గూఢచారి రాబర్ట్ హన్‌సెన్: అమెరికాను ముప్పుతిప్పలు పెట్టిన ‘ఇంటి దొంగ’ కథ

రాబర్ట్ హన్‌సెన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాబర్ట్ హన్‌సెన్

గూఢచర్యంలో ఆరితేరిన అమెరికాను ముప్పుతిప్పలు పెట్టి, ఆ దేశ రహస్యాలను రష్యాకు అమ్ముకున్న ‘డబుల్ ఏజెంట్‌'ను పట్టుకునేందుకు ఎఫ్‌బీఐకి 20 ఏళ్లు పట్టింది. తమ మధ్యలోనే ఉన్న ఆ ఏజెంట్‌ను నకిలీ ఉద్యోగాన్ని సృష్టించి, వలపన్ని పట్టుకోవాల్సి వచ్చింది.

అమెరికా నిఘా సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) చరిత్రలో అత్యంత తీవ్ర నష్టం చేసిన గూఢచారుల్లో రాబర్ట్ హన్‌సెన్ ఒకరు. దాదాపు 20 ఏళ్ల పాటు అమెరికా రహస్యాలని రష్యాకు అమ్మేసిన ఈ మాజీ ఏజెంట్ ఇటీవల జైల్లో చనిపోయారు.

హన్‌సెన్ ద్రోహం కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ఎఫ్‌బీఐ చెబుతోంది. దాదాపు 300 మంది ఏజెంట్లతో నిఘా పెట్టి, ఎట్టకేలకు ఎఫ్‌బీఐ ఆయన్ను పట్టుకుంది. ఈ ఆపరేషన్‌లో కీలకపాత్ర పోషించిన ఇద్దరు వ్యక్తులు ఆయన్ను ఎలా పట్టుకున్నారో వివరించారు.

2000వ సంవత్సరం డిసెంబర్‌లో రష్యా డెస్క్‌లో పనిచేస్తున్న ఓ సహోద్యోగి ఎఫ్‌బీఐ ఏజెంట్ రిచర్డ్ గర్షియాను కలిశారు.

''రాబర్ట్ హన్‌సెన్ అనే వ్యక్తి మీకు తెలుసా? అని అతను ఆసక్తిగా అడిగాడు'' అని గర్షియా గుర్తు చేసుకున్నారు. ''నాకు తెలియదు'' అని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు.

''మంచిది. మీరు తెలుసుకోబోతున్నారు?'' అని ఆయన అన్నారని గర్షియా చెప్పారు.

కొద్ది నెలల తర్వాత, గర్షియా రహస్యంగా చేసిన పనికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. 2001లో హన్‌సెన్ అరెస్టు నిఘా విభాగంలో ప్రకంపనలు రేపింది.

ఆయన గూఢచర్య జీవితంపై వార్తా కథనాలు ప్రముఖంగా ప్రచురితమయ్యాయి.

సుమారు రెండు దశాబ్దాల తర్వాత ఈ మాజీ ఏజెంట్ హన్‌సెన్ చనిపోయారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే కొలరాడోలోని జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న హన్‌సెన్, సోమవారం అచేతనంగా కనిపించారు. 79 ఏళ్లున్న హన్‌సెన్ వయోభారంతో చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు.

ఆయన మరణంపై ఎఫ్‌బీఐ నుంచి రిటైర్ అయిన 70 ఏళ్ల గర్షియా తీవ్రంగా స్పందించారు. అలాంటి వ్యక్తికి మంచి విముక్తి దొరికిందన్నారు.

గూఢచారి

ఫొటో సోర్స్, Getty Images

డెడ్ డ్రాప్స్ పద్ధతిలో రహస్య సమాచారం

కాలేజీలో రష్యన్ చదువుకున్న హన్‌సెన్.. 1976లో ఎఫ్‌బీఐ కోసం పనిచేయడం మొదలుపెట్టారు. ఒక దశాబ్దం తర్వాత ఆయన నిఘా ఏజెన్సీ నిబంధనలను ఉల్లంఘించారు.

1985 నుంచి అమెరికా ప్రభుత్వ నిఘా సంస్థలోనే పనిచేస్తూ విధ్వంసకర ద్రోహిగా మారారు. రహస్యాలను యూఎస్‌ఎస్‌ఆర్, రష్యాకు అమ్ముకున్నారు. అంతేకాకుండా గూఢచారుల వివరాలను కూడా చేరవేశారు.

హన్‌సెన్ నేరాలపై దాఖలు చేసిన 100 పేజీల అఫిడవిట్ ప్రకారం, ఈ కేసులో యూఎస్ మూలాలున్న ముగ్గురు జైలు పాలయ్యారు. మరో ఇద్దరికి మరణ శిక్ష పడింది.

అమెరికా అణు పరీక్షల సమాచారం సేకరించేందుకు రష్యా చేసిన ప్రయత్నాలు అమెరికా నిఘా సంస్థలకు తెలిసిపోవడం వంటి చాలా విషయాలకు సంబంధించిన పత్రాలను హన్‌సెన్ చేరవేశారు. రష్యా నిఘా సంస్థలు కేజీబీ, ఎస్‌వీఆర్‌లకు సమాచారం చేరవేసినట్లు తేల్చారు.

అందుకోసం హన్‌సెన్‌కు రష్యా 1.4 మిలియన్ డాలర్లు (అంటే సుమారు 11 కోట్ల రూపాయలు) చెల్లించింది. నగదు, వజ్రాల రూపంలో ఆరు లక్షల డాలర్లు(రూ.4.9 కోట్లు), మరో 8 లక్షల డాలర్ల(రూ.6.5 కోట్లు)ను బ్యాంక్ అకౌంట్‌లో జమ చేసింది.

పాత గూఢచర్య పద్ధతుల్లోని 'డెడ్ డ్రాప్స్'‌ని అనుసరించడం ద్వారా హన్‌సెన్ చాలా కాలం ఎవరికీ దొరక్కుండా జాగ్రత్తపడ్డారు. కొన్ని వస్తువులను గుర్తుగా అక్కడక్కడా వదిలేయడం ద్వారా తన వారికి సమాచారం అందజేయడాన్ని డెడ్ డ్రాప్స్‌గా వ్యవహరిస్తారు.

ఎఫ్‌బీఐ నుంచి దొంగిలించిన రహస్య సమాచారం రష్యన్లకు అందించేందుకు, వాషింగ్టన్ సమీపంలో అంతగా నిఘా ఉండని, వర్జీనియా పరిసరాల్లోని గ్రామీణ ప్రాంతాలను హన్‌సెన్ ఎంచుకునేవారు.

మాస్కో నుంచి తనను పర్యవేక్షిస్తున్న వారికి కూడా ఆయన గురించి వివరాలు తెలియకుండా జాగ్రత్తపడేవారు. రష్యన్లతో వ్యవహరించేటప్పుడు తనను రామొన్ గర్షియాగా చెప్పుకొనేవారు. ఆ పేరుతో రాబర్ట్ గర్షియా‌కు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ, ఇద్దరూ తొలిసారి కలిసినప్పుడు హన్‌సెన్ ఇబ్బందిపడ్డారు.

బెర్లిన్ వాల్ కూల్చివేత, యూఎస్‌ఎస్ఆర్ విచ్ఛిన్నం తర్వాత కూడా హన్‌సెన్ రహస్య కార్యకలాపాలు కొనసాగించారు. అరెస్టుకు కొద్ది క్షణాల ముందు వరకూ కూడా రష్యాను సంప్రదించేందుకు ప్రయత్నించారు.

అయితే, ఆయన తరచూ రహస్య సమాచారాన్ని చేరవేయడం ఎఫ్‌బీఐ, యూఎస్ ఇంటెలిజెన్స్ విభాగానికి తలనొప్పిగా మారింది.

గూఢచారి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాబర్ట్ హన్‌సెన్

ఎలా గుర్తించారు?

తమ మధ్యనే ఒక గూఢచారి ఉన్నట్లు 1990లలో అమెరికా ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులకు అనుమానాలు మొదలయ్యాయి. అయితే, అది హన్‌సెన్ అని గుర్తించడానికి మాత్రం సంవత్సరాలు పట్టింది.

వర్జీనియా నుంచి ఒకరు రహస్య సమాచారం చేరవేస్తున్నట్లు అమెరికా కోసం పనిచేస్తున్న రష్యా ఏజెంట్ నుంచి సమాచారం అందడంతో ఆ దిశగా నిఘా పెట్టారు.

రష్యా ప్రతినిధులతో హన్‌సెన్ మాట్లాడిన ఓ ఫోన్‌కాల్ రికార్డింగ్‌ను అమెరికా నిఘా అధికారులు గుర్తించారు. అలాగే డెడ్ డ్రాప్స్ విధానంలో భాగంగా ఆయన వదిలివెళ్లిన వస్తువుల నుంచి వేలిముద్రలను సేకరించారు.

2000వ సంవత్సరం నవంబర్‌లో ఆ గూఢచారిని గుర్తించారు. అయితే, అది రుజువు చేసేందుకు ఆధారాలు కావాల్సి ఉంది.

అందుకోసం ఎఫ్‌బీఐ ఒక ప్లాన్ వేసింది. నిఘా విధుల్లో భాగంగా హన్‌సెన్‌ను బదిలీ చేస్తున్నట్లు చెప్పి, ఒక నకిలీ ఉద్యోగాన్ని సృష్టించి అందులో నియమించింది. ఆయన కదలికలపై నిఘా పెట్టింది.

''ఆయన్ను దోషిగా నిర్ధరించేందుకు తగిన ఆధారాలు సేకరించడంతోపాటు ఆయన్ను చట్టప్రకారం అరెస్టు చేయడమే మా లక్ష్యం.'' అని కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం మాజీ డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ డెబ్రా ఇవాన్స్ స్మిత్ గుర్తు చేసుకున్నారు.

అప్పుడే గర్షియా ఆ ప్లాన్‌లో భాగమయ్యారు.

ఎఫ్‌బీఐ‌లో రష్యా డెస్క్ చూస్తున్న సెక్షన్ చీఫ్ 2000 సంవత్సరం డిసెంబర్ 8న కావాలనే విధులకు హాజరుకాలేదు. ఆయన స్థానంలో హన్‌సెన్‌ ఉండేలా ప్లాన్ చేశారు.

నిఘా కార్యకలాపాల్లో అనుభవజ్ఞుడు, ఉన్నతాధికారి అయిన గర్షియా డబుల్ ఏజెంట్ హన్‌సెన్‌కు నకిలీ ఉన్నతాధికారిగా వ్యవహరించారు.

''ఆయన నన్ను అసహ్యించుకున్నారు. ఆయనతో మరీ ఇబ్బందికరంగా ప్రవర్తించకుండా చాకచాక్యంగా పట్టుకున్నాం'' అని గర్షియా గుర్తు చేసుకున్నారు.

గూఢచారి

ఫొటో సోర్స్, Getty Images

హాలీవుడ్ సినిమా

హ్యాకింగ్ అనుభవమున్న 26 ఏళ్ల ఎరిక్ ఓనీల్‌ అనే యువకుడిని హన్‌సెన్‌కు ఆఫీస్ పనుల్లో సహాయకుడిగా గర్షియా నియమించారు.

''అమెరికాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న గూఢచారిని పట్టుకోవడానికి రహస్యంగా పనిచేయడం నా జీవితంలోని ముఖ్యమైన విషయాల్లో ఒకటి'' అని ఓనీల్ బీబీసీకి చెప్పారు.

కొన్ని వారాల్లోనే హన్‌సెన్‌తో పరిచయం పెరిగింది. హన్‌సెన్ కుటుంబంతో ఓనీల్ ఒకసారి చర్చికి కూడా వెళ్లారు.

తనకు మాత్రమే అన్నీ తెలుసనే అహంభావిగా కనిపించడమే ఓనీల్ లక్ష్యం. తనకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు అందజేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పేవారు. ఇలా కావాలనే చేసేవారు.

కొన్నేళ్ల పాటు సాగిన ఈ రహస్య విచారణలో, హన్‌సెన్ గురించి కీలక సమాచారం సేకరించిన తర్వాత ఎఫ్‌బీఐ ఏజెంట్లు హన్‌సెన్ కార్‌లో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో కీలక రహస్యాలకు సంబంధించిన పత్రాలు బయటపడ్డాయి.

ఒకరోజు ఆయన్ను ఆఫీస్ నుంచి బయటికి వచ్చేలా చేసి, హన్‌సెన్‌కి చెందిన బ్లాక్‌బెర్రీ, స్మార్ట్ ఫోన్లలోని సమాచారాన్ని ఓనీల్ కాపీ చేశారు. హన్‌సెన్ రావడానికి ముందే ఆయన ఫోన్లు మార్చేసినట్లు చెప్పారు.

హాలీవుడ్ సినిమాని తలపించిన ఈ స్టోరీలో, ఓనీల్ ఎపిసోడ్ ఆధారంగా 2007లో బ్రీచ్ అనే స్పై మూవీ కూడా వచ్చింది.

గూఢచారి

ఫొటో సోర్స్, Getty Images

అరెస్టు, జైలు

ఎఫ్‌బీఐ చెప్పిన వివరాల ప్రకారం, 2001 ఫిబ్రవరి నాటికి ఈ కేసుపై 300 మంది పనిచేస్తున్నారు.

మరో డెడ్ డ్రాప్ చేసే వరకూ ఎఫ్‌బీఐ అధికారులు ఎదురుచూశారు. సరిగ్గా మరో డెడ్ డ్రాప్ చేయగానే హన్‌సెన్‌ను పట్టుకున్నారు.

2001 ఫిబ్రవరిలో వర్జీనియాలోని ఫాక్స్టోన్ పార్కులో హన్‌సెన్‌ను గూఢచర్యం కింద అరెస్టు చేశారు. పెరోల్ అవకాశం కూడా లేకుండా కోర్టు జీవిత ఖైదు విధించింది.

'' హన్‌సెన్ దేశానికి వ్యతిరేకంగా అత్యంత దారుణమైన ద్రోహాలకు పాల్పడ్డారు'' అని ఎఫ్‌బీఐ డైరెక్టర్ లూయిస్ ఫ్రీహ్ అన్నారు.

ఈ కేసు రష్యాతో సంబంధాలను మరింత కఠినతరం చేసింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ రష్యన్ దౌత్యవేత్తలను బహిష్కరించారు.

హన్‌సెన్ దాదాపు రెండు దశాబ్దాలు ఫ్లోరెన్స్, కొలరాడో జైళ్లలో గడిపారు. ఈ వారం ఆయన చనిపోయారు.

ఈ కేసు ఎంతోమంది జీవితాలను మార్చేసింది. ఈ కేసు ఆధారంగా ఓనీల్ ఒక పుస్తకం రాశారు.

గ్రే డే అనే ఉద్యోగి ఒక స్పై‌ని పట్టుకునే వ్యక్తిగా మారారు. 'స్పై క్యాచర్' అని తన వెబ్‌సైట్‌లో రాసుకున్నారు.

హన్‌సెన్ చనిపోయారని తెలిసినప్పుడు ఎక్కువ విషయాలు తెలుసుకోలేకపోయానని ఓనీల్ చింతించారు. ''ఎందుకిలా చేశావని నేను ఆయన్ను అడిగాను'' అని ఆయన చెప్పారు.

అయితే, హన్‌సెన్ అలా ఎందుకు చేశారనే విషయంపై గర్షియా ఒక థియరీ చెప్పారు.

''తనను తాను దేవుడిగా భావించేవారు. అమెరికా, రష్యాలను తాను నియంత్రిస్తున్నట్టు అనుకునేవారు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

అమెరికా చరిత్రలోనే అత్యంత విధ్యంసకర గూఢచారి హన్‌సెన్ అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి: