ఆంధ్రప్రదేశ్: కరెంటు బిల్లులో ఈ చార్జీలు ఏంటి... వీటిని ఎందుకు వసూలు చేస్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పెదగాడి రాజేశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ బిల్లులపై మళ్లీ చర్చ జరుగుతోంది. ట్రూఅప్ చార్జీలు, సర్‌చార్జీలు, ఇతర రుసుముల పేరుతో ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని నిరసన వ్యక్తం అవుతోంది.
మరోవైపు రాజకీయంగానూ ఈ విద్యుత్ బిల్లుల వివాదం దుమారం రేపుతోంది. రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ, జనసేన విమర్శలు సంధిస్తున్నాయి.
ఇంతకీ కరెంటు బిల్లులో ఏఏ చార్జీలు ఉంటాయి, మొత్తంగా ఈ బిల్లును ఎలా లెక్కిస్తారు? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్‌లో వినియోగదారులను ఐదు కేటగిరీలుగా విభజించారు. దీనిలో కేటగిరి-1గా సాధారణ ప్రజలు, కేటగిరి-2గా వ్యాపారులు, కేటగిరీ-3గా పరిశ్రమలు, కేటగిరీ-4గా యుటిలిటీస్, కేటగిరీ-5గా వ్యవసాయదారులు వస్తారు. వీరిలో కేటగిరీ-1 గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
మినిమం/ఎనర్జీ చార్జెస్: మీరు ఖర్చుపెట్టే యూనిట్ల ఆధారంగా ఈ చార్జిని లెక్కిస్తారు. ఇక్కడ కొన్ని శ్లాబ్‌లు ఉంటాయి. ఉదాహరణకు మీరు 200 యూనిట్లు ఖర్చు పెడితే, మొదటి 30 యూనిట్లు రూ.1.9 చొప్పున, తర్వాత 31 నుంచి 75 యూనిట్లకు రూ.3 చొప్పున, ఆ తర్వాత 76 నుంచి 125 యూనిట్లకు 4.50 చొప్పున, ఆ తర్వాత 126 నుంచి 225 యూనిట్లకు రూ.6 చొప్పున.. ఇలా లెక్కిస్తారు. ఇక్కడ శ్లాబు మారితే, దానిలోని యూనిట్లకు వేసే చార్జీలు కూడా మారుతాయి. ఈ చార్జీలను ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్‌సీ) సమీక్షిస్తుంది.
ఫిక్సెడ్ చార్జెస్: విద్యుత్ స్తంభాలు, వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లతోపాటు విద్యుత్ సిబ్బంది సేవలను ఉపయోగించుకుంటున్నందుకు ఈ చార్జీలు వసూలు చేస్తారు. అంటే విద్యుత్ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునేందుకు వసూలు చేసే అద్దెగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇది బిల్లు బిల్లుకూ మారుతుంది. మన మీటర్ మొత్తం లోడు(మన ఇంట్లోని అన్ని విద్యుత్ ఉపకరణాల కోసం నిర్దేశించిన మొత్తం యూనిట్లు)తోపాటు మనం ఏ శ్లాబులో ఉన్నాం, ఎంత బిల్లు కడుతున్నాం లాంటి అంశాల ఆధారంగా ఈ చార్జి ఉంటుంది. కేటగిరీ-1లో కిలో వాట్‌కు రూ.10 చొప్పున దీన్ని వసూలు చేస్తున్నారు. కేటగిరీ-2, 3లలో ఇది కిలోవాట్‌కు 75 చొప్పున వసూలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, NTPC
కస్టమర్ చార్జి: దీన్ని వినియోగదారుల సర్వీసు చార్జిగా చెబుతుంటారు. ఇది కూడా కేటగిరీల ఆధారంగా ఉంటుంది. మనం విద్యుత్ ఉపయోగించినా లేకున్నా దీన్ని డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుంది.
ఎలక్ట్రిసిటీ డ్యూటీ: ప్రతి వినియోగదారుడి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిసిటీ డ్యూటీ (విద్యుత్ సుంకం) రూపంలో సుంకాన్ని వసూలు చేస్తాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది. దీన్ని కేటగిరీ-2, కేటగిరీ-3లకు ఒక యూనిట్‌కు ఒక రూపాయి చొప్పున వసూలు చేస్తారు. సాధారణ ప్రజలకు యూనిట్‌కు ఆరు పైసలు చొప్పున విధిస్తున్నారు. రైతులకు ఈ సుంకం ఉండదు.
ఇంట్రస్ట్ ఆన్ ఈడీ: ఇది ఎలక్ట్రిసిటీ డ్యూటీపై వసూలు చేసే వడ్డీ. బిల్లు కట్టడంలో ఆలస్యమైనప్పుడు దీన్ని వసూలు చేస్తారు. బిల్లు కట్టడానికి వినియోగదారులకు 15 రోజుల గడువు ఇస్తారు. ఈ లోగా బిల్లు కట్టకపోతే ఈ వడ్డీ పడుతుంది.
సర్‌చార్జ్: దీన్నే డిలే పేమెంట్ సర్‌చార్జి అంటారు. బిల్లు వచ్చిన 15 రోజుల్లో ఇక్కడ ఎలాంటి రుసుమూ వసూలు చేయరు. ఆ తర్వాత, రూ.100కు రోజుకు 5 పైసలు చొప్పున ఇది చెల్లించాలి. రైతుల నుంచి ఇది వసూలు చేయరు.

ఫొటో సోర్స్, ANI
గ్రిడ్ చార్జ్: ఇంటిలో సోలార్ నెట్ మీటరింగ్ పెట్టుకునే వారి నుంచి ఈ చార్జిని వసూలు చేస్తారు. ఒక కిలో వాట్‌కు గ్రిడ్ సపోర్ట్ చార్జెస్ (జీఎస్‌సీ) రూ.15 చొప్పున వసూలు చేస్తారు.
షార్ట్ ఫాల్: ఏదైనా మీటర్ ఆగిపోయినా లేదా ముందు నెలలో బిల్లు సరిగ్గా వేయకపోయినా ఆ చార్జీలను ఇక్కడ చూపిస్తారు. అయితే, ఇది ప్రతి నెలా ఉండకపోవచ్చు. ఏదైనా కారణం ఉంటేనే ఈ షార్ట్ ఫాల్ చార్జీ విధిస్తారు.
అదర్ చార్జెస్: కొన్ని డిస్కంలు.. మున్సిపాలిటీల తరఫున ‘‘అర్బన్ సెస్’’, ‘‘వాటర్ కన్జర్వేషన్ సెస్’’ లాంటివి వసూలు చేస్తుంటాయి. అయితే, వీటిని పరిశ్రమలు, వ్యాపారుల నుంచి ఎక్కువగా వసూలు చేస్తుంటారు. ఇవి అందరికీ వర్తించవు.
అడ్జస్ట్‌మెంట్: దీన్ని సర్దుబాట్లుగా చెబుతారు.
ట్రూ అప్: ఏప్రిల్ 2014 నుంచి మార్చి 2019 మధ్య వినియోగించుకున్న యూనిట్ల విషయంలో యూనిట్‌కు 7 పైసలు చొప్పున మొత్తంగా ఆగస్టు 2022 నుంచి జనవరి 2024 వరకూ 18 వాయిదాల్లో దీన్ని వసూలు చేస్తున్నారు. ఆ ఐదేళ్లలో వాస్తవంగా అయిన ఖర్చు, వసూలు చేసిన చార్జీల మధ్య వ్యత్యాసాన్ని నేరుగా ప్రజల నుంచి వసూలు చేసేందుకు ఏపీ ఎలక్ట్రిసిటీ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది.

ఫొటో సోర్స్, NTPC RAMAGUNDAM
ఎఫ్‌పీపీసీఏ చార్జెస్: దీన్నే ఫ్యూయల్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్‌గా చెబుతారు. బొగ్గు లేదా ఇంధనం ధరల్లో పెరుగుదలను నేరుగా వినియోగదారులకు బదిలీ చేసేందుకు తీసుకొచ్చిన సుంకం ఇది. మూడు నెలలకు ఒకసారి దీన్ని రాష్ట్రాల్లోని ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్లు (ఎస్‌ఈఆర్‌సీ)లు సవరిస్తూ ఉంటాయి. ఇది యూనిట్లు, శ్లాబులకు అనుగుణంగా మారుతుంటుంది.
లాస్/గెయిన్: ఏదైనా బిల్లు మొత్తంగా 50పైసలకు మించినప్పుడు రూపాయి కలపడం, 50 కంటే తక్కువ ఉండేటప్పుడు ఆ పైసలను తీసివేయడం లాంటివి దీనిలో చేస్తారు.
గవర్నమెంట్ సబ్సిడీ: ప్రభుత్వం ఏదైనా సబ్సిడీ ఇస్తే, దాన్ని ఇక్కడ చూపిస్తారు.
బిల్ అమౌంట్: చార్జీలన్నీ కలిపి మొత్తంగా వచ్చిన బిల్లు ఇదీ.
అరియర్స్: ముందు నెలలో ఎవైనా కట్టని బిల్లులు ఉంటే ఇక్కడ చూపిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘అసలు బిల్లు రూ.230.. కట్టమంటోంది రూ.350’’
అయితే, ట్రూ అప్ చార్జీలతోపాటు ఫిక్సిడ్ చార్జీలు, కస్టమర్ చార్జీలు, సర్‌చార్జీలు, ఎఫ్‌పీపీసీఏ చార్జీల పేరుతో తమపై చాలా భారం పడుతోందని వినియోగదారులు అంటున్నారు.
దీనిపై కల్యాణ్ సాయి అనే వ్యక్తి ట్విటర్ వేదిగా స్పందిస్తూ.. ‘‘బిల్లులో మినిమమ్ చార్జి 232గా పేర్కొన్నారు. కానీ, మా దగ్గర నుంచి రూ.120 అదనంగా వసూలు చేస్తున్నారు’’ అని ఆయన చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆయన బిల్లులో ఫిక్సిడ్ చార్జీ రూ.20, కస్టమర్ చార్జి రూ.45, సర్‌చార్జి రూ.25, ఎఫ్‌పీపీసీఏ చార్జి రూ.25 కనిపిస్తోంది.
గోపీ కృష్ణ అనే వ్యక్తి కూడా ఇలానే బిల్లు భారీగా పెరిగిందని ఆందోళన వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘భవిష్యత్ చార్జీలు కట్టమంటున్నారా?’’
మరోవైపు భవిష్యత్ చార్జీలను కూడా బిల్లులో వసూలు చేస్తున్నారని కొందరు వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
అయితే, వినియోగించిన యూనిట్లకే చార్జీలు, సుంకాలు వసూలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్)కు చెందిన సీనియర్ అకౌంట్ అఫీసర్ కే ఆదినారాయణ మూర్తి చెప్పారు.
‘‘ట్రూ అప్ చార్జీల విషయంలో కొన్ని అపోహలు, అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి. ఇదేమీ భవిష్యత్ చార్జీల వసూలు కాదు. టారిఫ్ ఆర్డర్ ప్రపోజల్ సమయంలో వాస్తవానికి, వసూలు చేసిన చార్జీలకు మధ్య వ్యత్యాసాన్ని వసూలు చేయడమే ట్రూ అప్ చార్జీల ఉద్దేశం. దీనికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్‌సీ) అనుమతులు కూడా ఇచ్చింది. అనంతరమే దీన్ని వసూలు చేస్తున్నాం’’ అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- రైతు ఉద్యమ సమయంలో ‘ట్విటర్’ను మూసేస్తామని భారత ప్రభుత్వం బెదిరించిందన్న జాక్ డోర్సీ.. ఖండించిన కేంద్రం
- ఆంధ్రప్రదేశ్: సీఎం జగన్‌కు బీజేపీ గుడ్‌బై చెప్పినట్లేనా... అమిత్ షా వ్యాఖ్యల ఆంతర్యమేంటి?
- అమెజాన్ అడవుల్లో కూలిన విమానంలోని నలుగురు పిల్లలు 40 రోజుల తర్వాత ప్రాణాలతో దొరికారు
- వక్షోజాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకుంటే ఏమవుతుంది?
- కోవిడ్ డేటా లీక్: ‘వ్యాక్సీన్ వేయించుకున్నవారి ఫోన్, ఆధార్, పాన్ నంబర్లు టెలిగ్రామ్‌లో’.. ఈ వార్తలపై ప్రభుత్వం ఏమంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















