కర్ణాటక బస్సుల్లో పక్క రాష్ట్రాల మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చా?

ఫొటో సోర్స్, Twitter/CMofKarnataka
కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించే ‘శక్తి’ పథకాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం బెంగళూరులో ఈ పథకాన్ని ప్రారంభించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు ముఖ్యమైన హామీలలో ఇదొకటి.
''మహిళలకు సాధికారత కల్పిస్తుంది కాబట్టి ఈ పథకానికి శక్తి అని పేరు పెట్టాం. మేం వాగ్దానం చేసిన ఐదు హామీల్లో నాలుగు హామీలు మహిళా సాధికారత లక్ష్యంగా ఉన్నాయి’’ అని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.
గృహ జ్యోతి (నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్), గృహ లక్ష్మి (కుటుంబంలో మహిళా పెద్దలకు రూ. 2,000), అన్న భాగ్య (10 కిలోల బియ్యం), శక్తి.. ఈ పథకాలన్నీ మహిళలకు సాధికారత కల్పించేందుకే అమలు చేస్తున్నామని ఆయన అన్నారు.
ఈ పథకాలన్నీ కులం, మతం, లింగంతో సంబంధం లేకుండా పేదల కోసం ఉద్దేశించినవే అని సిద్ధరామయ్య తెలిపారు.

ఫొటో సోర్స్, Twitter/CMofKarnataka
రాష్ట్రం వెలుపల 20 కిలోమీటర్ల వరకు..
''ఉచిత పాస్‌తో మీరు బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్లలేరు. కానీ రాష్ట్రం వెలుపల 20 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. పేద, మధ్యతరగతి ప్రజల జేబుల్లో డబ్బులు పెడితే ఆర్థిక వ్యవస్థ వేగవంతమవుతుంది. ధనికుల జేబుల్లో డబ్బు పెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ప్రయోజనం ఉండదు’’ అని సిద్ధరామయ్య అన్నారు.
ఐదు హామీలపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించడంపై ముఖ్యమంత్రి స్పందించారు.
''ప్రభుత్వం ఎలా పనిచేస్తుందనే ఆలోచన కూడా వారికి లేదు. రాష్ట్రాన్ని దివాళా తీస్తామన్నారు. ఈరోజు ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా మా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలన్నింటినీ అమలు చేస్తామని చెబుతున్నా’’ అని సిద్ధరామయ్య అన్నారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం జూలై 1 నుంచి అమలులోకి వస్తుందని, మహిళా కుటుంబ పెద్దకు నెలకు రూ. 2,000 ఇచ్చే పథకాన్ని ఆగస్టు 15 లేదా 16 తేదీన ప్రారంభిస్తామన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పక్క రాష్ట్రాల మహిళలు ప్రయాణించొచ్చా?
కర్ణాటకలో విద్యార్థులు, మహిళలు ఆధార్ లేదా ఓటర్ ఐడీ కార్డ్ వంటి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి రాష్ట్రవ్యాప్తంగా నాన్ ఏసీ (ఆర్డినరీ) బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. తర్వాత మహిళలందరికీ ఉచితంగా స్మార్ట్ కార్డ్ అందజేస్తారు.
అయితే, ఈ సదుపాయం కేవలం కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళలకు మాత్రమే. అంటే కర్ణాటకలో నివాసం ఉంటున్నట్లు ప్రభుత్వ గుర్తింపు కార్డు కలిగి ఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు టికెట్ కొనాల్సి ఉంటుంది.
కర్ణాటక మహిళలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా కర్ణాటకను ఆనుకొని ఉన్న మిగతా రాష్ట్రాల్లోనూ 20 కిలోమీటర్ల దూరం వరకు కర్ణాటక బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు.
అంతకంటే ఎక్కువ దూరం వెళ్లాలంటే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.
అందుకే ఈ పథకం కింద బెంగళూరు నుంచి తిరుపతికి ఉచితంగా ప్రయాణించేందుకు వీలుండదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టంగా చెప్పారు.
ఈ పథకం అమలుకు ఏడాదికి రూ. 4,051.56 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. దానిని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.
ఈ పథకం ద్వారా కర్ణాటకలో రోజూ బస్సుల్లో ప్రయాణించే దాదాపు 41 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుంది.
ఈ పథకం కింద కర్ణాటకలో నివాసం ఉండే మహిళలందరికీ ప్రభుత్వం స్మార్ట్ కార్డులు జారీ చేయనుంది.
ఆ కార్డుల ద్వారా సేకరించే డేటా ఆధారంగా మహిళలు బస్సుల్లో ఎంత దూరం ఉచితంగా ప్రయాణించారన్నది లెక్కించి, అందుకు సంబంధించిన ఛార్జీలను ఆయా బస్ సర్వీసుల నిర్వహణ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
ఇవి కూడా చదవండి
- కెనడా నుంచి వందల మంది భారతీయ విద్యార్థులు వెనక్కి వచ్చేయాల్సిందేనా? అసలేం జరిగింది?
- యుక్రెయిన్: యుద్ధ క్షేత్రంలో కొడుకు మృతదేహాన్ని ఈ తల్లి ఎలా కనిపెట్టారు?
- సైనికుల వీర్యాన్ని ఉచితంగా ఫ్రీజర్‌లో భద్రపరిచేందుకు రష్యా ఎందుకు అనుమతిస్తోంది?
- రష్యా - యుక్రెయిన్ యుద్ధం: ‘‘రష్యాను తప్పుపట్టొద్దు.. ఇరు దేశాలకూ అది విషాదమే’’: పుతిన్
- ఆర్థికంగా దూసుకుపోతున్న అతి చిన్న దేశం, ఏడాదిలోనే ఆ దేశ కరెన్సీ విలువ డాలర్‌తో పోల్చితే 15% పెరిగింది... ఎలా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














