చిత్తూరు: నిరుడు కేజీ రూ.70 పలికిన తోతాపురి మామిడిని రైతులు ఇప్పుడు రూ.10కే అమ్మాల్సి వస్తోంది? దీని వెనక ఎవరున్నారు?

శ్రీనివాసులు రెడ్డి, రైతు
ఫొటో క్యాప్షన్, పెట్టుబడి కూడా చేతికి రాక తీవ్రంగా నష్టపోయామని శ్రీనివాసులు రెడ్డి లాంటి రైతులు చెబుతున్నారు.
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీకోసం

భారత్‌లో సాగు చేసే మామిడి రకాల్లో తోతాపురి ఒకటి. దీన్నే బెంగుళూరు మామిడి, సందర్శ, కిలి మూకు అని కూడా పిలుస్తారు.

ఈ కాయ ఆకారం కాస్త ప్రత్యేకంగా ఉంటుంది. దీని కింది చివర చిలుక ముక్కులా ఉంటుంది. ఈ కాయ మంచి పుల్లటి రుచికి, గట్టిగా, మందంగా ఉండే గుజ్జుకు ప్రసిద్ధి పొందింది. అత్యధిక దిగుబడినిచ్చే మామిడి రకం కూడా ఇదే.

అయితే పల్ప్ పరిశ్రమలను నమ్ముకుని భారీగా సాగు చేసిన చిత్తూరు జిల్లా మామిడి రైతులను అకాల వర్షాలు ఓవైపు దెబ్బతీస్తే, మరోవైపు పల్ప్ యూనిట్ల వ్యాపారులు ఇచ్చే ధర వారిని మరింత కుంగదీస్తోంది. వ్యాపారులు ‘సిండికేట్' అవ్వడం వల్లే తమకు ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు అంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో తోతాపురి మామిడి సాగును నమ్ముకుని ఏకంగా 39 మామిడి గుజ్జు ప్రాసెసింగ్ యూనిట్స్ ఇక్కడకు వచ్చాయి.

ఇవే ఇప్పుడు తమకు అన్యాయం చేస్తున్నాయని స్థానిక రైతులు బీబీసీతో అన్నారు. నిరుడు కేజీ రూ.70 వరకు పలికిన తోతాపురి మామిడిని ఇప్పుడు రూ.10కే అమ్ముకోవాల్సి వస్తోందని వారు వాపోయారు.

మ్యాంగో

నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లోనూ మంచి పంట

తోతాపురి రకం మామిడి ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో కూడా బాగా పండుతుంది.

తోతాపురిని ప్రజలు తినడానికి పెద్దగా ఇష్టపడరు.

ఇది పుల్లగా ఉండటం వల్ల గుజ్జు పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పల్ప్ ఎక్కువగా విదేశాలకు ఎగుమతి అవుతుంది.

తోతాపురి మామిడి గుజ్జును ఎగుమతి చేసి ఫ్రూటీ, మాజా, స్లైస్ లాంటి పానీయాలు తయారు చేస్తారు.

తోతాపురి

కలెక్టర్ నిర్ణయించిన ధరను లెక్క చేయని వ్యాపారులు

చిత్తూరు జిల్లాలో ఉన్న మామిడి గుజ్జు పరిశ్రమలు, రైతుల నుంచి తోతాపురి కాయలను కొంటూ ఉంటాయి. దీంతో ఈ పరిశ్రమలను నమ్ముకుని రైతులు కూడా ఈ రకం భారీగా సాగు చేశారు.

గత ఏడాది సీజన్ ముగిసేసరికి జులైలో వీటి ధర కేజీ 60 నుంచి 70 రూపాయలు పలికింది. ఈ ఏడాది కూడా ధర బాగానే వస్తుందని రైతులు ఆశించారు.

కానీ, ఇటీవలి అకాల వర్షాలు, భారీ గాలులతో పూత దశలోనే రైతుకు ఎక్కువ నష్టం వచ్చింది. ఎలాగోలా పంట కోసిన కొందరు రైతులు ఈసారి మంచి ధర వస్తుందనుకుంటే పల్ప్ పరిశ్రమ యూనిట్లు వారి ఆశలను నీరుగార్చాయి.

గుజ్జు పరిశ్రమల యజమానులంతా కుమ్మక్కై రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తుండటంతో చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ గుజ్జు పరిశ్రమల యజమానులు, రైతు సంఘాల నాయకులతో మే 10న సమావేశమయ్యారు.

చర్చల తర్వాత చివరికి తోతాపురి రైతుల నుంచి కేజీకి రూ.19కి మామిడి కొనాలని జిల్లా కలెక్టరే స్వయంగా ధర నిర్ణయించారు. అయితే, కలెక్టర్ నిర్ణయం ఎక్కడా అమలు కాలేదు.

దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు రైతులు పల్ప్ పరిశ్రమలు నిర్ణయించిన ధరలకు అంటే రూ.12 నుంచి రూ.14 మధ్యలో పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొందరు రైతులు దీనిపై మళ్లీ ఫిర్యాదు చేయడంతో జూన్ 6న మరోసారి సమావేశమైన కలెక్టర్, పల్ప్ యూనిట్లు, రైతులతో చర్చించి ధరను రూ.15.50గా నిర్ణయించారు. వారం రోజులు ధర స్థిరంగా ఉండాలని, తర్వాత పరిస్థితిని బట్టి ధరను నిర్ణయిస్తామని చెప్పారు.

అయితే, ఒకటి రెండు రోజులు రూ.14 నుంచి రూ.15 వరకు కొనుగోలు చేసిన గుజ్జు పరిశ్రమలు మళ్లీ మొదటికి వచ్చాయి.

జ్యూస్

ఒక మాటపై ఉండటం లేదు: రైతులు

ప్రస్తుతం రూ.11కే పంటను అమ్ముకోవాల్సి వస్తోందని, పెట్టుబడి కూడా చేతికి రాక తీవ్రంగా నష్టపోయామని శ్రీనివాసులు రెడ్డి లాంటి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

“ఒక ఎకరాను నాలుగు దఫాలు దున్నాలంటే సంవత్సరంలో రూ.10 వేలు అవుతుంది. పశువుల ఎరువులు రూ.12 వేలు, గవర్నమెంట్ ఎరువులు రూ.5 వేలు అవుతుంది. మందులు కొట్టాలంటే రూ.25 వేలకు పైనే అవుతుంది. ఎకరాకు ఐదు టన్నులు కాయలు వస్తాయి. ఒక లోడ్ కోసి ఫ్యాక్టరీకి తోలుకొనిపోవడానికి రూ.7 వేలు అవుతోంది. కూలీలు అన్నీ కలుపుకుంటే మాకు ఒక ఎకరా మీద ఖర్చు రూ.70 వేలకు పైనే అవుతోంది. ఫ్యాక్టరీకి అమ్మేసరికి ఇంకా పది, పన్నెండు వేలు మా చేతి నుంచే పడుతోంది” అని చెప్పారు.

పల్ప్ యూనిట్లు ధర విషయంలో ఒక మాటపై ఉండడం లేదని, అందరూ సిండికేట్ అయి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

తోతాపురి

‘నాలుగేళ్లలో దారుణమైన సీజన్ ఇదే’

“పొద్దున ధర రూ.15 అంటారు. మధ్యాహ్నానికి 14 రూపాయలు అంటారు. సాయంత్రానికి రూ.13 లేదా రూ.12కు తగ్గిస్తారు. ఫ్యాక్టరీలన్నీ సిండికేట్ అయిపోయి ఈ విధంగా చేస్తున్నాయి. దీనిపై కలెక్టర్ తగిన చర్యలు తీసుకోకపోతే మాకు కాయ కోసిన కూలీలు కూడా దొరకవు. అంత నష్టపోవాల్సి వస్తుంది. కనీసం టన్నుకు రూ.30 వేల ధరైనా లేకపోతే రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది” అని శ్రీనివాసులు రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రస్తుతం తమ జీవితాలు పల్ప్ కొనే పరిశ్రమల దయా దాక్షిణ్యాలపై ఆధారపడ్డాయని తూర్పుపల్లెకు చెందిన రైతు సుబ్రమణ్యం రెడ్డి చెప్పారు.

“రైతుకు గిట్టుబాటు ధర దొరకడం అంటే, అది ఎండమావిలో నీటిని వెదికినట్లే అనిపిస్తోంది. ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ, ఫ్యాక్టరీల వాళ్లు రైతుల గురించి పట్టించుకోవడం లేదు. వాళ్లు కలెక్టర్ చెప్పినా వినడంలేదు. వాళ్లదే ఇష్టారాజ్యం. ఈ రోజు రూ.15 అంటారు. రైతులు ఎక్కువగా కాయలు తీసుకొచ్చేశారని సాకు చెబుతూ మరో రెండు రూపాయలు తగ్గిస్తారు” అన్నారు.

గత మూడు నాలుగేళ్లలో ఇంత దారుణమైన సీజన్ తాను ఎప్పుడూ చూడలేదని దామలచెరువుకు చెందిన మామిడి మండీ వ్యాపారి గోవర్ధనరెడ్డి చెప్పారు.

“ఇక్కడ పరిశ్రమలన్నీ సిండికేట్ అయ్యి రూ.12 నుంచి తక్కువలో తక్కువగా 6 రూపాయలకు కూడా కొంటున్నాయి. ప్రైవేట్ మార్కెట్ కాబట్టి ఎక్కడ నుంచి కాయలు వచ్చినా తమకు ఇష్టం వచ్చినట్లు కొనుగోలు చేస్తూ రైతులను దారుణంగా మోసం చేస్తున్నారు. దీనివల్ల రైతులు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఇక్కడ ఇన్ని జ్యూస్ ఫ్యాక్టరీలు వచ్చిన తర్వాత పోటీ పెరిగి, ధరలు పెంచాల్సింది పోయి పడిపోయేలా చేశారు” అని ఆయన చెప్పారు.

తోతాపురి మార్కెట్ నడిస్తేనే మండీలు, వ్యాపారులు అందరూ బాగుంటారని, అది నడవకపోతే మార్కెట్, మండీలు, రైతులు అందరూ నష్టపోతారని గోవర్థనరెడ్డి అభిప్రాయపడ్డారు.

గోవర్ధన బాబి, పరిశ్రమల యూనియన్ ప్రెసిడెంట్
ఫొటో క్యాప్షన్, పరిశ్రమల యూనియన్ ప్రెసిడెంట్ గోవర్ధన్ బాబీ

పల్ప్ యూనిట్ల వాదన ఏమిటి?

పల్ప్ యూనిట్ల వాదన మరోలా ఉంది.

పక్క రాష్ట్రాల నుంచి ఉన్న పోటీని తట్టుకోవడానికే తాము తక్కువ ధరకు కొనాల్సి వస్తోందని, లేదంటే నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆలిండియా ఫుడ్ ప్రాసెసర్స్ అసోసియేషన్ సౌత్ జోన్ ఛైర్మన్ గోవర్ధన్ బాబీ చెప్పారు.

“సిండికేట్ అవుతున్నాం అనేది నిజం కాదు. రైతు నేరుగా అక్కడకు లోడ్ తీసుకుని వెళ్తే చిత్తూరు జిల్లాలో ఉండే ఫ్యాక్టరీలు కచ్చితంగా రూ.15.50కు కొంటున్నాయి. ఫ్యాక్టరీ వరకు ఎలా వెళ్లడం అని మండీల్లో లేదంటే ర్యాంపుల దగ్గర రైతులు అమ్ముకుంటున్నారు. అక్కడ అప్పటికప్పుడే డబ్బు ఇస్తారు. దీంతో చిన్న చిన్న రైతులు అమ్ముకుంటున్నారు.”

తమ దగ్గర ఒక్కోసారి కాయ దించుకోవడం ఆలస్యం అవుతుందని, ఆ ఆలస్యాన్ని రైతులు తట్టుకోలేకపోతున్నారని గోవర్ధన్ చెప్పారు. తాము జిల్లా రైతులకు మిగతా రాష్ట్రాల రైతుల కంటే కాస్త ఎక్కువే ఇస్తున్నామన్నారు.

“మా దగ్గర ఒక్కొక్కసారి అన్ లోడింగ్‌కు ఆలస్యం అవుతుంది. ఒక్కోసారి దానికి ఏడెనిమిది గంటల నుంచి ఒకరోజు కూడా పడుతుంది. ఆ ఆలస్యాన్ని వారు భరించలేకపోతున్నారు. నేరుగా ర్యాంప్‌ల దగ్గరకు వెళ్లి రూ.10 ఉంటే రూ.8కి ఇచ్చేయడం చేస్తున్నారు” అని ఆయన చెప్పారు.

మామిడి గుజ్జుకు త్వరగా పాడయ్యే స్వభావం ఉంటుందని, కాబట్టి తమకు కనీస ఎగుమతి ధర అనేది ఉండదని చెప్పిన గోవర్ధన్, దానివల్ల కనీస మద్దతు ధరను నిర్ణయించడం కూడా కష్టమేనన్నారు.

“దక్షిణ భారతదేశంలో దీని కోసం ఒక బోర్డ్ ఏర్పాటు చేస్తే, మామిడి మార్కెట్ కొంచెం స్థిరంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. పక్క రాష్ట్రాల నుంచి మనకు పోటీ ఉండడంతో, దాన్ని బట్టి మేం మా పల్ప్ అమ్ముకోవాల్సి ఉంటుంది. లేదంటే మా ఉత్పత్తులు పోవు. దీనికి పాడయ్యే స్వభావం ఉంటుంది కాబట్టి ఏడాది లోపల దాన్ని ఎగుమతి చేసేయాల్సి ఉంటుంది” అని ఆయన చెప్పారు.

మధుసూదన్
ఫొటో క్యాప్షన్, హార్టికల్చర్ డీడీ మధుసూదన్ రెడ్డి

హార్టికల్చర్ శాఖ ఏమంటోంది?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదన ఇంకోలా ఉంది. చిత్తూరు జిల్లాలో తోతాపురిఎక్కువగా సాగు చేయడంతోపాటు కాయ నాణ్యత కూడా కొంత తగ్గిపోవడం వల్లే ధరలు తగ్గాయని చెబుతోంది.

చిత్తూరు జిల్లా హార్టికల్చర్ డీడీ మధుసూదన్ రెడ్డి చెప్పినదాని ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 4 లక్షల 13 వేల హెక్టార్లలో మామిడి సాగు చేస్తున్నారు. వీటి నుంచి ఏటా సగటున 43 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూస్తే దాదాపు లక్షా 12 వేల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. ఏటా దాదాపు 5 లక్షల 60 వేల టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుందని అంచనా.

దీంతో చిత్తూరు జిల్లాకు ప్రాసెసింగ్ యూనిట్లు వచ్చాయని, జిల్లాలో ప్రధానంగా అల్ఫోన్సో, తోతాపురి రకం మామిడి కాయలనే ప్రాసెస్ చేస్తుంటారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.

ప్రాసెసింగ్ యూనిట్లపై ఆశతో రైతులు ఎక్కువ సాగు చేయడం, ఈసారి గాలివానల లాంటి కారణాల వల్ల కాయ ధర పతనమైందని అన్నారు.

“చిత్తూరు జిల్లాలో 39 ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆల్ఫోన్సో, తోతాపురి కాయల నుంచి పల్ప్ తయారు చేస్తాయి. ఈ యూనిట్లకు భారీగా దాదాపు 5 లక్షల నుంచి 7 లక్షల టన్నుల పల్ప్ తయారు చేసే సామర్థ్యం ఉంది. జిల్లాలోని ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి ఇక్కడ ఉత్పత్తి, దిగుబడి సరిపోదు కాబట్టి, ధరలు బాగా ఎక్కువ వస్తాయని రైతులు తోతాపురి రకం మామిడిని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. గాలివాన వల్ల కాయ దెబ్బతినడంతో ధర తగ్గిపోయింది. నిర్దేశిత ధరలకు రైతుల నుంచి కొనుగోలు అయ్యేలా చూడలేకపోయాం” అని మధుసూదన్ రెడ్డి చెప్పారు.

తోతాపురి

మూడు రకాల మార్కెటింగ్ వ్యవస్థలు

రైతులే కాయలను కోసి ఫ్యాక్టరీ వరకు తీసుకొస్తే వారికి రూ.15.50 చెల్లిస్తారని ప్రభుత్వం చెబుతోంది.

“జిల్లాలో మూడు రకాల మార్కెటింగ్ వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి ప్యాక్టరీలు, రెండు యార్డులు, మూడోది ర్యాంపు అనే ఒక కొత్త వ్యవస్థ. మార్కెట్ యార్డుల్లో ఏజెంట్లు కొంటారు కాబట్టి, వారు కచ్చితంగా ఫ్యాక్టరీలు చెల్లించే ధర కంటే తక్కువే ఇస్తారు. కాయ నాణ్యత ఉండి కూడా తక్కువ ధర ఇస్తుంటే, దానిని జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువస్తే, దాన్ని సర్దుబాటు చేస్తాం. అలా కాకుండా వేరే కారణాలతో మార్కెట్లో, ర్యాంపుల దగ్గర అమ్ముకుంటే, అది రైతుల ఇష్టం” అంటారు మధుసూదన్ రెడ్డి.

మామిడి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని రైతు సంఘం నాయకుడు జయచంద్ర చౌదరి విమర్శించారు. ఫ్యాక్టరీ యజమానులంతా సిండికేట్ అయి ధరలు తగ్గించారని ఆయన బీబీసీతో చెప్పారు.

‘‘చిత్తూరు జిల్లా మామిడి కాయ కోతలు ప్రారంభం కాక ముందు నూజివీడు మామిడికాయకు 22 రూపాయలు ఇచ్చిన ఫ్యాక్టరీ యజమానులు చిత్తూరు కాయ కోతలు ప్రారంభం కాగానే ధరలు తగ్గించారు. ఇదంతా సిండికేట్ మాయాజాలం’’అని ఆయన అన్నారు.

గాలి వానలకు రాలిన కాయలకు, మంగు పట్టిన కాయలకు గిట్టు బాటు ధర అడగలేదని, బాగున్న వాటికే అడుగుతున్నామని చెప్పారు.

‘‘రైతులకు కనీసం 25 రూపాయల నుంచి 30 రూపాయల వరకు ధర వచ్చేటట్టు చూడాలి. లేని పక్షంలో రైతులు తీవ్రంగా నష్టపోతారు. పల్ప్ రేట్‌‌ను బట్టి మామిడి ధరలను ఫిక్స్ చేస్తే రైతు బాగుపడతారు. అలా కాని పక్షంలో రైతులకే ప్రాసెసింగ్ చేసుకునే విధంగా సొసైటీలు ఏర్పాటు చేసి ఫ్యాక్టరీలు మంజూరు చేస్తే ధరలు పెరుగుతాయి. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న తంతు. దీనివల్ల రైతులు నష్టపోతునే ఉన్నారు’’ అని జయచంద్ర చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: తోతాపురి మామిడి ధర 10 రూపాయలకు ఎందుకు పడిపోయింది?

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)