సాదీ షిరాజీ: ఈ పర్షియన్ రచయిత సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి బ్రాహ్మణుడిగా మారారా? ఇది నిజమా, కల్పితమా?

సాదీ

ఫొటో సోర్స్, Alamy

    • రచయిత, మిర్జా ఏబీ బేగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మామూలుగా ఒకరి విద్యార్హత, వారి సామర్థ్యాలు డిగ్రీల ద్వారా తెలుస్తాయి. కానీ వందేళ్ల క్రితం భారత ఉపఖండంలో 'గులిస్తాన్', 'బోస్తాన్' చదవడం ద్వారా విద్యా స్థాయిని పరీక్షించేవారు.

ఈ రెండు పుస్తకాలు అప్పట్లో డిగ్రీలతో సమానం. చాలా మంది ముఖ్యుల జీవిత చరిత్రల్లో వారు యుక్తవయస్సు వచ్చేనాటికి గులిస్తాన్, బోస్తాన్‌లను చదివారని చెప్పారు.

ఈ పుస్తకాలు వారి వద్ద ఉన్నాయని కూడా గర్వంగా చెప్పుకొనేవారు.

ఈ రెండు పుస్తకాలను సుమారు 750 సంవత్సరాల క్రితం అంటే పదమూడో శతాబ్దంలో అబూ మొహమ్మద్ ముస్లే ఉద్దీన్ బిన్ అబ్దుల్లా షిరాజీ రాశారు. ఆయన నాణేలు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి.

ఆయనను సాధారణంగా షేక్ సాదీ లేదా సాదీ షిరాజీ అని పిలుస్తారు. ఆయన ఇరాన్‌లోని షిరాజ్ నగరానికి చెందినవారు కాబట్టి ఆయన పేరులో షిరాజీ రాసేవారు.

ఇరాన్ నాణెంపై గులిస్తాన్ కవితలోని 'బానీ ఆడమ్ అజాయ్ యాక్ దిగ్రాండ్' అనే వాక్యం ఉంటుంది.

ఈ పంక్తి అర్థం ఏమిటంటే మానవులందరూ ఒకరిలో మరొకరు భాగమే. 2005లో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయానికి ఇరాన్ అందించిన కార్పెట్‌పై ఈ పద్యం మొత్తం పొందుపరిచారు.

''ఐక్యరాజ్యసమితి లోపలి తలుపు వద్ద అద్భుతమైన తివాచీ ఉంది. ఇది ఇరాన్ దేశ ప్రజల బహుమతి. దానిపై గొప్ప పర్షియన్ కవి సాది అద్భుతమైన పదాలు పొందుపరిచారు" అని ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్‌ తెలిపారు.

''700 ఏళ్ల తర్వాత కూడా ఒక కవిని ముఖ్యమైన, సమకాలీనుడిగా భావిస్తే ఆయనను బుల్బుల్-ఎ-షిరాజ్ (ది నైటింగేల్ ఆఫ్ షిరాజ్), 'ప్రాఫెట్ ఆఫ్ వర్డ్స్' అని ఎందుకు పిలవకూడదు'' అని కలకత్తా యూనివర్శిటీలో పర్షియన్ ప్రొఫెసర్ మహ్మద్ షకీల్ అన్నారు.

సాదీ

ఫొటో సోర్స్, Alamy

సాదీ షిరాజీ తొలి దశ జీవితం ఎలా ఉండేది?

సాదీ అంటే అదృష్టమని, ఇప్పటివరకు ఆయనకున్న పాపులారిటీ చూస్తే ''మీ పనితోనే మీ పేరు గుర్తుంటుంది'' అనే దానికి ఉదాహరణ అని మహ్మద్ షకీల్ అన్నారు..

షేక్ సాదీ జీవితం గురించి పెద్దగా సమాచారం లభ్యం కాలేదని, అయితే సాదీ పుస్తకాల్లో తన గురించి చెప్పిన విషయాల ఆధారంగా ఆయన జీవితానికి సంబంధించిన చరిత్ర తెలిసిపోతుందని చెప్పారు.

1200 ఏడీ మొదటి దశాబ్దంలో సాదీ జన్మించాడని పర్షియన్ చరిత్ర పుస్తకం 'సనాదిద్-ఎ-ఆజం' ద్వారా తెలుస్తోంది. ఆయన దాదాపు 100 ఏళ్లు బతికాడని రాశారు.

కానీ ఇతర చరిత్రకారులు ఆయన వయస్సు 81-82 సంవత్సరాలుగా పేర్కొన్నారు. ఆయన 1210 లో జన్మించాడని, 1291-92 కాలంలో మరణించాడని రాశారు.

ప్రఖ్యాత ఉర్దూ కవి, చరిత్రకారుడు అల్తాఫ్ హుస్సేన్ హలీ రాసిన 'హయత్-ఎ-సాది' పుస్తకంలో, సాదీ విద్య కంటే ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ఆకర్షితుడయ్యారని, అందుకే ఆయనలో మొదటి నుంచి ఆధ్యాత్మికత ఉందని రాశారు.

తండ్రి మరణానంతరం ప్రముఖ విద్యాసంస్థ అయిన మదరసా నిజామియాకు సాదీ షిరాజీ వెళ్లినప్పుడు చదువు పట్ల ఆసక్తి ఏర్పడిందని ఆ పుస్తకం తెలిపింది.

ఎమెర్సన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికన్ తత్వవేత్త, కవి వాల్డో ఎమెర్సన్

విద్యార్థి జీవితంలో సూఫీ నృత్యానికి దూరంగా..

సాదీ షిరాజీ చిన్నప్పటి నుంచి సూఫీ ఆలోచనలు కలవారని హాలీ రాశారు. సాదీ విద్యార్థి జీవితంలో క్రమం తప్పకుండా వాజ్ద్, సమా (సూఫీ ఖవ్వాలి, నృత్యం) సభలకు హాజరయ్యేవారు.

ఆయన గురువు ఇబ్న్ జౌజీ ఎప్పుడూ అలాంటి సమావేశాలకు వెళ్లకూడదని హెచ్చరించేవారు. కానీ సాదీ వాటిని చాలా ఇష్టపడ్డారు. దీంతో ఎవరి సలహా సాదీపై ప్రభావం చూపలేదు.

ఒక రోజు మజ్లిస్‌లో కవ్వాల్‌తో ఉన్నారని, బలవంతం మీద ఆ కార్యక్రమంలో రాత్రంతా ఉండవలసి వచ్చిందని హాలీ చెప్పారు.

కార్యక్రమం పూర్తయిన తర్వాత సాదీ తన తలపాగా, జేబులోంచి దీనార్ (స్థానిక కరెన్సీ) తీసి కవ్వాల్‌కి అందించారు.

సాదీ కాలంలో పుస్తకాలను ప్రచురించే వ్యవస్థ అంతగా లేదని, ప్రజలు జ్ఞానం, మనస్సాక్షికి సంబంధించిన విషయాలను ఎలా వ్యక్తీకరించగలిగేవారని అమెరికన్ తత్వవేత్త, కవి వాల్డో ఎమెర్సన్ ప్రశ్నించారు.

"లైబ్రరీ, ప్రింటింగ్ ప్రెస్ లేని దేశంలో ప్రజలు జుమ్లా విధానంలో జ్ఞానాన్ని వ్యక్తీకరించేవారు" అని ఆయన తన రచనల ద్వారా తెలిపారు.

సాదీ రచనలు ప్రభావవంతంగా, స్పష్టంగా, హాస్యస్ఫోరకంగా ఉన్నాయని ఎమెర్సన్ రాశారు. ఇది ఆయన సమర్థతను ప్రతిబింబిస్తుందని తెలిపారు.

అంతేకాదు సాదాసీదాతనం పాఠకుల్లో అభిరుచిని నింపుతుందని ఆయన చెప్పారు.

సాదీని ప్రముఖ ఆంగ్ల కవి లార్డ్ బైరాన్‌తో పోలుస్తూ "బైరాన్ శైలికి, సాదీ వివేకానికి మధ్య తేడా ఎంత?. ఆయన తన పర్షియన్ భాషలో అన్ని రకాలుగా మాట్లాడతారు. హోమర్, షేక్స్ పియర్, సెర్వంటెస్, మోంటెగ్నే మాదిరి శాశ్వత ఆధునిక వ్యక్తి" అని అభివర్ణించారు.

సాదీ

ఫొటో సోర్స్, Alamy

"సాదీ ఒక గజల్ ప్రవక్త"

కవిత్వానికి సంబంధించిన ముగ్గురు ప్రవక్తలలో షేక్ సాదీని 'గజల్ ప్రవక్త' అని సంబోధిస్తారు.

"కవిత్వానికి ముగ్గురు ప్రవక్తలు ఉన్నారు. అబయత్ ఫిర్దౌసీ (కవితా రూపం), ఖసీదా అన్వారీ (ప్రశంసల పద్యం), గజల్ సాదీ" అని ప్రఖ్యాత పెర్షియన్ కవి జామీ తన రచనల్లో రాశారు.

గత వందేళ్లలో తూర్పు ప్రాంతంలో ఆయన ప్రభావం తగ్గిందని ప్రొఫెసర్ షకీల్ బీబీసీతో చెప్పారు.

అయితే పశ్చిమ దేశాల్లో తూర్పు కవులకు ప్రశంసలు పెరిగిపోయాయని, హఫీజ్, రూమీతో పాటు సాదీ రచనలు కూడా గట్టిగానే పరిగణిస్తున్నారని షకీల్ తెలిపారు.

సాదీ కవిత్వంలోనే కాకుండా గద్యంలో కూడా చెరగని ముద్ర వేశారని, మానవత్వం అవసరమైనప్పుడల్లా ఆయన మాటలు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.

సాదీ పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసుకోవడంలో ఆలస్యం అయ్యారని ఎమెర్సన్ తన రచనల్లో విచారం వ్యక్తం చేశారు.

ఇది చాలా కారణాల వల్ల కావచ్చు, కానీ ఆయన పాశ్చాత్య ప్రపంచానికి కొంచెం ముందుగా పరిచయం అయి ఉంటే సాహిత్యం దిశ, వేగం భిన్నంగా ఉండేవని తెలిపారు.

"సాదీకి హఫీజ్ మాదిరి కవిత్వ కల్పన లేకపోయినా తెలివితేటలు, ఆచరణాత్మక, నైతిక భావనలు ఉన్నాయి. బోధించే స్వభావం ఉంది. ఫ్రాంక్లిన్‌ మాదిరి ప్రతి సంఘటనలోని నైతిక కోణాన్ని వెలికితీసే నైపుణ్యం ఉంది. సాదీ స్నేహం, ప్రేమ, శాంతి రూపాల కవి" అని ఎమెర్సన్ తన రచనల్లో తెలిపారు.

మహ్మద్ షకిల్

ఫొటో సోర్స్, MOHAMMED SHAKEEL

ఫొటో క్యాప్షన్, మహ్మద్ షకిల్

సోమనాథ్‌లో చాలా కాలం గడిపారా?

సాదీ 30 సంవత్సరాలు విద్య కోసం, మరో 30 ఏళ్లు పర్యటనల్లో గడిపినట్లు చెబుతారు. అంతేకాకుండా 30 ఏళ్లు షిరాజ్‌లో సాదీ ఏకాంతంగా గడిపారు.

"షేక్ సాదీ కంటే ఎక్కువగా తూర్పు నుంచి ఇబ్న్ బటుతా తప్ప మరే ఇతర పర్యాటకుల గురించి మేం వినలేదు. ఆయన భారతదేశాన్ని సందర్శించారు. ఆసియా కొచక్ (తుర్కియేలో ఒక భాగం) ప్రయాణించారు. ఇథియోపియా, ఈజిప్ట్, సిరియా, పాలస్తీనా, అర్మేనియా, అరేబియా, ఇరాన్, ఇరాక్ లలో పర్యటించారు." అని ఖ్వాజా అల్తాఫ్ హుస్సేన్ హలీ తెలిపారు.

అయితే సాదీ భారతదేశాన్ని నాలుగు సార్లు సందర్శించినట్లు ఖ్వాజా పేర్కొనడం కొద్దిగా అతిశయోక్తిగానే ఉంది.

గులిస్తాన్, బోస్తాన్ ప్రకారం సాదీ తూర్పున ఖొరాసాన్, టర్కిస్తాన్, టాటర్‌లకు వెళ్లి బాల్ఖ్ (ఆఫ్ఘనిస్తాన్), కష్గర్ (చైనా)లో బస చేసినట్లు అల్తాఫ్ హుస్సేన్ హలీ రాశారు.

సాదీ సోమనాథ్‌కు వెళ్లి అక్కడ చాలాకాలం ఉండి, పశ్చిమ భారతదేశంలో తిరుగుతూ, సముద్ర మార్గంలో అరేబియా ప్రాంతానికి వెళ్లారని హలీ తెలిపారు.

సాదీ కొన్నిరోజులు మంగోలుల చెరలో కూడా ఉన్నారు.

సాదీ జైలు జీవితంపై గులిస్తాన్‌లో రాసిన దాని ప్రకారం.. డమాస్కస్ ప్రజలపై కోపంతో సాదీ పాలస్తీనా అడవులలో నివసించారు. ఆ సమయంలో ఆయన్ను క్రైస్తవులు పట్టుకున్నారు. అప్పుడు నగరం రక్షణ కోసం ట్రిపోలీలో ఒక కందకం తవ్వాలనుకున్నారు. యూదు ఖైదీలతో కలిసి సాదీ ఆ కందకం తవ్వే పనిలో ఉన్నారు.

అదే సమయంలో హలాబ్ (సిరియా) నుంచి ఒక వ్యక్తి అటుగా వెళ్లారు. ఆయన సాదీని గుర్తించి పది దీనార్లు చెల్లించి జైలు నుంచి విడుదల చేశారు. అనంతరం 100 దీనార్లు సాదీకి ఇచ్చి, ఆయన కుమార్తెతో వివాహం చేశారు.

సాదీ ఆ మహిళతో కొన్నిరోజులు గడిపారు. అయితే భార్య ప్రవర్తన సాదీకి చిరాకు తెప్పించింది.

ఒకసారి ''మా నాన్న పది దీనార్లకు కొన్నది నిన్నే'' అని భార్య వెక్కిరించారు.

దానికి బదులుగా సాదీ '' నిజమే, నన్ను 10 దీనార్లకు కొని, 100 దీనార్లకు నీకు అమ్మేశారు'' అని తెలిపారు.

సాదీ

ఫొటో సోర్స్, MAKTAB JAMIA

''పాదరక్షలు లేకపోవడంతో సహనం కోల్పోయాను''

సాదీ తన ప్రయాణంలో చాలామంది యాచకుల మాదిరి నిరాశ్రయుడిగా బతికారు. ఎక్కడికి వెళ్లినా పనిచేసేవారు.

బైతుల్ ముఖద్దాస్ , సిరియా నగరాలలో నీటిని నింపి, తాగే పనిని ఆయన చాలాకాలం పాటు చేశారని 'నఫ్ఖతుల్ అనస్'లో రాసి ఉంది.

'గులిస్తాన్'లో సాదీ తన బాధలను ప్రస్తావించారు.

దాని ప్రకారం "నేను మనుషులు, ఆకాశం నుంచి ఎదురైన బాధల గురించి ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. కానీ ఒకసారి నా కాళ్లకు పాదరక్షలు లేనప్పుడు సహనం కోల్పోయాను. నేను పాదరక్షలు కూడా కొనలేకపోయాను" అని సాదీ తెలిపారు.

సాదీ అలాంటి స్థితిలో జామా మసీదుకు చేరుకున్నప్పుడు, ఆయన కాళ్లు లేని వ్యక్తిని చూశారు. ఆ సమయంలో సాదీ దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. తన చెప్పులు లేని పాదాలను ఒక ఆశీర్వాదంగా భావించారు.

సోమ్‌నాథ్ ఆలయం

ఫొటో సోర్స్, Getty Images

సాదీ బ్రాహ్మణుడిగా మారారా?

బోస్తాన్ ఎనిమిదో అధ్యాయంలో సాదీ భారతదేశ ప్రయాణం ప్రస్తావన రాసి ఉంది.

సాదీ అందులో ఇలా రాశారు.

"నేను సోమనాథ్ చేరుకున్నప్పుడు అక్కడ విగ్రహాన్ని పూజించి, కోరికలు కోరడానికి వేల మంది ప్రజలు చేరుకోవడం చూశాను. జీవుడు నిర్జీవమైన దానిని ఎందుకు పూజిస్తాడోనని నేను ఆశ్చర్యపోయాను. దీని గురించి ఒక బ్రాహ్మణుడితో స్నేహం చేసి ఆయన్ని అడిగాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆలయ అర్చకులకు సమాచారం ఇచ్చారు. వారందరూ నా దగ్గరికి వచ్చారు.

ఈ విగ్రహానికి నేను ఆకర్షితుడినయ్యానని వారి నాయకుడికి చెప్పాను. నేను ఇక్కడికి కొత్తగా వచ్చానని, దాని రహస్యాలు నాకు తెలియవన్నాను. అందుకే నేను సత్యాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నానని, అర్థం చేసుకుంటానని చెప్పాను. దానికి ఆయన రాత్రి గుడిలో ఉండమని సూచించారు.

నేను రాత్రంతా అక్కడే ఉన్నాను, ఉదయాన్నే ఆ ప్రాంతంలోని పురుషులు, మహిళలు అందరూ అక్కడ గుమిగూడారు. ప్రార్థనలు మొదలుపెట్టారు. అనంతరం విగ్రహం చెయ్యి పైకి లేచింది. అందరూ జై జై అనడం ప్రారంభించారు.

జనం వెళ్లగానే బ్రాహ్మణుడు నవ్వుతూ ఇప్పుడు సందేహం తీరిందా? అని అడిగారు. నేను ఏడవడం ప్రారంభించాను, నా ప్రశ్నకు సిగ్గుపడ్డాను.

అందరూ నా చేయిపట్టుకుని ఆయన వద్దకు తీసుకువెళ్లారు. ఆయన చేతిని ముద్దు పెట్టుకున్నా. అనంతరం కొన్ని రోజులకు బ్రాహ్మణుడిగా మారా.

ఆలయంలో నాపై అందరికీ నమ్మకం పెరిగాక, ఒకరోజు రాత్రి అందరూ వెళ్లిపోయాక, నేను గుడి తలుపులు మూసివేశాను. విగ్రహం దగ్గరికి వెళ్లి చుట్టూ జాగ్రత్తగా చూడటం ప్రారంభించాను. అక్కడ నాకు ఒక తెర కనిపించింది. దాని వెనుక ఒక పూజారి దాక్కున్నారు. ఆయన చేతిలో ఒక తీగ ఉంది. ఆయన తీగను లాగినప్పుడు, విగ్రహం చేయి వెంటనే పైకి లేచినట్లు కనుక్కున్నాను. దీనిని సామాన్య ప్రజలు అద్భుతంగా భావిస్తారు.

ఆ పూజారి రహస్యం బయటపడిందని గమనించి, అక్కడి నుంచి పారిపోయాడు. నేను కూడా అతని వెనుకే పరుగెత్తాను. అయితే అతను నన్ను చంపేస్తాడేమోనని భయపడ్డాను. అతన్ని పట్టుకుని బావిలో పడేశాను. వెంటనే అక్కడి నుంచి పారిపోయి, యెమెన్ మీదుగా హిజాజ్ (అరేబియా ప్రాంతం) చేరుకున్నా'' అని సాదీ చెప్పారు.

'సాదీ భారత్ రాక ఒక కట్టుకథ'

అయితే సాదీ భారతదేశంలో ఎప్పుడూ ప్రయాణించలేదని, ఇదంతా ఒక కట్టుకథ అని విమర్శకులు అంటున్నారు.

"బాల్బన్ కాలంలో యువ అమీర్ ఖుస్రో, ఆయన స్నేహితుడు హసన్ దేహ్లావి ముల్తాన్‌లోని ప్రిన్స్ మహ్మద్ కోర్టుకు పిలిపించారు. ఆ ఇద్దరూ సాదీ అనుచరులు. అయితే సాదీని కూడా ఆహ్వానించారు. వృద్ధాప్యం కారణంగా ఆయన రాలేనంటూ కబురు పంపారు. తరువాత సాదీ మార్గాన్ని అనుసరించిన హసన్ డెహ్ల్విని భారతదేశపు సాదీ అని పిలిచారు. ఖుస్రో మరో మార్గంలో వెళ్లారు" అని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ ప్రొఫెసర్ అఖ్లాక్ అహ్మద్ అహన్ బీబీసీతో చెప్పారు.

హాలీ రాసిన 'హయత్-ఎ-సాది' పుస్తకం ఉర్దూలో సాదీ గురించిన మొదటి పుస్తకం అని, అయితే ఇందులో చాలా విషయాలు అస్పష్టంగా ఉన్నాయని ఆయన చెప్పారు.

''సాదీ పుట్టడానికి దాదాపు 200 ఏళ్ల ముందు నాశనమైన సోమనాథ్‌ను చూడటానికి ఆయన ఎలా వెళ్లారు" అని అఖ్లాక్ ప్రశ్నించారు.

చదువుకున్నా ప్రయోజనం లేదని..

సాదీ స్వదేశానికి తిరిగి వెళ్లిన తర్వాత ఏకాంతంగా ఉండిపోయాడు. ఆ సమయానికి కుత్లాగ్ ఖాన్ అబూ బకర్ సింహాసనం అధిష్టించారు.

పర్షియాను కుత్లాగ్ ఖాన్ అబూ బకర్ సుసంపన్నం చేశారు. అయితే ఆయన ఆస్థానంలో చాలా సందర్భాల్లో అజ్ఞానులు పండితులుగా చలామణి అయ్యేవారు. సాదీ లాంటి విద్యావంతులు తమ అభిప్రాయాన్ని చెప్పడానికి భయపడేవారు.

చదువుకుని ప్రపంచాన్ని చుట్టి వచ్చినా చెప్పుకోదగ్గ పని ఏమీ చేయలేకపోయానని సాదీ పశ్చాత్తాపపడటం మొదలుపెట్టాడు. దీంతో ఆయన ఏకాంత జీవితాన్ని గడపడం ప్రారంభించాడు. కానీ, స్నేహితుడి ఒత్తిడితో ఆయన ఇంటి నుంచి బయటికి వచ్చారు.

వసంతకాలంలో సాదీ షిరాజ్‌లోని బాగ్-ఎ-బహిష్త్ చేరుకున్నారని చెబుతారు.

అక్కడ సాదీ స్నేహితుడు ఆయన కోసం పువ్వులు తీసుకున్నాడు. కానీ, సాదీ వాటిని పట్టించుకోలేదు.

రచయిత జోబిన్ బఖ్దర్ రచనల ప్రకారం- ''ఆ పువ్వుల మాదిరి వాడిపోని పుస్తకాన్ని రాస్తానని సాదీ తన స్నేహితుడికి చెప్పాడు. అది సమాచారాన్ని ఇవ్వడంతోపాటు ఆసక్తికరంగానూ ఉంటుందని సాదీ తెలిపాడు. దానికి ‘గులిస్తాన్’ అని పేరు పెట్టాడు.''

ఒక పువ్వుకు ఐదు లేదా ఆరు రోజుల జీవితం అని సాదీ తన పుస్తకంలో రాశాడు. కానీ ఆయన రచన కలకాలం నిలిచిపోయింది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)