ల్యాబ్ చికెన్ ఇది.. దీని ధర ఎంత, రుచి ఎలా ఉంటుంది?

- రచయిత, నిక్ మార్ష్
- హోదా, ఆసియా బిజినెస్ కరస్పాండెంట్
ఇది చూడటానికి చికెన్‌లా ఉంటుంది, వాసన కూడా చికెన్‌లానే వస్తుంది, రుచి కూడా చికెన్‌లానే ఉంటుంది.
నా ముందు కనిపిస్తున్న ఈ మాంసం కోళ్ల పెంపక కేంద్రం నుంచి రాలేదని మీరు అసలు ఊహించలేరు. ఇక్కడకు కొన్ని మైళ్ల దూరంలోని ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ఒక ల్యాబ్‌లో దీన్ని తయారుచేశారు.
నేను సింగపూర్ బ్రిస్టోలోని హ్యూబెర్స్ బుచెరీలో ఉన్నాను. మెనూలో ‘‘కల్టివేటెడ్ మీట్’’ కనిపిస్తున్న ప్రపంచంలోని ఏకైక రెస్టారెంట్ ఇది.
కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని ఈ రెస్టారెంట్ యజమాని చెబుతున్నారు.
ఈ మాంసాన్ని అభివృద్ధి చేసిన కాలిఫోర్నియాకు చెందిన ‘ఈట్ జస్ట్’ స్పందిస్తూ ‘‘దీన్ని ఇలా తయారుచేయడంలో ఎలాంటి నైతిక సమస్యలూ ఉండవు. పైగా ఇది గ్రీన్ టెక్నాలజీ. రుచిలోనూ ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొంది.

ఈ టెక్నాలజీపై కొన్ని సంస్థలు బిలియన్ల డాలర్ల నిధులను కుమ్మరిస్తున్నాయి. అయితే, దీని భవిష్యత్‌పై కొన్ని ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
2013లో లండన్‌లో తొలి ‘ల్యాబ్‌లో తయారుచేసిన బర్గర్’ను ఆవిష్కరించిన తర్వాత, ‘కల్టివేటెడ్ మీట్’ కోసం ప్రపంచ వ్యాప్తంగా డజన్ల కొద్దీ కంపెనీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
అయితే, ప్రస్తుతం ‘‘ఈట్ జస్ట్’’ మాత్రమే ఈ మాంసాన్ని ప్రజలకు విక్రయించేందుకు సింగపూర్ ప్రభుత్వం అనుమతులను పొందగలిగింది.
ఇలా ల్యాబ్‌లో తయారుచేసిన మాంసాన్ని అమ్మే ఏకైక దేశం సింగపూర్ మాత్రమే. దీనికి డిసెంబరు 2020లో ఇక్కడి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
అయితే ఇప్పటికీ ఇక్కడ విస్తృతంగా ప్రజలకు ఈ మాంసం అందుబాటులోకి రావడం లేదు. 2021లో ఒక క్లబ్‌లోని మెనూలో ‘కల్టివేటెడ్ చికెన్ నగెట్స్’ కనిపించాయి.
అయితే, ఇది కొన్ని నెలల ముచ్చటగానే మిగిలింది. ఈ ఏడాది మళ్లీ హ్యూబర్ ‘‘చికెన్ శాండ్‌విచ్’’, ‘‘చికెన్ పాస్తా’’లను మెనూలో చేర్చింది. అయితే, ఇది కేవలం వారంలో ఒక రోజు మాత్రమే అందుబాటులో ఉంటోంది. దీని కోసం ప్రత్యేక స్లాట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్లాట్లు కూడా చాలా పరిమితంగా ఉంటాయి.
‘‘కల్టివేటెడ్ మీట్ అసలైన మాంసం. దీని కోసం మీరేమీ జంతువులను చంపాల్సిన అవసరం ఉండదు’’ అని ఈట్ జస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జోష్ టెట్రిక్ బీబీసీతో చెప్పారు. ‘‘ఇది భవిష్యత్‌కు భరోసా ఇచ్చే ఆహారం’’ అని ఆయన అన్నారు.

మొక్కల నుంచి తయారుచేసే మాంసంతో పోలిస్తే, కల్టివేటెడ్ భిన్నమైన మాంసం. దీని కోసం జంతువుల నుంచి కొన్ని కణాలను సేకరిస్తారు. వీటికి పోషకాలు, షుగర్లు, కొవ్వులను అందించి పెంచుతారు.
ఆ కణాలు బాగా పెరిగేందుకు అవసరమైన వాతావరణం కల్పిస్తారు. చివరగా వీటిని ‘‘స్టీల్ బయోరియాక్టర్’’లో పెడతారు. ఇది ఒక ‘‘ఫెర్మెంటేషన్ ట్యాంక్’’లా పనిచేస్తుంది.
నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత బయోరియాక్టర్ నుంచి దీన్ని బయటకు తీస్తారు. దీనికి వృక్ష సంబంధిత ప్రోటీన్‌ను కలుపుతారు. చివరగా 3డీ ప్రింటింగ్ సాయంతో ముక్కల రూపంలోకి తీసుకొస్తారు.
నా ప్లేట్‌లో కనిపిస్తున్న ‘‘డీప్ ఫ్రైడ్ చికెన్’’ అచ్చమైన చికెన్‌లానే అనిపిస్తోంది. అయితే, ఇది కాస్త ఫాస్ట్-ఫుడ్ రెస్టారెంట్‌లో బాగా ప్రాసెస్‌చేసిన చికెన్‌లా ఉంది.
‘‘ఇది అసలైన మాంసం, చక్కగా ఉంది’’ అని ఇటలీకి చెందిన కత్రినా అన్నారు. ఈ కల్టివేటెడ్ చికెన్ రుచి చూసేందుకు ప్రత్యేకంగా ఆమె ఇక్కడికి వచ్చారు. పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమె మాంసాన్ని తినడం మానేశారు. కానీ, ఇలాంటి మాంసాన్ని అయితే, కచ్చితంగా తింటానని ఆమె అంటున్నారు.
ఆమెకు ఇక్కడ నచ్చని విషయం ఏమిటంటే.. పాస్తాతో చికెన్‌ను కలిపి అందించడం. సాధారణంగా ఇటలీలో ఇలా వడ్డించరు.
మరోవైపు ఇది అసలైన చికెన్‌లానే కనిపించడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందని మరో సింగపూర్ వాసి చెప్పారు.
‘‘అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకేమీ పట్టింపు లేదు. దీని ధరే నాకు ముఖ్యం’’ అని ఆయన అన్నారు.
నేను ఆర్డర్ చేసిన చికెన్ పాస్తా 13.70 డాలర్లు(రూ.1130). ప్రస్తుతం తయారుచేయడానికి అవుతున్న ధరతో పోలిస్తే, దీనిలో భారీగా డిస్కౌంట్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
అసలు ఈ చికెన్‌పై ఎంత ఖర్చుపెడుతోందో ఈట్ జస్ట్ వెల్లడించలేదు. అయితే, సింగపూర్‌లో వారానికి మూడు కేజీల చికెన్‌ను కంపెనీ ఉత్పత్తి చేస్తోంది.
అయితే, ఇక్కడ హ్యూబర్‌లోనే వారానికి 4,000 నుంచి 5,000 కేజీల చికెన్‌ను అమ్ముతుంటారు. అంటే ఈట్ జస్ట్ తమ ఉత్పత్తిని ఏ స్థాయికి పెంచాల్సి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఒక్కో చికెన్ ముక్క ధర తగ్గాలంటే ఉత్పత్తిని కూడా భారీగా పెంచాల్సి ఉంటుంది.
2018 నుంచి తాము ఖర్చు పెడుతున్న ఖర్చును భారీగా తగ్గించగలిగామని ఈట్ జస్ట్ చెబుతోంది. సింగపూర్‌లోని తమ తయారీ కేంద్రాన్ని చూసేందుకు సంస్థ మాకు అనుమతులు ఇచ్చింది.
మెరుస్తున్న 6,000 లీటర్ల స్టీలు బయోరియాక్టర్‌లు మాకు అక్కడ కనిపించాయి. ప్రస్తుతమున్న చికెన్ ధరకు కల్టివేటెడ్ చికెన్ ధర తగ్గాలంటే ఇలాంటివి భారీగా కావాల్సి ఉంటుంది.

ధరలు తగ్గేందుకు కాస్త సమయం పడుతుందని సంస్థ చెబుతోంది. అయితే, ఇప్పటికే చాలా సమయం గడిచిందని కొందరు నిపుణులు అంటున్నారు.
‘‘ఈ కంపెనీలు చాలా భరోసాతో చెబుతున్నాయి. కానీ, వాస్తవంలోనూ పరిస్థితులు అలానే కనిపించాలి. నంబర్లను చూడండి. ధరలను తగ్గించే స్థాయిలో చికెన్‌ను ఉత్పత్తి చేయగలరా? లేదు. ఈ విధానంతో మనం ప్రపంచాన్ని కాపాడగలమా? లేదు. నాకు తెలిసినంతవరకు ఈ కంపెనీలు ఏదో చెబుతున్నాయి అంతే’’ అని కాలిఫోర్నియా యూనివర్సిటీలోని ఆల్ట్ మీట్ ల్యాబ్ కో డైరెక్టర్ రిచర్డో శాన్ మార్టిన్ అన్నారు.
భారీగా ఉత్పత్తి చేయడంపైనా ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు కాలుష్యం తగ్గుతుందనే వాదనతోనూ కొందరు శాస్త్రవేత్తలు విభేదిస్తున్నారు.
భూమి, జంతువులపై ఒత్తిడిని తగ్గించడంతోపాటు కార్బన ఉద్గారాలను తగ్గించేలా కొత్త పరిష్కార మార్గాలు ఉండాలి. కానీ, ప్రస్తుతం కల్టివేటెట్ మీట్ కోసం చాలా ఎనర్జీ ఖర్చు అవుతోంది.
సాధారణ ఆవు మాంసంతో పోల్చినప్పుడు కల్టివేటెడ్ మీట్ సగటున నాలుగు నుంచి 25 రెట్ల ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలకు కారణం అవుతోందని కాలిఫోర్నియా యూనివర్సిటీ చేపట్టిన ఒక అధ్యయనం వెల్లడించింది.
అయితే, ఆ అధ్యయనంలో చాలా లోపాలున్నాయని ఈట్ జస్ట్ చెబుతోంది.
మరోవైపు ఈ విధానంలో మాంసాన్ని తయారుచేయడం తప్పనిసరని జోష్ అన్నారు. ‘‘కొన్నిసార్లు దీనికి సమాధానం నేరుగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఈ విధానాలు పనిచేయకపోవచ్చు కూడా. కానీ, ఏమీ చేయకుండా కూర్చునే కంటే ఏదో ఒకటి చేయాలని మేం నిర్ణయం తీసుకున్నాం. ఆ దిశగా ముందుకు వెళ్తున్నాం’’ అని ఆయన అన్నారు.
ఈ టెక్నాలజీపై కొందమంది మదుపరులు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు కల్టివేటెడ్ మీట్ టెక్నాలజీపై 2.8 బిలియన్ డాలర్ల (23 వేల కోట్లు) పెట్టుబడులు పెట్టారు.
అయితే, ఇక్కడ కేవలం అభివృద్ధి చెందిన దేశాల్లో కొందరు ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడులు పెడితే సరిపోదు.
‘‘ప్రభుత్వాలు కూడా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. పునరుత్పాదక ఇంధనం దిశగా అడుగులు వేసినట్లే అందరూ కలిసి ప్రయత్నించాలి. ఇది ఒక లైఫ్‌టైమ్ ప్రాజెక్టు’’ అని జోష్ అన్నారు.
ప్రస్తుతం సింగపూర్ మినహా ఏ ఇతర దేశాల్లోనూ కల్టివేటెడ్ మీట్ అమ్మేందుకు అనుమతులు లేవు.
‘‘అయితే, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా పెట్టుబడులు పెడితే, ఇటు ప్రైవేటు, అటు ప్రజా ధనం రెండూ వృథా అవుతాయి’’ అని శాన్ మార్టిన్ అన్నారు.
‘‘ఇక్కడ సఫలం అయ్యేందుకు స్పష్టమైన మార్గం కనిపించకపోతే, ప్రభుత్వాలు లేదా పెట్టుబడుదారులు ముందుకు రాకపోవచ్చు’’ అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- 'అప్పులు తీరేవరకు ఈ వృత్తి తప్పదు' - ఒక సెక్స్ వర్కర్ కథ
- ఫస్ట్ డే-ఫస్ట్ షో, ఏపీ ఫైబర్‌నెట్: కొత్త సినిమాలను నేరుగా ఇంట్లోనే రిలీజ్ రోజే చూసే సదుపాయం
- మనిషిని చంపేసి ఇంటర్నెట్లో ఏం వెతుకుతున్నారు? శవాన్ని ఎందుకు ముక్కలు చేస్తున్నారు?
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య: ట్రైన్ శబ్దంలో తేడాను గుర్తించి యాక్సిడెంట్ జరగబోతుందని ఊహించి చైన్ లాగి రైలు ఆపిన ఇంజినీర్
- పీఎం అయినా సీఎం అయినా ఆ కులం నుంచే.. బ్రాహ్మణులు, క్షత్రియులదే ఆధిపత్యం, కమ్యూనిస్ట్ పార్టీలోనూ వారే
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















