భారత్‌లో వందేళ్ళ కిందటే తొలి అండర్ వాటర్ మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాలని కలగన్న బ్రిటిష్ ఇంజనీర్

ఫొటో సోర్స్, INSTITUTION OF CIVIL ENGINEERS ARCHIVE, LONDON
- రచయిత, మోనిదీప బెనర్జీ
- హోదా, కోల్‌కతా
కోల్‌కతా ప్రజలు ఈ ఏడాది చివరి కల్లా భారత్‌లో తొలి అండర్‌వాటర్ రైలులో ప్రయాణించబోతున్నారు. ఈ సందర్భంగా శతాబ్దం క్రితమే కలకత్తాలో భూగర్భ రైల్వే వ్యవస్థను తీసుకురావాలని కలగన్న బ్రిటీష్ ఇంజనీర్‌ను గుర్తు చేసుకుంటున్నారు.
కోల్‌కతాను దాని జంట నగరమైన హౌరాతో కలిపేందుకు హుగ్లీ నదిలో సొరంగాన్ని నిర్మించి, 10 స్టాప్‌లతో అండర్ వాటర్ రైల్వే వ్యవస్థను 10.6 కి.మీల మేర ఏర్పాటు చేయాలని బెంగాల్‌లో పుట్టి పెరిగిన సర్ హార్లే డాల్రింపుల్-హే అనే ప్రఖ్యాత ఇంజనీర్ అనుకున్నారు.
కానీ, సరిపడా నిధులు లేకపోవడంతో పాటు నగరానికి చెందిన జియోలాజికల్ ప్రాపర్టీల విషయంలో అనుమానాలు ఉండటంతో, ఈ క్షేత్రస్థాయి ప్రణాళిక పట్టాలెక్కలేదు.
ఆ తర్వాత, 1984 అక్టోబర్‌లో మెట్రో రైలును తీసుకొచ్చిన తొలి భారతీయ నగరంగా కోల్‌కతా నిలిచింది.
కేవలం 3.4 కి.మీల దూరంతో ఐదు స్టేషన్లతో ప్రారంభమైన ఈ మెట్రో రైలు వ్యవస్థ, ప్రస్తుతం 26 స్టేషన్లతో 31 కి.మీల మేర విస్తరించి ఉంది. దీనిలో సగం మేర భూగర్భంలోనే నడుస్తోంది.
ఈ ఏడాది డిసెంబర్‌లో హుగ్లీ నది గుండా ప్రయాణించే భారత్‌లోనే తొలి అండర్‌వాటర్ రైల్వేను ప్రవేశ పెట్టేందుకు కూడా ఆ నగర మెట్రో రైల్వే సిద్ధమవుతోంది.
నదిలో ఏర్పాటు చేసిన రెండు సొరంగాలు 520 మీటర్ల పొడవున ఉన్నాయి. కోల్‌కతా, హౌరాను కలిపే 4.8 కి.మీల మేర దూరంలోని మెట్రో రైల్వే వ్యవస్థలో ఈ అండర్ వాటర్ మార్గం అనుసంధానమైంది.
ఇది నదిలో 52 అడుగుల దిగువన ఉంది. ఈ మార్గం ప్రారంభమైన తర్వాత ప్రతి గంటకు 3 వేల మందికి పైగా ప్రయాణికులకు సేవలందించనుంది.

ఫొటో సోర్స్, PTI
తూర్పు కోల్‌కతాలోని హౌరా, సాల్ట్ లేక్‌ను కలుపుతూ ఉన్న పొడవైన రైల్వే మార్గంలో భాగమైన ఈ అండర్ వాటర్ రైల్వే మార్గం, దాదాపు సర్ హార్లే 1921 డిజైన్‌ను ప్రతిబింబిస్తోంది.
సర్ హార్లే కేవలం ఒక్క మెట్రో లైన్‌నే డిజైన్ చేయలేదు. కోల్‌కతా కోసం పూర్తి భూగర్భ మాస్టర్ ప్లాన్‌ను ఆయన రూపొందించారు. సెంట్రల్ కోల్‌కతాలో తూర్పు నుంచి దక్షిణానికి ఆయన తన లైన్స్‌ను విస్తరించారు.
కలకత్తా ట్యూబ్ రైల్వేస్ పేరుతో రాసిన పుస్తకంలో ఆయన దీని గురించి పూర్తిగా వివరించారు. కోల్‌కతా మ్యాప్స్, ప్రతిపాదిత మెట్రో లైన్ల డ్రాయింగ్స్, ట్యూబ్ రైలు ఖర్చులు ఏ మేర ఉండొచ్చనే అంచనాలన్ని ఈ పుస్తకంలో ఉన్నాయి.
అన్ని స్టేషన్లలో ఎస్కెలేటర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని కూడా ఈ బ్రిటీష్ ఇంజనీర్ ప్రతిపాదించారు.
‘‘రైళ్లలో సౌకర్యవంతమైన ఉష్ణోగ్రతలను నిర్వహించడమన్నది అతిపెద్ద ప్రశ్న. ఈ సమయంలో భూగర్భ స్టేషన్లు అత్యంత ఉపయోగకరంగా నిలుస్తాయి. ముఖ్యంగా కోల్‌కతాలో కొన్ని కాలాల్లో ఉపరితలంపై ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయి’’ అని సర్ హార్లే తన పుస్తకంలో రాశారు.
సర్ హార్లే తన కోల్‌కతా భూగర్భ రైల్వే ప్రణాళికను రూపొందించే సమయానికే, లండన్, పారిస్, న్యూయార్క్‌లలో భూగర్బ రైల్వేలు నడుస్తున్నాయి.

ఫొటో సోర్స్, AFP
ప్రపంచంలో తొలి భూగర్భ రైల్వే ఎక్కడ?
1863 జనవరి 10న ప్రపంచంలోనే తొలి భూగర్భ రైల్వేను లండన్‌లోని మెట్రోపాలిటన్ రైల్వే ప్రారంభించింది. దీన్ని పాడింగ్టన్(అప్పట్లో బిషప్ రోడ్డు) నుంచి ఫారింగ్‌డన్ స్ట్రీట్ మధ్యలో ఏర్పాటు చేశారు.
ప్రపంచంలో తొలిసారి నదీగర్భంలో ఏర్పాటు చేసిన సొరంగం థేమ్స్ టన్నెల్‌ను జనవరి 1943లో తెరిచారు.
నిత్యం రద్దీగా ఉండే ఈ నదీ మార్గం ద్వారా కార్గోను తరలించేందుకు సర్ మార్క్ బ్రూనెల్ అనే ఇంజనీర్, ఆయన కొడుకు ఇసాంబార్డ్ దీన్ని ఏర్పాటు చేశారు.
వారి వద్ద డబ్బులు అయిపోవడంతో, దీన్ని కేవలం పాదాచారుల ఆకర్షణ కోసం తెరిచారు. రహదారులు, పాదాచారులు, యుటిలిటీల కోసం థేమ్స్ టన్నెల్‌లో కనీసం 10 టన్నెల్‌లు ఆపరేషన్‌లోకి వచ్చాయి.
ఏ రకంగా చూసుకున్నా 1921లో సర్ హార్లే ఈ ప్లాన్‌ను డిజైన్ చేసినప్పుడు కోల్‌కతాలో హుగ్లీ నది గుండా అండర్ వాటర్ టన్నెల్‌ను ఏర్పాటు చేయడం పెద్ద పనే కాదు.

ఫొటో సోర్స్, SCIENCE & SOCIETY PICTURE LIBRARY
కోల్‌కతాలో అడుగు పెట్టకుండానే ట్యూబ్ రైల్వే ప్రణాళిక
సర్ హార్లే 1861లో పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లాలో జన్మించారు. ఎడిన్‌బర్గ్‌లో ఆయన ఇంజనీరింగ్ చదువుకున్నారు. ఆ తర్వాత లండన్ భూగర్భ రైల్వే వ్యవస్థలో చేరారు.
బేకెర్లూ లైన్, హ్యాప్‌స్టెడ్ ట్యూబ్, పికాడిల్లీ లైన్‌లో ఆయన పనిచేశారు. బ్రిటీష్ ఇండియాను ఇంపీరియల్ లెజిస్టేటివ్ కౌన్సిల్ పాలించేటప్పుడు, కోల్‌కతాకు ట్యూబ్ రైలు కావాలని నిర్ణయించారు. ఈ పనిని 1921లో సర్ హార్లేకి అప్పజెప్పారు.
కోల్‌కతా బ్రిటీష్ రాజ్‌కు రాజధాని కాదు. కానీ వాణిజ్యానికి మాత్రం ఇది బిజీ హబ్‌గా మారింది.
హౌరాలో ఫ్యాక్టరీలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ జంట నగరాల్లో పనిచేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు ఇక్కడికి తరలి వచ్చేవారు. కానీ, ప్రజా రవాణా వ్యవస్థ మాత్రం అంత విస్తారంగా ఉండేది కాదు.
అప్పట్లో కేవలం కోల్‌కతా నుంచి హౌరా వరకు రోడ్డు మార్గమమే ఉండేది. హుగ్లీ గుండా పాంటూన్ వంతెన ఉండేది. బోట్లలోనే ప్రజలు ఈ నది గుండా ప్రయాణించే వారు. ప్రముఖ హౌరా బ్రిడ్జి కూడా 1943లోనే ఏర్పాటైంది.
కోల్‌కతాలో అడుగు పెట్టకుండానే సర్ హార్లే ఈ నగరం కోసం ట్యూబ్ రైలు ప్రణాళికను రూపొందించారు. అవసరమైన సమాచారమంతా తీసుకు రమ్మని ఆయన అసిస్టెంట్‌ను ఇక్కడికి పంపించారు. కోల్‌కతా, హౌరా మున్సిపాలిటీని అనుసంధానిస్తూ ట్యూబ్ రైల్వేను నిర్మించవచ్చా? అనే దానిపై తనకు నివేదిక అందించాలని చెప్పారు.
ఈస్ట్రన్ కోల్‌కతాలోని బాగ్మరిని హౌరాలో బెనారస్ రోడ్డుగా పిలిచే ప్రాంతాన్ని అనుసంధానిస్తూ ఉండేలా సర్ హార్లే తన తొలి సెక్షన్ రైల్వే నెట్‌వర్క్‌ను ప్రతిపాదించారు.

ఫొటో సోర్స్, CALCUTTA CORPORATION GAZETTE
ట్యూబ్ రైలు కలలకు ఎలా ముగింపు చెప్పాల్సి వచ్చింది?
ఈ ప్రాజెక్ట్ ఖర్చు 3.5 మిలియన్ పౌండ్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.36 కోట్లు పైగానే ఉంటుందని అంచనావేశారు. ఇది చాలా ఖరీదుగా కూడుకున్నదని, దీనికి నిధులు అందించడం కష్టమని భావించారు.
నగరానికి చెందిన ట్యూబ్ రైలు కలలకు ముగింపు చెప్పాల్సి వస్తుందని పేర్కొంటూ డిసెంబర్ 1947లో కోల్‌కతా మున్సిపల్ గెజెట్, పత్రికల్లో తొలి పేజీ వార్తను ప్రచురించింది.
‘‘దీన్ని నిర్మించేందుకు అవుతున్న ఖర్చును పరిగణనలోకి తీసుకుంటే, ఈ రైల్వే ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గడమే మంచిది’’ అని ఈ ప్రాజెక్ట్ సమావేశం ముగిసిన అనంతరం మున్సిపల్ కౌన్సిలర్ చెప్పారు.
అలాగే, కోల్‌కతాకు చెందిన ఒండ్రు, బంకమట్టి, హుగ్లీ కింద టన్నెల్ నిర్మించేందుకు అనువైనదా? కాదా? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.
ఇలా, భారత్‌లో తొలి అండర్ వాటర్ రైల్వే మాస్టర్ ప్లాన్ అధికారికంగా సమాధి అయిపోయింది.
ఈ ట్యూబ్ రైలు ప్లాన్ పట్టాలెక్కనప్పటికీ, సర్ హార్లే మాత్రం కోల్‌కతాలో తనదైన ముద్రను లిఖించుకున్నారు.
కోల్‌కతా నుంచి హౌరాకు పవర్ కేబుల్స్‌ను పంపేందుకు హుగ్లీ కింద సొరంగాన్ని ఏర్పాటు చేయాలని నగరానికి చెందిన విద్యుత్ సరఫరా కంపెనీ సీఈఎస్‌సీ 1928లో సర్ హార్లేను కోరింది.
ఈ పనిని ఆయన ఒప్పుకోవడంతో, 1931లో కోల్‌కతాలో తొలిసారి అండర్ వాటర్ టన్నెల్ అందుబాటులోకి వచ్చింది.
హుగ్లీ లోపల ఏర్పాటు చేసిన సర్ హార్లే టన్నెల్‌ను ఇప్పటికీ వాడుతున్నారు. దీని ద్వారా కేవలం పవర్ కేబుల్స్‌ను మాత్రమే పంపిస్తున్నారు. రైళ్లను నడపడం లేదు.
ఇవి కూడా చదవండి:
- రబ్బర్‌ను చెట్ల నుంచి ఎలా తీస్తారో తెలుసా... ఈ పరిశ్రమకు భారత్‌లో మళ్ళీ మంచిరోజులు వస్తాయా?
- నలుగురు పిల్లలను చంపిన కేసులో 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన తల్లిని సైన్స్ విడిపించింది... ఎలా?
- లాన్సెట్: భారత్‌లో 10 కోట్ల మందికి మధుమేహం, 13 కోట్ల మందికి ప్రీడయాబెటిస్
- 12 వేల ఏళ్ల కిందట పక్షి ఎముకతో పిల్లనగ్రోవి.. ఇందులో దాగిన వేటగాళ్ల రహస్యం ఏమిటి?
- యుక్రెయిన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తే జైలు శిక్షలా? పుతిన్ పాలన స్టాలిన్‌ను తలపిస్తోంది: హక్కుల కార్యకర్త అర్లావ్
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














