యుక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల సూరత్‌లో ‘వజ్రాల ఉద్యోగాలు’ పోతున్నాయి. ఎందుకు?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, దీపల్ షా
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘ఐదు నెలల క్రితం కంపెనీ మేనేజర్ నాకు ఫోన్ చేశారు. సిబ్బందిని తగ్గిస్తున్నామని, అందుకే నువ్వు కూడా రాజీనామా చేయాలని చెప్పారు. మా ఇంట్లో నేను ఒక్కదాన్నే సంపాదిస్తాను. నాకు భర్త లేరు. ఇద్దరు పిల్లలు స్కూలుకు వెళ్తారు. మా తమ్ముడు వికలాంగుడు. మా నాన్న కూడా లేకపోవడంతో అమ్మ భారం కూడా నాపైనే పడింది. ఉద్యోగం కోల్పోయిన తర్వాత మరో దాని కోసం వెతుకుతూనే ఉన్నాను. కానీ, ఏమీ దొరకడం లేదు.’’
సూరత్‌లోని ఓ డైమండ్ కంపెనీలో పనిచేసిన మహిళ మాటలివీ.
వజ్రాల పరిశ్రమ ప్రస్తుతం ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటోందని, తన లాంటి చాలా మంది మహిళలు ఉద్యోగాలను కోల్పోతున్నారని ఆమె వివరించారు.
గత కొన్ని నెలల్లో ఇలా 20 వేల మందికి పైగా ఉపాధి కోల్పోయారని కొందరు నిపుణులు చెబుతున్నారు.
కరోనావైరస్ సంక్షోభం నుంచి పూర్తిగా కోలుకోక ముందే ఇక్కడ ఆర్థిక మాంద్యం తీవ్రమైన ప్రభావం చూపుతోంది. రష్యా-యుక్రెయిన్ యుద్ధమే దీనికి కారణమని నిపుణులు వివరిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలో విక్రయించే 90 శాతం వరకూ వజ్రాలకు దక్షిణ గుజరాత్ నగరం సూరత్‌లోనే కటింగ్, పాలిషింగ్ చేస్తుంటారు.
సూరత్‌లో వజ్రాల పరిశ్రమ విలువ ఏటా మూడు లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనాలు ఉన్నాయి. దేశ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లోనూ ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది.
మొత్తంగా గుజరాత్‌లో 12 లక్షల నుంచి 15 లక్షల మందికి వజ్రాల పరిశ్రమ ఉపాధి కల్పిస్తోంది.
తాజా సంక్షోభంతో సూరత్‌లో ఉద్యోగం కోల్పోయిన మహిళ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. ఆర్థిక మాంద్యం కొనసాగుతోంది. యుక్రెయిన్ యుద్ధం, దాని ఇతర ప్రభావాల వల్ల ప్రపంచంలో చాలా చోట్ల సూరత్ వజ్రాల విక్రయాలు సరిగా జరగడం లేదు. ముడి పదార్థాల ధర కూడా పెరిగింది. రెండు, మూడు రకాల పనులను చేయగలిగే వారినే ఉద్యోగాల్లో ఉంచుకుంటున్నారు’’ అన్నారు.

ఫొటో సోర్స్, ANI
పరిస్థితులు ఎప్పుడు మారతాయో!
‘‘ఉద్యోగం నుంచి తొలగించినప్పుడు డబ్బులు కూడా ఏమీ ఇవ్వలేదు. ఇప్పటివరకూ దాచుకున్న పీఎఫ్ డబ్బులతో నేను నెట్టుకురావాల్సి వస్తోంది. ఉద్యోగం కోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. కానీ, ఇప్పటివరకూ దొరకనే లేదు’’ అని ఆమె చెప్పారు.
ఈ పరిస్థితి వల్ల తన జీవితం ఎలా ప్రభావితం అవుతుందో చెబుతూ.. ‘‘చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కానీ, వేరే మార్గం లేదు. ఏదైనా పనివస్తే మీకు ఫోన్ చేస్తామని ఫ్యాక్టరీల సిబ్బంది చెబుతున్నారు. నెలలు గడుస్తున్నాయి. కానీ, ఫోన్లు మాత్రం రావడం లేదు’’ అని ఆమె అన్నారు.
సంక్షోభం వల్ల ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న మరో మహిళ కూడా బీబీసీతో మాట్లాడారు. కానీ, ఆమె తన పేరును వెల్లడించడానికి ఇష్టపడలేదు.
‘‘ఫ్యాక్టరీ యజమానులు కూడా బాధపడుతున్నారు. పరిస్థితి సర్దుకున్నాక మళ్లీ ఉద్యోగానికి పిలుస్తామని అంటున్నారు. కానీ, ఎప్పటికి పరిస్థితులు బాగవుతాయో తెలియడం లేదు’’ అని ఆమె చెప్పారు.
రష్యా మైనింగ్ కంపెనీ ‘‘అల్‌రోసా’’పై తాజాగా అమెరికా ఆంక్షలు విధించింది.
యుక్రెయిన్‌పై దాడి అనంతరం రష్యా మీద అమెరికా విధిస్తున్న ఆంక్షల్లో ఇవి కూడా భాగం.
ప్రపంచంలోనే అత్యధిక వజ్రాలను ఉత్పత్తి చేస్తున్న సంస్థగా అల్‌రోసాకు పేరుంది. ఈ రఫ్ డైమండ్లు బెల్జియంలోని అంట్వర్ప్‌కు వెళ్తాయి. అక్కడి నుంచి ప్రాసెసింగ్ కోసం సూరత్‌కు వస్తాయి.
సూరత్‌కు వచ్చే 30 శాతం రఫ్ డైమండ్‌లు రష్యాలోని గనుల నుంచి ఉత్పత్తి అవుతుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
పరిస్థితులు మరింత దిగజారుతాయా?
ఈ ప్రశ్నకు సదరన్ గుజరాత్ చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్‌భాయ్ నానావతి సమాధానమిస్తూ- ‘‘రష్యా-యుక్రెయిన్ యుద్ధంతో చాలా దేశాల్లో వాణిజ్యం మీద ప్రభావం పడుతోంది’’ అన్నారు.
మొదట అల్‌రోసాపై అమెరికా నిషేధం విధించిందని, ఇప్పుడు బెల్జియం కూడా అదే దిశగా అడుగులు వేస్తోందని ఆయన చెప్పారు.
రష్యా నుంచి బెల్జియంకు వచ్చే డైమండ్లను అడ్డుకునే ప్రతిపాదనకు బెల్జియం పార్లమెంటులోని విదేశీ వ్యవహారాల కమిటీ తాజాగా ఆమోదం తెలిపింది.
రష్యా డైమండ్లను పూర్తిగా నిషేధించాలని ఇటీవల బెల్జియం పార్లమెంటును ఉద్దేశించి చేసిన ప్రసంగంలో యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమీర్ జెలియెన్‌స్కీ కోరారు. ‘‘వజ్రాల కంటే శాంతి ముఖ్యమైనది’’ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బెల్జియంలోని అంట్వర్ప్‌ను వజ్రాల వాణిజ్యానికి కేంద్రంగా చెబుతారు. అయితే, ఇక్కడకు రష్యా వజ్రాలు రాకుండా పూర్తిగా నిషేధం విధించాలని జెలియెన్‌స్కీ డిమాండ్ చేశారు.
అమెరికా తర్వాత బెల్జియంలో జరుగుతున్న పరిణామాలపై నానావతి మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ అదే జరిగితే, 30 శాతం వజ్రాల వాణిజ్యం కుప్పకూలుతుంది. ఇప్పటికే యుద్ధం వల్ల వాణిజ్యం ప్రభావితం అవుతోంది. ఇప్పుడు బెల్జియం కూడా ఆంక్షలు విధిస్తే, పరిస్థితి మరింత దిగజారుతుంది’’ అన్నారు.
‘‘సూరత్‌కు పెద్దయెత్తున వజ్రాలు రష్యా నుంచి వస్తుంటాయి. వాటిని అడ్డుకుంటే కృత్రిమ వజ్రాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కానీ, వీటిపై ప్రజలు లేదా మదుపరుల్లో అంత మంచి అభిప్రాయం లేదు. ఫలితంగా పెట్టుబడులు నిలిచిపోయే ముప్పు ఉంటుంది’’ అని నానావతి చెప్పారు.
‘‘ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ మదుపరులు వెనక్కి తగ్గొచ్చు. ఇటీవల అల్‌రోసా ప్రతినిధులు సూరత్‌కు వచ్చారు. ఇక్కడ నేరుగా కార్యాలయాన్ని సంస్థ తెరుస్తుందని కూడా వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడన్నీ మధ్యలోనే ఆగిపోయాయి’’ అని ఆయన వివరించారు.
వజ్రాల డిమాండ్ కంటే సరఫరా తగ్గిపోయినప్పుడు సమస్యలు రావడం అనివార్యమని సూరత్ డైమండ్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, గుజరాత్ జెమ్ అండ్ జ్యూవెలరీ ఎక్స్‌పోర్ట్ కౌన్సిల్ ప్రాంతీయ డైరెక్టర్ దినేశ్ నావ్డియా అన్నారు.
‘‘అంట్వర్ప్ వ్యాపారులతో నేను మాట్లాడాను. నిషేధం విషయంలో బెల్జియం ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. అల్‌రోసా కంపెనీపై ప్రభుత్వం నిషేధం విధిస్తే, చాలా ప్రభావం పడొచ్చు’’ అని ఆయన చెప్పారు.
‘‘ఆఫ్రికా గనులు వజ్రాల ఉత్పత్తిని పెంచడం లేదు. మరోవైపు రష్యా నుంచి వచ్చే ముడి పదార్థాల నుంచి ఎక్కువ వజ్రాలను మనం సేకరించొచ్చు. వాటిపై నిషేధం విధిస్తే, చాలా ఇబ్బందులు ఎదురవుతాయి’’ అన్నారు.
‘‘దీని వల్ల ఉద్యోగాలపైనా ప్రభావం పడుతోంది. ఉదాహరణకు వంద మంది పనిచేసే చోట చాలా మందిని తీసేయాల్సి రావచ్చు. వ్యాపారం తగ్గిపోతే, సిబ్బందిని కూడా తగ్గించాల్సి రావచ్చు’’ అని నాన్డియా చెప్పారు.
రెండు వైపులా ఆంక్షలు
అల్‌రోసా కంపెనీ నుంచి నేరుగా వజ్రాలను కొంటున్న వజ్రాల వ్యాపారులతోనూ బీబీసీ మాట్లాడింది.
‘‘మాకు రఫ్ డైమండ్లు నేరుగా రష్యా నుంచి వచ్చేవి. అల్‌రోసా మాకు వాటిని సరఫరా చేసేది. రష్యా-యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత సరఫరాకు ఇబ్బందులు వచ్చాయి. రష్యా నుంచి వచ్చే డైమండ్లను కూడా కొనొద్దని అమెరికా ప్రజలకు అక్కడి ప్రభుత్వం సూచించింది. అందుకే ఒకవేళ రష్యా నుంచి సూరత్‌కు వజ్రాలు వచ్చినా వీటిని విక్రయించడం పెద్ద సమస్య అవుతోంది. ఎందుకంటే చాలా వజ్రాలను అమెరికన్లు కొనుగోలు చేస్తుంటారు’’ అని లక్ష్మీ డైమండ్ కంపెనీకి చెందిన చునీభాయ్ గజేరా చెప్పారు.
ఉద్యోగులను తొలగించడంపై మాట్లాడుతూ- ‘‘వజ్రాల అందుబాటుతోపాటు డిమాండ్ కూడా తగ్గిపోయింది. రష్యా నుంచి వస్తున్న ముడి పదార్థాల ధర కూడా పెరిగింది. ప్రస్తుతం కెనడాతోపాటు కొన్ని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే డైమండ్లపైనే పనిచేస్తున్నాం. అందుకే సిబ్బందిని కూడా తగ్గించుకోవాల్సి వస్తోంది’’ అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, రష్యా-యుక్రెయిన్ యుద్ధం, ఇతర కారణాల వల్ల సూరత్‌లోని వజ్రాల పరిశ్రమ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని నిపుణులు చెబుతున్నారు.
పశ్చిమ దేశాలపై యుద్ధం ప్రభావం వల్ల వజ్రాల విక్రయాలు తగ్గిపోయాయని, ఫలితంగా సూరత్‌లో సంక్షోభం ముదురుతోందని వారు అంటున్నారు.
యుక్రెయిన్ యుద్ధంతో మొదలైన కష్టాలు నేటికీ కొనసాగుతున్నాయని రత్న కళాకార్ వికాస్ సంఘ్ ప్రెసిడింట్ బాలూభాయ్ వెకారియా అన్నారు.
‘‘ఇదివరకూ చాలా పని ఉండేది. కానీ, ఇప్పుడు పని తగ్గిపోయింది. ఆర్థిక మాంద్యం కూడా కొనసాగుతోంది. ఉద్యోగాలు కోల్పోతున్న వారికి వేరే ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, అవేమీ ఫలించడం లేదు’’ అని ఆయన చెప్పారు.
మార్చి నుంచి కట్, పాలిష్డ్ డైమండ్ల ఎగుమతులు పడిపోతూనే ఉన్నాయని జెమ్స్ అండ్ జ్యూవెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రొమోషణ్ కౌన్సిల్ (జీజేఈపీసీ) డేటా చెబుతోంది.
అంతకుముందు నెల, అంటే ఫిబ్రవరిలోనూ ఎగుమతుల పరిస్థితి అలానే ఉండేది. మార్చిలో మొత్తం ఎగుమతులు 1.6 బిలియన్ డాలర్లుగా (రూ.13.23 వేల కోట్లు) నమోదయ్యాయి. అంతకుముందు నెలతో పోలిస్తే 33 శాతం ఎగుమతులు తగ్గిపోయాయి.
అంటే ఫిబ్రవరిలో 2.4 బిలియన్ డాలర్లుగా (19.85 వేల కోట్లు) ఉండే ఎగుమతులు మార్చిలో 1.6 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి.
మార్చి 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వార్షిక ఎగుమతులు 24.4 బిలియన్ డాలర్లు (రూ. 2,01,855 కోట్లు)గా ఉండేవి.
ఈ ఏడాది మార్చి 2023కు ఇవి 9.78 శాతం పడిపోయాయి.
ఇవి కూాడా చదవండి:
- సూడాన్: 'గుర్రాలపై వచ్చే దెయ్యాల'ను ఎదుర్కోవడానికి ఏకే-47 పట్టుకున్న అకౌంటెంట్
- చైనా మిలటరీపై జోక్ వేసినందుకు 17 కోట్ల జరిమానా
- హైపర్‌టెన్షన్ డే: అధిక రక్తపోటు ఎందుకు వస్తుంది, తగ్గాలంటే ఏం చేయాలి?
- హమీదా బానో: మగ కుస్తీ యోధులు కూడా ఓడించలేని పహిల్వాన్ ఈమె, చివరకు బూందీ అమ్ముకుంటూ ఎందుకు బతికారంటే....
- ఐపీఎల్‌కు ‘ఎంఎస్ ధోనీ ట్రోఫీ’ అని పేరు మార్చే సమయం వచ్చిందా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















