స్పై డెత్స్: మజ్జోరే సరస్సు పడవ మునకలో గూఢచారుల మరణాలపై అనేక సందేహాలు

మజ్జోరే సరస్సు

ఫొటో సోర్స్, SHUTTERSTOCK

ఫొటో క్యాప్షన్, ప్రయాణీకులతో సరస్సులో మునిగిపోయిన పడవను ఇంకా బయటకు తీయలేదు
    • రచయిత, సోఫియా బెటిజా
    • హోదా, బీబీసీ న్యూస్, రోమ్

మజ్జోరే సరస్సులో మే 28వ తేదీన మునిగిపోయిన పడవ కథలో ఒక గూఢచారి నవలలో ఉండాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి.

స్విస్ ఆల్ఫ్స్‌కు దక్షిణాన ఉన్న ప్రసిద్ధ, సుందరమైన ఈ సరస్సులో నలుగురు వ్యక్తులు విషాదకరంగా మునిగిపోయారు.

అందులో ఒకరు ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మోసాద్‌కు చెందిన మాజీ ఏజెంట్ కాగా, మరో ఇద్దరు ఇటలీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు. నాలుగో వ్యక్తి రష్యాకు చెందిన ఒక మహిళ.

సరస్సులో విహారానికి బయల్దేరిన చిన్న పడవలో ఎక్కిన 23 మందిలో ఈ నలుగురూ ఉన్నారు.

ఆ ప్రమాదంలో తమ సన్నిహితులను కోల్పోయి ప్రాణాలతో బయటపడిన వారికి ఇదొక బాధాకరమైన ఘటన అని చెప్పడంలో సందేహం లేదు.

కానీ, ఈ కేసులోని కొన్ని వాస్తవాలు అసలు అక్కడ ఏం జరిగిందనేదానిపై ఊహాగానాలకు దారి తీశాయి.

మజ్జోరే సరస్సు, దాని తీరప్రాంతాలు ఇటలీకి చెందిన లాంబార్డీ, పీడ్మాంట్‌లతో పాటు స్విస్‌కు చెందిన కాంటన్ ఆఫ్ టిసినో మధ్య ఉన్నాయి.

మిలిటరీతో పాటు సామాన్యులు ఉపయోగించగల సాంకేతికతను ఉత్పత్తి చేసే అనేక కంపెనీలు లాంబార్డీలోనే ఉన్నాయి.

నిఘా సంస్థల సభ్యులు రాకపోకలు సాగించే దేశంగా స్విట్జర్లాండ్‌ను పరిగణిస్తారు.

సరస్సులో ఆ విహార యాత్ర కేవలం ఒక వినోద యాత్ర అని కొన్ని నివేదికలు చెబుతున్నప్పటికీ అది ఇటలీ, ఇజ్రాయెల్ ఏజెంట్ల మధ్య ఒక రహస్య సమావేశం అని ఇటలీకి చెందిన పలు వార్తా సంస్థలు వార్తలు రాస్తున్నాయి.

మజ్జోరే సరస్సు

ఫొటో సోర్స్, SHUTTERSTOCK

ఫొటో క్యాప్షన్, సహాయక చర్యల్లో ఇటలీ పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా పాల్గొన్నారు

తుపాను

ఈ ప్రమాదంపై అందరిలో ఆసక్తి నెలకొంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్లో నిసెరినో అసలేం జరిగిందో కనుక్కునే పనిలో పడ్డారు.

పడవలో 13 మంది ఇటలీ ఏజెంట్లు, ఎనిమిది మంది ఇజ్రాయెల్ ఏజెంట్లు ఉన్నారని కార్లో చెప్పారు. ఆ పడవ కెప్టెన్ క్లాడియో కార్మినటీ, ఆయన భార్య మాత్రమే ఏ నిఘా సంస్థకు చెందినవారు కాదు. క్లాడియో భార్య ఒక రష్యన్.

పడవలో ఒకరి పుట్టినరోజు వేడుకలు చేయాలని అనుకున్నారు. ఈ పడవ పొడవు 15 మీటర్లు. దీని పేరు ‘‘గుడ్.. యురియా’’

కానీ, అకస్మాత్తుగా ఈ పడవ గంటకు 70 కి.మీ వేగంతో కూడిన ఒక తుపానులో చిక్కుకుంది.

‘’30 సెకన్ల వ్యవధిలో అంతా చిన్నాభిన్నమైంది’’ అని ఆ ఘటన గురించి కార్మినటీ వివరించారు.

పడవ వెంటనే బోల్తా కొట్టి నీటిలో పడిపోయిందని వార్తాపత్రిక కరీర్ డెల్లా సెరా నివేదించింది.

ప్రయాణానికి ముందు వాతావరణం అంతా సవ్యంగానే కనిపించిందని, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు లేవని దర్యాప్తు అధికారులకు కార్మినటీ చెప్పారు.

మజ్జోరే సరస్సు

ఫొటో సోర్స్, EPA

తిరిగి రావాలని ముందుగా నిర్ణయించుకున్న సమయం మించిపోయాక కూడా పడవ ఆ సరస్సులోనే ఉందని ఆయన వెల్లడించారు.

ఓడ విధ్వంసం, నరవధకు సంబంధించిన కేసుల్లో ఆయనను విచారిస్తారు.

కార్మినటీ భార్య అనా బెజ్కోవా వయస్సు 50 ఏళ్లు. ఆమెకు ఇటలీలో నివసించేందుకు అనుమతి కూడా ఉంది.

ఇతర బాధితుల్లో 53 ఏళ్ల టిజియానా బర్నోబీ, 62 ఏళ్ల క్లాడియో అలోంజి ఉన్నారు. వీరిద్దరూ ఇటలీ రహస్య సర్వీస్ సభ్యులు.

ఇజ్రాయెల్ పౌరుడు 50 ఏళ్ల సిమోనీ ఎరెజ్ ఈ ప్రమాదంలో మరణించారు. ఆయన రిటైర్డ్ ఏజెంట్. మోసాద్ సంస్థ కోసం ఆయన పనిచేశారు.

ఆ పడవలోని ఇతరుల్లో కొందరు తీరానికి ఈదుకుంటూ రాగా, మరికొందరిని సహాయం చేయడం కోసం వచ్చిన ఇతర నౌకలు కాపాడాయి.

ఈ ప్రమాదంలో మరణాలన్నింటికీ కారణం నీటిలో మునిగిపోవడమే. అయితే, మృతదేహాలకు పోస్ట్ మార్టమ్ నిర్వహించలేదని ఇటలీ మీడియా పేర్కొంది.

మజ్జోరే సరస్సు

ప్రాణాలతో బయటపడినవారు కనిపించకుండా పోయారు

ఈ మిస్టరీలో ఉన్న మరో కోణం ఏంటంటే, ఈ విపత్తు నుంచి ప్రాణాలతో బయటపడిన వారంతా వెంటనే అక్కడనుంచి తప్పించుకుపోయినట్లుగా కనిపిస్తున్నారని ఇటలీ మీడియా పేర్కొంది.

ఇందులో ప్రాణాలతో బయటపడినవారు తాము చికిత్స పొందిన ఆసుపత్రుల నుంచి, బస చేసిన హోటళ్ల నుంచి తమ వస్తువులను అన్నింటినీ తీసుకొని వెంటనే వెళ్లిపోయినట్లు ఇటలీ మీడియాలో నివేదికలు వచ్చాయి.

వైద్యం పొందిన వారి గురించి కూడా ఎలాంటి పత్రాలు లేవు.

ఇజ్రాయెల్‌కు చెందిన వారు తాము అద్దెకు తీసుకున్న కార్లను అర్ధాంతరంగా వదిలేసి ఇజ్రాయెల్‌కు చెందిన విమానంలో తమ సొంత దేశానికి వెళ్లిపోయారు. మిలాన్‌లో వారంతా ఇజ్రాయెల్ విమానం ఎక్కారు.

వారి వివరాలను కూడా బయటపెట్టలేదు. అయితే ప్రాణాలతో బయటపడినవారి పేర్లు కాకుండా బాధితుల పేర్లనే వెల్లడించడం అత్యంత సాధారణ అంశమని బీబీసీతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిసెరినో చెప్పారు.

ఈ ప్రమాదంలో మరణించిన ఇజ్రాయెల్ వ్యక్తి మోసాద్ రిటైర్డ్ సభ్యుడు అని బుధవారం ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ధ్రువీకరించింది.

‘‘మోసాద్ ఒక ప్రియమైన మిత్రుడిని కోల్పోయింది. అంకితభావం, ఫ్రొఫెషనలిజం కలిగిన సభ్యుడిని కోల్పోయింది. దేశ భద్రత కోసం దశాబ్దాల పాటు జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిని కోల్పోయింది’’ అని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

వీడియో క్యాప్షన్, బాలాసోర్ రైలు ప్రమాదం: ‘తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్లాడు ఏడ్చిఏడ్చి ప్రాణాలొదిలాడు’

పడవ కిక్కిరిసిపోయిందా?

ఈ ప్రమాదానికి గురైన పడవను ఇంకా తీరానికి చేర్చలేదు. అంటే దీనిపై సరైన దర్యాప్తు ఇంకా మొదలు కాలేదని బీబీసీతో నిసెరినో అన్నారు.

‘‘ప్రస్తుతం అది సరస్సు అడుగు భాగంలో చిక్కుకుపోయి ఉంది. దాన్ని బయటకు తీయడానిక రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుంది’’ అని ఆయన చెప్పారు.

ఆ పడవ సామర్థ్యం 15 మంది ప్రయాణీకులేనని, కానీ ప్రమాదం జరిగిన సమయంలో మరో 8 మంది అదనంగా అందులో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

సామర్థ్యానికి మించి ప్రయాణీకులు ఉండటంతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పడవను అదుపులోకి తీసుకురావడం కెప్టెన్‌కు ఇబ్బందికరంగా మారిందని నివేదికలు చెబుతున్నాయి.

పడవ సామర్థ్యానికి మించి అదనంగా ప్రయాణీకులను ఎందుకు అనుమతించారనే అంశంపై దర్యాప్తు జరుగుతోంది.

ఈ ఘటనలో అనేక అంశాలు అనిశ్చితంగా ఉండటంతో దీనిపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి.

ఈ దర్యాప్తుకు ఇటలీ మిలిటరీ పోలీసులు సహకారం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)