గ్లాడియేటర్ సీక్వెల్ షూటింగ్: దూసుకొచ్చిన భారీ అగ్నిగోళం, చిత్ర బృందానికి గాయాలు

గ్లాడియేటర్

ఫొటో సోర్స్, UNIVERSAL/GETTY

మొరాకోలో జరుగుతున్న గ్లాడియేటర్ సినిమా సీక్వెల్ చిత్రీకరణలో ప్రమాదం జరిగింది. స్పెషల్ ఎఫెక్స్ట్ సీన్ కోసం స్టంట్స్ చేస్తుండగా ప్రమాదం సంభవించడంతో చిత్ర బృందంలోని పలువురికి గాయాలయ్యాయి.

అన్ని ఏర్పాట్లు చేసుకుని ప్రణాళికాబద్ధంగా స్టంట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు ఈ ప్రమాదం సంభవించిందని చిత్ర నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఎవరికీ ప్రాణాపాయం లేదని పేర్కొంది.

సిబ్బంది అందరూ క్షేమంగానే ఉన్నారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పింది. సినిమా షూటింగ్ చేస్తుండగా పేలుడు జరిగిందని, ఆరుగురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ది సన్ వార్తాసంస్థ తెలిపింది.

"ఇది భయంకరంగా ఉంది. భారీ అగ్నిగోళం పైకి ఎగిరి సిబ్బంది మీదకి వచ్చేసింది. ఎన్నో ఏళ్లుగా చిత్రీకరణలో పాల్గొంటున్నా, ఇలాంటి భయానకమైన ప్రమాదాన్ని ఎప్పుడూ చూడలేదు. ఈ ఘటన సాధారణమైన వ్యక్తుల నుంచి స్టార్ నటుల వరకు అందరినీ కలవరపరిచింది" అని ప్రత్యక్ష సాక్షి ఒకరు ఆ వార్తా సంస్థతో చెప్పారు.

"చిత్రీకరణ ప్రాంతంలోని భద్రతా సిబ్బంది, వైద్య బృందం సత్వరమే స్పందించాయి. బాధితులకు అవసరమైన సేవలు అందించగలిగాం'' అని పారామౌంట్ పిక్చర్స్ ప్రతినిధి ఒక ప్రకటనలో చెప్పారు.

గ్లాడియేటర్

ఫొటో సోర్స్, Getty Images

ఐదు ఆస్కార్‌లు గెలుచుకున్న చిత్రం

చిత్ర‌ బృందంలో అందరూ క్షేమంగానే ఉన్నారని, ఆరుగురు చికిత్స తీసుకుంటున్నారని, నలుగురు ఇంకా ఆసుపత్రిలో ఉన్నారని వెరైటీ మ్యాగజైన్ తెలిపింది.

గ్లాడియేటర్ ఒక హిస్టారికల్ డ్రామా. 2000వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి సర్ రిడ్లే స్కాట్ దర్శకత్వం వహించారు. అదే చిత్రానికి స్కాట్ డైరెక్షన్‌లోనే ఇపుడు సీక్వెల్ తీస్తున్నారు.

ఈ చిత్రం 2024 నవంబర్‌లో విడుదల కావాల్సి ఉంది. ఇప్పటివరకైతే ఈ గ్లాడియేటర్ సీక్వెల్‌కు టైటిల్ వెల్లడించలేదు. ఈ సీక్వెల్‌లో పాల్ మెస్కల్, డెంజెల్ వాషింగ్టన్, కొన్నీ నీల్సన్‌ తదితరులు నటిస్తున్నారు.

గ్లాడియేటర్ మొదటి చిత్రం ఐదు ఆస్కార్‌ అవార్డులు గెలుచుకుంది. ఇందులో రస్సెల్ క్రో ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నారు. అతను మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్‌ పాత్రలో నటించారు.

గ్లాడియేటర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 3,700 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది.

ఈ సినిమా దశాబ్దాలుగా ఫ్యాషన్‌ ప్రపంచానికి దూరంగా ఉన్న హిస్టారికల్ డ్రామా జోనర్ చిత్రాలను మళ్లీ తెరమీదకి తెచ్చేలా చేసింది.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)