం. ద్వీపం చుట్టుపక్కల వేల కిలోమీటర్ల దూరం వరకూ ఎవరూ కనిపించరు. అక్కడికి వచ్చేందుకు ఎవరికీ అనుమతి లేదు.
బోటులో ఉన్న 89 మంది శ్రీలంకకు చెందిన తమిళులని, అక్కడి పరిస్థితులను భరించలేక వారు పారిపోతున్నట్టు తెలిసింది. నిజానికి వారు ఆ ద్వీపానికి వెళ్లాలని అనుకోలేదు.
వాళ్లు కెనడా వెళ్లాలని అనుకున్నారు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడం, వారి బోటు ఇంజిన్‌లో సమస్యలు తలెత్తడంతో సముద్రంలో చిక్కుకుపోయినట్లు వారి వద్దనున్న మ్యాప్స్, జీపీఎస్ డేటా, డైరీలో వారు రాసుకున్న వివరాల ఆధారంగా గుర్తించారు.
బోటులో సమస్య తలెత్తడంతో సమీపంలో ఏదైనా సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని అనుకున్నామని ఆ బోటులో ఉన్న ఒకరు చెప్పారు. ''చిన్న వెలుతురు కనిపించడంతో బోటును నెట్టుకుంటూ డియెగో గర్సియా ద్వీపం వైపు వెళ్లాం'' అని బీబీసీకి చెప్పారు.
ఆ సమయంలో రాయల్ నేవీ షిప్ సాయంగా వచ్చి బోటును ద్వీపానికి చేర్చింది. అందరికీ అక్కడ తాత్కాలికంగా వసతి ఏర్పాటు చేశారు.
అది దాదాపు 20 నెలల కిందట జరిగింది. వలసదారులు ద్వీపం వైపు ఎందుకొచ్చి ఉంటారనే దిశగా డియెగో గర్సియా అధికారులను అడిగి లండన్ అధికారులు వివరాలు సేకరించారు.
ఇప్పటికే అక్కడి భయంకర పరిస్థితులు తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించారు. ఇప్పటికీ వారు అక్కడే ఉన్నారు.
వలసదారులను ద్వీపంలో ఉంచినట్లు తెలిసిన వెంటనే వారి సమాచారం కోసం విదేశాంగ కార్యాలయాన్ని సంప్రదించినట్లు వారి తరఫు న్యాయవాది బీబీసీకి చెప్పారు. ఆ తదనంతర పరిణామాలతో ఇప్పుడేం చేయాలని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
ఇంజిన్‌కు మరమ్మతులు చేయించేందుకు ప్రయత్నిస్తున్నామని మొదట చెప్పారు. కానీ ఆ తర్వాత, వారు ద్వీపంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని, అలాంటి వారిని ఉపేక్షించలేమని డియెగో గర్సియా యంత్రాంగం వాదించింది. డియెగో గర్సియా మాటే నిజమని తర్వాత తేలింది.

ఫొటో సోర్స్, HANDOUT
సురక్షిత దేశానికి పంపించాలని లేఖ
ద్వీపంలో ఉన్న తమిళులు అక్కడి బ్రిటిష్ దళాల కమాండర్‌కు ఓ లేఖ రాశారు. తాము వేధింపులు భరించలేక పారిపోయి వచ్చామని, 18 రోజుల ముందు భారత్‌లోని తమిళనాడు నుంచి బయలుదేరినట్లు తెలిపారు. ''ఏదైనా సురక్షిత దేశానికి పంపించాలని కోరుకుంటున్నాం'' అని ఆ లేఖలో రాశారు.
2009లో శ్రీలంకలో జరిగిన అంతర్యుద్ధంలో ఓడిపోయిన తమిళ టైగర్ తిరుగుబాటుదారులతో తమకు సంబంధాలున్నాయని, అందుకే తమను వేధిస్తున్నారని వారిలో చాలా మంది చెప్పారు. లైంగిక వేధింపులు, చిత్రహింసలకు గురైనట్లు వారిలో కొందరు ఆరోపించారు.
డియెగో గర్సియా ద్వీపాన్ని అధికారికంగా బీఐవోటీగా వ్యవహరిస్తారు.
తొలిసారి ఒక సమూహం ఆశ్రయం కోసం బ్రిటిష్ ఇండియన్ ఓషెన్ టెరిటరీ(బీఐవోటీ)కి వచ్చినట్లు గుర్తించామని లండన్‌లోని ఓవర్‌సీస్ టెరిటరీస్ డైరెక్టర్ పాల్ క్యాండ్లర్ ధ్రువీకరించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రస్తుతం అక్కడున్న వాళ్లకు బయటి ప్రపంచంతో మాట్లాడే అవకాశాలు లేకపోవడంతో అనేక వార్తలు వ్యాప్తి చెందుతున్నాయని తెలిపింది.
దీనిపై మీడియా సంప్రదించినప్పుడు, విషయం బ్రిటన్ ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, సాధ్యమైనంత త్వరగా దీన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఆ తర్వాతి నెలల్లో డియెగో గర్సియాకు మరిన్ని బోట్లు వచ్చాయని లండన్‌కు సమాచారం అందింది. శ్రీలంక నుంచి మరికొంత మంది అక్కడికి వెళ్లారని, వారి సంఖ్య దాదాపు 150కి చేరి ఉంటుందని న్యాయవాదులు చెబుతున్నారు.
అయితే, ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్న అలాంటి వారికి, ఇప్పుడిప్పుడే అక్కడ చిక్కుకుపోయిన వారి వాస్తవ పరిస్థితి గురించి తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Handout
‘బోటులో వచ్చిన వ్యక్తే లైంగిక దాడికి పాల్పడ్డాడు’
''నేను బతికే ఉన్నాను. ఆహారం దొరుకుతుంది. చిత్రహింసల నుంచి తప్పించుకున్నా. మొదట సంతోషంగానే అనిపించింది.'' అని అక్కడ చిక్కుకుపోయిన మహిళ లక్షణి గత నెలలో బీబీసీకి చెప్పారు.
''కానీ, ఆ తర్వాత నరకంలా మారిపోయింది'' అని ఆమె అన్నారు.
తనతో బోటులో వచ్చిన వ్యక్తే గత అక్టోబర్‌లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, అతన్ని కూడా తనతో పాటు ఒకే టెంటులో ఉంచారని ఆమె చెప్పారు. అరిచి మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదని ఆమె అన్నారు.
ఈ ఘటనపై ఫిర్యాదు చేయాలని అనుకున్నానని, అయితే బట్టలు ఉతికేయడంతో సాక్ష్యాలు సేకరించడం కష్టమని చెప్పారని ఆమె అన్నారు.
వారం రోజులపాటు అతనితో ఒకే టెంటులో ఉండాల్సి వచ్చిందని, చివరికి అధికారులు అతన్ని మరో చోటుకు మార్చేందుకు ఒప్పుకున్నారని ఆమె చెప్పారు.
అయితే, ఈ ఆరోపణలపై స్పందించేందుకు బ్రిటన్ ప్రభుత్వం, బీఐవోటీ అధికారులు నిరాకరించారు.
తమ దుస్థితిని, ఇక్కడి ఇబ్బందికర పరిస్థితులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించామని లక్షణి సహా మరికొందరు బీబీసీకి చెప్పారు. చేతికి దొరికినవి మింగేశామని, ఒంటిపై గాయాలు చేసుకున్నామని వారు చెప్పారు.
ఆ శిబిరంలో రెండు లైంగిక దాడి ఘటనలు, 12 ఆత్మహత్యా యత్నాలు జరిగినట్లు తెలిసిందని న్యాయవాదులు చెబుతున్నారు.

''మేం శారీరకంగా, మానసికంగా అలసిపోయాం. జీవం లేని జీవితం గడుపుతున్నాం. చచ్చిన శవంలా బతుకుతున్నాం'' అని విదుసన్ అనే మరో వ్యక్తి చెప్పారు. రెండుసార్లు తన శరీరానికి తానే హాని చేసుకున్నానని ఆయన బీబీసీకి చెప్పారు.
తనను కాపాడాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించడంతో ఆశలు వదులుకున్నానని, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు ఆధవన్ చెప్పారు.
బోనులో బంధించిన జంతువులా నేనిక్కడ బతకాలని అనుకోవడం లేదని ఆయన అన్నారు. తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు తనతో ఉన్న మహిళకు చెప్పానని, ఆమె వెంటనే క్యాంప్ అధికారులకు చెప్పడంతో వైద్యం అందించారని చెప్పారు.
తన భర్త కూడా ఆత్మహత్యాయత్నం చేశారని అదే క్యాంపులో ఉంటోన్న శాంతి అనే మరో మహిళ చెప్పారు.
2021లో శ్రీలంక సైనికులు తనపై అత్యాచారం చేశారని, చిత్రహింసలు పెట్టారని లక్షణి ఆరోపించారు. మళ్లీ అక్కడికే పంపిస్తామని ఓ అధికారి చెప్పడంతో తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశానని ఆమె చెప్పారు.
అయితే, అక్కడి వలసదారులు చెబుతున్న విషయాలపై బ్రిటన్ ప్రభుత్వం, వలసదారుల శిబిరాలకు పహారా కాస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీ జీ4ఎస్ స్పందించలేదు.
క్యాంప్‌లో ఉంటున్న వలసదారులతో తమ అధికారులు మర్యాదగానే ప్రవర్తిస్తున్నారని జీ4ఎస్ కంపెనీ చెబుతోంది.
వలసదారుల సంక్షేమం, భద్రతకు తాము ప్రాధాన్యం ఇస్తున్నామని యూకే ప్రభుత్వ అధికార ప్రతినిధి చెప్పారు. వారితో ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరుపుతామన్నారు. వారికి ఉత్తమ వైద్య సేవలు కూడా అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
అయితే, అక్కడ నిరాహార దీక్షలు కూడా జరిగాయని, వాటిలో చిన్నారులు కూడా పాల్గొంటున్నారని న్యాయవాదులు చెప్పారు.
నిరాహార దీక్షలు చేసినందుకు బీఐవోటీ నిబంధనలను ఒప్పుకుంటున్నట్లు పత్రాలపై సంతకం చేయాలని బీఐవోటీ కమిషనర్ ఒత్తిడి చేశారని, వాటిపై సంతకాలు చేయకపోవడంతో వారి ఫోన్లు లాగేసుకున్నారని న్యాయవాదులు చెబుతున్నారు. టెలిఫోన్ సదుపాయం కూడా తీసేశారని, వైద్య సేవలు కూడా అందించడం లేదని చెప్పారు.
అయితే, బీఐవోటీ అధికారులు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో వారిపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో తమకు తాము హాని చేసుకోకుండా నివారించేందుకు వారికి దగ్గర్లోని పదునైన వస్తువులను అక్కడి నుంచి తొలగించామని చెప్పారు.

ఫొటో సోర్స్, HANDOUT
డియెగో గర్సియా సైనిక స్థావరం నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే స్థలం కాదు.
మారిషస్‌ను పరిపాలించిన సమయంలో డియెగో గర్సియా ద్వీపం ఉన్న చాగోస్ ఐలాండ్స్‌ను కూడా బ్రిటన్ తన నియంత్రణలోకి తెచ్చుకుంది. 1965లో మారిషస్ నుంచి వెళ్తూ అక్కడ తమ బేస్ ఏర్పాటు చేసుకునేందుకు సుమారు వెయ్యి మందిని అక్కడ వదిలి వెళ్లింది.
అఫ్గానిస్తాన్, ఇరాక్‌పై బాంబులు వేసేందుకు ఈ ద్వీపం నుంచే అమెరికా తన యుద్ధ విమానాలను పంపింది. అమెరికా నిఘా సంస్థ సీఐఏ బ్లాక్ సైట్‌గా దీన్ని చెబుతారు. అనుమానిత ఉగ్రవాదులను ప్రశ్నించేందుకు ఈ బేస్‌ను వినియోగిస్తుంది.
గతంలో కోవిడ్ సమయంలో మిలటరీ అధికారుల ఐసోలేషన్ కోసం ఉపయోగించిన టెంట్‌లను వలసదారుల శిబిరంగా మార్చినట్లు కోర్టులో సమర్పించిన పత్రాల్లో తెలిపారు. ఆ టెంట్‌ల చుట్టూ ఫెన్సింగ్ ఉందని, వైద్య సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్కడి నుంచి బయటికి వెళ్లాలంటే జీ4ఎస్ కంపెనీ గార్డులను వెంటబెట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది.
తమకు కనీస స్వాతంత్ర్యం లేదని, ''మేము చిలుకలం. పంజరంలో ఉన్నాం'' అని శాంతి అన్నారు.
ఏడాది కిందట ప్రాథమిక విద్య అందుబాటులోకి వచ్చిందని, కానీ ఎలుకల బెడద కారణంగా కొన్నిసార్లు తరగతులు బయట నిర్వహించాల్సి వస్తోందని వలసదారుల తరఫు న్యాయవాదులు చెబుతున్నారు.
తమ పిటిషన్లను తిరస్కరించడంతో కొందరు ఇప్పటికే తమ ఇంటికి తిరిగి వచ్చేశారని, మరికొందరు హిందూ మహాముద్రంలోని మరో ద్వీపం రీయూనియన్‌కు బయలుదేరారని చెప్పారు. రీయూనియన్ ద్వీపం ఫ్రాన్స్ నియంత్రణలో ఉంది.
ఇంకా సుమారు 60 మంది తమిళులు అక్కడే ఉన్నట్లు అంచనా. వేల మైళ్ల దూరంలో ఉన్న యూకేలోని కోర్టుల నిర్ణయాల కోసం వారు ఎదురుచూస్తున్నారు.

అవి బీఐవోటీకి వర్తించవు..
శరణార్థులకు ఆశ్రయం కల్పించే అంతర్జాతీయ ఒప్పందాలపై యూకే సంతకాలు చేసినప్పటికీ అది బీఐవోటీకి వర్తించవని యూకే ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. యూకే వెలుపల ఉన్న ఈ ప్రాంతానికి సంబంధించి రాజ్యాంగంలో ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు ఉన్నట్లు చెబుతోంది.
అయితే, వారిని తిరిగి శ్రీలంకకు పంపాలా? లేదా ఏదైనా సురక్షిత దేశానికి పంపాలా? అనేది నిర్ణయించాల్సి ఉంది.
ఈ ప్రక్రియలో చట్టబద్దతను ప్రశ్నించడం అన్యాయమని డియెగో గర్సియాలో చిక్కుకుపోయిన వారి కోసం పనిచేస్తున్న లండన్‌కు చెందిన లీడే సంస్థకు చెందిన న్యాయవాది టెస్సా గ్రొగెరీ అన్నారు.
హడావిడి విచారణల కారణంగా కొందరు వలసదారులను తిరిగి శ్రీలంక పంపించాలనే నిర్ణయాలు తీసుకున్నారని, ఆ తర్వాత పూర్తి విచారణ జరిగినప్పటికీ అనువాద లోపాలు ఉన్నాయని ఆమె చెప్పారు. అటు శ్రీలంక, ఇటు యూకే కాకుండా మూడో సురక్షిత దేశాన్ని యూకే ప్రభుత్వం ఇంకా గుర్తించనందున మిగిలిన వారు అయోమయంలో ఉన్నారని అన్నారు.
అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా, వలసదారుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుంటామని యూకే చెబుతోంది.
డియెగో గర్సియాలో వలసదారుల అనారోగ్యానికి గురవుతున్నారన్న నివేదికలపై యూకేలోని యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ ఏజెన్సీ(యూఎన్‌హెచ్‌సీఆర్) ఆందోళన వ్యక్తం చేసింది. యూకే అధికార యంత్రాంగం అనుమతులు కోరామని, ఇప్పటి వరకూ రాలేదని తెలిపింది.
వలసదారుల సంక్షేమం కోసం అన్ని అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని, బ్రిటిష్ నియంత్రణలోని భూభాగంలో ఉన్నందున యూకే ప్రభుత్వం రక్షణ కల్పించాల్సిందేనని మానవ హక్కుల విభాగంలో యూకే అడ్వొకసీ అండ్ కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ ఎమిలీ మెక్‌డొనెల్ అన్నారు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం బీఐవోటీ అధికారులతో నిత్యం సంప్రదింపులు జరుగుతున్నాయని యూకే ప్రభుత్వం బీబీసీకి గత వారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే అందుకు కచ్చితమైన సమయం చెప్పలేమని పేర్కొంది.
ఇరవై నెలలుగా నిరీక్షిస్తున్నామని, ఇక ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి చేరతామనే ఆశ ఎవరిలోనూ కనిపించడం లేదని డియెగో గర్సియాలో చిక్కుకుపోయిన ఒక వలసదారుడు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఎవరికీ తెలియని రహస్య పర్వతం ఉన్న ప్రాంతాన్ని సమంత టీం ఎలా గుర్తించింది?
- మెదడు మార్పిడి ఎందుకు సాధ్యం కావట్లేదు? కోతి తలను మార్చినప్పుడు ఏం జరిగింది?
- గ్లాడియేటర్ సీక్వెల్ షూటింగ్: దూసుకొచ్చిన భారీ అగ్నిగోళం, చిత్ర బృందానికి గాయాలు
- చిరునవ్వులు నేర్చుకోవడానికి గంట క్లాసుకు రూ. 4,500
- కారు వాడుతున్నారా? మీకోసమే ఈ తొమ్మిది టిప్స్














