కొలంబియా - అమెజాన్: దట్టమైన అడవిలో ఆ నలుగురు పిల్లలు 40 రోజులు ఏం తిన్నారు, ఎలా నిద్రపోయారు? అడవే వారిని కాపాడిందా?

అమెజాన్ అడవుల్లో నలుగురు పిల్లల్ని కాపాడిన సైన్యం

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, డేనియల్ బ్రౌన్
    • హోదా, కొలంబియా నుంచి బీబీసీ ముండో ప్రతినిధి

చాలా మందికి ఈ కేసు ఒక అద్భుతం కావొచ్చు. కొందరికి ఇదొక సాధారణమైన ఘటన, కానీ, అడవుల్లో జీవితం అంత తేలికైన విషయం కాదు.

ప్రపంచంలోనే అతి పెద్ద, దట్టమైన, చిత్తడి నేలల అమెజాన్ అడవుల్లో చిరుతలు, కొండ చిలువల వంటి ప్రమాదకరమైన జంతువుల మధ్య నలుగురు పిల్లలు 40 రోజుల పాటు గడిపారు.

ఈ పిల్లలు తమ తల్లి, ఇద్దరు పెద్దవాళ్లతో కలిసి ఒక చిన్న విమానంలో ప్రయాణిస్తుండగా మే 1న ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదం నుంచి 14 ఏళ్లు, తొమ్మిదేళ్లు, నాలుగేళ్లు, ఏడాది వయసున్న చిన్నారి ప్రాణాలతో బతికి బయటపడ్డారు.

అమెజాన్ అడవుల్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత ఆర్మీ ఈ పిల్లల్ని కనుగొనింది.

శనివారం ఈ పిల్లల్ని బోగోటాకు తరలించి, అక్కడే ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స అందించారు.

ఈ పిల్లల్ని ఆర్మీ కాపాడిన తర్వాత కొలంబియా మీడియా అంతా ఇదొక ‘అద్భుతం’ అని, సహాయక చర్యల్ని, ఆర్మీ వీరత్వాన్ని కొనియాడింది.

కానీ, వాళ్లు వాడిన ఈ భాష వారి అజ్ఞానాన్ని వ్యక్తపరుస్తుందని అడవులను సంరక్షించే టికునా నిపుణుడు అలెక్స్ రుఫినో అన్నారు.

వీడియో క్యాప్షన్, దట్టమైన అడవిలో ఆ నలుగురు పిల్లలు 40 రోజులు ఏం తిన్నారు, ఎలా నిద్రపోయారు

అమెజాన్ లాంటి దట్టమైన, చిత్తడి అడవుల్లో జాగ్వార్, పైథాన్ లాంటి ప్రమాదకరమైన జంతువుల మధ్య 40 రోజుల పాటు నలుగురు పిల్లలు ప్రాణాలతో మనుగడ సాగించడం చాలా కష్టమైన విషయం.

‘‘పిల్లలు వారి వాతావరణంలో ఉన్నారు. అడవుల సంరక్షణలో ఉన్నారు. ఎన్నోఏళ్లుగా స్థానిక ప్రజలు ఈ ప్రకృతితోనే మమేకమై ఉన్నారు’’ అని ఆయన చెప్పారు.

ఈ 40 రోజులు పిల్లలకి ప్రమాదకరంగా ఉండొచ్చని నేషనల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్, ఫోటోగ్రాఫర్ అంగీకరించారు. ఆహారం దొరకక, జంతువుల మధ్యలో నివసించడం అత్యంత ప్రాణాంతకమని చెప్పారు.

కానీ, వారు కూడా ప్రకృతితో మమేకమయ్యారన్నారు. ‘‘అడవినే వారిని కాపాడింది’’ అని చెప్పారు.

అమెజాన్ అడవుల గురించి పిల్లలకి పాఠాలు చెప్పిన తర్వాత, రుఫినో ఈ కేసు గురించి బీబీసీ ముండోతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు విషయాలను బీబీసీతో చర్చించారు.

బోటు ప్రయాణం

ఫొటో సోర్స్, PRIVATE FILE

అడవిలో వారు ఎలా బతకగలిగారు?

ఈ పిల్లలు తెలియకుండానే తమ తల్లిదండ్రుల నుంచి చాలా నేర్చుకున్నారు.

వేటకు వెళ్లినప్పుడు, పండ్లు తెచ్చేటప్పుడు వారిని గమనించడం, అడవిలో ఏం చెయ్యవచ్చో, ఏం చెయ్యకూడదో వాళ్లు తెలుసుకున్నారు.

పిల్లలు ప్రకృతిని అర్థం చేసుకున్నారు. అంటే, ఆహారం కోసం, ప్రమాదాల నుంచి తప్పించుకోవడం కోసం కోతుల్ని అనుసరించి ఉంటారని రుఫినో అన్నారు.

వారికి రాని పనులు చేసేందుకు ప్రయత్నించినప్పుడు, ఒక్కోసారి వారు అనారోగ్యానికి కూడా గురయ్యారు. కానీ, వారికి అన్నలు ఉండటంతో, ఏది ప్రమాదకరమో చెప్పేందుకు సాయం చేశారు.

ప్రతి చెట్టు, ప్రతి మొక్క, ప్రతి జంతువు వారికి తోడుగా నిలిచింది. ఏది మంచిదో, ఏది ప్రమాదకరమో అవే వారికి చెప్పాయి. ఈ పిల్లలకు అడవిని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసు.

అంతేకాక జంతువుల నుంచి కూడా వారు సాయం పొందుంటారు.

ఉదాహరణకు, కోతులు ఉన్నాయనుకుంటే, అవి మనలాగే తింటాయి. చాలా వరకు తియ్యటి పండ్లనే కొరుకుతాయి. కాబట్టి, అవే వారికి మార్గదర్శకంగా నిలిచి ఉంటాయి.

ఇది వారిని అనుకరించడం కాదు, ఆహారం వెతుకుకోవడం కోసం అవి వేసే ప్రతి అడుగును గమనించడం, వాటి వెంట వెళ్లడం.

చెట్ల కొమ్మలు విరిగిపోవడం కూడా వెళ్లాల్సిన మార్గాన్ని సూచిస్తోంది.

వీటి శబ్దాలు, వీటి అడుగులు కూడా జాగ్వార్, విషపూరిత పాములు వంటి జంతువుల బారిన పడకుండా ప్రమాద హెచ్చరికలు చేస్తాయి.

కోతులతో మనుషులకున్న సంబంధంతో మనకు మనం కాపాడుకోవచ్చు.

పిల్లలు ఒక చోట నుంచి మరో చోటకి వెళ్తుండటంతో, తమ వెతుకులాట కాస్త కష్టతరంగా మారిందని ఆర్మీ తెలిపింది.

వారెందుకు ఇలా చేసుంటారో కూడా రుఫినో వివరించారు.

ఎందుకంటే అడవుల్లో ఒకే దగ్గర నిశ్చలంగా ఉండలేం. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక దగ్గర్నుంచి మరో దగ్గరకి వెళ్లాల్సిందే.

రాత్రి వేళల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆహారం, ఇతర వాటి కోసం ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి కదలాల్సి ఉంటుంది.

అమెజాన్ అడవుల్లో నలుగురు పిల్లల్ని కాపాడిన సైన్యం

ఫొటో సోర్స్, Reuters

వారున్న అడవిని మీరెలా అభివర్ణిస్తారు?

ఇది చాలా చిమ్మచీకటి ప్రాంతం. దట్టమైన, చిత్తడి అడవి. ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద చెట్లుంటాయి. అన్వేషించేందుకు వీలు కాని ప్రాంతమిది. ఇక్కడుండే జననివాసాలు కూడా చాలా చిన్నవి. నదికి పక్కనుంటాయి తప్ప, అడవిలో కాదు.

ఈ ప్రాంతమంతా చాలా చల్లగా, తేమతో కూడుకున్నదై ఉంటుంది.

ఇది చాలా ప్రమాదకరమైన ప్రాంతం. ఎందుకంటే జాగ్వార్‌లకు, అనకొండకు నెలవైన ప్రాంతం.

అమెరికాలో అత్యంత విషపూరితమైన పాములు ఈ అడవుల్లోనే ఉన్నాయి.

భయంగా లేదా ప్రమాదకరంగా మనం దీన్ని చూడకూడదు. గౌరవంతో చూడాల్సి ఉంది. అడవిలో ప్రతి అంగుళం కూడా ఆధ్యాత్మికతను కలిగి ఉంటుంది. దాన్ని మనం కొట్టివేయలేం.

అడవిలో ప్రతి అంశం, ప్రతి చెట్టు మనకు ఏదో ఒకటి నేర్పించగలదని చెబుతుంది. ప్రతిగా మనకు ఔషధాలను, ఆహారాన్ని, నీటిని అందిస్తుంది.

ఉదాహరణకు, మనం నిద్రపోతున్నప్పుడు, చెట్లు మనకు రక్షణగా నిలుస్తాయి. ఇవి గొప్ప సంరక్షకులు. మీకు ఆశ్రయమిస్తాయి, మిమ్మల్ని అక్కున చేర్చుకుంటాయి.

అమెజాన్ అడవుల్లో నలుగురు పిల్లల్ని కాపాడిన సైన్యం

ఫొటో సోర్స్, Reuters

అడవిలో నివసించేందుకు పిల్లలు వాడిన టెక్నిక్స్‌ ఏమై ఉంటాయి?

తడి ఆకులు, చిన్న చిన్న నీటి ప్రవాహాలను వారు గుర్తించి ఉండొచ్చు. కానీ తాగేందుకు అవి అనువైనవి కావు.

కానీ, నీటిని ప్యూరిఫై చేసే ఆకులు ఉంటాయి. మిగిలినవి విషపూరితమైనవి.

వాటిని మీరు కనుగొనాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని శుభ్రపరిచి, కొద్ది సేపటి తర్వాత నీటిని సేకరించుకునేందుకు వాటిని ఉపయోగించుకోవచ్చు.

దోమలు, ఇతర కీటకాలు కుట్టకుండా ఉండేందుకు అవసరమయ్యే ఆకులతో శరీరాన్ని శుభ్రపరుచుకునే టెక్నిక్స్‌ను వారు వాడి ఉండొచ్చు.

పాములు తమ కాళ్లను కరవకుండా ఉండేలా వారి కాళ్లను శుభ్ర పరుచుకునే ఒక చిన్న పొదను కనుగొని ఉండొచ్చు.

14 ఏళ్ల వయసు వచ్చేటప్పటికే ఈ రకమైన జ్ఞానం ఉండాలి. కొన్ని పురుగులను, కీటకాలను వారు తినుంటారు. చీమ నుంచి పక్షి వరకు ప్రతి ఒక్కటీ వారికి ఆహారమే.

పైనన్నంటిన్ని చూసుకుంటే, మాంజనిల్లాస్ వంటి కొన్ని పండ్లను వారు తీసుకుని ఉండొచ్చు.

ఈ కాలంలో కొన్ని తియ్యటి ఎర్రటి విత్తనాలు అడవిలో సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకుంటాయి. అంతేకాక ఎనర్జీ ఇస్తాయి.

వీటిని కూడా వారు తినుంటారు. కోకా మాంబె వంటి పౌడర్లు కూడా దొరికి ఉండొచ్చు. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచే కేలరీలను అందిస్తాయి.

అడవిలో మీరు బరువు తగ్గుతున్నారన్న విషయం కూడా మీకు తెలియకపోవచ్చు. మీరు బాగున్నట్లు మాత్రమే మీకనిపిస్తుంది.

ఎప్పుడైతే మీరు బయట వాళ్లని కలుస్తారో, అప్పుడు మీరెంత బక్కపల్చగా మారారో మీకు అర్థమవుతుంది.

మీరు చనిపోతున్నట్లు కూడా మీకు తెలియదు. ముందుకు సాగడంపైనే మీ దృష్టంతా ఉంటుంది.

అడవిలో ప్రయాణం

ఫొటో సోర్స్, PRIVATE FILE

అడవిలో ఇలాంటి పరిస్థితిలో చిక్కుకుపోవడం మామూలు విషయమా?

కొందరి విషయంలో ఇది మామూలే. కొంత మంది వ్యక్తులు సగటున 10 రోజుల వరకు అడవుల్లో గడుపుతుంటారు.

ఎందుకంటే వారు పండ్లు లేదా వేట కోసం వెళ్లినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది.

తిరిగి వారి ఆశ్రయానికి ఎలా వెళ్లాలో తెలియనప్పుడు ఇలా ఇరుక్కుపోతుంటారు.

తిరిగి వెళ్లే మార్గం తెలియనప్పుడు లేదా అడవుల్లో రాత్రిపూట ఉండే ప్రతికూలతల మూలంగా వెళ్లకూడదని చెప్పినప్పుడు వారు తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటూ ఉంటారు.

దీనివల్ల సంక్లిష్టమైన దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంటుంది.

ఎందుకంటే, ఎవిరైనా అడవిలోంచి బలవంతంగా బయటకు తీసుకువస్తే వారు బయటి వాతావరణంలో కుదురుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

అడవిలో ఉండడం, బయటకు రావడం అన్నది అడవిలో ఉన్నప్పుడు ఎలాంటి జీవితాన్ని గడిపారనే దానిపై ఆధారపడి ఉంటుంది.

అందుకే, అడవి నుంచి బయటకు తీసుకు వచ్చినంత మాత్రాన అంతా బాగా అయిందని అనుకోవడానికి వీల్లేదు.

అందుకే, ఈ పిల్లల మీద ఎలాంటి ప్రభావాలు ఉన్నాయి, వారి సంస్కృతి ఏమిటనే అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన చికిత్స చేయాలి.

లేదంటే, వారు ఇప్పటికీ ప్రమాదంలో ఉన్నట్లే భావించాలి.

అమెజాన్ అడవుల్లో నలుగురు పిల్లల్ని కాపాడిన సైన్యం

ఫొటో సోర్స్, Reuters

ఇదొక అద్భుతమని చెప్పడంపై మీరేం అనుకుంటున్నారు?

మేం అద్భుతాల గురించి మాట్లాడం. కానీ, ప్రకృతితో మనకున్న ఆధ్యాత్మిక అనుభవం గురించి మాట్లాడతాం.

ఈ పదం చర్చనీయాంశమైనదే కావొచ్చు. కానీ, మిమ్మల్ని రక్షించే అడవి తల్లి ఆలింగనం గురించి నేను ఎక్కువగా మాట్లాడాలనుకుంటున్నాను.

దీని అర్థం చేసుకోవడం కాస్త కష్టమే, నాకు తెలుసు, కానీ భూఉపరితలంపై ఉన్న భిన్నమైన ప్రపంచం గురించి మరింత తెలుసుకునేందుకు సమాజానికి, మనుష్యులకు ఇదొక మంచి అవకాశం.

అద్భుతం కంటే కూడా, మనల్మి రక్షించే, మనకు అండగా నిలిచేవి అడవుల్లో ఉంటాయన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సినవసరం ఉంది.

అడవి అంటే కేవలం పచ్చదనమే కాదు. ప్రజలకు అవసరమయ్యే ఎనర్జీలను కలిగి ఉంటుంది. వాటి గురించి తెలుసుకోవాలి. ఒకరికొకరు సాయం చేసుకోవడం ఇది నేర్పిస్తుంది.

ఈ 40 రోజుల్లో పిల్లలు తాము నేర్చుకున్న దేన్ని కూడా మర్చిపోరు.

విమాన ప్రమాదం జరగకపోయుంటే, పిల్లలు అడవిలో ఎలా నివసించి ఉంటారు? అడవిలో ఉన్న సమయంలో వారెలా బతికి బయటపడ్డారు? లేదా ఎలా చనిపోయారు? వంటి విషయాలను ఎవరూ పట్టించుకునే వారు కాదు.

పిల్లల తాత

ఫొటో సోర్స్, Reuters

పిల్లలు తప్పిపోయినప్పుడు మీరేం అనుకున్నారు?

తమ కుటుంబం ఎక్కడుంది? వారి ప్రాంతం ఎక్కడనే విషయాన్ని కనుగొనలేని పరిస్థితిలోకి ఈ పిల్లలు వెళ్లారనిపించింది.

కానీ కాదు, ఈ పిల్లలు ఏం కోల్పోలేదు. ఎందుకంటే వారు తమ ప్రపంచంలో ఉన్నారు. వారికి తెలుసు ఇక్కడెలా మనుగడ సాధించాలో.

పిల్లల గురించి మాట్లాడుకుంటే, సంరక్షణ లేని అడవిలో వారున్నారని మనం తప్పుగా భావించాం. కానీ, వారు తమ ప్రాంతంలో, తమకు నచ్చిన ప్రపంచంలోనే ఉన్నారు.

ఉదాహరణకు వర్షాన్ని తీసుకుంటే.. అయ్యో వర్షంలో ఎలా ఉన్నారని మీకనిపిస్తుంది. కానీ వాస్తవంగా అది వారిని రక్షించింది. వారికి స్నానం చేసేలా సహకరించింది.

వారిని శుభ్రపరుచుకునేందుకు సాయపడింది. వారిని కాపాడేందుకు ఈ వర్షమే ఆటంకంగా నిలిచి ఉండొచ్చు. కానీ, ఈ అడవిలో ప్రకృతిపరమైన అడ్డంకులు సహజమే.

‘అడవే కాపాడింది’

ఈ సంఘటనను అద్భుతంగా వర్ణిస్తే, అది మీ అజ్ఞానానికి సాక్ష్యం.

ఎందుకంటే, భూ ఉపరితలం ఎలా పనిచేస్తుందో మీరు అర్థం చేసుకోవాల్సి ఉంది.

ఆర్మీ గురించి, ఇన్‌స్టిట్యూషన్ల గురించి మాట్లాడుకుంటూ, పిల్లల్ని కాపాడిన వారిని హీరోలుగా కొనియాడుతున్నాం.

కానీ వాస్తవంగా అడవులు ప్రమాదకరం కాదు. ఈ అడవే వారిని కాపాడింది.

ఈ పిల్లలు వారు పొందిన గౌరవానికి హామీగా నిలుస్తారని ఆశిస్తున్నా. ఈ ఉపరితలాన్ని, సంస్కృతిని గౌరవించాలి. సాయుధ దళాలు, మైనింగ్ వంటి వారు ఈ అడవులను నాశనం చేస్తున్నారు.

ఈ పిల్లలు క్షేమంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను.

వారికేం జరిగిందో చెప్పాలని ఈ పిల్లలపై మనం ఒత్తిడి తేకుండా ఉండాలి.

ఈ పిల్లలు ఇంకా ప్రమాదం ఉన్నారా?

ఇది క్లియర్. అడవిలో ఉన్నప్పటి కంటే కూడా ఇప్పుడు వారు మరింత ప్రమాదంలో ఉన్నారని నేననుకుంటున్నాను.

ఎందుకంటే బయటున్న మీడియా, బయటున్న వ్యక్తులు, ఈ సమాజం, అద్భుతం గురించి మాట్లాడుతున్నారు.

వారికి అవసరం లేని చికిత్సలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తారు. వారికి అవసరం లేని దాన్ని వారికి అంటకడతారు.

అడవిలో వారు పొందిన సహజ మార్గాన్ని మనం గౌరవించాల్సినవసరం ఎంతో ఉంది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)