ఎవరికీ తెలియని రహస్య పర్వతం ఉన్న ప్రాంతాన్ని సమంత టీం ఎలా గుర్తించింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జరియా గోర్వెట్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
అంటార్కిటికాలో అది వేసవి కాలపు రోజు. అయినప్పటికీ, అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 62 డిగ్రీలు ఉన్నాయి. ఆ చలికి కంటి రెప్పలు కూడా గడ్డ కడుతుండగా సమంత హన్సెస్ బయటకు వచ్చారు.
ఆకారం లేకుండా ఉన్న ఎత్తైన తెల్లటి గోడను ఆమె చూశారు. ఆ గోడ పైకి ఎలా ఉందో కింది వైపు కూడా అలాగే కనిపిస్తుంది. ఆ గోడ భూమి, ఆకాశాన్ని కలుపుతున్నట్లు ఎత్తుగా ఉంది.
మైనస్ ఉష్ణోగ్రతల్లో చలికి వణుకుతూ కూడా ఆమె మంచులో ఒక సరైన ప్రదేశాన్ని గుర్తించారు.
అలబామా, అరిజోనా స్టేట్ యూనివర్సిటీలకు చెందిన బృందంలో ఉన్న సమంత, అంటార్కిటికాలో దాగి ఉన్న పర్వత శ్రేణుల (హిడెన్ మౌంటెన్ రేంజెస్) గురించి వెదుకుతున్నారు.
ఇప్పటివరకు ఏ అన్వేషకుడు అడుగు పెట్టని, సూర్యరశ్మి కూడా ప్రసరించని పర్వతాల కోసం ఆమె వెతుకున్నారు. ఈ పర్వతాలు భూమి లోతుల్లో ఉంటాయి.
అంటార్కిటికాలోని పరిశోధకులు 2015లో అక్కడ భూకంప స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. భూమి లోపలి భాగాన్ని అధ్యయనం చేయడం కోసం ఈ స్టేషన్ ఉపయోగపడుతుంది. మొత్తంగా అంటార్కిటికా వ్యాప్తంగా 15 భూకంప స్టేషన్లను ఏర్పాటు చేశారు.
వారు వెల్లడించిన పర్వతాల్లాంటి నిర్మాణాలు పూర్తిగా రహస్యమైనవి. సమంత బృందం కనిపెట్టిన ఈ ‘ఆల్ట్రా లో వెలాసిటీ జోన్స్’ (యూఎల్‌వీజడ్) అనేవి దాదాపు ప్రపంచమంతటా ఉంటాయి. మీ పాదం కింది నేల లోతులో కూడా ఇలాంటివి ఉండొచ్చు.
‘‘యూఎల్‌వీజడ్ లాంటివి ప్రతీచోటా ఉన్నట్లు మేం సాక్ష్యాధారాలను గుర్తించాం’’ అని సమంత చెప్పారు. ఇప్పుడు ఉత్పన్నమయ్యే ప్రశ్నలు ఏంటంటే, అసలు యూఎల్‌వీజడ్‌లు అంటే ఏంటి? అవి భూమి లోపల ఏం చేస్తున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
రహస్య చరిత్ర
భూమి లోపలి ఈ వింత పర్వతాలు ఒక క్లిష్టమైన ప్రాంతంలో ఏర్పడతాయి. మెటాలిక్ కోర్, రాతి నేలల (రాక్ మాంటిల్స్) మధ్య ఇవి పుట్టుకొచ్చాయి. ఆ పరివర్తన అనేది ఘన శిలలు, గాలి భౌతిక లక్షణాలలో వచ్చే మార్పుల కంటే కూడా మరింత ప్రబలమైనది అని సమంత బృందం నొక్కి చెప్పింది. ఇవి దశాబ్దాలుగా నిపుణులను ప్రలోభపెడుతూనే ఉన్నాయి. ఇవి గ్రహం భూగర్భశాస్త్రాన్ని ప్రభావితం చేసేంత సమస్యాత్మకమైనవి.
భూమి ఉపరితలానికి వేల కిలోమీటర్ల దూరంలో మెటాలిక్ కోర్- రాక్ మాంటిల్స్ మధ్య సరిహద్దు ఉన్నప్పటికీ ఆ లోతుకు మన ప్రపంచానికి మధ్య ఒక ఆశ్చర్యకరమైన పరస్పర అనుబంధం ఉంటుంది.
భూమి లోతుల్లోని ఈ పర్వతాల కథ 1996లో మొదలైంది. పసిఫిక్ మహాసముద్రం అట్టడుగుల్లో కోర్-మాంటిల్ సరిహద్దును శాస్త్రవేత్తలు గుర్తించినప్పుడు వీటి కథ మొదలైంది.
తీవ్ర భూకదలికలను అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ కోర్-మాంటిల్ సరిహద్దును కనుక్కున్నారు. సాధారణంగా భూకంపాలు వచ్చినప్పుడు, న్యూక్లియర్ బాంబులు వేసినప్పుడు ఇలాంటి భూకదలికలు వస్తాయి.
భూమి గుండా ప్రసరించే ఈ కదలికలను మరో ప్రాంతంలోని భూకంప కేంద్రాలు నమోదు చేస్తాయి. ఒక్కోసారి భూమి కంపించిన చోటు నుంచి 12,742 కి.మీకు పైగా దూరంలో ఉండే భూకంప కేంద్రాలు కూడా ఈ కదలికలను పట్టుకుంటాయి.
వివిధ పదార్థాల (మెటీరియల్స్) గుండా ఈ తరంగాలు ప్రయాణించే మార్గాన్ని పరీక్షించడం ద్వారా శాస్త్రవేత్తలు గ్రహం అంతర్భాగానికి చెందిన ఎక్స్‌రే వంటి చిత్రాన్ని రూపొందిస్తారు.
పరిశోధకులు 25 భూకంపాల వల్ల ఉత్పత్తి అయిన తరంగాలను పరిశీలించినప్పుడు, ఆ తరంగాలు కోర్-మాంటిల్ సరిహద్దుకు చేరుకోగానే నెమ్మదించినట్లు గుర్తించారు.
ఈ విస్తారమైన, విచిత్రమైన పర్వతాల ఎత్తులు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. కొన్ని పర్వత శిఖరాలు 40 కి.మీ వరకు ఉండగా, మరికొన్నింటి ఎత్తు కేవలం 3 కి.మీ ఉంది. 40 కి.మీ ఎత్తు అంటే ఎవరెస్ట్ ఎత్తుకు దాదాపు 4.5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు. ఒక రాక్షస పర్వతం అయితే హవాయి కింద 910 కి.మీ విస్తీర్ణంలో ఉంది.
అవి అక్కడి వరకు ఎలా విస్తరించాయో, దేనితో అవి తయారయ్యాయో ఈరోజుకీ ఎవరికీ తెలియదు.

ఫొటో సోర్స్, Getty Images
ఒక భావన ఏంటంటే, ఈ పర్వతాలు దిగువ మాంటిల్‌లోని భాగాలు. భూమిలోని జ్వలించే కోర్‌కు దగ్గరగా ఉండటం వల్ల ఈ మాంటిల్ బాగా వేడెక్కిపోతుంది. ఈ మాంటిల్ వేడి 3,700 డిగ్రీ సెంటిగ్రేడ్‌కు చేరుకోగలిగినప్పుడు కోర్ ఉష్ణోగ్రత 5,500 డిగ్రీ సెంటిగ్రేడ్‌గా ఉంటుంది. అంటే, సూర్యుని ఉపరితలం ఉష్ణోగ్రతలకు దాదాపు సమానంగా భావించవచ్చు. కోర్-మాంటిల్ సరిహద్దులోని అత్యధిక వేడిగా ఉండే భాగాలు పాక్షికంగా కరిగిపోయి ఈ యూఎల్‌వీజడ్‌లుగా ఏర్పడినట్లు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు భావిస్తారు.
మరో భావన ఏంటంటే, మాంటిల్ పరిసరాల్లోని ఒక సంక్లిష్టమైన మెటీరియల్ నుంచి ఈ లోతైన పర్వతాలు ఏర్పడి ఉంటాయి. పురాతన సముద్రపు ఉపరితలానికి చెందిన అవశేషాలుగా వీటిని భావించారు. మిలియన్ల సంవత్సరాల క్రితం మునిగిపోయిన ఈ అవశేషాలు కోర్ మీద స్థిరపడినట్లుగా భావిస్తారు.
వాస్తవానికి టెక్టోనిక్ ప్లేట్లు భూమి మాంటిల్‌లోకి జారిపోయి కోర్-మాంటిల్ సరిహద్దులో మునిగిపోవడం వల్ల ఇదంతా మొదలైనట్లు ఒక వివరణ ఉంది.
తర్వాత ఇవి నెమ్మదిగా విస్తరించి విభిన్న ఆకారాలు, పరిమాణాల్లో పర్వతాలుగా ఏర్పడినట్లు చెబుతారు.
కానీ, అంటార్కిటికా కింద ఉన్న పర్వతాల ఉనికి పైన చెప్పుకున్నదానికి విరుద్ధంగా ఉండవచ్చు అని సమంత సూచించారు.
‘‘మేం ఎక్కువగా దక్షిణార్థ గోళంలో అధ్యయనం చేశాం’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చురుగ్గా అన్వేషణ
అంటార్కిటికాలో భూకంప కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సమంత హన్సెన్, ఆమె బృందం హెలికాప్టర్లు, చిన్నచిన్న విమానాల్లో అనువైన ప్రదేశాలకు బయలుదేరారు. పెంగ్విన్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కొన్ని, తీర ప్రాంతాల్లో మరికొన్ని, నడుము లోతు దట్టంగా పేరుకుపోయిన మంచులోనూ పరికరాలను ఏర్పాటు చేశారు.
దీంతో తొలి ఫలితాలు రావడానికి కొద్దిరోజుల సమయమే పట్టింది. భూగోళంపై ఎక్కడ భూకంపాలు సంభవించినా ఆ పరికరాలు పసిగడతాయి. ''ఒకవేళ దాని తీవ్రత ఎక్కువగా ఉంటే మనం చూడగలం'' అని సమంత చెప్పారు. అందుకు చాలా అవకాశాలున్నాయని ఆమె అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా రోజుకి దాదాపు 55 భూకంపాలు సంభవిస్తున్నట్లు యూఎస్ నేషనల్ ఎర్త్‌క్వేక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ రికార్డ్స్‌లో నమోదవుతున్నాయి.
భూమి లోపలి పర్వత శ్రేణులను గతంలోనూ గుర్తించారు. కానీ, అంటార్కిటికా దిగువ ప్రాంతంలో వాటి గురించి ఎవరూ అన్వేషించలేదు. అవి ఇటీవల కాలంలో పడిపోయిన టెక్టోనిక్ ప్లేట్స్‌కి సమీపంలో ఉండవు.
అయితే, వాళ్లు పరికరాలు అమర్చిన ప్రతిచోటా వాటి జాడ బయటపడటం బృంద సభ్యులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఎత్తైన బుడగల్లాంటి ఆనవాళ్లు ఉన్న చోటే భారీ పర్వతాలు ఉంటాయని గతంలో భావించేవారు. కానీ, భూ కేంద్రానికి చుట్టూ ఓ దుప్పటిలా పర్వతాలు పరుచుకుని ఉండొచ్చని సమంత హన్సెన్ పరిశోధన చెబుతోంది.
అయితే, ఒకవేళ ఈ పర్వతాలు నిజంగా అంతలా విస్తరించి ఉంటే, అవి దేనితో తయారయ్యాయి? భారీ బుడగ నిర్మాణాలతో వాటికి సంబంధం ఏంటి? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి.
భూమి లోతుల్లోని ఈ వింత, సూపర్ హీటెడ్ పర్వతాల గురించి అంటార్కిటికాలో మనకు ఆధారాలు లభిస్తాయి.
ఇవి కూడా చదవండి:
- కెనడా నుంచి వందల మంది భారతీయ విద్యార్థులు వెనక్కి వచ్చేయాల్సిందేనా? అసలేం జరిగింది?
- అమెజాన్ అడవుల్లో కూలిన విమానంలోని నలుగురు పిల్లలు 40 రోజుల తర్వాత ప్రాణాలతో దొరికారు
- వక్షోజాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకుంటే ఏమవుతుంది?
- రాక్ క్లైంబింగ్ సురక్షితంగా చేయడం ఎలా... ట్రైనర్ చెప్పే పాఠాలేంటి?
- మీ డేటా చోరీకి గురైతే ఏమవుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














