అరటి పండు తింటే 5 లాభాలు

అరటి పండు

ఫొటో సోర్స్, Getty Images

ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలో ఎక్కువగా ఇష్టపడే పండ్లలో అరటి పండు ఒకటి. వీటిలో చాలా రకాలు ఉన్నాయి.

అరటి పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి శక్తినిచ్చే కార్బొహైడ్రేట్లు, గుండెను పదిలంగా ఉంచే పొటాషియం బాగా లభిస్తాయి.

తియ్యదనంతో, పసుపు రంగులో ఉండే అరటిపండ్లు మనకు ఎక్కువగా లభిస్తాయి. ఆకుపచ్చ అరటి పండ్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఆకుపచ్చ అరటి పండ్లను కూరగాయ రూపంలో ఎక్కువగా వినియోగిస్తారు.

సుమారు 80 గ్రాముల అరటిపండులో లభించే పోషకాలు :

ఎనర్జీ : 65 కిలో క్యాలరీలు

ప్రొటీన్ : 1 గ్రాము

ఫ్యాట్ : 0.1 శాతం

కార్బొహైడ్రేట్స్ : 16.2 గ్రాములు

ఫైబర్ : 1.1 గ్రాములు

పొటాషియం : 264 మిల్లీ గ్రాములు

అరటి పండు

ఫొటో సోర్స్, Getty Images

అరటిపండ్ల వల్ల కలిగే ప్రయోజనాలు

పేగు పదిలం: అరటి పండ్లలో ఎక్కువగా ఉండే పెక్టిన్ పేగు పనితీరును మెరుగుపరుస్తుంది. పేగులోని ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు సహకరిస్తుంది. అందులో ఉండే కరిగిపోయే గుణమున్న ఫైబర్ శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అరటి పండ్లలో అధిక ఫైబర్ కారణంగా కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది.

అరటి పండ్లలోని కార్బొహైడ్రేట్లు త్వరగా జీర్ణం కాని ఆహార పదార్థాలు కూడా జీర్ణమయ్యేందుకు ఉపకరిస్తాయి. పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు ఇది సహకరిస్తుంది. ఫ్యాటీ యాసిడ్స్‌ను ఉత్పత్తి చేసేందుకు ఇది తోడ్పడుతుంది.

గుండెకు భరోసా: అరటి పండ్లు పొటాషియం వంటి సూక్ష్మ పోషకాలను కలిగి ఉంటాయి. శరీరంలోని అత్యంత ముఖ్యమైన ఎలక్ట్రోలైట్‌లలో పొటాషియం ఒకటి. ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో ఫ్లూయిడ్‌ల సమతౌల్యాన్ని కాపాడడంతో పాటు రక్త పోటు(బీపీ)ని నియంత్రిస్తుంది. పొటాషియం రక్తపోటును తగ్గించడమే కాకుండా, గుండెపోటు రాకుండా అడ్డుకుంటుందని శాస్త్రీయంగా నిరూపితమైంది.

గుండెల్లో మంటకు ఉపశమనం: అరటిపండ్లు ఉదరంలో విడుదలయ్యే యాసిడ్‌లను సమతౌల్యం చేస్తాయి. అందులో ఉండే ల్యూకోసియానిడిన్ పేగులోని పలుచని పొరను మందంగా చేసేందుకు ఉపయోగపడుతుంది. అది యాసిడ్‌ల ప్రభావాన్ని తగ్గిస్తుంది. బాగా పండిన అరటి పండ్లు గుండెల్లో మంట నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

శక్తి: అరటి పండ్లు శరీరానికి ఎక్కువ క్యాలరీల శక్తిని అందిస్తాయి. మిగిలిన పండ్లతో పోలిస్తే అరటి పండ్లలో షుగర్ లెవల్స్ అధికంగా ఉంటాయి. ఫైబర్‌తో కలిసిన సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటివి శరీరానికి అత్యవసర శక్తిని అందిస్తాయి. కండరాల కదలికలకు, తిమ్మిర్లు తగ్గించేందుకు పొటాషియం సహకరిస్తుంది.

ఒత్తిడి తగ్గించడం: అరటిలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్‌ను మెదడు‌ను ప్రశాంతంగా ఉంచేందుకు సాయపడే సెరోటొనిన్‌గా శరీరం మార్చుకుంటుంది. ఈ సెరొటొనిన్ మెదడును విశ్రాంతిగా ఉంచేందుకు సాయపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంతోపాటు ఉత్సాహాన్ని కలిగిస్తుంది.

అందరూ తినొచ్చా?

ఔను, అరటి పండ్లు అందరూ తినొచ్చా అనేది కూడా ఇక్కడ చర్చించాల్సిన విషయమే. అందరికీ అరటి పండ్లు సరిపడకపోవచ్చు. కొందరిలో అవి మైగ్రేన్‌కు కారణం కావొచ్చు.

మరికొందరిలో అలర్జీలకు కారణమయ్యే అవకాశం ఉంది. అరటి పండు గిట్టకపోతే అవి తిన్న కొద్ది నిమిషాల్లోనే అలర్జీ లక్షణాలు కనిపిస్తాయి. ఇలా అలర్జీలు రావడాన్ని అనాఫిలాక్సిస్ అంటారు. అలా జరిగితే వెంటనే వైద్య సాయం పొందవలసి ఉంటుంది.

అయితే, మధుమేహంతో బాధపడుతున్న వారు అరటి పండ్లను ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

అలాగే, కొన్ని ఔషధాలు కూడా రక్తంలో పొటాషియం స్థాయులను పెంచుతాయి. ఒకవేళ అలాంటి ఔషధాలు వాడుతున్నట్టయితే అరటి పండ్ల వంటి పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకునే ముందు జాగ్రత్త వహించాలి.

ఇవి కూడా చదవండి: